12, ఏప్రిల్ 2012, గురువారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా! – భండారు శ్రీనివాసరావు


రాజకీయుల నాలుకకు  నరం వుంటుందా!భండారు శ్రీనివాసరావు
అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దివంగత రాజశేఖర రెడ్డి గురించి కూడా ఇదే రకమయిన అయోమయం చోటుచేసుకుంటు న్నట్టు అనుదినం వార్తలు తెలుపుతున్నాయి. కొందరికి ఆయన కనబడుతుంటే మరికొందరికి ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి కూడా కనబడుతున్నారు. నిజానికి, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఆజాత శత్రువు ఏమీ కాదు. ఆజన్మ శత్రువులకు కూడా కొదవేమీ లేదు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సయితం  ఆయనతో తీవ్రంగా విభేదించిన కాంగ్రెస్ నాయకులున్నారు. అలాగే ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని వేనోళ్ళ పొగిడి రాజకీయ లబ్ది పొందినవాళ్ళు కూడా వున్నారు.  తెలుగు దేశం హయాంలో రాష్ట్రంలో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తన పాద యాత్రతో నూతన  కొత్త జవసత్వాలు కట్టబెట్టి అనేక ఏళ్ళ తరువాత అందని పండుగా మారిన అధికారాన్ని  తమ  పార్టీకి అందించాడని  కొన్నేళ్లపాటు ఆయనను విడవకుండా కీర్తించిన వందిమాగధుల స్వరాలు కూడా  క్రమంగా మారిపోతూ వుండడమే విచిత్రం. ఆయన చనిపోయిన వెంటనే సీను హఠాత్తుగా మారిపోలేదు  కాని క్రమంగా మారుతూ వచ్చింది.  వైయస్సార్ కుమారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసి వేరు కుంపటి పెట్టి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన వరస అపజయాల దరిమిలా కాని కాంగ్రెస్ నాయకులకు కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. లక్షల కోట్ల లెక్కలో జగన్  మోహన రెడ్డి అవినీతి గురించి తాము  చెబుతున్న లెక్కలు జనాలకు పట్టకపోవడం వారికి వింతల్లో వింతగా అనిపిస్తూ వుండవచ్చు. ఇందుకు నెపం ఎవరిమీదనో మోపాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం. ఆయన చనిపోగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందా అన్నట్టు ఆ తరువాత  అధికార పీఠం ఎక్కిన వారు ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారికి నచ్చడం లేదు. ఆ విధంగానే, ఆయన పాలన అంతా అవినీతిమయం అంటున్న  వారికి ఆయన చేపట్టి అమలు చేసి చూపిన సంక్షేమ కార్యక్రమాల వూసు పట్టడం లేదు. దాని ఫలితమే బడుగు బలహీన వర్గాలన్నీ వైయస్సార్ పేరుతొ పెట్టిన పార్టీ వెంట నడవడానికి దోహదం చేసింది. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనకేం చేసుకున్నాడో, తన కొడుక్కేం చేసుకున్నాడో మాకనవసరం. మాకేం  చేశాడన్నదే మాకు ప్రధానం’ అని మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి రాజధానిలో బార్బర్ గా పనిచేస్తున్న నరేష్ చెప్పాడు. వైయస్సార్ పుణ్యమా అని తన చెల్లెలు ఇంజినీరింగు పూర్తిచేసిందని, తనకూ ఈ మాదిరి సాయం లభించి వుంటే పదో తరగతి కూడా పూర్తి చేయకుండానే  చదువు మధ్యలో  మానేయాల్సిన దుస్తితి తప్పేదని అంటూ, చెల్లెలు ఇంజినీరుకాగానే వూళ్ళో తమ స్తాయి పెరిగిందనీ, అందరూ తమ కుటుంబాన్ని గౌరవంగా చూస్తున్నారనీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆరోగ్య శ్రీ కింద  గుండె ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళు, ఏ పార్టీ జెండా పట్టుకోకుండానే ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లు, నెలనెలా పెన్షన్ క్రమం  తప్పకుండా అనుకుంటున్న వృద్ధులు – వీరంతా  వూరూరా నోటిమాటగా చేసిన ప్రచారం కోట్లు ఖర్చు  పెట్టి చేసే ప్రభుత్వ ప్రచారాన్ని మించి పోయింది. ఇది గమనం లోకి తీసుకోకుండా పార్టీలోని వైయస్సార్ ప్రత్యర్ధులు చేసిన తప్పుడు ప్రచారాన్ని  నమ్మి కొంతా, పధకాల మీద తమ  పట్టు పోతోందన్న  ఉక్రోషంతో కొందరు అధికారులు చేసిన నిర్వాకం వల్ల కొంతా  మొత్తం మీద ఏదయితేనేం వైయస్సార్ సంక్షేమ పధకాలను  అటకెక్కి స్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వైయస్సార్ మరణం తరువాత ఈ పధకాలను అప్పటి మాదిరిగానే కొనసాగించివున్న పక్షంలో ఈనాడు జగన్ మోహన రెడ్డి  ఆ పధకాలను గురించి క్లెయిం చేసుకునే అవకాశం దక్కివుండేది కాదు. ఆ పధకాల వల్ల మేలు పొందిన వారి అభిమానం కాంగ్రెస్ పట్ల చెక్కు చెదరకుండా వుండేది. వైయస్సార్ బొమ్మ గురించి ఈనాడు ఇంతగా పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడాల్సిన అవసరం వుండేది కాదు.  కారణాలు ఏవయినా కాంగ్రెస్ నాయకత్వం ఈ బంగారు అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. దాని ఫలితమే,  దరిమిలా  కడప, కోవూరు ఉపఎన్నికల  ఫలితాల్లో ప్రస్పుటమయింది కూడా.
అయినా ఇప్పటికీ,  రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం గురించి  పార్టీ వర్గాల్లో  గుంజాటన సాగుతూనే వుంది. ఈ మధ్య ఢిల్లీలో అధిష్టాన దేవతలు రాష్ట్ర నాయకులకు అభ్యంగన స్నానం చేయించి, చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి, చేయాల్సిన హిత బోధలు చేసి సాగనంపిన పిమ్మట   ఇది క్రమంగా శ్రుతి మించి ఆరున్నొక్క రాగంగా మారుతోంది.
కాంగ్రెస్ లో అవలక్షణాలకు చక్కని పేర్లు పెట్టుకుంటూ వుంటారు. కార్యకర్తల స్తాయిలోనే కాకుండా అధినాయకుల స్తాయిలో కూడా మాటలు విసురుకుంటూ దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనే నామకరణం చేసుకుని వారిలో వారే సంతృప్తి పడుతూ వుంటారు. పోటీ లేనప్పుడు, ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా గొడవలు పడ్డా వచ్చే ప్రమాదం లేకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. ఏదో అధికారంలో వున్న పార్టీ కదా ఇప్పుడే  వొదిలేయడం ఎందుకు, కొన్నాళ్ళు ఆగితే పోలా అనుకునేవాళ్లకు  కాంగ్రెస్ లో ఏమాత్రం కొరత లేదు. అలాగే వై యస్సార్ వీరవిధేయులు పార్టీ విడిచి వెళ్ళిన తరువాత కూడా, మరి  కొందరు ఇంకా మఠం వేసుకు కూర్చుని ‘మనసు ఒక చోటా మనువు మరో చోటా’ అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తార్కాణం కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా  వెల్లడిస్తున్న ‘కోవర్టు’ల వ్యవహారమే.
త్వరలో జరగనున్న పద్దెనిమిది ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్తితి ఎలావుంటుందో ఎవరూ చెప్పలేరు. పోలింగుకు ఒక్క రోజు ముందు జరిగే ఏ సంఘటన అయినా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం వుంటుంది. కాని ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దీనాతిదీనంగా వుండడం గత నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. వైయస్సార్ మరణానంతరం లభించిన  మూడేళ్ళ పై చిలుకు అధికార సమయాన్ని కాంగ్రెస్ వారు పూర్తిగా వృధా చేసుకున్నారు. నిష్క్రియాపరత్వానికి ఒక ఉదాహరణగా చరిత్రలో నిలచిపోతారు. (11-04-2012)
                                                          

5 కామెంట్‌లు:

sree చెప్పారు...

good analysis.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@sree - Thanks

అజ్ఞాత చెప్పారు...

YSR has done lot to north andhra districts like vizianagaram and srikakulam. Irrigation canals, houses to poor and essentially totally economic uplift. TDP has lost its ground there. As you said who bothers what YSR or his son did for themselves but they took the people along with them in prosperity. I remember congress started PV´s name to counter YSR name just before the elections last year. Congress really needs to consult for ideas before it bites dust.

Praveen Mandangi చెప్పారు...

Thotapalli contactor cheated people of Vizianagaram and Srikakulam districts in YSR's era only,

Praveen Mandangi చెప్పారు...

రాజశేఖర రెడ్ది ఏమీ జల యజ్ఞం చెయ్యలేదూ, పిండాకూడూ చెయ్యలేదు. రాజశేఖర రెడ్ది బతికి ఉన్నప్పుడే తోటపల్లి కాంట్రాక్టర్ అవినీతి బయటపడింది. అతని అవినీతి గురించి అధికారులకి తెలిసినా అతని దగ్గర డబ్బులు తీసుకుని, అతను యంత్రాలతో సహా అక్కడి నుంచి పారిపోవడానికి అధికారులే సహాయం చేశారు. ఇప్పటికే చంద్రబాబు తెచ్చిన ప్రపంచ బ్యాంక్ అప్పులు రాష్ట్రాన్ని పీకలలోతులో ముంచేశాయి. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తలకాయ కూడా కనిపించకుండా ముంచేసేవాడు.