4, జులై 2017, మంగళవారం

బదరీ, కేదార్ యాత్ర (1996) – శ్రీమతి కీ. శే. కొమరగిరి అన్నపూర్ణ


(ప్రారంభం)
మా చిన్న తమ్ముడు భండారు శ్రీనివాసరావు కాలు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి, చెల్లెలు భారతితో కలిసి హైదరాబాదు వెళ్ళాము. అప్పుడే భారతి పెద్ద కోడలు, సురేష్ భార్య స్వర్ణ మాకో సంగతి చెప్పింది, వైష్ణవీదేవి దేవాలయం చూడడానికి వెడుతున్నామని. వాళ్ళ అన్నయ్య కాశ్మీరులో పెద్ద మిలిటరీ అధికారి. అత్తామామల్ని తీసుకుని కాశ్మీర్ చూడడానికి రమ్మని ఆయన కబురు చేసాడు. వస్తే, వైష్ణవీ దేవి దర్శనం కూడా చేయిస్తానని అన్నాడు. వీళ్ళు సరే అన్నారట. దాంతో చెల్లెలు భారతి, ఆమె భర్త తుర్లపాటి పాండు రంగారావుకి కూడా స్వర్ణ ఢిల్లీ పోవడానికి రైలు రిజర్వేషన్లు చేయించింది. అనుకోకుండా వచ్చిన నన్ను కూడా ప్రయాణం కమ్మన్నారు. బొంబాయిలో వున్న మా రెండో కుమారుడికి విషయం తెలిసి ‘మా అమ్మను కూడా యాత్రకు తీసుకు వెళ్ళండి, అవసరమైన పైకం పంపుతాను’ అని కబురు చేసాడు. ఆ విధంగా నా ప్రయాణం ఖరారు అయింది. 
ఈలోగా, కంభంపాడులో మా మూడో తమ్ముడు భండారు వెంకటేశ్వర రావు కుమార్తె పద్మ పెళ్లి. అక్కాచెల్లెళ్లు అందరం మళ్ళీ ఆ పెళ్ళిలో కలిసాం. మా యాత్ర సంగతి తెలుసుకుని మా అక్కయ్యలు శారద, సరస్వతి, సావిత్రి, చెల్లెలు ప్రేమ, తాము కూడా వస్తామనడం, వాళ్ళ పిల్లలు కొలిపాక రాజేంద్రప్రసాద్, తుర్లపాటి సాంబశివరావు, కౌటూరు దుర్గాప్రసాద్, పింగిలి శ్రవణ్ కుమార్ సరే అనడం చకచకా జరిగిపోయాయి. మా చిన్నబ్బాయి రంగారావు, సావిత్రి చిన్న కొడుకు శేషగిరి రావు కలిసి మా అందరి రిజర్వేషన్ ఏర్పాట్లు చూసారు. ప్రయాణం సమయానికి మా మూడో అక్కయ్య సరస్వతి, మా బావగారి ఆరోగ్య పరిస్తితి దృష్ట్యా రాలేకపోయింది. నాలుగో అక్కయ్య సావిత్రి కూతురు పర్చా విమల యాత్రీకుల బృందంలో చేరింది.
నేను మా అబ్బాయి రంగారావును తీసుకుని ఒక రోజు ముందే పెనుగంచి ప్రోలు నుంచి బస్సులో బయలుదేరి హైదరాబాదు వెళ్ళాను. ఎందుకంటే నాకు రేడియోలో రికార్డింగు వుంది. నిజానికి ఆ రికార్డింగు జరగాల్సింది 23 వ తేదీన. కానీ అప్పటికి నేను యాత్రల్లో వుంటాను. అంచేత తమ్ముడు శ్రీనివాసరావు రేడియో స్టేషన్ లో సంబంధిత అధికారికి ఫోను చేసి నా రికార్డింగు 13 వ తేదీకి మార్పించడంతో ఆ పని కూడా పూర్తయింది. ఆ రోజు కృష్ణ శతకం చదివాను. హార్మనీ ఉండడంతో నా గొంతులోని నీరసం, బడలిక కప్పడిపోయాయి. తరువాత స్తిమితపడి నరసింహ శతకం చదివాను. బాగా వచ్చిందన్నారు, అక్కడి అధికారిణి పుట్టపర్తి నాగ పద్మిని. ఆవిడే నేను ఎప్పుడు రేడియోకి వెళ్ళినా దగ్గరుండి రికార్డింగు చేయిస్తుంటారు. చాల మంచి మనిషి. ( ప్రముఖ పండితులు పుట్టపర్తి నారాయణాచార్యులు గారి అమ్మాయి. అంచేత మా తమ్ముడు శ్రీనివాసరావు, వాడూ రేడియోలోనే పనిచేస్తాడు, ఆవిడ్ని ‘గురు పుత్రిక’ అని పిలుస్తుంటాడు)
తరువాత వైద్య సలహా కోసం డాక్టర్ మనోహర్ (మా పెద్దక్కయ్య రాధ రెండో కొడుకు, పెద్దవాడు అయితరాజు పాండురంగారావు కూడా డాక్టరే. కానీ డాక్టరు అనేవాడు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదన్నది వాడి నియమం. అయితే మా చుట్ట పక్కాల్లో ఎవరికి ఒంట్లో బాగా లేకపోయినా మా కుటుంబానికి 108 లాగా గుర్తు వచ్చేది వాడే. మనోహర్ చూసి ఒకసారి డాక్టర్ నాగభూషణం గారి వద్దకు వెళ్ళమన్నాడు. ఆయన మా డాక్టర్ రంగారావు కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు. మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించాడు. మా బదరీ కేదార్ యాత్ర విషయం చెప్పి, ‘వెళ్ళవచ్చా’ అని అడిగాను. ఆయన నవ్వి, ‘ మీ అక్కచెల్లెళ్ళు అంతా కలిసి వెడితే బదరీ కేదారేమిటి మానస సరోవర్ యాత్ర కూడా నిక్షేపంగా చేయగలరు. మీ మనోబలం అలాంటిది’ అన్నాడు. ‘మీ పెద్దక్కయ్య (డాక్టర్ రంగారావు తల్లి) కూడా సుస్తీ లెక్క చేయకుండా ప్రయాణాలు చేస్తూ వుండేది. మీరంతా కలిసి ప్రయాణాలు చేస్తూ ఉండడమే మీకు మందు. వేరే మందులు మీకు అవసరం లేదు. నిశ్చింతగా వెళ్లి రండి” అని ధైర్యం చెప్పాడు. కేదార్ యాత్రలో బాగా ఎత్తుకు వెళ్లి నప్పుడు వేరే బాధలు కలగకుండా కొన్ని మందులు ఇచ్చి దగ్గర వుంచుకోమన్నాడు. అదేమిటో, చికిత్స చేస్తాడు కానీ ఫీజు తీసుకోడు. బతిమిలాడితే, ‘అయితే నన్నూ, రంగారావును వేరుగా చూస్తున్నారా’ అంటాడు. అసలు పేషెంట్లకు ఆయన ఇచ్చే ధైర్యపు వచనాలతోనే సగం జబ్బు తగ్గిపోతుంది. 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: