29, సెప్టెంబర్ 2012, శనివారం

అధికార ప్రాప్తి పాదయాత్ర


గమనిక లాంటి హెచ్చరిక : నెట్లో తిరుగాడుతున్న ఆర్టికిల్ ఇది. నవ్వుకుంటూ చదివే వాళ్ళు, చదువుకుంటూ నవ్వేవాళ్ళు నిక్షేపంగా చదవండి. హేళన చేయడానికో, వెక్కిరించడానికో రాశారనిపిస్తే వెంటనే ఆపుచేసి వేరే ఏదయినా చదువుకోండి. నేను దీన్ని ఇందులో పోస్ట్ చేయడానికి ముందు వారం రోజులు ఆలోచించాను. పదిమందికి పంపిస్తే  ఆరుగురు హాయిగా నవ్వుకున్నారు. ఇద్దరేసిచొప్పున నలుగురు మాత్రం 'రాజకీయ రంగుటద్దాలు' పెట్టుకుని  చదివారేమో తెలియదు, ఆ తరువాత మాత్రం చాలా ఘాటుగా,  అనుకూలంగాను, ప్రతికూలంగాను  ప్రతిస్పందించారు. ఇక మీ ఇష్టం -          

అధికార ప్రాప్తి పాదయాత్ర

హాలంతా కేరింతలతో, విజిల్స్‌తో ఊగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి తెలుగు నాయకుడి కళ్లు చెమ్మగిల్లాయి. వారిలో ఇంతటి ఉత్సాహాన్ని చూడడం అదే మొదటి సారి. ఆనందంతో గొంతు బొంగురు పోయింది. ఈలోపు పాట అయిపోయింది. నాయకులంతా వన్స్‌మోర్ ... వన్స్‌మోర్ అని అరవసాగారు. తెలుగునేత తల ఊపడంతో పాట  మళ్ళీ  వినిపించారు.' ఓలమ్మీ  తిక్కరేగిందా.... ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?' మైకులో పాట పెద్దగా వినిపిస్తోంది. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఒక్క హిట్టు కూడా లేక చతికిలపడిపోవడంతో సినిమా శ్రేయోభిలాషులు కొందరు ఇచ్చిన సలహా మేరకు తెలుగునేత హిట్ చిత్రాల దర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.

ఒక్కో దృశ్యం రక్తి కట్టడానికి ఎంతో   కృషి చేసే ఆ  దర్శకులు,  పడిపోయిన పార్టీ పైకి లేవాలంటే పవర్ ఫుల్ సీన్స్ ఉండాలని సూచించారు. యాత్ర ప్రారంభ సభలో  'ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా?' పాటను వినిపించాలని నిర్ణయించారు. ఆ పాటకు నాయకులంతా ఊగిపోతుండడం గమనించిన తెలుగునేత 'రాష్ట్రమంతా  మీలానే చైతన్యంతో రగిలిపోయి, జనం వేసే వోట్లతో మనం మళ్ళీ  అధికారంలోకి రాగానే ఓలమ్మీ  తిక్కరేగిందా? పాటను తెలుగు జాతీయ గీతం చేస్తానని  ప్రకటిస్తున్నాను' అని ప్రకటించగానే అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు.

సార్! రగులుతుంది మొగలి పొదపాటను రెండవ తెలుగు జాతీయ గీతంగా ప్రకటించండి.సామాజిక న్యాయాన్ని పాటించినట్టు అవుతుందిఅని సినిమా రాజ్యం పార్టీలోకి వెళ్లి, మళ్ళీ అంతే వేగంతో  వెనక్కి వచ్చిన సీనియర్ నాయకుడొకరు సూచించాడు. అతని సలహాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ అతగాడిపక్కనవున్న మరోనేత  సానుభూతిగా చూస్తూ  సినిమా రాజ్యం నాయకుడికి  ఇవ్వాల్సిన సలహాలు తెలుగు నేతకు ఇస్తున్నావు. ఇలా చేస్తే పార్టీలో  నీకు భవిష్యత్తు ఉండదు అని మెల్లగా చెవిలో చెప్పారు.

హాలులో రాజమౌళి ని చూసి తెలుగు పార్టీ నేత ఒకరు ఈగను హీరోను చేసిన దర్శకుడు మా నేతను తప్పకుండా  హీరోను చేస్తాడు,  చేసి తీరుతాడుఅని ధీమాగా  చెప్పాడు. గడ్డం రాఘవేంద్రరావు వెనక అతని సహాయకులు ఆపిల్ పళ్లు, బత్తాయి పళ్ల బుట్టలు పట్టుకుని కూర్చున్నారు. రాఘవేంద్రరావు ఉత్సాహాన్ని ఆపుకోలేక బత్తాయి పళ్ల బుట్టను తీసుకుని ఆడవారివైపు చూడగానే విషయాన్ని గ్రహించిన పూసపాటి  రాజావారు కొంప మునుగుతుంది మీ కళా ప్రదర్శన ఇక్కడొద్దుఅని అడ్డుకున్నారు.

దర్శకుల వైపు తెలుగునేత కృతజ్ఞతా పూర్వకంగా చూసి సరే! ఇక త్వరలో చేపట్టే అధికార ప్రాప్తి పాదయాత్రగురించి మీమీ అభిప్రాయాలు చెప్పండిఅని అడిగారు. వారిలో ఒక్కొక్కరు వంద రోజుల సినిమాలు పదేసి చొప్పున తీసిన ఘనాపాటీలు. జనాలకు ఎమినచ్చుతుందో, ఎలాచెపితే నచ్చుతుందో ఆ నాడి తెలిసిన వాళ్లు. కాబట్టి, అలాటి  హిట్ దర్శకులు రాసిచ్చిన సీన్స్‌తో ప్రారంభించే పాదయాత్ర సూపర్ హిట్టయి తీరుతుందని తెలుగునేత గట్టి విశ్వాసంతో ఉన్నాడు. పాదయాత్ర హిట్టు కావాలంటే కామెడీ ట్రాక్ బాగుండాలని శ్రీనువైట్ల మరీ మరీ చెప్పాడు. దాంతో స్క్రీన్ ప్లే లో మార్పులుచేసి చూసుకున్నారు. దాని ప్రకారం యాత్ర అట్టహాసంగా మొదలవుతుంది.  ఛానళ్ళ వారితో చేసుకున్న ముందస్తు ఏర్పాటు ప్రకారం తెలుగు నేత ఎండకు, చలికి, వర్షానికి, తుఫానుకు భయపడకుండా పాదయాత్ర ప్రారంభించారుఅంటూ టీవీల్లో  బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.

యాత్ర సాగుతుండగా, వికలాంగుల గుంపు వచ్చింది. అన్నయ్యా! మీరు రాజకీయాల్లోకి రావాలి!అని ఒక వికలాంగుడు తెలుగు నేత కాళ్లపై పడ్డాడు. అతన్ని పక్కకి తీసుకెళ్లి ఏరా! నువ్వు ఎప్పుడో చూసిన  ఠాగూర్ సినిమా డైలాగు ఇంకా మరిచిపోలేదా? అది చెప్పే సందర్భమా ఇది?  ఆయన  రాజకీయాల్లోకి రావడం ఏమిటి? వచ్చి నాలుగు దశాబ్దాలవుతుంది.భవిష్యత్తు ఏమిటా ? అని దశాబ్ధం నుంచి కలవరపడుతున్నాడుఅని గట్టిగా మందలించాడు.

డైలాగు సరి చేసుకుని ఆ బృందం మళ్లీ వచ్చింది. అన్నయ్యా! నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కాళ్లు లేకున్నా పరిగెత్తే వాళ్లం. ఇప్పుడు ట్రై సైకిల్ ఉన్నా ముందుకెళ్లడం లేదన్నా! నువ్వు అధికారంలోకి రావాలి, రావాలిఅంటూ పెద్దగా  ఏడ్చాడు.
అన్నయ్య  నా భుజంపై చేయి వేయగానే నాకు కళ్లు వచ్చాయిఅని మరో వికలాంగుడు సంతోషంగా గెంతులేశాడు.అన్నయ్యా మేం ఐటి ఉద్యోగులం ... చెయ్యోళ్ల ప్రభుత్వంలో మా నాన్న ఐఏఎస్ పాసై నిరుద్యోగిగా దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మా అమ్మకడుపులో ఉండగానే ఐటి కంపెనీ నుంచి నాకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు ఐఐటి చదివినా పాన్‌షాప్‌లో కూడా ఉద్యోగం దొరకడం లేదు. మళ్లీ నువ్వు రావాలన్నా రావాలిఅంటూ కంటనీరు పెట్టుకున్నారు.

రైతుల బృందం వచ్చి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పని హాయిగా వుండేది. పనీ పాట లేకుండా గోళ్ళు గిల్లు కుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. అప్పుడు వ్యవసాయమే లేదు. మాకు ఎరువులు, విత్తనాలు, కరెంటు అవసరమే పడలేదు. ఇప్పుడు చూడండి,  వాటి కోసం క్యూలో నిల్చుంటే లాఠీచార్జీలు చేస్తున్నారంటూ  భోరుమన్నారు.
ఈ దృశ్యాలన్నీ తాము అనుకున్నట్టుగానే వస్తుండడంతో దర్శకులు సంతోషించారు. తెలుగునేత మాత్రం మనసులో... లక్ష కోట్లు సంపాదించిన నేత అధికారం నాదే అని ధీమాగా జైలులో విశ్రాంతి తీసుకుంటుంటే, నేనేమో రోడ్డున పడి నడుస్తున్నా గిట్టుబాటు అవుతుందో అవదోఅని మధనపడ్డాడు. ఘనాపాటీ  దర్శకులు మనసు పెట్టి రాసిన సీన్లు, తలపండిన జూనియర్  ఆర్టిస్టులతో తీసిన సీన్లు కావడం వల్ల అన్నీ  బాగా వచ్చాయని అంతా అనుకున్నారు . యాత్రలో అవి బాగా పండి, రజనీకాంత్ సినిమాలను మించిన ప్రచారం వచ్చింది. యాత్ర ముగిసింది. ఎన్నికలు వచ్చాయి. జనం తండోప తండాలుగా పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారు.
                                          **********************
అర్ధరాత్రి వరకు మీటింగ్‌లంటూ తిరిగి బారెడు పొద్దెక్కినా మంచం మీది నుంచి లేచేది లేదుఅంటూ భార్య దుమ్ము దులపడంతో తెలుగు కార్యకర్త ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. బంగారం లాంటి కల పాడు చేశావు ఇంతకూ కౌంటింగ్‌లో ఏం జరిగిందోఅని మధనపడ్డాడు.
ఔను!  కౌంటింగ్‌లో ఏం జరిగింది!
తెలియాలంటే 2014 వరకు వేచి చూడాల్సిందే! (29-09-2012)

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

తిలాపాపం తలా పిడికెడు – భండారు శ్రీనివాసరావు



తిలాపాపం తలా పిడికెడు

(29-09-2012 తేదీ 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

అన్ని పార్టీలనూ ప్రభావితం చేసిన తెలంగాణ
నిట్టనిలువుగా చీలిన రాజకీయ పార్టీలు 
ఆచి తూచి రాసినప్పటికీ,  
కొత్త ఇక్కట్లు తెచ్చిన చంద్రబాబు  లేఖ
భవిష్యత్తుపై  భరోసా లేని కాంగ్రెస్‌
ఆట ముగించడం తెలియని టీఆర్‌ఎస్‌



సూర్యుని కాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించినట్టు ఈనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంత తెలంగాణా అంశంతో ప్రభావితమవుతున్నాయి. పుష్కర కాలం పైచిలుకు  ప్రత్యేక రాష్ట్రం పేరుతొ మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి, టీ.ఆర్.ఎస్.,  తన ప్రధాన లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డప్పటికీ, రాష్ట్రంలోని అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణా పట్ల దృష్టి  సారించేలా చేయడంలో ఒక మేరకు విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలన్న టీ.ఆర్.ఎస్. ధ్యేయం ఎప్పుడు నెరవేరుతుందో కాని, తెలంగాణాకు అనుకూలంగానో, ప్రతికూలంగానో - అన్ని రాజకీయ పార్టీలు నిట్టనిలువుగా చీలిపోవడానికి మాత్రం ఆ పార్టీ ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’లో  తాజాగా మొదలయిన ‘ప్రాంతీయ కలకలం’ ఇందుకు ఉదాహరణ.
తనపై పడ్డ ‘రెండు కళ్ళ సిద్ధాంతం’ అపవాదును చెరిపేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానా హైరానా పడాల్సివస్తోంది.. ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో గట్టి క్యాడర్ పట్టున్న పార్టీగా పేరున్న టీడీపీ, జారిన కాలును  మళ్ళీ కూడగట్టుకోవడానికి ప్రారంభించిన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ప్రధాన మంత్రికి తాజాగా రాసిన లేఖ సానుకూల ఫలితాలు ఇస్తున్న  దాఖలా కానరావడం లేదు. నిజానికి చంద్రబాబు ఆ లేఖను ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరీ రాసినట్టు చదవగానే ఎవరికయినా బోధపడుతుంది.  తెలంగాణాను కోరుకునేవారు, వేర్పాటును వ్యతిరేకించేవారు ఎవరికివారు సంతృప్తి పడేలా ఆ లేఖలోని అంశాలను  ఆచితూచి కూర్చి పేర్చారు. అయినా కానీ, కొండ నాలుకకు మందేస్తే వున్న నాలుక వూడిందన్న చందంగా తెలంగాణాపై చంద్రబాబు లేఖ పార్టీకి కొత్త ఇక్కట్లను తెచ్చిపెట్టింది. తెలంగాణాపై తమ నాయకుడు త్వరలో  స్పష్టత ఇస్తారంటూ  కొద్దిరోజులుగా చెబుతూవచ్చిన ఆ ప్రాంతపు  టీడీపీ నాయకులకు,  చంద్రబాబు నాయుడు   ప్రధానమంత్రికి రాసిన లేఖలో కొత్తగా ఇచ్చిన ‘అస్పష్టతతో కూడిన స్పష్టత’ కొరుకుడు పడడం లేదు. పైగా, సీమాంధ్రకు చెందిన కొందరు టీడీపీ నాయకులకు ఆ లేఖలోని అంశాలు అసలు మింగుడు  పడడం లేదు. ‘వ్యక్తులకంటే పార్టీ  ముఖ్యం’ అని తరచూ నీతి వాక్యాలు వల్లె వేసేవారు   వున్నట్టుండి బాణీ మార్చి ‘పార్టీ కంటే  రాష్ట్ర ప్రయోజనాలు  ప్రధానం’ అంటూ రాత్రికి రాత్రే  సరికొత్త పల్లవి ఎత్తుకోవడం ఆ పార్టీలోని అగ్రనాయకులను నివ్వెరపరుస్తోంది.
 ‘వస్తున్నా, మీకోసం’ అంటూ గాంధీ  జయంతి నుంచి తెలుగుదేశం అధినేత మొదలుపెట్టే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు తెలంగాణా ప్రాంతంలో అవాంతరాలు ఎదురుకాకుండా చూసే లక్ష్యంతో రాసిన లేఖ, మరోపక్క  సీమాంధ్ర పార్టీ నాయకులలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘రాష్ట్ర  విభజనకు టీడీపీ  అనుకూలం’ అని ఆ లేఖలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనకపోయినా కొందరు సీమాంధ్ర పార్టీ  నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటే, దానికి కారణం వారి సొంత ప్రయోజనాలే అయి  వుండవచ్చని పార్టీలో కొందరు గుసగుసలాడుతున్నారు. ఏదో ఒక సాకు  చూపి పార్టీ నుంచి  బయటపడాలని చూసేవారు  ఈ లేఖను ఒక అవకాశంగా వాడుకోవడంలో వింతేమీ లేదన్నది వారి వాదన.
ఇంతాచేసి,   ఈ లేఖ వల్ల తెలంగాణాలో అన్నా కొంత పార్టీకి మేలు జరుగుతుందా అన్నది అనుమానమే. చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణాకు వున్న ప్రధాన అడ్డంకి తొలగిపోగలదని ఇన్నాళ్లబట్టీ వాదిస్తూ వస్తున్న టీ.ఆర్. ఎస్.  కూడా ఈ లేఖను స్వాగతించలేదు. పైగా,   ‘టీడీపీ మొదలుపెట్టిన మరో నాటకం’ అంటూ ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఘాటుగా విమర్శించారు. దానికితోడు, రెంటికీ చెడ్డ రేవడి చందంగా ఈ తలనొప్పిని యెందుకు కోరి తెచ్చుకున్నట్టని పార్టీ వర్గాల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు.      
నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో అత్యంత క్లిష్టమయిన పరిస్తితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదయినా వుందంటే ముందు చెప్పుకోవాల్సింది టీడీపీ పేరే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా వుంటూ వరసగా మూడో పర్యాయం కూడా అధికారపీఠానికి దూరంగా వుండడం అన్నది ఆత్మహత్యాసదృశ్యం. అందువల్ల ఆ పార్టీ నాయకుడుగా, సారధిగా చంద్రబాబుకు వున్న వొత్తిళ్లు అనేకం. ఏంచేసయినా సరే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో పార్టీ నావని విజయ తీరానికి చేర్చాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది.  కాబట్టే ఆయన వరస  ‘డిక్లరేషన్ల’కు  తెర తీసారు. అరవై ఏళ్ళ వయస్సులో కష్టసాధ్యమయిన పాదయాత్రకు నడుంకట్టారు. తెలంగాణా విషయంలో స్పష్టతతోనో, అస్పష్టతతోనో – అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ  ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇన్ని చేసినా ఇన్ని  తలనొప్పులేమిటన్నది ఆయన అభిమానుల బాధ. అందుకే అంటారు, కాలం కలసిరానప్పుడు తాడే పామై కరుస్తుందని.
పోతే, రాష్ట్రంలో అత్యంత క్లిష్టమయిన రాజకీయ  భవితవ్యాన్ని ఎదుర్కుంటున్న పార్టీల్లో కాంగ్రెస్  రెండో స్థానంలో వుంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో మరో రెండేళ్లు అధికారంలో వుంటామన్న  ధీమా తప్ప భవిష్యత్తు గురించిన భరోసా ఏమాత్రం లేని పార్టీగా అనేక సర్వేల్లో ఇప్పటికే వెల్లడయింది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బలహీనతే ఈ పార్టీకి ప్రస్తుతం వున్న బలం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి పూర్తిగా అగమ్య గోచరం. ఎంతో అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం అన్నది ఆ పార్టీ నాయకులే అంగీకరించే వాస్తవం. ఏదయినా అద్భుతం  జరిగినా మూడోమాటు ప్రజలు అధికారం కట్టబెట్టడం కల్ల అనే నిజం జీర్ణించుకున్నవాళ్లు కాబట్టి,  అధికారానికి కొన్నాళ్ళు దూరంగా వున్నా జాతీయ పార్టీగా తమ మనుగడకు ఎలాటి ధోకా వుండదన్న నమ్మకం వున్నవాళ్ళు కనుక కాంగ్రెస్ వారికి పార్టీ జయాపజయాలతో నిమిత్తం వుండదు. ‘వూహించనిదేదో జరిగి అధికారంలోకి వస్తే సంతోషం, రాకపోతే పోయేదేమీ లేదు పదవి తప్ప’ అనే సిద్ధాంతం వారిది. అందుకే, రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కుంటున్న  సమస్యలని పేరబెట్టి, తెలంగాణా వంటి కీలక అంశాల  పరిష్కారాన్ని నానబెట్టి ప్రజలిచ్చిన అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇక టీ.ఆర్.ఎస్. విషయం తీసుకుంటే,  ఆట మొదలు పెట్టడం తప్ప  ముగించడం ఎలాగో తెలియని పరిస్తితి ఈ పార్టీది. తెలంగాణా పట్ల చులకన భావంతో ఒకప్పుడు మొరాయించిన పార్టీలను సైతం  ముగ్గులోకి లాగేలా వాటిపై  వొత్తిడి పెంచడం మినహా ఈ పార్టీ తన ప్రాధమిక లక్ష్యం దిశగా సాధించింది పూజ్యం. పైగా వేర్పాటువాదాన్ని బలంగా కోరుకునే వారినందరినీ ఒక్క తాటిపైకి  చేర్చడంలో పూర్తిగా విఫలం అయిందనే చెప్పాలి.
వై.ఎస్.ఆర్. పార్టీ కూడా తెలంగాణా విషయంలో ఒక స్పష్టమయిన వైఖరితో ముందుకు వచ్చిన దాఖలా లేదు. అందుకే, వై ఎస్ ఆర్ సంక్షేమ పధకాల స్పూర్తితో ముందుకు పోతున్నామని చెప్పుకునే ఈ పార్టీ, అ ప్రాతిపదికపై తెలంగాణలో కుదురుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పరకాల ఎన్నిక తరువాత మరింత ఉత్సాహంతో సాగాల్సిన ఈ పార్టీ మందకొడిగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. రెండు కళ్ళు అని పైకి చెప్పకపోయినా, ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నదన్న పేరు పడడం వల్ల తెలంగాణా పట్ల ఒక నిశ్చితమయిన వైఖరిని తొందరపడి  వెల్లడించాల్సిన అగత్యం  లేదన్నది ఆ పార్టీ అభిప్రాయంగా తోస్తోంది.
ఇక మిగిలిన పార్టీలన్నీ తెలంగాణాపై ఆటో ఇటో చెప్పగలిగినా వాటి  ప్రభావం శూన్యం.
అయితే, ఒక్కటి మాత్రం స్పష్టం.
తెలంగాణా పట్ల విస్పష్టమయిన  వైఖరి వెల్లడించడం వల్ల రానున్న సార్వత్రిక  ఎన్నికల్లో తమకు ఏమేరకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అనే  లెక్కల విషయంలో ఆయా పార్టీలకు ఇంకా స్పష్టత రాకపోవడంవల్లనే ఆ పార్టీలకు తెలంగాణా అంశం  ఒక క్రీడామైదానంగా తయారవుతోంది. (28-09-2012)   


25, సెప్టెంబర్ 2012, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు – భండారు శ్రీనివాసరావు



మార్పు చూసిన కళ్ళు – భండారు శ్రీనివాసరావు

లెనిన్ సమాధి
1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ  నిర్మాత,  అక్టోబర్ విప్లవ సారధి అయిన   వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై  ఆయన  శరీరాన్ని రసాయనిక ప్రక్రియల  ప్రకారం   భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో  ప్రజల సందర్శనార్ధం వుంచారు.


ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు  నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద  పోతపోసిన విగ్రహాల్లా నిలబడివుండేవారు. విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత  వారినుంచి బాధ్యతలు  స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.


సోవియట్ యూనియన్  విచ్చిన్నం తరువాత  ఏర్పడ్డ  కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు  ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు,  రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి  లెనిన్  మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే  నిధులను నిలుపుచేసింది కూడా.  తదాదిగా,   అభిమానుల విరాళాలతోనే   నెట్టుకు వస్తున్నారు.
మసోలియం తెరిచి వుంచే  సమయాన్ని కూడా  బాగా తగ్గించారు. అయినా సందర్శకుల  సంఖ్య  తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా,  రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న  ఆంక్షల  వల్ల కూడా  లెనిన్ మసోలియం  సందర్శన  అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారం కాదు.
గత ఎనభై ఎనిమిది ఏళ్లుగా మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే  అపూర్వం. ఇన్నేళ్ళ నుంచి,  క్రమం తప్పకుండా ప్రతివారం  నిపుణులు లెనిన్ పార్ధివ  శరీరాన్ని  ప్రత్యేకించి చర్మాన్ని  చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన  జాగ్రత్తలు తీసుకుంటారు.
పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి   రసాయనాలతో  ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఇందుకోసం రెండు నెలలపాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో  లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మదినెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో  తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం  ఉద్దేశ్యం.


డాక్టర్ ఇల్యా  జబ్రస్కీ అనే 90 సంవత్సరాల  నిపుణుడు 1934 నుంచి   1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో  వున్నారు.   ఆయన తండ్రి బోరిస్, 1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన  శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.
ఈ డాక్టర్  చెప్పేదాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు.  మొదటిసారి ఎంబామింగ్  (embalming - రసాయనిక పూత)  చేసినప్పుడే వాటినన్నింటినీ  తొలగించారు. కాకపొతే కనుబొమలుమీస కట్టు, తల వెండ్రుకలను మాత్రం  యధాతధంగా వుంచేశారు.
పోతే,  లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై  ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే  తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం. లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని  తొలగించి  సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ  కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో  నాజీల నుంచి  బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.
‘లెనిన్ మసోలియం నుంచి ఆయన  శరీరాన్ని  తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక యెంతమాత్రం అనుమతించకూడదు’  అనేవారి సంఖ్య  ఇప్పుడు ఆ దేశంలో  క్రమంగా పెరుగుతోంది.  నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం  తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని  ఎన్నడు  కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన  భార్య  నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి  కూడా అదే.  లెనిన్ పేరు మీద ఏవిధమయిన  స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను  ఆవిడ కోరారు.
కానీ, అప్పటి  సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో  ఆవిడ సూచనలను  ఎవరూ  పట్టించుకోలేదు.
స్టాలిన్  చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.
ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి   ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద  పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా  జారీ అయ్యాయి. అయితే ఇందుకు   చాలా సమయం పట్టేట్టు వుండడం,  లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో  ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎంబామింగ్  చేసి,  రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు.   కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం  ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్విత ప్రాతిపదికపై  ఏళ్ళ తరబడి పాడయిపోకుండా  చేయడం యెలా అన్నది ఆనాటికి  కనీవినీ ఎరుగని  విషయం.
ఉక్రెయిన్ లో అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్  వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర  కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని  జయప్రదంగా పూర్తిచేసింది.


అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో  ప్రభుత్వం చురుగ్గా కదిలింది.  సోవియట్  సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణ వర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే  ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ బౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.
1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్  చేసి లెనిన్ మసోలియంలోనే  ఆయన దేహం  సరసనే  భద్రపరిచారు.  ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడనుంచి తొలగించి  క్రెమ్లిన్ గోడ పక్కన  ఖననం చేశారు.
గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్ ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను  తలపించేదిగా వుండరాదని’  అభిప్రాయపడ్డారు. అయితే,  లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం  అప్పట్లో సాధ్యం కాలేదు.  పుతిన్ మూడో పర్యాయం రష్యా అధినేతగా ఎన్నికయిన  తరువాత మళ్ళీ ఈ మధ్యకాలంలో  ఈ ఆలోచన  కొత్త చిగుళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తోంది.
2024 సంవత్సరానికి  కామ్రేడ్  లెనిన్ కన్ను మూసి వందేళ్ళు పూర్తవుతాయి. అప్పటిదాకా ఆగుతారా  లేక ఈ లోగానే  అంతపనీ చేస్తారా వేచి చూడాలి.

24, సెప్టెంబర్ 2012, సోమవారం

మమ్మీ మమ్మీ

మమ్మీ మమ్మీ



10 జన్ పద్  రాణివాసంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఒక సమావేశం  వివరాలు. 

వెన్యూ : రాణిగారి ప్రైవేటు సమావేశ మందిరం 

హాజరైనవారు : రాణిగారు, యువరాజు రాహుల్ బాబా , అహమద్  పటేల్  

రాహుల్ బాబా : ఏడుపు గొంతుతో, గెడ్డం నిమురుకుంటూ :.... మమ్మీ మమ్మీ ....... 
రాణి : ఏమి అయ్యింది చిన్నా 

రాహుల్ బాబా : నాకు బోర్ గా ఉంది , పెద్ద పాత్ర ( బిగ్గర్ రోల్) కావాలి. 

రాణి : వావ్ నీకు పెద్ద రోల్ కావాలా? 

రాహుల్ బాబా : (కళ్ళు మెరుస్తుండగా) ఎస్ మమ్మీ .... 

రాణి : లెట్ మీ గెస్!  పెద్ద పాత్ర అంటే - పార్లమెంట్ కు  నీ లంచ్ బాక్స్ నువ్వే సర్దుకు వెళ్లి మమ్మీ తో షేర్ చేసుకోకుండా నువ్వే తినేస్తావా? 

రాహుల్ బాబా : అవును మమ్మీ! అది ఒక్కటే కాదు మమ్మీ- 

రాణి : మరి నీ తెల్లకుర్తా పైజామా మమ్మీ  సెలెక్ట్ చెయ్యవద్దు , నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా 

రాహుల్ బాబా : ఎస్ మమ్మీ,  కాని  అది ఒక్కటే కాదు 

రాణి : మరి పెద్దలకు మాత్రమే సినిమాలు చూస్తావా 

రాహుల్ బాబా : (ఆనందం పట్టలేక ఎగురుతూ ) ఎస్ మమ్మీ  

రాణి : నెలకు ఒక్క సారే చూడాలి, ప్రతిసారి నేను వచ్చి నీ కళ్ళు ముయ్యడం కష్టం కదా 

రాహుల్ : (ఏడుపు గొంతుతో) సరే మమ్మీ, అది కాదు మమ్మీ... 

రాణి : పార్లమెంట్ లో మల్ళీ  స్పీచి ఇస్తావా, ప్రణబ్ అంకుల్ కూడా లేడు స్పీచి రాసి ఇయ్యడానికి 

రాహుల్ : (పెద్ద గొంతుతో వా, వా వా అని ఏడుపు....) 

రాణి : మరి గర్ల్ ఫ్రెండ్ కావాలా 

రాహుల్ బాబా : ఎస్ మమ్మీ.....  

రాణి : సరే నేను సెలెక్ట్ చేసి పెడతాలే.

రాహుల్ : ( మళ్ళీ  ఏడుపు ) 

రాణిగారు  (చిరాకుగా) ఇంకా ఏం కావాలెహే.... 

రాహుల్ : నేను ప్రభుత్వాన్ని నడిపిస్తా మమ్మీ ..... 

రాణి : పటేల్ గారు, వీడికి పెడిగ్రీ బిస్కట్ పాకెట్ ఇవ్వండి, తల తినకుండా ఉంటాడు.

(ఇంటర్నెట్ లో సంచరిస్తున్న ఓ కధనానికి తెలుగు అనువాదం) 

22, సెప్టెంబర్ 2012, శనివారం

ఓటర్ల మేనిఫెస్టో – భండారు శ్రీనివాసరావు



 ఓటర్ల మేనిఫెస్టో 

‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్


ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతే,  ఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
 ‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో.  ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.
      
1.  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.  (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా  రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే  లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని  మనవి.

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నరం లేని నాలుకలు – స్థిరం లేని ఏలికలు – భండారు శ్రీనివాసరావు


నరం లేని నాలుకలు – స్థిరం లేని ఏలికలు 

(23-09-2012 తేదీ 'సూర్య' దినపత్రికలో ప్రచురితం)

అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే! గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ‘ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.’
ప్రస్తుత రాజకీయాల తీరుతెన్నులు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయి.
డీసెల్ ధర పెంపు, గాస్ సిలిండర్ల రేషను, చిల్లర వర్తకంలో ఎఫ్ డీ ఐ లకు అనుమతి – వీటి పట్ల అధికార, ప్రతిపక్షాల వైఖరులు గమనించిన వారికి ఎవరికి వారు అవకాశవాదాన్ని నమ్ముకుని మాట్లాడుతున్నారు తప్ప ఒక సిద్ధాంత ప్రాతిపదికపై వాదులాడుతున్న సందర్భం కనబడదు.
వెనుక విక్రమార్కుడి సింహాసనం గురించి ఒక కధ ప్రచారంలో వుండేది. సింహాసనం మీద కూర్చోగానే న్యాయం చెప్పే తీరులో నిబద్దతత కనబడేది. సింహాసనం దిగితే చాలు మళ్ళీ మామూలు మనిషే. అలాగే ఇప్పుడు అధికారంలో వున్నప్పుడు చెప్పే మాటలు వేరు. అధికారం కోల్పోగానే చేసే విమర్శలు వేరు.
యూ.పీ.ఏ. సర్కారు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తో సహా విపక్షాలన్నీ భారత్ బంద్ నిర్వహించాయి. బీ.జే.పీ. పాలిత రాష్ట్రాల్లో బంద్ సంపూర్ణం అని వార్తలు వస్తే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బంద్ పాక్షికమనీ, ప్రభావం స్వల్పమనీ సమాచారం. అంటే ప్రజలతో నిమిత్తం లేకుండా కేవలం ఆయా పార్టీల కార్యకర్తల బలం, వారి ఉత్సాహం  ప్రాతిపదికగా బంద్ జరిగిందనో, సరిగా జరగలేదనో  అనుకోవాలి. దీనర్ధం యూ.పీ.ఏ. ప్రభు త్వం తీసుకున్న చర్యలకు ప్రజామోదం వుందని కాదు. చిల్లర వర్తకంలో ఎఫ్.డీ.ఐ. ల ప్రవేశం గురింఛీ,  దానివల్ల వొనగూడే పరిణామాల గురించి సామాన్యులకు అవగాహన వుండడం సాధ్యం కాకపోవచ్చు. కాని, డీసెల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల  నియంత్రణ వల్ల తమకు వాటిల్ల గల ఇబ్బందులు వారికి తెలియనివి కావు. అయినా కానీ మెజారిటీ ప్రజానీకం బందులు వంటి నిరసన కార్యక్రమాలపట్ల యెందుకు నిరాసక్తంగా వుంటున్నారన్నది రాజకీయ పార్టీలే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సామాన్యుల కష్టాలను తీర్చడానికి తాము బందులు, ఆందోళనల రూపంలో ఇంతగా హైరానా పడుతుంటే జనం పట్టించుకోకుండా నిర్లిప్తంగా వుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఒక ప్రతిపక్షనేత టీవీ చానళ్ళలో మాట్లాడుతూ అన్నారు. అయితే, అలాటివారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి వుంది.  ప్రజావ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజలు నిర్లిప్తంగా లేరు. అదను చూసి, అంటే ఎన్నికల వరకు వేచి చూసి వేటు వేయడం వారికి తెలుసు. ఈ లోపల ఎన్ని బందులు జరిపినా అవన్నీ కంటి తుడుపు చర్యలే అన్న సత్యం వారికి తెలియనిది కాదు. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అన్న భ్రమలో రాజకీయ నాయకులు వుంటారు. కానీ, ఇవే ప్రతిపక్షాలు గతంలో అధికారంలో వున్నప్పుడు ఏం చేశాయన్నది ప్రజలు మరచిపోయారనుకుంటే అది వారి భ్రమ. డీసెల్, పెట్రోలు ధరలు పెంచినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో, సరిగ్గా అదే విధంగా అప్పుడు  ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ కూడా అచ్చు  అదే విధంగా వ్యవహరించిన విషయం వారికి బాగా గుర్తుంది.
పెట్రోలుకు మండే గుణం సహజం. పెట్రోలు ధరలు కూడా మండిపోతూ వుండడం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే వున్నాం.  అలాగే ఈ ధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా చూస్తూనే వున్నాం. కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం చూస్తుంటే రాజకీయ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రో ధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా  ఈ పాటికి వొంటబట్టే వుంటుంది.
‘అధికారంలోకి రావడానికి కొన్ని మాయ మాటలు చెప్పాలి, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరికొన్ని మాయదారి  పనులు చేయాలి’ అన్నది ఈ నాటి రాజకీయులకు ప్రాధమిక సూత్రంగా మారిపోయింది. చిత్తశుద్ధిలేని ఈ మాదిరి వ్యవహారశైలి వల్లనే  జనాలకు రాజకీయపార్టీల పట్ల చులకనభావం పెరుగుతోంది. ఈరోజు ఇంత గగ్గోలు చేస్తున్న ప్రతిపక్షాలు రేపు అధికారంలోకి వస్తే చమురు ధరలు పెంచమని గట్టి హామీ ఇవ్వగలవా అన్నది వారి ప్రశ్న. గత్యంతరం లేని స్తితిలోనే ధరలు పెంచాల్సివచ్చిందని ఈరోజు నెత్తీనోరూ బాదుకుంటున్న పాలకపక్షం రేపటిరోజున ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్తితి దాపురిస్తే అప్పుడు ఇవే మాటలు చెప్పగలుగుతుందా అన్నది సమాధానం దొరకని శేషప్రశ్న. ధరల పెంపుదలకు నిరసనగా  బందులూ, ధర్నాలు అంటూ రోడ్డెక్కకుండా వుంటా మన్న హామీ ఏమయినా ఇవ్వగలవా? అన్నది ప్రజల ప్రశ్న. ఈ రకమయిన ద్వంద్వ వైఖరుల మూలంగానే  బందులూ, ఆందోళనల విషయంలో ప్రజలలో నిర్లిప్తత ఏర్పడుతోందన్న ఎరుక ఇంకా రాజకీయ పక్షాలకు కలిగినట్టులేదు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రాధమిక హక్కు కావచ్చు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం – అది ఇప్పటి  యూ.పీ.యే. కావచ్చు ఒకప్పటి ఎన్.డీ.యే. కావచ్చు – చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు. కానీ ఈ సారి డీసెల్ ధర  లీటర్ ఒక్కింటికి అయిదు  రూపాయలు  ఒక్కమారుగా పెంచికూర్చుని, ఆయిల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్న కారణంగా పెంచిన ధరను ప్రజలు మంచిమనసుతో అర్ధం చేసుకుని భరించాలని సర్కారు ఒక్క ప్రకటనతో సరిపుచ్చుకుంది. అదీ పార్లమెంటు సమావేశాలు ముగియగానే.  
చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని
ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.
ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన  నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన  అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న  ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే  సులువయిన మార్గం. ఇది  తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. ఇవన్నీ చూసేవారికి  నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.
లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ  సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.
ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నారు.. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా  సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది. (21-09-2012)