15, ఆగస్టు 2012, బుధవారం

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు

(ఆరేళ్ళ క్రితం రాసిన వ్యాసం ఇది. అప్పటికీ ఇప్పటికీ మారింది ఏమయినా వుందా? ఇందులో మార్చాల్సింది ఏమయినా వుందా?)


- భండారు శ్రీనివాసరావు
దసరా,దీపావళి మొదలయిన పండగల సరసన చేరిపోయిన జాతీయ పర్వ దినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై  ఆరు.

మొదటి పండుగ మొదటిసారి జరుపుకున్నప్పుడు నేను నెలల బిడ్డని. రెండో పండగ తొలిసారికి నా వయస్సు నాలుగయిదేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి. 
నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే - అరవై ఆరేళ్ళు  అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో ఇది ఒక లెక్కలోనిది కాదు.

నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరి లో పాల్గొనే వాళ్ళం.


 ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఆ ఊరేగింపులో 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ రాష్ట్రాల ప్రసక్తి వుందో మాకు తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.జనగణమన చరణాలలోని - 'న' ను 'న' లాగా- 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.

అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?

'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే 'కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలనే రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా 'జనగణమన' పాడడం పోయి - అందులో తప్పులెన్నే రోజు వచ్చింది. జాతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది. పతాకావిష్కరణలు మొక్కుబడి తంతుగా  మారిపోయాయి. ఈ పండగల సమయాల్లో  నాయకుల తలల మీద కానవచ్చే 'గాంధీ టోపీలు' మిగిలిన రోజుల్లో అటకెక్కుతున్నాయి.  ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.
సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, భారత జాతి గర్వించ దాగిన గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై  ఆరేళ్లలో  కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు  బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, అప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.
జనానికి  జై!
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి. గిద్దెలు, సోలలు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంకా మైలు రాళ్ళని దాటలేదన్న సంగతి ఇక్కడ గమనార్హం.
దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లోనే పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను  దాటి ఒకే బాలట్ పేపరు ముద్రించిన అనేక గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని ఎన్నుకోగల స్తాయిని అందుకుని ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకున్న జనాభా కలిగిన  దేశం మనది.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము.

ఏ ఇంగ్లీష్ వారితో అహింసా మార్గంలో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీష్ భాషతోనే భావి భారత నిర్దేశకులయిన మన యువతీ యువకులు - కంప్యూటర్ రంగాన్ని దేశ దేశాలలో తమ కనుసన్నలతో శాసించగలుగుతున్నారు.
కానీ.....

అయితే , అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికొకటి   అడ్డం పడుతున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మారుస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ వాళ్ళ మంచితనం మంచులా కరిగిపోతోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవలక్షణాలు తలెత్తడం అతి సహజం. అయితే అది తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం అందరిదీ.

నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ప్రతి పంద్రాగస్టు నాడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఇది.
ఏమంటారు?NOTE: All the images in this blog are copy righted to their respective owners.

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...


your blog is nice with appropriate pictures.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@కమనీయం - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు