7, మార్చి 2012, బుధవారం

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!




సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా




ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే.
సౌదీ మహిళల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ వివక్ష కారణంగా  ఆ దేశంలో చాలా కుటుంబాలు డ్రైవర్ ని పెట్టుకోవాల్సిన పరిస్తితి. అలా సొంతంగా డ్రైవర్ ని పెట్టుకుకోవాలంటే అతగాడికి నెలకు రెండు వేల సౌదీ రియాల్స్ చెల్లించుకోవాలి. లేదా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఆఫీసులకు వెళ్లి రావడానికి భర్త మీదనో లేదా కుటుంబంలోని  మరో మగవాడి మీదనో  ఆధారపడాలి. ఇందువల్ల వాళ్లు ఎంతో విలువయిన సమయాన్ని నష్టపోతున్నారు. శారీరకంగా, మానసికంగా కష్టపడుతున్నారు.       
పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగినుల పరిస్తితి మరీ దారుణం.
మనాల్ షరీఫ్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఇందుకొక ఉదాహరణ.
భర్త తోడు లేని ఈ మహిళ  పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో కారున్నప్పటికీ, పిల్లల్ని పార్కు తీసుకు వెళ్ళాలన్నా లేక ఆసుపత్రికి వెళ్ళాలన్నా అన్నదమ్ములపై ఆధారపడాల్సిన దుస్తితి. ఆ మాత్రం మగతోడు కూడా లేని ఆడవాళ్లు, సొంత కారున్నప్పటికీ  అవసరం పడితే  టాక్సీలో వెళ్ళాలి. ఇలాటి సందర్భాలలో  ఆడవాళ్ళు ఎంతో నిర్వేదానికి లోనవుతుంటారు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళడానికి పరాయి మగవాళ్ళని దేబిరించడం  కనాకష్టంగా  ఉంటోందని మనాల్ తన స్నేహితురాలికి యూ ట్యూబ్ లో ఒక సందేశం పంపారు.
కారు నాది.  నా డబ్బుతో కొనుక్కున్నాను. నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అయినా కానీ దాన్ని నడపలేని దౌర్భాగ్య స్తితి నాది.  ఏం చెప్పమంటావు?’ అంటూ అందులో  తన గోడు వెళ్లబోసుకుంది.

ఉన్నత కుటుంబీకులకీ, సంపన్న వర్గాలవారికీ డ్రైవర్ను పెట్టుకోవడం పెద్ద ఖర్చేమీ కాదు. కానీ, ఆడా మగా ఇద్దరూ సంపాదించుకుంటే కాని సంసారం నడవని మధ్య తరగతి కుటుంబాలలోని ఆడవారికి సౌదీలో ఇదొక ప్రధాన సమస్యగా తయారయింది. హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఆఫీసుకు సకాలంలో చేరాలన్నా, పిల్లల్ని స్కూళ్ళలో దింపాలన్నా, పచారీ దుకాణానికి వెళ్లి సరకులు కొనుక్కోవాలన్నా ఆడవారు సొంత కారు పెట్టుకొని కూడా  ఎవరినో ఒకరిని ప్రాధేయ పడాల్సి వస్తోంది. అందుకే అక్కడి ఆడవారు ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్టీలు డ్రైవింగ్ లైసెన్స్ హక్కు కోసం ఆందోళనలు దిగుతున్నారు.
  
బాగా అవసరం పడ్డప్పుడయినా కారు నడపడం రావాలని ఆదేశంలో కొందరు ఆడవాళ్ళు పొరుగునవున్న బహ్రెయిన్, లేదా యూయేయీ దేశాలకు వెళ్లి కారు నడపడం నేర్చుకుంటున్నారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించుకుని స్వదేశానికి వస్తున్నారు. 
కారు డ్రైవింగ్ నా తమ్ముడు నేర్పాడు. వూరికి దూరంగా తీసుకువెళ్ళి కారు నడపడంలో మెళకువలు నేర్పాడునూర్ అనే పేరుగల మహిళా అరబ్  వార్తా  సంస్థతో చెప్పింది.
నిరుడు జెడ్డాలో వరదలు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను ఓ మహిళ కారులో సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని పత్రికల్లో  చదివినప్పుడు నాకూ కారు డ్రైవింగ్ వస్తే యెంత బాగుండుననిపించింది. అందుకే లెబనాన్ కు వెళ్లి దాన్ని సంపాదించుకున్నానుఅని మోనా హేజాజీ అనే సౌదీ స్త్రీని ఉటంకిస్తూ రియాద్ న్యూస్  పేర్కొన్నది.  
రాత్రివేళల్లో తాను కారు నడుపుతున్న దృశ్యాలను అరీజ్ ఆల్ ఖల్డీ అనే మహిళ  ఇంటర్నెట్ లో పెట్టింది. దాన్ని చూసయినా మరికొందరు మహిళలు స్పూర్తి పొందుతారేమో అన్నది ఆవిడ ఆకాంక్ష.
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆవిడ ఆకాంక్ష నెరవేరడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు వేచివుండాలో!)
  
(08-03-2012)

కామెంట్‌లు లేవు: