(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 10-12-2015, THURSDAY)
(డిసెంబరు ఎనిమిది నేదునూరి వారి ప్రధమ వర్ధంతి)
(డిసెంబరు ఎనిమిది నేదునూరి వారి ప్రధమ వర్ధంతి)
1968 జనవరి
నెల. నలభై ఏడేళ్ళనాటి మాట. హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత
కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల
సమయంలో వేదికమీద నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము
కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్
విద్వాంసులు ఎం చంద్రశేఖరన్ , మృదంగ
విద్వాంసులు దండమూడి రామ్మోహనరావులు
సహకరిస్తుండగా, నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు
ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన తన్మయస్తితిలో
తేలిపోయింది. త్యాగరాజస్వామి వారు ఎంతటి ఆర్తితో ఆ కీర్తన
రాసారో అదే ఆర్తి, కృష్ణమూర్తి గారి స్వరంలో తొణికిసలాడింది.
అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్
అయిదు నిమిషాలపాటు రవీంద్రభారతి ఆడిటోరియం, నేదునూరివారి
సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్ తమిళుడు.
అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు
మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్ తమిళంలో
వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా
జీవితం ధన్యమయింది. ఇంత గొప్ప సంగీతాన్ని పక్కనే కూర్చుని వినే భాగ్యం
కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా మనగలిగిన
అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను'
(సంగీత కళానిధి కీర్తిశేషులు నేదునూరి)
చంద్రశేఖరన్ గారి నోటి
నుంచి ‘సంగీత కళానిధి’ అనే పదం రావడం యాదృచ్చికమైనా, తరువాతి
రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై
సంగీత అకాడమివారు ఏటా ఇచ్చే అత్యున్నత
పురస్కారం ‘సంగీతకళానిధి’ బిరుదు. ప్రతి సంగీత విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం
కన్నా మిన్నగా భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది.
తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి ఈ పురస్కారం లభించడంపట్ల
హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే ఆయనకు
‘సంగీత కళానిధి’ పురస్కారం
ప్రకటించినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నది
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఆయనకు ఆ
రోజుల్లో పీ.ఆర్.ఓ గా వున్న వనం జ్వాల
నరసింహారావు (ప్రస్తుతం ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కే,చంద్ర శేఖర రావు కార్యాలయంలో
ముఖ్య పౌరసంబంధ అధికారిగా పనిచేస్తున్నారు)కు నాడు ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ గా
పనిచేస్తున్న ఆర్వీవీ కృష్ణారావు ద్వారా ఈ విషయం తెలిసింది. నేదునూరి వారికి
పురస్కార ప్రకటన సంగతి తెలుసుకున్న చెన్నారెడ్డి గారు నేదునూరి
వారిని అభినందిస్తూ చక్కని సందేశం కూడా పంపారు.
ఆ పురస్కారం అందుకున్న
తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది.
స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని బెజవాడలోని
అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.
చెన్నై మ్యూజిక్
అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి
పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా
డిసెంబరు నెలలో జరిగే సంగీత ఉత్సవాల్లో 1951 నుంచి
క్రమం తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు కచ్చేరీ
చేస్తూ వస్తున్న ఘనత నేదునూరి వారిది. అప్పటి వరకు కళానిధి పురస్కారం
పొందిన వారు మొదటి వరసలో ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో, ప్రముఖ
సంగీత కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కచ్చేరీలు ఇస్తారు. దేశం
నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు ఆ సంగీతాంబుధిలో
వోలలడుతారు. చెన్నై నగరంలోని హోటళ్ళన్నీ
సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.
తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. చెన్నైకి
మకాం మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను సంగీత
పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ
మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ
పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం
ఆయనకే చెల్లింది.
నేదునూరి వారు
కన్నుమూయడానికి కొద్దిరోజులముందరే ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన
ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. ఉత్తరాంద్రను నిరుడు అతలాకుతలం చేసిన హుద్ హుద్
తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సకాలంలో తీసుకున్న చర్యలు గురించి నేదునూరివారు ప్రశంసించినట్టు
వార్తలు కూడా వచ్చాయి.
నేదునూరి కృష్ణమూర్తి
గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ
అశేష యశస్సును తన వెనుకే వొదిలి, తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన
విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు
సంగీత చక్రవర్తులు శ్రీ మాండలిన్ శ్రీనివాస్, శ్రీ
నేదునూరి కృష్ణ మూర్తిని గత ఏడాదిలోనే
పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.
నేదునూరి వారి
శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'పద్మ' అవార్డులు
లభించాయి కానీ వారి గురువుకు రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
మొదలయిన వారి అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం.
కర్ణాటక సంగీతంలో
గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన నేదునూరి
బాణీని అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో ఈ నెల
ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలు కావాల్సి వుంది. అయితే భారీ వర్షాలు, వరదలతో బాగా
దెబ్బతిని నెమ్మదిగా కోలుకుంటున్న చెన్నై నగరంలో ఈ ఏడాది సంగీత ఉత్సవాలు గతంలో
మాదిరిగా జరగడం అనుమానమే. చెన్నై మ్యూజిక్
అకాడమి ఆధ్వర్యంలో, టీ.టీ.కే. ఆడిటోరియంలో
ఒకవేళ జరిగినా, ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ లేకపోవడం ఖచ్చితంగా
ఒక లోటు.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491
30595
2 కామెంట్‌లు:
yes sir nedunuri sir is a legend. it is well known that he has absolute mastery over carnatic music which he achieved with the help of his guru sripada pinakapani sir. he used to say that telugu is the mother tongue of carnatic music. the good thing is that he has passed on his bani to able disciples viz. malladi brothers. thank you sir for the good article.
నేదునూరి కృష్ణమూర్తిగారు మా పెదనానగారు. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు అశోక్ నగర్లోని మా స్వగృహానికి విచ్చేసి మమ్ములను ఆప్యాయంగ పలకరించి వెళ్ళేవారు, ఆయన మా బంధుకోటిలో ప్రముఖులవడం మా పూర్వజన్మ సుకృతం.
నేదునూరి వెంకట శివరామకృష్ణ
కామెంట్‌ను పోస్ట్ చేయండి