25, మార్చి 2012, ఆదివారం

మారానంటే నమ్మరేం! - కిరణ్ ఆత్మ ఘోష


మారానంటే నమ్మరేం! - కిరణ్ ఆత్మ ఘోష 
నెలలు గడిచిపోయాయి రాష్ట్ర రాజకీయాలను గురించి రాసి. ఎందుకంటే రాసిన దాంట్లో ఏదో ఒక కోణాన్ని తీసుకుని రాజకీయులకి ఆపాదిస్తూ ఆయా పార్టీల భుజకీర్తులు ధరించిన పాత్రికేయునిగా ముద్ర వేసే ధోరణి పెచ్చుపెరిగిపోతున్న తరుణంలో రాయకపోవడమే మంచిదన్న ఉద్దేశ్యంతో మానుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రాజకీయ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాయడానికి కూడా ఒక కారణం వుంది.
‘ముఖ్యమంత్రిని మార్చాలా! ముఖ్యమంత్రి మారాలా!’ అనే అర్ధం వచ్చేలా  గతంలో నేను రాసిన వ్యాసంలో ముఖ్యమంత్రికి సరిపడని సంగతులు వున్నాయని ఒక పత్రిక దాన్ని ప్రచురించలేదు. రాష్ట్ర రాజకీయాలను గురించి నేను వారం వారం రాస్తున్న వ్యాసాలను ఆ పత్రిక అప్పటికి కొన్ని మాసాలనుంచి క్రమం తప్పకుండా ప్రచురిస్తూనే వస్తోంది. అప్పటికే ఆ పత్రిక యజమాని ఏదో  కేసులో చిక్కుకుని వున్నందున కిరణ్ గురించిన ఈ  వ్యాసం ప్రచురించడంలో తమకు కొన్ని ఇబ్బందులు వున్నాయని సంపాదక వర్గ సభ్యుడొకరు తరువాత వివరణ ఇవ్వడం వల్ల ‘పీత కష్టాలు పీతవి’ అని సరిపుచ్చుకున్నాను.
కానీ, ఇప్పుడు అదే పత్రిక ముఖ్య మంత్రి కిరణ్ అనుకూల ధోరణిలో ప్రధాన వార్త రాస్తూ మరో పక్క ‘నేను మారానంటే నమ్మరేం!’ అంటూ ఆయన ఫోటో కింద ప్రచురించి కిరణ్ మనసులోని మాట ఇదే అని స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. పాఠకుల కోసం ఆ వ్యాసాన్ని మరోమారు ఇక్కడ ఇస్తున్నాను. (25-03-2012)
--------- దిన పత్రిక సంపాదకులకు (పత్రికా సంప్రదాయాలను గౌరవిస్తూ పత్రిక పేరు రాయడంలేదు)
శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ నెల ఇరవై నాలుగో తేదీకి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా రాసిన ఈ కింది వ్యాసాన్ని మీ పరిశీలన కోసం  పంపుతున్నాను.
భవదీయుడు
భండారు శ్రీనివాసరావు (18-11-2011)


కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది పాలనలో సాఫల్య వైఫల్యాలు  - భండారు శ్రీనివాసరావు
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అనేక ఒడిదుడుకులకు గురయింది. పాలక పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఒక రకమయిన అనిశ్చితి నెలకొనివున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో అధికార  పగ్గాలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఏడాదిలో ముఖ్యమంత్రిగా సాధించింది ఏమిటి అని విశ్లేషించే ముందు గతాన్ని ఓ సారి నెమరు వేసుకోవడం బాగుంటుంది. 
ముప్పయ్యేళ్ళ కిందటి మాట.
ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు  కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.
అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి  ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే  తుంచేయాలని భావించిన  ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్  అతిరధులంతా ఆ

సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కుయ్ కయ్ అంటే వొట్టు.    
మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. మంత్రులే కాదు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని  అశక్తతలో నేటి అధిష్టానం.

మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో   రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత  ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై  ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన కూడా పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.
వైఎస్సార్  దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ  చీకాకులకు  అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది.  వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.
ఈ పరిణామాలు  సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే  వై.ఎస్.  మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా  వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం  రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
ఎందుకంటె,  ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండే  చిల్లర దేవుళ్లు  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి.  చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై  పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం  జాతీయ పార్టీలయినా,  ప్రాంతీయ
పార్టీలయినా వాటి  అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ  ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ అధికారం లో వున్నప్పుడు జడ్పీ చైర్మన్ల ఎంపిక సందర్భంలో సీల్డ్ కవర్రాజకీయం నడిపిన విషయం అందరికీ తెలిసిందే.
కాకపొతే తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ గద్దె ఎక్కడానికి దోహదపడిన  వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో కలగూరగంపను తలపించే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త  బాధ్యతలు, తొలి విడత పాలనలో రాజశేఖరరెడ్డికి ఓ మేరకు కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి రాజశేఖరరెడ్డి వంటి అన్నింటా సమర్ధుడయిన ఒక ప్రాంతీయ నాయకుడి అవసరం  ఢిల్లీ పెద్దలకు వుండడం ఆయనకు మరింత కలసి వచ్చింది. 
వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న  మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా  ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల  కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు.అయితే, 2009 లో   అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ  తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని,  వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులపై మునుపటి మాదిరిగా పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.
వై ఎస్ మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టిన  రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చూపిన  కారణం ఆయన వయో భారం. ఆ విషయాన్ని  కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.
కారణాలు ఏమయినా గత నవంబర్ ఇరవై నాలుగో తేదీన వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని  ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు,  మంత్రుల శాఖల పంపిణీలో స్వతంత్రించి సీనియర్లను సైతం
పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం  మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.
కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించిన సంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న  కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత  చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే   అటకెక్కిస్తున్నదన్న  భావన ఆ పధకాల  లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు  అధికారులు  కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా  ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా  పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ  కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు  అసమ్మతికి భయపడాల్సిన పని ముఖ్యమంత్రికి వుండదు. 
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను రుజువు చేసుకోవడంలో ఆయన కొంతవరకు  వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం.  క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి.  సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం ఇవన్నీ  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ  నిష్క్రియాపరత్వానికి   కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి  వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు  ఎదుర్కొనక తప్పని  సమస్యలే.  
నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా  పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు.  ఎన్నెన్ని అవినీతి  ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు  వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనకు రాజకీయంగా కలసివచ్చిన కాలం తక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సమస్య.  ఒకదాని వెంట  మరొకటి. ఇలా దాదాపు మొదటి ఆరుమాసాలకాలం ఉక్కిరిబిక్కిరిగానే గడిచిపోయింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మారనున్నారనే వదంతుల నడుమ కిరణ్ కుమార్ రెడ్డి పాలన సాగడంవల్ల యంత్రాంగంపై పట్టు చిక్కించు కోవడానికి కొంత సమయం పట్టింది.  ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సంకేతాలు కానవస్తున్నాయి.  సంక్షేమ పధకాలకు సంబంధించి సొంత ముద్ర వేసుకొనే క్రమంలో ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం పధకం, లక్షమందికి ఉపాధి కలిగించే రాజీవ్ యువ కిరణాలు పధకం, పరిపాలనలో జవాబుదారీతనం కల్పించడానికి ఉద్దేశించిన మీ కోసంపధకం ఇలా అనేక కొత్త పధకాలకు
కిరణ్  స్వయంగా రూపకల్పన చేశారు. అయితే వాటిని విస్తృతంగా ప్రచారం చేసి  జనంలోకి తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నం  పూజ్యం. గతంలో ముఖ్యమంత్రులు ప్రచారాలకు పెట్టిన ఖర్చుతో పోలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అందుకోసం  చేస్తున్న వ్యయం చాలా తక్కువనే చెప్పాలి. కానీ, పని చేయడమే కాదు పని చేస్తున్నట్టు కనిపించాలి అన్న ఈ కాలపు సూత్రాన్ని ఆయన గమనం లోకి తీసుకున్నట్టులేదు.      
అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ పైచిలుకు  వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు.
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.  కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (18-11-2011)       

       

కామెంట్‌లు లేవు: