నిర్ణయరాహిత్యంతో రాష్ట్రానికి చేటు చేస్తున్న కాంగ్రెస్
అధిష్టానం
‘ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేన’ని మాజీ
ప్రధానమంత్రి పీవీ నరసింహారావుగారు అంటుండేవారు. అయితే, నిర్ణయాలు వాయిదా వేయడం ద్వారా పరిష్కారం దానంతట అదే వొనగూడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఈ చిట్కా
అన్ని సందర్భాలలో పనికిరాదు. పైగా ఈ వాయిదాల వ్యవహారం అసలు సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదం వుంటుంది.
ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్
అధిష్టానం అనుసరిస్తున్న సాచివేత ధోరణి ఈ మాదిరిగానే వుంది.
వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో రాష్ట్ర
వ్యవహారాలపై తమ కట్టు, పట్టు తప్పిపోయిందని గుంజాటన పడ్డ కాంగ్రెస్ అధిష్టానం, ఆయన తదనంతర కాలంలో మళ్ళీ పూర్వ పెత్తనాన్ని చలాయించాలని ఆత్రుత పడుతున్నట్టుగా
అర్ధం అవుతోంది. స్తానిక నాయకత్వాన్ని పటిష్టం చేయడం వల్ల కలిగే లాభాలకన్నా
నష్టాలు ఎక్కువ అనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ
నాయకులను తమ చేతలతో, వ్యాఖ్యలతో చిన్నబుచ్చుతూ మరోపక్క ప్రజల దృష్టిలో చులకన
అవుతున్న విషయాన్ని విస్మరిస్తోంది. గత రెండు మూడురోజులుగా వస్తున్న వార్తలు,
మీడియాలో వస్తున్న స్క్రోలింగులు దీన్నే ధృవపరుస్తున్నాయి.
‘సీఎం ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశం. హస్తిన
చేరుకున్న కిరణ్. సీఎం మార్పుపై మళ్ళీ గుప్పుమంటున్న ఊహాగానాలు.”
“అంతకుముందే పీసీసీ అధ్యక్షుడు బొత్సపై వేటు. ఆ
తరువాత సీఎం మార్పు ఖాయం. సెప్టెంబర్
పదిలోగా ప్రక్షాళన పూర్తి.”
“సీఎం కు అహ్మద్ పటేల్ అర్ధరాత్రి పిలుపు.”
“చిరంజీవికి పార్టీ పగ్గాలు?”
“సీనియర్ మంత్రులను తప్పించే క్రమంలో కామరాజు
ప్లాన్. వారికి
పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్తవారికి అవకాశం
‘2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి. – ఏ ఐ సీ
సీ కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టీకరణ
‘ధర్మాన రాజీనామా ఆమోదించే అవకాశాలు. ఆరోపణలు
ఎదుర్కుంటున్న ఇతర మంత్రులకు స్వస్తి
చెప్పే బాటలో అధినాయకులు”
తీసుకోబోయే నిర్ణయాలు గురించి ఇలా పలురకాలుగా అనుదినం వార్తలు వెలువడుతూ
వుండడం పార్టీకి ఏవిధంగా లాభిస్తుందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి.
ఇలా రకరకాలుగా వదంతులు గుప్పుమంటుంటే ఖండించే
నాధుడు వుండడు. అసలే అంతంత మాత్రంగా వున్న పాలన. నిర్ణయాలు తీసుకోవడం అసలే లేదు.
అధవా తీసుకున్నా వాటిని తక్షణం అమలు పరిచే నాధులు లేరు. ఏం చేస్తే ఎక్కడ మెడకు
చుట్టుకుంటుందో అనే సందేహం. ఠలాయించే నాయకులు లేకపోవడంతో మొరాయించే అధికారులు
పెరిగిపోతున్నారు.
దిగిపోయేవాడే కదా అన్న భావన మరింత ప్రబలితే ఈ
మాత్రం మాట వినే వాళ్ళుకూడా అధికారగణంలో మిగులుతారన్న ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో పని చేసేవాళ్ళు ఎలాచేస్తారు. పని చేయించేవాళ్ళు
యెలా చేయిస్తారు? ఎన్నాళ్ళు వుంటామో తెలియకుండా దోలాయమానంలోకి నెడుతుంటే ఏ
ముఖ్యమంత్రి మాత్రం ఎన్నాళ్ళు కుదురుగా పాలన చేయగలుగుతాడు?
అర్ధరాత్రి అహ్మద్ పటేల్ ఫోను చేసి ముఖ్యమంత్రిని
తన వద్దకు పిలిపించుకోవడానికి ఆయనకు వున్న అధికార హోదా ఏమిటి? అధిష్టానానికి
దగ్గరగా మసలగలిగిన అవకాశం మినహా ఆయనకు వున్న అదనపు అర్హత ఏమిటి? ఆ మాటకువస్తే, కాఫీలు
టీలు ఇచ్చే నౌకర్లు కూడా చనువుగా మసిలే వీలుంటుంది. కానీ, పెత్తనం చేయడానికి అది అర్హత యెలా అవుతుంది?
అధిష్టానం దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో
ఒక కార్యకర్త కావచ్చు. కానీ తెలుగు ప్రజల దృష్టిలో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయన విషయంలో ఇలా అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలు ఏమనుకుంటారు? యన్టీఆర్ జీవించి వున్నట్టయితే ‘ఆంధ్రులు –
ఆత్మ గౌరవం’ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో
నామరూపాలు లేకుండా చేసేవారేమో.
ఇక, ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి చోటా మోటా నాయకుడు వెడుతూ
వెడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రే 2014 ఎన్నికల దాకా కొనసాగుతారని మీడియాకు చెప్పడంలో
పరమార్ధం ఏమిటి? దిగిపోతున్నారని వస్తున్న ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడమా లేక పరోక్షంగా ఆ వదంతులను సమర్ధించడమా? యేమని అర్ధం
చేసుకోవాలి? ఈ వ్యాఖ్యలకు, ప్రకటనలకు యేమని అర్ధం చెప్పుకోవాలి?
ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అనేకమంది
మంత్రులు, ఎమ్మెల్యేలు, పదవి కోరుకుంటున్నవాళ్ళు,
పదవీ గండం వుందని భయపడుతున్నవాళ్ళు అంతా
కట్టగట్టుకుని హస్తినలోనే మకాం వేసి అధినాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
రాష్ట్ర ఎదుర్కుంటున్న ఇబ్బందుల పరిష్కారం
కోసం ఢిల్లీ వెళ్ళే తీరిక దొరకని నాయకులందరూ ఇప్పుడు పదవీ లాలసతతో రాజధానిలో
రోజులు రోజులు పొద్దుబుచ్చుతున్నారు.
పునశ్చరణ దోషం అయినా మరోమారు చెప్పక తప్పడం లేదు.
ఈనాడు రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్త సమస్యలకు, రాష్టంలో ఏర్పడ్డ అన్ని గందరగోళాలకు
కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న
అనిశ్చిత వైఖరే కారణం. సాగదీత ధోరణే మూల కారణం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల అభిమానం వున్నవారితో
పాటు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు సయితం కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుకునేదొక్కటే. రాష్ట్రానికి సంబంధించి, అది
తెలంగాణా విషయం కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి మార్పుకానివ్వండి, పీసీసీ అధ్యక్షుడి
వ్యవహారం కానివ్వండి – ఆ నిర్ణయాన్ని మీనమేషాలు లెక్కించకుండా తక్షణం తీసుకోవాలనే.
ముఖ్యమంత్రిని మార్చదలచుకున్నారా తక్షణం
మార్చండి. కనీసం ఆ వచ్చే కొత్త ముఖ్యమంత్రికి సాంతం కాకపోయినా కొంతలో కొంతయినా నిర్వహణ స్వేచ్ఛ ఇవ్వండి. తన మంత్రివర్గాన్ని తననే ఏర్పాటు చేసుకోనివ్వండి. రెండేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా
నిర్దేశించండి. కట్టు తప్పి వ్యవహరిస్తాడన్న భయ సందేహాలు వుంటే పైనుంచి పట్టు బిగించండి.
అంతే కాని కాళ్ళూ చేతులూ కట్టేసి, మరోపక్క అసమ్మతి పొగ రాజేసి సొంత పార్టీ వారితోనే ఆటలాడుకునే పద్ధతికి స్వస్తి చెప్పండి. లేదా వున్న ముఖ్యమంత్రికే గట్టి భరోసా ఇవ్వండి. మాటకు ఏమాత్రం విలువ లేని చిన్నాచితకా
నాయకులు ప్రతి పది పదిహేను రోజులకు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి పదవికి ధోకా లేదు అంటూ షరామామూలుగా చిలకపలుకులు
వల్లె వేయడం కిరణ్ కుమార్ రెడ్డి హోదాకు ఎంతమాత్రం శోభస్కరం కాదు. స్తాయిలేనివాళ్ళు
ఇలాటి పనికిమాలిన ప్రకటనలు చేసి, ప్రజల్లో పార్టీని పలచన చేసే బదులు ఆ ఒక్క ముక్కా
అధినేత్రి నోటి నుంచే వస్తే అసమ్మతి అన్నది చప్పున చల్లారి వూరుకుంటుంది.
కాంగ్రెస్ ఎన్ని అవకరాల పుట్ట అయినా అధిష్టానం పట్ల భక్తిప్రపత్తులు
ప్రదర్శించడంలో ఆ పార్టీ వారిని మించిన వారు వుండరు. ఈ లక్షణం బాగా వొంటబట్టిన
అసమ్మతి యోధులు మంత్రం వేసినట్టు మాయమయిపోతారు. తరచుగా నోరుజారేవారు, తోకలు
ఝాడించే వారు నోటికి తాళం వేసుకుంటారు. ఈ
వాస్తవం కాంగ్రెస్ అధిష్టాన దేవతలకు తెలియదని కాదు. కాకపొతే, గిల్లికజ్జాలు పెట్టి,
వొడ్డున నిలబడి తమాషా చూడడం వారికి వినోదం.
తమలో తాము పోట్లాడుకునేవాళ్ళు తమజోలికి రారని అదోమాదిరి నమ్మకం. (24-08-2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి