డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు
ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు. ‘అమ్మ’ (శ్రీమతి ఇందిరాగాంధి) కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు. ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది. ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ. ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే ఆరోగ్యం అక్కడ వుంటుంది’ అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం. బాత్రూం, బెడ్ రూముల్లో కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ కారుకు యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీ, రెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం మరో కారణం.
ఇంతకీ ఈ సీట్ల గొడవ ఎత్తుకోవడానికి కారణం లేకపోలేదు.
ఆస్ట్రేలియాలో ‘స్కై స్కానర్’ అనే ఓ వెబ్ సైట్ సంస్థకు ఏమీ తోచక, తోడికోడలు పుట్టిల్లు ఎక్కడో తెలియక – తరచుగా విమానాల్లో ప్రయాణించేవారు ఏ సీటు అంటే బాగా మక్కువ పడతారో లెక్కలు తేల్చడానికి ఏకంగా ఓ సర్వే చేపట్టింది. దానాదీనా తేలిందేమిటంటే చాలా ఎక్కువమంది ‘గాలి తిరుగుబోతులు’ తాము ప్రయాణించే విమానాల్లో ‘6-A’ నెంబరు కలిగిన సీటును కోరుకుంటారట.
విమానం ఆగగానే ఆలశ్యం లేకుండా దిగిపోయేందుకు ఆ సీటు అయితే బాగా వుంటుందన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే టాయిలెట్లు కాస్త దూరంలో వుండడం కూడా ‘6-A’ నెంబరు సీటు కోరుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అలాగే, విమానం ముందు భాగంలో ఎడమవైపు వరసలో వుండే సీట్లు కూడా చాలామంది కోరుకునే సీట్లని ఈ సర్వే తేల్చింది.
పోతే ఎవ్వరూ కూడా అంతగా ఇష్టపడని సీటు ఒకటి వుందని ఈ సర్వేలో తేలింది. అదేమిటంటే విమానం వెనుక భాగంలో రెండు సీట్ల నడుమ వుండే ‘31-E’ సీటట.
‘6-A’ నెంబరు సీటుకు డిమాండు వుందని తేలడంవల్ల ‘గిరాకీ’ని బట్టి రేట్లు పెంచే సంస్కృతి కలిగిన విమానయాన సంస్తలు ఆ సీటుకు ‘ప్రీమియం’ చార్జీ వసూలు చేసే అవకాశం లేకపోనూలేదని ఈ సర్వే చేసిన ‘స్కై స్కానర్’ ట్రావెల్ ఎడిటర్ శామ్ బాల్డ్ విన్ మహాశయులవారు హెచ్చరిస్తున్నారు.
లాభం లేనిదే వ్యాపారి వరదను సయితం లెక్కచేయకుండా ప్రయాణం పెట్టుకోడని సామెత.
కాబట్టి, సర్వేల్లో అసలు మతలబు ఇదన్నమాట.
సర్వేజనా సుఖినోభవంతు! (30-04-2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి