16, ఆగస్టు 2012, గురువారం

వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం గారితో తురగా జానకీరాణి గారి స్మృతులు


వెంపటి చిన సత్యం మాస్టారు 

(తురగా జానకీరాణి గారు నాకు రేడియోలో సీనియర్ సహోద్యోగి. ఆకాశవాణిలొ చిన్నపిల్లల  ప్రోగ్రాము నిర్వాహకురాలిగా, రచయిత్రిగా, వక్తగా ఆమె తెలుసు. నాకు తెలియని ఆమెలోని మరో పార్శ్వం ఈరోజు ఫేస్ బుక్ లో ఆవిడ రాసిన సత్యం గారి జ్ఞాపకం.  చిన్నతనంలో నాట్యం నేర్చుకున్న సంగతి ఈరోజే తెలిసింది. ఫోనులో పలకరిస్తే తను ముప్పయ్యేడవ ఏట కూడా  రంగస్థలంపై  నర్తించిన సంగతి చెప్పారు.  ఆమె స్మృతులను  నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయంతోనే ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావు)   

“పంతొమ్మిది వందల నలభై ఏడు ,ఎనిమిది ప్రాంతాల్లో మాస్టారికి పంతొమ్మిది నాకు పన్నెండు. మదరాసులో పెదసత్యంగారి దగ్గర నుంచి కూచిపూడికి తిరిగి వచ్చేసిన రోజుల్లో బందరులో నాకు నాట్యం నేర్పించారు. మహిళా సేవా మండలిలో కొందరికి నేర్పుతూ నాకు ఉదయం పూట ఆరు గంటలకి వచ్చి స్పెషల్ క్లాసు తీసుకునేవారు.

“మా అమ్మమ్మ ఆయనగారికి కంచు గ్లాసులో కాఫీ ఇచ్చేది. అది త్రాగి గోడవారగా పెట్టేవారు.


“నేను అప్పటికే మదరాసులో పందనల్లూరు చొక్కలింగం పిళ్ళై గారి దగ్గర కొంత నేర్చుకొన్నాను. అందువల్ల నాకు ఒకే సారి కొన్ని అంశాలు నేర్పించారు. అలరింపు, అఠాణా స్వరజతి, భైరవి, కల్యాణి రాగాల్లో జతిస్వరాలు, కానడ తిల్లానా, వసంత రాగంలో స్వరజతి, మా వల్లకాదమ్మ దేవి యశోద, కొన్ని అరవ పాటల రికార్డింగులు, ఇలా ఎన్నో. ఆయనే నట్టువాంగం, గానం చేసేవారు. తేలికగా, లైట్ గా మాట్లాడేవారు.

“నాచేత బుట్టాయపేట హాలులోను, గుడివాడ, వడాలి మొదలైన కొన్ని పల్లెటూళ్ళలో ప్రదర్శనలిప్పించారు. మువ్వలు కొని వాటికి వెండి పూత పూయించి తోలు పట్కా మీద కుట్టించి ఇచ్చారు. అవి నా దగ్గరున్నాయి. బహుశ నేను ఆయనకు తొలి శిష్యురాలినేమో. ఆ తరువాత ఆయన మదరాసు వెళ్లి పోయారు. నేను మళ్ళీ చొక్క లింగం పిళ్ళై గారి దగరకి నేర్చుకోవడానికి వెళ్ళాను. నిజానికి ఆయన నాకు భరత నాట్యమే నేర్పారు.

“ఆ తరువాత ఆయన్ని రాజసులోచన మేడ మీద క్లాసులు నడుపుతుండగా చూసి వచ్చాను. ఇంకొక సారి ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి  భోపాల్ వరకు చేసిన ప్రయాణంలో ఆయన ఎందరెందరి గురించో  చెప్పారు. ఆ తరువాత తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం ఇచ్చినప్పుడు నేను స్టేజీ మీదకు వెళ్లి నాకు పన్నెండు, ఆయనకు పంతొమ్మిది ఏళ్ల వయస్సులో ఎంత గొప్ప గురు భావం ఉండేదో చెప్పినప్పుడు, అయన అలాగా’ అన్నారు. ‘ఇంకా ఎంతో చెయ్యాలని ఉందమ్మా’ అని కూడా  అన్నారు. ‘ఎప్పుడూ అమ్మ బాగున్నారా మామయ్యా బాగున్నారా’ అని అడిగేవారు. ఆ సాన్నిహిత్యం, అభిమానం నేను కలకాలం మదిలో నిలుపుకుంటాను. నేను కొంత వరకైనా దూరదర్శన్,  రేడియోలతో పాటు, రవీంద్ర భారతి రంగస్థలం మీద అనేక నృత్య రూపకాలకి, బృంద గీతాలకు దర్శకత్వం వహించగలిగానంటే అది ఆయన పెట్టిన భిక్షే. ప్రాతః స్మరణీయులు ఆ మహామనీషి.” 

తురగా జానకీరాణి

(16-08-2012)


కామెంట్‌లు లేవు: