21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నరం లేని నాలుకలు – స్థిరం లేని ఏలికలు – భండారు శ్రీనివాసరావు


నరం లేని నాలుకలు – స్థిరం లేని ఏలికలు 

(23-09-2012 తేదీ 'సూర్య' దినపత్రికలో ప్రచురితం)

అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే! గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ‘ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.’
ప్రస్తుత రాజకీయాల తీరుతెన్నులు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయి.
డీసెల్ ధర పెంపు, గాస్ సిలిండర్ల రేషను, చిల్లర వర్తకంలో ఎఫ్ డీ ఐ లకు అనుమతి – వీటి పట్ల అధికార, ప్రతిపక్షాల వైఖరులు గమనించిన వారికి ఎవరికి వారు అవకాశవాదాన్ని నమ్ముకుని మాట్లాడుతున్నారు తప్ప ఒక సిద్ధాంత ప్రాతిపదికపై వాదులాడుతున్న సందర్భం కనబడదు.
వెనుక విక్రమార్కుడి సింహాసనం గురించి ఒక కధ ప్రచారంలో వుండేది. సింహాసనం మీద కూర్చోగానే న్యాయం చెప్పే తీరులో నిబద్దతత కనబడేది. సింహాసనం దిగితే చాలు మళ్ళీ మామూలు మనిషే. అలాగే ఇప్పుడు అధికారంలో వున్నప్పుడు చెప్పే మాటలు వేరు. అధికారం కోల్పోగానే చేసే విమర్శలు వేరు.
యూ.పీ.ఏ. సర్కారు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తో సహా విపక్షాలన్నీ భారత్ బంద్ నిర్వహించాయి. బీ.జే.పీ. పాలిత రాష్ట్రాల్లో బంద్ సంపూర్ణం అని వార్తలు వస్తే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బంద్ పాక్షికమనీ, ప్రభావం స్వల్పమనీ సమాచారం. అంటే ప్రజలతో నిమిత్తం లేకుండా కేవలం ఆయా పార్టీల కార్యకర్తల బలం, వారి ఉత్సాహం  ప్రాతిపదికగా బంద్ జరిగిందనో, సరిగా జరగలేదనో  అనుకోవాలి. దీనర్ధం యూ.పీ.ఏ. ప్రభు త్వం తీసుకున్న చర్యలకు ప్రజామోదం వుందని కాదు. చిల్లర వర్తకంలో ఎఫ్.డీ.ఐ. ల ప్రవేశం గురింఛీ,  దానివల్ల వొనగూడే పరిణామాల గురించి సామాన్యులకు అవగాహన వుండడం సాధ్యం కాకపోవచ్చు. కాని, డీసెల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల  నియంత్రణ వల్ల తమకు వాటిల్ల గల ఇబ్బందులు వారికి తెలియనివి కావు. అయినా కానీ మెజారిటీ ప్రజానీకం బందులు వంటి నిరసన కార్యక్రమాలపట్ల యెందుకు నిరాసక్తంగా వుంటున్నారన్నది రాజకీయ పార్టీలే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సామాన్యుల కష్టాలను తీర్చడానికి తాము బందులు, ఆందోళనల రూపంలో ఇంతగా హైరానా పడుతుంటే జనం పట్టించుకోకుండా నిర్లిప్తంగా వుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఒక ప్రతిపక్షనేత టీవీ చానళ్ళలో మాట్లాడుతూ అన్నారు. అయితే, అలాటివారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి వుంది.  ప్రజావ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజలు నిర్లిప్తంగా లేరు. అదను చూసి, అంటే ఎన్నికల వరకు వేచి చూసి వేటు వేయడం వారికి తెలుసు. ఈ లోపల ఎన్ని బందులు జరిపినా అవన్నీ కంటి తుడుపు చర్యలే అన్న సత్యం వారికి తెలియనిది కాదు. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అన్న భ్రమలో రాజకీయ నాయకులు వుంటారు. కానీ, ఇవే ప్రతిపక్షాలు గతంలో అధికారంలో వున్నప్పుడు ఏం చేశాయన్నది ప్రజలు మరచిపోయారనుకుంటే అది వారి భ్రమ. డీసెల్, పెట్రోలు ధరలు పెంచినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో, సరిగ్గా అదే విధంగా అప్పుడు  ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ కూడా అచ్చు  అదే విధంగా వ్యవహరించిన విషయం వారికి బాగా గుర్తుంది.
పెట్రోలుకు మండే గుణం సహజం. పెట్రోలు ధరలు కూడా మండిపోతూ వుండడం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే వున్నాం.  అలాగే ఈ ధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా చూస్తూనే వున్నాం. కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం చూస్తుంటే రాజకీయ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రో ధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా  ఈ పాటికి వొంటబట్టే వుంటుంది.
‘అధికారంలోకి రావడానికి కొన్ని మాయ మాటలు చెప్పాలి, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరికొన్ని మాయదారి  పనులు చేయాలి’ అన్నది ఈ నాటి రాజకీయులకు ప్రాధమిక సూత్రంగా మారిపోయింది. చిత్తశుద్ధిలేని ఈ మాదిరి వ్యవహారశైలి వల్లనే  జనాలకు రాజకీయపార్టీల పట్ల చులకనభావం పెరుగుతోంది. ఈరోజు ఇంత గగ్గోలు చేస్తున్న ప్రతిపక్షాలు రేపు అధికారంలోకి వస్తే చమురు ధరలు పెంచమని గట్టి హామీ ఇవ్వగలవా అన్నది వారి ప్రశ్న. గత్యంతరం లేని స్తితిలోనే ధరలు పెంచాల్సివచ్చిందని ఈరోజు నెత్తీనోరూ బాదుకుంటున్న పాలకపక్షం రేపటిరోజున ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్తితి దాపురిస్తే అప్పుడు ఇవే మాటలు చెప్పగలుగుతుందా అన్నది సమాధానం దొరకని శేషప్రశ్న. ధరల పెంపుదలకు నిరసనగా  బందులూ, ధర్నాలు అంటూ రోడ్డెక్కకుండా వుంటా మన్న హామీ ఏమయినా ఇవ్వగలవా? అన్నది ప్రజల ప్రశ్న. ఈ రకమయిన ద్వంద్వ వైఖరుల మూలంగానే  బందులూ, ఆందోళనల విషయంలో ప్రజలలో నిర్లిప్తత ఏర్పడుతోందన్న ఎరుక ఇంకా రాజకీయ పక్షాలకు కలిగినట్టులేదు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రాధమిక హక్కు కావచ్చు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం – అది ఇప్పటి  యూ.పీ.యే. కావచ్చు ఒకప్పటి ఎన్.డీ.యే. కావచ్చు – చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు. కానీ ఈ సారి డీసెల్ ధర  లీటర్ ఒక్కింటికి అయిదు  రూపాయలు  ఒక్కమారుగా పెంచికూర్చుని, ఆయిల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్న కారణంగా పెంచిన ధరను ప్రజలు మంచిమనసుతో అర్ధం చేసుకుని భరించాలని సర్కారు ఒక్క ప్రకటనతో సరిపుచ్చుకుంది. అదీ పార్లమెంటు సమావేశాలు ముగియగానే.  
చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని
ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.
ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన  నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన  అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న  ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే  సులువయిన మార్గం. ఇది  తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. ఇవన్నీ చూసేవారికి  నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.
లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ  సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.
ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నారు.. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా  సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది. (21-09-2012)

8 కామెంట్‌లు:

PRASAD చెప్పారు...

నిజ్జంగా నిజం. దాడి వీరభద్ర రావు నిన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ లో చెప్పిన వివరాల ప్రకారం గత ఆర్ధిక సంవత్సరానికి ఆయిల్ కంపెనీలు అన్నీ లాభాల్లోనే వున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే మీరు చెప్పిన
విధంగా సగానికి పైగా వున్న పన్నులు భవిష్యత్తులో పెంచకుండా ఆపగలిగితె కొంతవరకు ధరలు నియంత్రణలో వుంటాయి.
ప్రసాద్ శర్మ, హైదరాబాదు.

అజ్ఞాత చెప్పారు...

మీరు మీ విజయవాడ మీద వ్రాసిన వ్యాసాలన్నీ ఈ బుక్ గా పబ్లిష్ చేద్దామనుకున్నారు కదా? అది ఏమయింది?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ప్రసాద శర్మ. - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ఇల్లు కట్టి చూడు, బుక్కు వేసి చూడు అన్నారు. అన్ని తెలిసి కూడా పుస్తక ప్రచురణకు పూనుకునే సాహసం యెలా చేస్తాను అజ్ఞాత గారూ.- భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు పెద్దగా శ్రమపడనక్కర్లేకుండా అమెజాన్ కిండిల్ అనే ఒక కొత్త ప్రాసెస్ మొదలైంది. మీ మాన్యుస్క్రిప్ట్స్ (అంటే మీ చేతిరాతల్తో) వున్న కాపీలని వాడికి ఇచేస్తే, వాడే స్కాన్ చేసి, టైప్ చేసి, బుక్ వేసి అమ్మకానికి పెడతాడు. అల్లా అమ్మిన బుక్స్ లో ఒరిజినల్ ఆథర్ కి రాయల్టీ కూడా ఇస్తాడు అని విన్నాను.

అఫ్ కోర్స్ .. బుక్ లో కంటెంట్ బాగుంటేనే ఇదంతా జరుగుతుందనుకోండి.

I will mail you the exact process, you can pursue it if you are interested.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - Thanks for the valuble information.- Bhandaru Srinivas Rao

అజ్ఞాత చెప్పారు...

అధికారంలో వుండగా చేసిన పనులు ప్రతిపక్షంలో వ్యతిరేకిస్తారన్నది మనదేశంలో నిజమే. ఇక్కడ తమాషా ఏమంటే, 8ఏళ్ళూ గప్చిప్‌గా స్కాములు చేసుకుంటూ గడిపేసి, ఎన్నికలకు 2ఏళ్ళ ముందుగా ఇంత 'సాహసోపేతమైన కీలక నిర్ణయాలూ భాగస్వాములతో చెప్పకుండా/ఒప్పించకుండా తీసుకోవడం. దీని వెనుక, ఒబామ వెలిబుచ్చిన అసంతృప్తి, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ వాడిన ఎదవ, చవట, దద్దమ్మ అనే తిట్లు మన సింగన్నను ఆర్థిక సంస్కరణలకు పురిగొల్పుతున్నాయన్నది సుస్పష్టం.

"ఫలానా మేధావి ఆర్థిక సంస్కరణలు చేసెను" అనడంలో ఎంత నిజముందో/మేధావితనముందో ఈ హడావుడి సంస్కరణల ద్వారా తెలుస్తోంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@SNKR - Thanks - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు