27, ఫిబ్రవరి 2016, శనివారం

ప్రభులవారి రైల్వే బడ్జెట్

సూటిగా.....సుతిమెత్తగా..........

పరిగెత్తి పాలు తాగాలా నిలబడి నీళ్ళు తాగాలాఅంటే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండోదే ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన మోడీ మార్కు రైల్వే బడ్జెట్ లో ఈ ధోరణే ద్యోతకమవుతోంది.



ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది చూసేవారి కంటినిబట్టి రెండు రకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ఆహా ఓహో’ బడ్జెట్. ఇంకా కాస్త పొగడాలని అనిపిస్తే 'అభివృద్ధికి బాటలు వేసే అద్భుతమైన బడ్జెట్'. అదే బడ్జెట్   ప్రతిపక్షం వారికంటికి  అంకెల గారడీ బడ్జెట్. ఇంకా తెగడాలని అనిపిస్తే, 'అభివృద్ధి నిరోధక బడ్జెట్'.  అయితే ఈ రెండు కళ్ళే కాదు, పైకి కనబడని  మూడో కన్ను’ మరోటి వుంది. అది ప్రజలది. అంటే ప్రయాణీకులది. అందులోనూ అతి సాధారణ ప్రయాణీకులది. కానీ వారి గోడు ఎన్నికల సమయంలో తప్ప ఎవ్వరికీ పట్టదు. తమకున్న   'మూడో కన్ను' తెరవాలంటే ఎన్నికలదాకా ఆగాలన్న 'మునిశాపంవాళ్లకు  వుంది. రైల్వే భాషలో చెప్పాలంటే వాళ్ళది 'వెయిట్ లిస్టుకేటగిరీ.
పోతే,  కొత్త రైలు ప్రస్తావన లేని మొట్టమొదటి రైల్వే బడ్జెట్ అంటూ షరా మామూలు పద్దతిలోనే ప్రతిపక్షాల వాళ్లు  విమర్శలు చేశారు.
ఈ సారి రైల్వే బడ్జెట్లో  కొత్త రైలు కూతలు లేకపోయినా చార్జీల మోతలేకుండా చేశామని, అన్ని వర్గాలవారి అవసరాలు తీర్చేవిధంగా వుందని  సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీగారే కితాబు ఇచ్చారు కాబట్టి ఇక ఎవరుఏమనుకుంటే ఏమని మంత్రిగారు భరోసాగా ఉండవచ్చు.
బడ్జెట్ పాత పద్దతిలో కాకుండా అందులో నవ్యత్వం చూపడానికి రైల్వేమంత్రి కొంత  ప్రయత్నం చేశారు. అయితేఅనేక సంవత్సరాలుగా బడ్జెట్ అంటే ఒక ఒరవడికి అలవాటుపడిన వారికి అది ఒక బడ్జెట్ మాదిరిగా కాకుండా మంత్రిగారి 'ఊహలచిత్రంగా కానరావడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు.  మోడీగారి 'స్వచ్చభారత్ఈ బడ్జెట్ లో బయో  టాయిలెట్ల రూపంలో దర్శనం ఇచ్చింది. ఇంట్లో నుంచే టికెట్ బుకింగ్ఈ టికెట్ తో రైల్లో కావాల్సిన భోజనంఆన్ లైన్ ద్వారా వీల్  చైర్ సౌకర్యంమహిళలకువృద్ధులకు కింది బెర్తుల కోటా పెంపు, స్టేషన్లలో వైఫై సదుపాయాలు, బోగీల్లో రేడియోలు, ఎన్నికల్లో కల్పించలేని ముప్పై శాతం మహిళా రిజర్వేషన్లను బెర్తుల్లో కల్పించడం, మహిళా ప్రయాణీకుల భద్రత కోసం హెల్ప్  లైన్, ఇలా ఒకటా రెండాకొత్త రైళ్ల వూసే లేని ఈ కొత్త రైల్వే బడ్జెట్ లో ఇలాటి వూసులు ఎన్నోఎన్నెన్నో.( ఈమాదిరి చిలకపలుకులు గత  ఏడాది రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా వినవచ్చాయని, వాటి సంగతి ఏమైందని   కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.)
కాకపొతే రైళ్ళలో అనునిత్యం ప్రయాణించే కోటిన్నర పైచిలుకు ప్రయాణీకుల్లో ఈ మాటలు వినని వాళ్లువాటికి అర్ధం తెలియని వాళ్లుఅసలు వాటి అవసరమే లేనివాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు. ఆ జనాలకు సురేష్ ప్రభుగారు ప్రతిపాదించిన 'భోజనాలు. 'టిక్కెట్లు, ''  దుప్పట్లువీటి  అవసరమే లేదు. వారికి  కావాల్సింది సమయానికి వచ్చికడగండ్లు లేకుండా  సమయానికి గమ్యం చేర్చే ప్రయాణపు బండ్లు. వాటిల్లో కూర్చోవడానికి ఎలాగూ చోటుండదుకనీసం సౌకర్యంగా నిలబడి ప్రయాణించడానికి కాసింత వీలుంటే చాలనుకునే వాళ్లు చాలామంది. ఇలాటి  సాధారణ బోగీల్లో కూడా  మొబైల్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారుసంతోషం. అలాగేమామూలు బోగీల్లో కూడా చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తామంటున్నారు. మరీ సంతోషం. ప్లాటుఫారాలపై లిఫ్టులుఎస్కలేటర్లు పెడతామంటున్నారు. మరింత సంతోషం. వాటితో పాటుప్రస్తుతం వున్న మెట్ల దారిలో ట్రాలీ సూటుకేసులు తోసుకుంటూ తీసికెళ్లగల సైడ్ వాక్ సౌకర్యం గురించి యెందుకు ఆలోచించరుఈరోజుల్లో అనేకమంది ప్రయాణీకులు రైల్వే  పోర్టర్ల మీద ఆధారపడకుండా  తోసుకుంటూ వెంట తీసుకువెళ్ళే ట్రాలీ  లగేజీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాటివారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కడానికీదిగడానికీ పడుతున్న  అవస్థలు తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు చేయించనక్కర లేదుఏ రైలు స్టేషన్ కు వెళ్ళినా ఈ దృశ్యాలు కానవస్తాయి. ఈ సందర్భంలో గతం గురించిన ఒ ముచ్చట చెప్పుకోవడం అసందర్భం కానేరదు.
పూర్వం జనతా ప్రభుత్వం హయాములో రైల్వే మంత్రిగా మధుదండావతే పని చేశారు. అప్పటి వరకు సాధారణ టూ టయర్త్రీ టయర్ బోగీల్లో పడుకోవడానికి చెక్క బల్లలు వుండేవి. దండావతే గారి పుణ్యమా అని ఆ బోగీలకు కూడా ఫోం పరుపులు అమర్చారు. ఆ ఒకే ఒక్క నిర్ణయంతో సామాన్యులు కూడా తామూ సమాజంలో ఎదుగుతున్నాం అనే ఉన్నత భావనకు లోనయ్యారు. సామాన్యులకు దగ్గరకావడం అంటే ఏమిటోఎలానో నాటి రైల్వే మంత్రి దండావతే చేసి చూపించారు.  సురేష్ ప్రభుమోడీ గార్లకు ఆ సంకల్పం కలగాలే కాని ఇటువంటివి చాలా చెయ్యవచ్చు.     
నిజానికి రైలుబళ్ళు యావత్ భారతానికి నకళ్ళు. ఇంట్లోవొంట్లో పుష్కలంగా వున్న వాళ్ళకోసం రాజులుమహారాజులు కోరే సకల  సౌకర్యాలతో 'ప్యాలెస్ ఆన్ వీల్స్అనే పేరుతొ పట్టాలపై నడిచే  రాజప్రసాదాలు మనదేశంలో ఇప్పటికే  వున్నాయి. 'ఎప్పుడు వస్తుందో తెలియనిఎప్పుడు గమ్యం  చేరుతుందో తెలియనిఅతి మామూలు పాసింజర్ రైళ్ళు కూడా అదే పట్టాలపై తిరుగుతుంటాయి. అసలు సిసలు భారతానికి ఇదొక నమూనా. ఇక మధ్య తరగతిఎగువ మధ్య తరగతిదిగువ తరగతి వాళ్లందరూ వేరు వేరు బోగీల్లో ఒకే రైలులో ప్రయాణిస్తుంటారు. వారి భాషలు వేరుసంస్కృతులు వేరుమాటతీరు వేరుఅయినా ఒక  కుటుంబం మాదిరిగా రైలు బండ్లు వారిని కలిపి వుంచుతాయి. రైల్వేలు మాత్రం వారిని వేరువేరుగా చూస్తాయి. పక్కపక్కనే వున్నా వారి పక్కలు వేరువారికి కల్పించే భోజన వసతులు వేరు. ఇదంతా వారు చెల్లించే టికెట్టు ధర నిర్ణయిస్తుంది.  కొందరేమో  శబ్దం చెయ్యని ఏసీ బోగీల్లో దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని వెడుతుంటేఅదే రైల్లో మరో సాధారణ బోగీలో కాలు చేయీ కదపడానికి  కూడా వీల్లేని స్తితిలో మరికొందరు ప్రయాణం సాగిస్తుంటారు. అచ్చమైన భారతానికి అచ్చమైన నకలు ఏదైనా వుందంటే అది మన దేశంలోని రైలుబండేసందేహం లేదు.
కాకపోతే, సురేష్ ప్రభుగారి విషయంలో ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా తన సొంత రాష్ట్రం 'మహారాష్ట్రకు ఏదో ఒరగబెట్టాలని యెంత మాత్రం అనుకోలేదు. ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క విషయంలో  వెనుకటి మంత్రులతో పోలిస్తే ఈయన చాలా మెరుగు.
గతంలో రైల్వే మంత్రులగా పనిచేసినవాళ్ళల్లో చాలామంది 'తమ' ప్రాంతాల 'పాల రుణం' తీర్చుకోవడానికి నిస్సిగ్గుగా రైల్వే బడ్జెట్ ని ఉపయోగించుకున్నారు. వీరిలో బెంగాల్ ఆడపులి మమతా బెనర్జీ, బీహారు రాజసింహం లాలూ పేర్లే ముందు చెప్పుకోవాలి. యూపీయే హయాములో మమత బెనర్జీ  'రైలు భవన్ మహరాణీగా ఓ వెలుగు వెలిగినప్పుడు,  రైల్వే బడ్జెట్ లో సింహభాగాన్ని తూర్పువెళ్ళే రైలు  ఎక్కించేసి  చేతులు దులుపుకున్నారు.  పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో హౌరా’ అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. అల్లాగే, లాలూ ప్రసాద్ యాదవ్ మహాశయులు. రైల్వే మంత్రిగా వున్నప్పుడు ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఏకంగా  అత్తవారి వూరికే ఒక రైలును వేయించారని ప్రతీతి. 'సొంత రాష్ట్రానికిసొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో' అని సంకోచించే నిత్య శంకితులకు మాత్రం నిజంగా  ఇది కనువిప్పే.

సరే అదలా వుంచికొత్తగా పురుడు పోసుకున్న తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే- - 
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటుకు సమర్పించిన ఈ బడ్జెట్ఈ రెండు ప్రాంతాల ప్రజలను మాత్రం  ఉసూరుమనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు. కేసీఆర్ ఇరువురూ ఈ విషయంలో తమ బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. ఢిల్లీ పెద్దలకు ముందస్తుగానే శాయంగల విన్నపాలు చేసుకున్నారు. ‘ఈ బడ్జెట్ లో కాస్త కనికరం చూపండి మహాప్రభూ' అంటూ, అనేక సార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు.  కానీ ప్రభువులు కరుణించింది లేదు.        
ఈసారి తెలుగు రాష్ట్రాలకు  అనుకున్న రీతిలో రైల్వేమంత్రి పూర్తి స్థాయిలో  న్యాయం చేయలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  విశాఖ కేంద్రంగా  కొత్త రైల్వే జొన్ గురించి ప్రకటన వెలువడగలదని ఆశించిన వారికి మళ్ళీ  నిరాశే ఎదురయింది. అల్లాగేదశాబ్దాల తరబడి నానుతూ వస్తున్న కాజీపేట కోచ్ ఫాక్టరీ వ్యవహారం.
అయితే, ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. చార్జీలు ఏమీ పెంచలేదు. ఇదొక ఉపశమనం అనుకోవాలి.  
ఒకటి మాత్రం నిజం. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. అలాగే,  రైలెక్కిన ప్రయాణీకుడి పేరు ముందు 'లేటు' అని రాయాల్సిన అవసరం లేకుండా  భద్రతకు భరోసా ఇవ్వగలిగితే మరీ గ్రేటు.

ఉపశృతి:
సాంఘిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కనిపించింది. “రైలు చార్జీలు పెంచలేదు సరే, కనీసం టాయిలెట్లలో మగ్గుకు తగిలించి వుండే గొలుసునన్నా అవసరానికి తగినట్టు పెంచితే బాగుంటుంది”

NOTE: Courtesy Image Owner

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   


24, ఫిబ్రవరి 2016, బుధవారం

రంగు వెలుస్తున్న రాజకీయం


సూటిగా........సుతిమెత్తగా........

రాజకీయులు పార్టీలు మారుతున్నట్టుగా,  జబ్బు పడి కోలుకుంటున్న మనిషి మంచం మీద అటూ ఇటూ మెసులుతుంటాడని చార్లెస్ లాంబ్ అనే రచయిత అంటాడు ‘ఆన్ కన్వల్సెన్స్’ అనే వ్యాసంలో. ఇలాటి మాటే ఇంకో విధంగా చెప్పాడు గిరీశం ‘ అప్పుడప్పుడు ఒపీనియన్స్  చేంజ్ చేస్తుంటేనే కాని పొలిటీషియన్ కానేరడు’ అని.  దాన్నే కాస్త మార్చి ‘సైడ్స్ మారుస్తుంటేనే కాని రాజకీయనాయకుడు కానేరడు’ అని కొత్త భాష్యం చెబుతున్నారు. తాము పార్టీలు మారేది తమకోసం కాదని, తమని నమ్ముకున్న ప్రజల శ్రేయస్సు కోసమని నమ్మబలుకుతుంటారు. తిరుపతి దేవుడి దర్శనం రాజభోగంగా  చేసుకువచ్చిన అనంతరం ప్రముఖులు కూడా ఇదేవిధంగా చెబుతుంటారు, సమాజ శ్రేయస్సుకోసం ఆ దేవదేవుడ్ని ప్రార్ధించి వచ్చామని.     ఆమాటలు జనం నమ్ముతున్నారా లేదా అనేదానితో వారికి నిమిత్తం వుండదు. ఆ సోయి   వున్నవాళ్ళు  అలా  నిస్సిగ్గుగా ఆమాటలు చెప్పలేరు కూడా.
తెలుగునాట ఇలాటి  రాజకీయమే  రసవత్తరంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. ప్రతిపక్షం నుంచి పాలక  పక్షంలోకి ఫిరాయింపుల పర్వం కామాలే కాని ఫుల్   స్టాపుల్లేకుండా కొనసాగుతోంది. పైపెచ్చు  సస్పెన్స్  థ్రిల్లర్ సినిమాను మించి పోయేలా గంటగంటకు ఉత్కంఠ ఒకటి అదనం. ఇటు తెలంగాణలో ఈ రాజకీయ వలసలు దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయేమో అనిపించే తరుణంలో అటు  ఆంధ్రప్రదేశ్ లోకి  కూడా ఈ వలసల  సెగ పాకింది. వై.ఎస్.ఆర్.సీ.పీ.కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, గత సోమవారం నాడు,  మాఘ పౌర్ణమి శుభ ముహూర్తం చూసుకుని పాలక పక్షం టీడీపీ లోకి చేరిపోయి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలోనే పసుపు రంగు కండువాలు కప్పు కున్నారు. అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వెళ్లి పార్టీ మారిపోయిన సందర్భం కూడా ఈ సన్నివేశంలో వుంది. కలం కూలీగా తనను తాను చెప్పుకున్న ప్రసిద్ధ పాత్రికేయులు జీ. కృష్ణ గారన్నట్టు ఇదంతా ‘భలే’గా రక్తి కట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ గత కొద్ది రోజులుగా గిరికీలు కొడుతున్న ఊహాగానాలకు, చర్చోపచర్చలకు ఇది తెరదించింది. ‘అప్పుడేనా, ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఇలాంటి సీన్లు చాలా చూడాల్సి వుంటుంది’ అంటున్నారు టీడీపీ  ద్వితీయ శ్రేణి నాయకులు.  ‘టీడీపీ  ప్రభుత్వంలోకి వచ్చి రెండో ఏడాదేగా. మరో ఏడు గడవనివ్వండి, వలసలు అటు నుంచి ఇటు మొదలు కాకపొతే చూడండి’ అంటూ ప్రతి సవాలు విసురుతున్నారు వారి రాజకీయ ప్రత్యర్ధులు. ఈ సందర్భంగా ఉభయపక్షాలనుంచి షరా మామూలు వ్యాఖ్యానాలే వెలువడ్డాయి. అవి వింటున్నవాళ్ళకు ఈ  మధ్యనే  వాటిని విన్న ఫీలింగు కలిగిన మాట వాస్తవం. చూసిన సినిమానే మళ్ళీ చూసినప్పుడు సంభాషణలు, సన్నివేశాలు నెమరుకు రావడం అతి సహజం. ‘ప్రభుత్వ పధకాల పట్ల ఆకర్షితులం అయ్యాం.  నియోజక వర్గ అభివృద్ధి ముఖ్యమనుకున్నాం’ సరిగ్గా ఇలాటివే కొన్ని పడికట్టు పదాలతో కూడిన స్పందనలే అటూ ఇటూ వినవచ్చాయి. పైగా పార్టీలు మారడం వారిలో చాలామందికి కొత్తేమీ కాదు. మొదటి చెంబు చల్లటి నీళ్ళు వొంటి మీద పడేవరకే చలి. ఆ తరువాత అలవాటయిపోతుంది. ‘ఏకం తప్పితే అనేకం’ అనే నానుడి విన్నదే కదా!


పార్టీ ఫిరాయింపులకు ఎవరి కారణాలు వాళ్ళు చెబుతున్నా  ప్రధాన కారణం మాత్రం రాజకీయ అనివార్యత. పైకి ఎన్ని సుద్దులు వల్లె వేసినా, ఎవరికయినా, ఎంతటి సమర్ధ నాయకుడికయినా ముందు సొంత పార్టీ  మనుగడ ముఖ్యం. ఆ తరువాతే ఆదర్శాలు. గతంలోని రాజకీయ నిబద్ధతలను ఏకరవు పెట్టుకుంటూ, గిరి గీసుకుని వ్యవహారాలు నడిపితే వర్తమానం నష్ట పోతామనేది  నేటి రాజనీతి.   ఈతరం  రాజకీయ పార్టీ అధినేతల్లో సిద్ధాంత నిబద్ధత కంటే పార్టీ  పటిష్టత ప్రధానం.  అలాగే ఏపార్టీకి చెందినా సరే, ఈనాటి  రాజకీయ నాయకుల్లో సొంత పార్టీ లాభానష్టాలకంటే స్వప్రయోజనాలు ముఖ్యం. ఉభయులకు  తమకు  కావాల్సింది  ఏమిటో బాగా తెలుసు. ఇచ్చిపుచ్చుకోవడం ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం. అది తేలిపోతే అన్ని చిక్కుముళ్ళు దూదిపింజల్లా  తేలిపోతాయి.    ఈ ఎరుక కలిగిన వారు కనుకనే ఈ పార్టీ, ఆ పార్టీ  అనిలేకుండా అందరూ,  సంఖ్యాబల సూత్రాన్నే నమ్ముకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం, ఎదుటి పక్షాన్ని బలహీన పరచడం చాణక్య నీతిలో భాగం. కానీ  ప్రస్తుతం మనకున్న నాయకుల ఆలోచనలు మరో అడుగు  ముందుంటున్నాయి  తాము బలపడడంతో  పాటు ప్రతిపక్షాన్ని  నిర్వీర్యం చేయడం. వీలయితే ఉనికిలో లేకుండా చేయడం ఇప్పుడు పురుడు పోసుకుంటున్న  సరికొత్త రాజనీతి.  ఈ విషయంలో,  రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాల ధోరణి ఒకే రకంగా వుంది. అదేమిటంటే, ఫిరాయింపులను తాము ప్రోత్సహించడం లేదు, వారే ఆకర్షితులై స్వచ్చందంగా వస్తున్నారని. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఒక పార్టీ మీద గెలిచి వచ్చిన అభ్యర్ధులకు ఆ పార్టీ భవిష్యత్తు పట్ల సందేహాలు కలిగితే వెనుకటి రోజుల్లోలాగా మడి కట్టుకుని, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా  ఆ పార్టీకే కట్టుబడి వుండే పరిస్తితిలేదు. ‘ఏదో అధికారంలోకి వస్తుందని అందరిలాగే మేమూ నమ్మాము. కానీ  రాలేదు. మరి ఇలాగే వుంటే పార్టీ కేడర్ మా వెంట  వుంటుందన్న నమ్మకం లేదు. అంచేత మా దారి మేము చూసుకుంటున్నాం’ అనేది వారి మాటగా అనిపిస్తోంది. ఇందులో అనైతికం ఏమీ లేదని అంటున్నారు. పైగా ‘అనైతికంలో నైతికం’ అంటూ పార్టీ మారిన ఓ పెద్దమనిషి కొత్త భాష్యం చెబుతున్నారు.
పార్టీ పెట్టిన కొత్తల్లో వై.స్.ఆర్.సీ.పీ.  అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక మాట చెబుతుండేవారు. ఆయన్ని ఎన్ని కేసులు చుట్టుముడుతున్నా బయట పార్టీల నుంచి ఆ పార్టీలోకి వలసల వేగం పెరుగుతున్నరోజులవి. ‘’ నేను తలుపులు తెరిస్తే  బయట పార్టీల్లో ఒక్కళ్ళు మిగలరు. కానీ, మా నాన్న  తెచ్చిన ప్రభుత్వాన్ని  కూల్చడం నాకు ఇష్టం లేదు’ అని.
అప్పుడేమో  కాని  ఇప్పుడదేమాదిరి ప్రకటన ఈ పరిణామాలు అన్నింటికీ  కారణం అయిందని తెలుగుదేశం నాయకులు టీవీ చర్చల్లో బల్లగుద్ది వాదిస్తున్నారు. పాలక పక్షంలోకి రావాలని వై. ఎస్.ఆర్.సీ.పీ. శాసన సభ్యులు ఎంతో కాలంగా తమను సంప్రదిస్తున్నా మరో పక్క తెలంగాణలో తమ పార్టీవాళ్లు పాలక పక్షంలోకి చేరిపోతున్న సందర్భాలు తమను ఉడ్డుగుడుచుకునేలా చేసి, ఒక  నిర్ణయం తీసుకోకుండా అడ్డు పడ్డాయని అంటూ, ఆ సమయంలోనే  జగన్ మోహన రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యతో  తమకు ఇబ్బంది తీరిపోయిందని చెబుతున్నారు. ‘ఇరవై ఒక్కమంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్  లో ఉన్నారనీ, తలచుకుంటే ప్రభుత్వాన్ని గంటలో పడగొట్టడం పెద్ద విశేషం ఏమీ కాదని ఆయన చేసిన ప్రకటనతో తాము తెరిపిన పడ్డామని, , తామే ఈ  విషయంలో  తొలి అడుగు వేసి అయిదు ప్రత్యర్ధి  వికెట్లు పడగొట్టామని అంటున్నారు.  తెలంగాణాలో పరిణామాల కారణంగా మింగలేని కక్కలేని పరిస్తితి  నుంచి తమను ఆయనే బయట పడవేసాడని వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వైసీపీకి అనైతికం కాని ఫిరాయింపులు  తమకెలా అనైతికం అవుతాయన్నది వారి వాదన. ‘పుట్టలో వేలు పెడితే కుట్టమా’ అనే కధ గుర్తు చేస్తున్నారు.  
ఈ మొత్తం ఉదంతంలో కొత్త కోణం ఏమిటంటే, పార్టీ మారడం అనేది ఇప్పుడొక మీడియా ఆకర్షణగా మారిపోయింది. పలానా నాయకుడు పార్టీ  మారుతున్నారు అనే స్క్రోలింగులు రావడం తరువాయి మీడియా కెమెరాలు అడగకుండానే వారివద్ద వాలిపోతున్నాయి. దీంతో  పార్టీ మార్పిళ్ళకు మీడియా ఆమోదం కూడా లభించిందన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా మొక్కుబడి ఖండనముండనలే తప్ప గట్టిగా కిమ్మనడం లేదు. ప్రభుత్వాలు, ఎలెక్షన్ కమిషన్  ఈ విషయాల్లో మౌన ప్రేక్షకులు. ప్రజలు కూడా వీటిని ఆమోదిస్తున్నట్టు తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. సమస్యతో సంబంధం వున్న రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికలసంఘం చివరాఖరుకు ప్రజలు, ఇందరి మద్దతు వుంది అన్న అభిప్రాయం ప్రబలిన పిదప ఇక ఈ ‘రాకపోకల’కు అడ్డేముంది? అడ్డుకునేదెవరు?
గతంలో పరిస్తితి ఇలా వుండేది కాదన్నది వాస్తవం.
1978 లో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ఐ బ్రహ్మాండమయిన విజయం నమోదు చేసుకుని మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొత్త ప్రభుత్వం  ఏర్పాటయినప్పుడు కూడా ఈ వలసల పర్వం సాగింది. దాదాపు డెబ్బయిమంది రెడ్డి (సంస్థ) కాంగ్రెస్ సభ్యులు పార్టీ మారి ప్రభుత్వ పక్షంలో చేరారు. కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా సర్కారుపై నిప్పులు చెరిగిన రోశయ్యగారు గారు సయితం మంత్రిమండలిలో చేరిపోవడంతో ఆ అంకం అప్పటికి అలా ముగిసింది. అప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా లేదు. కాబట్టి అదొక కారణంగా చెప్పుకోవచ్చు.
ఎనభయ్ నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నాటికి కాస్తాకూస్తో రాజకీయ పరిజ్ఞానం వున్నవారు ఇప్పుడు రాజకీయాలనుంచి మనసు మళ్ళించుకుని కృష్ణా రామ అంటూ కాలక్షేపం చేస్తూ వుంటారు. ఈనాడు సాంఘిక మాధ్యమాల్లో చెలరేగి వ్యాఖ్యలు గుప్పిస్తున్న వారికి ఆనాటి విషయాలు అంతగా తెలిసే వీలులేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెళ్ళగించి, తెలుగుదేశం అధినేత స్వర్గీయ  ఎన్టీ రామారావు గారు ఏకచ్ఛత్రాధిత్యంగా ప్రభుత్వం నడుపుతున్న రోజులవి. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు సేనాధిపతి  సింహాసనం స్వాధీనం చేసుకున్న చందంగా అమెరికాకు గుండె ఆపరేషన్ కోసం వెళ్ళిన రామారావు గారు తిరిగొచ్చేలోగా, అప్పటి మంత్రివర్గంలో నెంబర్ టు అనిపించుకుంటున్న నాదెండ్ల భాస్కర రావు, నెంబరు వన్  స్థానం పై కన్నేసి నెంబరు గేమ్ మొదలుపెట్టారు. ఆనాడు  గవర్నర్ గా వున్న  రాం లాల్ సాయంతో ఎన్టీఆర్ ని పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో వున్నది రామారావు గారు తీవ్రంగా  వ్యతిరేకించే ఇందిరాగాంధి. అంచేత రామారావుకు తిరిగి పదవి దక్కడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. అక్కడే కధ అడ్డం తిరిగింది. దీనికి ప్రధాన కారణం ఆ నాటి పత్రికలు, నాడు తెలుగు దేశం పార్టీని ఒంటిచేత్తో  గెలిపించుకున్న ప్రజలు. రామారావుపై తిరుగుబాటుచేసిన ఎమ్మెల్యేలకు  వారి సొంత నియోజక వర్గాల్లోనే వ్యతిరేకత వెల్లువలా తన్నుకువచ్చింది.  ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీకి మద్దతుగా ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. నిప్పూ ఉప్పూ వంటి బీజేపీ, వామపక్షాలు కూడా సంఘీభావం తెలిపాయి. ఒకే కారుకి పక్కపక్కనే కమలం. సైకిల్, కంకీ కొడవలి, సుత్తీ కొడవలి చిహ్నాలు వున్న పార్టీల జెండాలు రెపరెపలాడాయి. జనం, మీడియా, రాజకీయం వెరసి అన్నీకలిసి బ్రహ్మాండమయిన ప్రజాఉద్యమంగా మారింది. దానితో ఇందిరాగాంధి మెట్టు దిగి, గవర్నర్ రాం లాల్ ని తొలగించి ఆయన స్థానంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మను నియమించారు. సరిగ్గా నెల తిరగగానే రామారావు చేత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇందిరాగాంధీని నరనరాన ద్వేషించే వారు సయితం ఆమె తప్పుదిద్దుకున్న తీరును మెచ్చుకున్న మాట నిజం. అప్పట్లో కూడా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. ప్రజలే పూనుకుని చట్టం చేయాల్సిన పనిని  పూర్తి చేసారు. తమ చేతిలో వున్న ‘పవర్’ ఏమిటో ప్రపంచానికి ఎరుకపరిచారు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కర్తాకర్మా క్రియా అన్నీ తానై నిలిచారు. నేటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు నాటి ఉద్యమానికి అన్నుదన్నుగా నిలబడ్డారు. తెలుగునాట ప్రజాదరణ కలిగిన పత్రికలన్నీ ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఆ విధంగా ప్రజలు, పత్రికలు, రాజకీయ పార్టీలు కలిసి పార్టీ మార్పిళ్ళను సమర్ధవంతంగా అడ్డుకోగలిగారు. అప్పటికి కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు.
ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. కాలానుగుణంగా దానికి  కొన్ని సవరణలు చేస్తూ,  మరింత పటిష్టం చేస్తూ వచ్చారు. అయినా ఫిరాయింపులు ఆగడం లేదు. మరి లోపం ఎక్కడ వున్నట్టు.
ఇటు తెలంగాణలో ఉద్యమస్పూర్తితో అహరహం తపించే  ముఖ్యమంత్రి కేసీఆర్. అటు ఆంధ్రాలో అభివృద్ధి నినాదంతో అనుక్షణం నినదించే ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇద్దరికీ తమ రాష్ట్రాల్లో  హాయిగా, సజావుగా పరిపాలన చేసుకోగల మెజారిటీ ఇచ్చి పంపారు ప్రజలు. అయినా ఫిరాయింపుల పర్వంలో తమ జోక్యం, ప్రమేయం లేదని చెప్పుకోగల పరిస్తితి లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు గురించిన ముచ్చట కనుక బాబుగారు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో అనేకులు అధికారాన్ని చూసి   వస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా చేరికలతో పెరిగే సంఖ్యాబలం పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే సరే. మోయలేని భారంగా మారితే.....అప్పుడేమిటి పరిస్తితి.  రాయల సీమలో ఫాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యర్ధులను ఒక గూటికిందకు చేరుస్తున్నామని ఒక తెలుగు దేశం నేత పేర్కొన్నారు.  ఒక వరలో రెండు కత్తులు ఇమడవని అంటారు. ఇమడ్చగలిగితే, ఫాక్షన్ రాజకీయాలకు మంగళం పాడగలిగితే అంతకు మించి  కోరుకునేది వేరే ఏముండదు. కానీ అది జరిగే పనా!
ప్రజలిచ్చిన పాలనా వ్యవధిలో రెండేళ్ళు చూస్తుండగానే కరిగిపోయాయి. తాత్కాలికంగా పెంచుకున్న  సంఖ్యాబలంతో నల్లేరు మీది బండి నడకలా హాయిగా  రాజ్యం చేయగలిగింది మరో మూడేళ్ళు. పెట్టుకున్న లక్ష్యాల సాధనకు ఈ సమయం బొటాబొటిగా కూడా సరిపోకపోవచ్చు. మళ్ళీ అప్పుడు ప్రజల దగ్గరికే పోవాలి. కొత్తగా అరువు తెచ్చుకున్న ఈ ప్రజాప్రతినిధులు అప్పటికి యెంత బరువుగా మారతారో తెలియదు. ఇప్పుడు పనికి వచ్చిన అవకాశవాద అస్త్రాన్నే అప్పుడు మళ్ళీ ప్రయోగించరన్న గ్యారంటీ ఏమీ లేదు. ముందే చెప్పినట్టు వారికి ‘చలి’ భయం లేదు. ఏకం ఎప్పుడో తప్పారు. 
నిజమే! ముందే చెప్పినట్టు రాజకీయ అనివార్యతల కారణంగానే ఇటువంటి అవాంఛనీయ చర్యలకు పూనుకోవాల్సిన పరిస్తితి ఉన్నమాట కూడా కాదనలేము. నీతి వాక్యాలు నేటి రాజకీయాల్లో పొసగని విషయాలు అని భావించే రోజులివి. అయినా కానీ,  పార్టీల బలోపేతానికి ఫిరాయింపులు మినహా  వేరు పరిష్కారం ఏమీ లేదా!
ఉపశృతి: ఈ వ్యాసం రాస్తున్నప్పుడు దీనికి సమాధానం దొరికింది. మా ఇంట్లో పనిచేసే వాచ్ మన్ కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చింది. వాళ్ళ ఓట్లు మాత్రం స్వగ్రామంలోనే వున్నాయి. మా పనిమనిషి కళావతి మోహంలో చెప్పలేని ఆనందం.
‘బాబుగారు దేవుడండీ. ఇవ్వాళే మా సర్పంచు గారు ఫోను చేసి చెప్పారు. మాకు పక్కా ఇళ్ళు  శాంక్షన్  చేసారట’ అని మా ఆవిడతో  చెబుతోంది. పార్టీ మారి పదవి పుచ్చుకోబోతున్న రాజకీయ నాయకుడి  మోహంలో కూడా ఇంతటి సంతోషం కానరాలేదు.
నిజానికి నిజమైన రాజకీయ పార్టీలకి నిజమైన బలం కళావతి వంటి సామాన్య ఓటర్లే. అటువంటి వారి అభిమానం ఉన్నంతకాలం జంప్ జిలానీలతో పనియేల?  (24-02-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

కేటీఆర్ వంద రోజుల చిత్రమ్


సూటిగా........సుతిమెత్తగా.........

యువత ఆలోచనల్లో ఆవేశం ఒక్కటే కాదు నవ్యత్వం కూడా వుంటుంది. పెద్దల ఆలోచనల్లో ముందు జాగ్రత్తతో పాటు పరిపక్వత వుంటుంది. నవ్యత్వం, పరిపక్వత ఈ రెండూ సమపాళ్ళలో మేళవిస్తే, అటువంటి ఆలోచనలు ఆచరణలో విజయాలు సాధించే అవకాశం మెండుగా వుంటుంది.
అనుభవశాలి కేసీఆర్ నేతృత్వంలో, నవ్యత్వం కాంక్షించే కేటీఆర్ సారధ్యంలో పురుడు పోసుకున్న ‘వంద రోజుల’ ఆలోచన విలక్షణంగా వుంది. ఆలోచనలను రేకెత్తించే విధంగా కూడా వుంది.

తనది ‘వంద రోజుల చిత్రం’ అని  చాలా భరోసాగా చెబుతున్నారు, కేటీఆర్ గా ప్రసిద్దులయిన తెలంగాణా  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. మంత్రి పదవి ఆయనకు కొత్తది కాదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఐ.టీ. శాఖలను ఆయన గత ఇరవై మాసాలుగా సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాలకపక్షం టీఆర్ఎస్  పార్టీని ఘనవిజయపధంలో నడిపించినందుకు కేటీఆర్ కు మునిసిపల్ మంత్రిత్వ శాఖ అదనంగా లభించింది. విజయోత్సవాల వేడి తగ్గకముందే అయన ఆలస్యం చేయకుండా పురపాలన శాఖను ఒక గాడిన పెట్టడానికి నడుం బిగించారు. ఈ విషయంలో ఆయన అనుభవమే ఆయనకు అక్కరకు వచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరం నలుమూలలు చుట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాలు నివసించే  బస్తీల్లో అడుగు పెట్టారు. సంపన్న వర్గాలు కాపురాలు వుండే కాలనీల్లో కాలు మోపారు. ఓటర్లను ఆకర్షించడానికి ఉపన్యాసాలలో  చేసిన వాగ్దానాలు  విజయానికి బాటలు వేశాయి.  అదే సమయంలో పౌరుల కష్ట సుఖాలు దగ్గరనుంచి గమనించడానికి ఆయా  సందర్భాలు పనికివచ్చాయి. ఆ క్రమంలో ఆయన మెదడులో రూపుదిద్దుకున్నదే ఈ వంద రోజుల పధకం.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్, చంద్రబాబునాయుడు జరిపిన పాదయాత్రలు వారి హయాములో  కొత్త కొత్త పధకాల ఆవిష్కరణకు దోహదపడ్డ సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రణాళికలు కాలయాపనతో కూడినవి అయినప్పుడు వాటి ఫలితాలు ప్రజలకు చేరడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టే అవకాశం వుంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు కేటీఆర్ ‘వంద రోజుల్లో పూర్తిచేసే విధంగా  ‘సరికొత్త కార్యాచరణ’కు తెర తీశారు.
ఈ వివరాలను కేటీఆర్ విలేకరులకు స్వయంగా తెలియచేశారు. విషయాన్ని సంగ్రహంగా, సందేహాలకు తావు లేకుండా సమగ్రంగా వివరించగల నైపుణ్యం ఆయనకు తండ్రి  నుంచే అలవడి వుంటుంది. వంద రోజుల కార్యక్రమం కాకుండా ఇతరత్రా అడిగిన ప్రశ్నలను ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. ఈ అంశంపైనే ఏవయినా సందేహాలు వుంటే తీర్చడానికి సిద్ధం అని చెబుతూ, సలహాలు, సూచనలను సైతం ఆహ్వానించారు. నూరు రోజుల్లో కొన్ని పనులను పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నామని, నిర్దేశిత గడువు తీరగానే వీటిల్లో ఎన్ని చేసిందీ తానే విలేకరులకు వెల్లడిస్తానని అన్నారు. మూడు మాసాల వ్యవధే కనుక వేచి చూడడం కూడా అంత ఇబ్బంది అనిపించదు.
ఈ  త్రైమాసిక ప్రణాళికలో అనేక అంశాలు వున్నాయి. కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా దీని పరిధిని  చాలా విస్తృతంగా నిర్దేశించుకున్నారు. తెలంగాణాలోని ఇతర మునిసిపల్  కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు  కూడా  ఇది వర్తిస్తుంది.    
తెలంగాణా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, నగరాల్లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్దీకరణ కోసం దాఖలయిన  ధరఖాస్తులను అన్నింటినీ పరిష్కరించడం కూడా ఈ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో వుంది. పాత వాటిని క్రమబద్దీకరించడంతో పాటు కొత్త కనెక్షన్లు కూడా జారీ చేస్తామని మంత్రి చెప్పారు. గుక్కెడు మంచి నీటికోసం అల్లాడుతున్న జనాలకు ఇది మంచి ఊరట కలిగించే కబురే. లేఔట్ల అనుమతులను దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల్లోగా ఆన్  లైన్ లో పరిష్కరించాలనేది మరో చక్కటి నిర్ణయం.
ప్రధానమంత్రి స్వచ్చ భారత్ స్పూర్తితో కాబోలు మొత్తం పదిహీను పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించి, ఆ సదుపాయంలేని ఇల్లంటూ లేకుండా చేయడం మరో ప్రధాన మైన అంశం. ఇరవై మూడు నగర పంచాయితీల్లో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ ఈ డీ విద్యుత్ దీపాలను అమర్చడం, గ్రేటర్ హైదరాబాదు  పరిధిలో పౌర సదుపాయాలను మెరుగు పరిచే విషయంలో ప్రజలను భాగస్వాములుగా చేయడానికి వీలుగా వార్డు కమిటీలు, ఏరియా కమిటీల ఏర్పాటు, రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అయిదువందల పైచిలుకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయడం, ప్రధాన నాలాల్లో పూడిక తొలగింపు, పది కోట్లతో పది శ్మశానవాటికల అభివృద్ధి, అవసరమైన చోట్ల బస్  షెల్టర్లు, వంద  పబ్లిక్ టాయిలెట్లు, ఇరవై ఆరు కోట్లతో నగరంలో నలభయ్ మోడల్ మార్కెట్లు....ఇలా వుంది ఆ జాబితా. మొన్నీమధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సంరంభంలో కేటీఆర్ స్వయంగా ఇచ్చిన హామీల్లో కొన్ని ఇవి కూడా వున్నాయి.  వాటిని నెరవేర్చడానికి చెప్పుకుంటున్న సంకల్పమే ఈ నూరు రోజుల పధకం.
ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి. ఉదాహరణకు నగరానికి వడ్డాణంలా రూపుదిద్దుకుంటున్న ఔటర్  రింగ్  రోడ్డు, కొన్ని చోట్ల అసంపూర్తిగా వుండిపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా వినియోగంలోకి రాకుండా వుంది. ఘట్ కేసర్, కీసర, శామీర్ పేట్ నడుమ ఓ.ఆర్.ఆర్. పనులను పూర్తిచేసి ఆ రోడ్డును వినియోగంలోకి తేవడం కూడా పెట్టుకున్న లక్ష్యాల్లో వుంది. ఈ రోడ్డు వెంట సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం,ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన  కోహెడ గ్రామస్తులకు ప్లాట్ల కేటాయింపు, పదేళ్లనుంచి పెండింగులో వున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారం ఇవన్నీ వంద రోజుల్లో పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘మీ వీధులను శుభ్రంగా వుంచండి’ అని నినాదం రాసి వున్న మునిసిపాలిటీ చెత్త లారీలు, అవి ప్రయాణించే దారిపొడుగునా చెత్త పారేస్తూ పోయే దృశ్యాలు ప్రజలకు అనుభవైకవేద్యం. మునిసిపాలిటీ అంటేనే ‘చెత్త’ అనే పర్యాయపదం ఏర్పడడానికి ఇదొక కారణం. ఈ  కోణం నుంచి కూడా ఆలోచించి, నగర పాలక సంస్థ పరిధిలోవున్న వెయ్యీ నూటపదహారు కిలోమీటర్ల నిడివి కలిగిన రహదారుల్లో ఇక చెత్తాచెదారం కనిపించకుండా శ్రద్ధ తీసుకుంటారు.
ఇవన్నీ సరే. వినడానికి వీనుల విందుగా వున్నాయి. పూర్తి  చేయాల్సిన కాలపరిమితి మూడంటే మూడే నెలలు కావడం మరింత సంతోషించాల్సిన సంగతి. బహుశా జూన్  రెండో తేదీ,  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి  పూర్తయ్యేలా ఈ వంద రోజుల పరిమితి నిర్దేశించుకున్నారేమో తెలవదు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన మంత్రి కేటీఆర్, ములుకోల ధరించి స్యందన సారధ్యం వహిస్తే ఈ లక్ష్య సాధన పెద్ద విషయం కాకపోవచ్చు. కావాల్సినదల్లా కాసింత చిత్తశుద్ధి. చెప్పిన తీరును గమనించిన వారికి ఆయనలో ఇది పుష్కలంగా ఉన్నట్టే కానవచ్చింది. కాకపొతే ఆయన అదిలింఛి, కదిలించాల్సిన పాలనా యంత్రాంగానికి  అంత మంచి పేరు వున్నట్టు లేదు. అలసత్వానికీ, అవినీతికీ మారుపేరయిన మునిసిపల్ శాఖలో కొంతలో కొంతయినా   మార్పు తీసుకు రాగలిగితే, మంత్రి గారి ప్రయత్నం సఫలం అయినట్టే.
విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఒక విషయం చెప్పారు, పనికివచ్చే సూచనలు, సలహాలు ఇవ్వండని. పనికి వస్తుందో లేదో తెలియదు కానీ, ఈ మధ్య సాంఘిక మాధ్యమాల్లో స్మార్ట్ సిటీకి ఒక కొత్త నిర్వచనం కనిపించింది,  ఏ నగరంలో అయితే,  నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో చిక్కుకున్న  అంబులెన్స్ కనబడదో,  ఆ నగరాన్ని స్మార్ట్ సిటీ అని పిలవాలని.  
ఉపశృతి: గ్రేటర్ ఎన్నికలకు ముందు నగరంలో బీటీ రోడ్ల నిర్మాణం ఆఘమేఘాల మీద జరిగింది. ప్రతి రోజూ  ఉదయం వేళల్లో అనేక ప్రాంతాల్లో వున్న టీవీ స్తూడియోలకు వెళ్లి వచ్చేటప్పుడు ఈ రోడ్ల నిర్మాణం కళ్ళారా చూసేవాడిని. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా కావూరి హిల్స్ వైపు వెళ్ళే రోడ్డు చక్కగా వేసారు. అయితే మూల మలుపులో కొంత పని మిగిలిపోయింది. నన్ను తీసుకువెళ్ళే ఒక స్టూడియో కారు  డ్రైవర్, అది నాకుచూపించి, ‘చూస్తుండండి, ఎన్నికలు అయిపోయాయి. ఇక దీని మొహం చూసేవాళ్ళు వుండరు’ అన్నాడు  నమ్మకంగా. అతడన్నట్టే ఎన్నికలు అయిపోయాయి. కొత్త మేయరుతో సహా,  గ్రేటర్ పాలకమండలి కొలువు తీరింది. ఆ మరునాడే మరో స్టూడియోకి వెడుతూ చూసాను. మిగిలిన ఆ రోడ్డు  పనిని పూర్తి చేసే పని కూడా మొదలయింది. ఆ  డ్రైవర్ నమ్మకం వమ్మయింది. అయితే మంత్రి గారి మీద బాధ్యత కూడా పెరిగింది. చెప్పింది చెప్పినట్టు చెప్పిన వ్యవధిలో పూర్తి చేయని పక్షంలో ఆ డ్రైవర్ మాటే నిజమవుతుంది. (19-02-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

17, ఫిబ్రవరి 2016, బుధవారం

ప్రేమంటే ఇదిరా!

  
పత్రికలకి కొన్ని వార్తలు పట్టవు. అయినా అలాటి వార్త ఒకటి నా కంట పడింది. ఏదో పత్రికలో కాదు, యాధాలాపంగా  రిమోట్ తో టీవీ ఛానళ్లు మారుస్తుంటే.
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఆయనకు కొత్తకాదు. కాని ఎప్పుడు మాట్లాడినా వినేవాళ్ళకు కొత్తగానే వుంటుంది.
ఆరోజు ఆయన తీసుకున్న  అంశం కొత్తగానే కాదు కాస్త విచిత్రంగా కూడా వుంది.
వేలంటైన్స్ డే. ప్రేమికుల దినం. దాన్ని గురించి మాట్లాడడమే కాదు, ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం రోజున దాన్ని హైదరాబాదులోని రామకృష్ణ మఠంలో  నిర్వహించారు కూడా.
ఇక ఈ ‘కూడా’లు కాస్త పక్కనబెట్టి అసలు విషయం చెప్పుకుందాం.


స్వామివారు ఏమిటి? ప్రేమికుల దినం గురించి మాట్లాడ్డం ఏమిటి అనే ప్రశ్నలకు తమ అనుగ్రహ భాషణంలో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.
‘వేలంటైన్స్ డే ప్రాశస్త్యం గురించి చెప్పారు. దాని ఆవిర్భావం గురించి వివరించారు. ఒక యువకుడు, ఒక యువతి ప్రేమించుకోవడం ఒక్కటే ప్రేమ అనుకోరాదన్నారు.


‘అది కూడా ప్రేమే. కాదనను. కానీ పిల్లలపట్ల తల్లి చూపే ప్రేమ, తల్లి పట్ల పిల్లలు చూపే ప్రేమ, తండ్రి పట్ల పిల్లలు, పిల్లల పట్ల తండ్రులు ప్రదర్శించే ప్రేమ,  భగవంతుడి పట్ల భక్తుడి ప్రేమ, భక్తుడి విషయంలో భగవంతుడు చూపే ప్రేమ, అన్నింటికీ  మించి  దేశం పట్ల, హనుమంతప్ప వంటి వీరుల పట్ల  జాతి ప్రజలు చూపాల్సిన ప్రేమ, ఇలా సాగే  ఈ ప్రేమలు అన్నింటినీ, వాటి వైశిష్ట్యాన్ని ఎత్తి చూపాల్సిన దినం-  ప్రేమికుల దినం’ అంటూ చక్కని కొత్త నిర్వచనం ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి వారు. యెంత చక్కటి తాత్వికత! యెంత గొప్ప ఆలోచన.           
నిజమే కదా! ప్రేమ్ దివస్ అంటే ప్రేమికుల రోజు కాదు, ప్రేమ మహత్తును అందులోని మత్తును జగత్తుకు తెలపాలనే సదుద్దేశ్యంతో  ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కళ్ళు చెదిరే విన్యాసాలు లేవు కానీ, కళ్ళు చమర్చే అంశాలు వున్నాయి. ప్రేమికుల రోజునే దీన్ని నిర్వహించడం ద్వారా స్వామి, నేటి తరానికి కొత్త సందేశం ఇచ్చారు. అంతే కాదు, ప్రేమ అంటే ఏమిటో, అది ఎన్ని రకాలుగా తన రూపాలను  విస్తరిస్తుందో ఈ కార్యక్రమంలో ఎత్తి చూపారు.   
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఒక మాతృమూర్తిని తీసుకువచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఆమె కడుపున  పడ్డ బిడ్డ,  భూమిన పడింది కాని, అప్పటి నుంచి ఇప్పటివరకు మానసిక ఎదుగుదల లేదు. ‘అమ్మా’ అనిపించుకోని ఆడ జన్మ నిరర్ధకం అంటారు. బిడ్డడు పుట్టి ముప్పయి రెండేళ్ళు అవుతున్నాయి. కాని ఏనాడు నోరు తెరిచి ‘అమ్మా’ అని పిలవలేని నిర్భాగ్య దామోదరుడు అతడయితే, పిలిపించుకోలేని దౌర్భాగ్యం ఈ తల్లిది. తల్లిప్రేమ తూచగలిగిన తరాజు ఈలోకంలో లేదు. ఏమీ లేకపోయినా అన్నింటికీ మించిన అమ్మతనం ఆమె సొంతం.  ఆ బిడ్డడి పట్ల కన్నతల్లి ప్రేమ చూపడంలో ఆ పేదరాలు ‘పేదది’ అనిపించుకోలేదు. ఇన్నేళ్ళు వచ్చినా ఆ పాపడికి పసితనపు ‘తెలియనితనం’ పోలేదు.  ఇప్పటికీ దైహిక సంబంధమైన ప్రాకృతిక పనులన్నీ ఆ తల్లి ఒడిలోనే. అయినా, అసహ్యించు కోకుండా సేవలు చేస్తూనే వస్తోంది. అన్నేళ్ళు వచ్చినా ఆ పాపడు ఆ తల్లికి ఇంకా ఒడిలోని బిడ్డే. అందుకే, ఈ కార్యక్రమ నిర్వాహకులు  ‘ తల్లి ప్రేమలో కల్తీ వుండదు’ అని నిరూపించిన ఆ మాతృమూర్తిని సగౌరవంగా వేదిక మీదకు తోడ్కొని వచ్చి సన్మానం చేసారు. ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణా ఆసెంబ్లీ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి,  ఆమె పరిస్తితి చూసి విచలితులై తన జేబులో వున్న కరెన్సీ నోట్లు అన్నింటినీ, ఎన్ని వున్నాయో లెక్కపెట్టుకోకుండా ఆ అమ్మ చేతిలో పెట్టి దణ్ణం పెట్టారు.
అలాగే, స్వామి కన్నుపడిన మరో అదృష్టవంతుడు, పుట్టుకతో దురదృష్టవంతుడు అయిన   కనుచూపు లేని సంగీత కళాకారుడు మోహన కృష్ణ.  చిన్నతనంలో అంతంతగా వున్నా కనుచూపు ఒక వయసు రాకముందే పూర్తిగా పోయింది. కన్నతల్లి లాలనలో పెరిగిన  కళ్ళు లేని మోహన కృష్ణ ఇంతేనా ఈ జీవితం అని నిరుత్సాహపడకుండా  సంగీతాన్నే తన జీవితం చేసుకున్నారు. సంగీత ప్రపంచంలోనే పెరిగిపెరిగి, వయస్సులోనే కాకుండా సంగీతంలో కూడా చాలా  పెద్దవాడయాడు. సంగీతాన్ని అంతగా ప్రేమించిన వాడు కనుకనే సంగీత సరస్వతి అతడిని అంతగా కరుణించింది. ఈ వేడుకలో సన్మానం పొందినవారిలో  మోహన కృష్ణ ఒకడు కావడానికి ఈ ప్రేమే కారణం.
పత్రికలు చదివే వారికి వరంగల్ ‘ప్రణీత’ గుర్తుండేవుంటుంది. రౌడీలు చిమ్మిన యాసిడ్ మొహాన పడి అందవికారిగా మారిన ప్రణీత, పట్టుదలతో చదువు కొనసాగించి, బీటెక్ పూర్తీ చేసి  ఇంజినీర్ కాగలిగింది. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అని నమ్మిన ఓ యువకుడు, ఆమె గురించి విని, అమెరికా నుంచి వచ్చి ఏరికోరి మరీ  ఆమెను పెళ్ళాడాడు. ఈ వేదిక మీద ఆమెను చూసిన వారు చప్పున గుర్తుపట్టి వుండరు. ఎందుకంటె ఆత్మ బలం ఇచ్చిన దమ్మూ ధైర్యం ఆమె మొహం మీది మరకలను కనబడకుండా కప్పివేశాయి. ఈ నిజమైన ప్రేమకు కూడా  ఈ వేదికపై ఘన సత్కారం  జరిగింది.
భారతీయతకు కుటుంబ వ్యవస్థ వెన్నెముక. కాలక్రమంలో కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని గ్రహించిన ఓ కుటుంబం, మనకే సొంతం అయిన ఈ  ‘కుటుంబ వ్యవస్థను’ రెండు చేతులు అడ్డం పెట్టి  కాపాడుతోంది. ఆ కుటుంబం మన మహబూబ్ నగర్ జిల్లాలోనే వుంది. మొత్తం అరవై రెండు మంది సభ్యులు వున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కు నానోజీ మహాశయులు. అత్తలు, కోడళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒదినెలు, మరదళ్ళు, కోడళ్ళు, ఆడపడుచులు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమనుమలు ఇలా అందరూ ఒక్క గూడు కిందనే కలసికట్టుగా వుంటున్నారు. ఒక చూరు కిందనే కలిసి  వండుకుంటారు. కలిసి తింటారు. ‘పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, పొరపొచ్చాలు లేని మంచి కుటుంబం’గా అందరు మెచ్చే విధంగా జీవిస్తున్నారు. కుటుంబ ప్రేమకు  ఉదాహరణగా నిలచిన ఆ కుటుంబానికి కూడా ఈ వేదికమీద సన్మానం జరిగింది.
ఇప్పుడు చెప్పండి ఇది వినూత్నంగా నిర్వహించిన ప్రేమికుల దినమా కాదా! ప్రేమ్ దివస్ అవునా కాదా!  
దీన్ని నిర్వహించిన భారత్ టుడే టీవీ ఛానల్ నిర్వాహకులకు అభినందనలు తెలపలా లేదా!
మొత్తం ఈ కార్యక్రమానికి ఇంతటి ఉద్దీపన కలిగించిన మాన్యులు పరిపూర్ణానంద స్వామి వారికి సాష్టాంగనమస్కారం నమస్కారం చేయాలా వద్దా!
నేనయితే మరో మాట లేకుండా, మరో ఆలోచన రాకుండా ఆ రెండూ చేసేసాను.                
(17-02-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:98491 30595 

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్


(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు పైనేనేమో!
2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు.  మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మసీదుకు దగ్గరలో  మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ప్రదేశంలో వున్నట్టుంది.


అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్, కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’ అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలువాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండాతడుముకోకుండాఅసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ‘ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్   అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతేభద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడంవాళ్ళు   దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడంచేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం –  అంతా కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నంపప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం. 

ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. (17-02-2016)