20, మార్చి 2012, మంగళవారం

మాస్కోలో మెక్ డొనాల్డ్




మాస్కోలో మెక్ డొనాల్డ్


1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయం లో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.



లెనిన్ సమాధి దగ్గర బారులు తీరిన ప్రజలు 




 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.


మాస్కోలో మెక్ డొనాల్డ్

ఇనుప తెరదేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్ ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్అనేవారు. రష్యన్లో బల్షోయీఅంటే పెద్దఅని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.
 (20-03-2012)

2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

మెక్ డొనాల్డ్ లో ఒక సారి తిన్న తరువాత మనం ఇంక దానిని,ఆ రుచిని వదలలేము. ఆ ఫ్రెంచ్ ఫ్ర్య్స్ రుచి ఎక్కడా రాదు. మొన్న బర్గర్ కింగ్ లో ఊర్కేనే ఫ్రైస్ ఇస్తుంటే తిన్నాము. మెక్ డొనాల్డ్ కి ఏమాత్రం దగ్గర కూడా రాలేదు.

మా ఊరి పక్కన, ఓక్ బ్రూక్లో మెక్ డొనాల్డ్ ప్రపంచ హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడ మెక్ డొనాల్డ్ యునివర్సిటీ ఉంది. ప్రపంచంలో మెక్ డొనాల్డ్ లో ఫుడ్ తయారు చేసే వాళ్లందరూ అక్కడ శిక్షణ పొందిన వారే. అందుకనే ఏదేశం లోనయినా వాటి రుచి ఒకటిగానే ఉంటుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - బాగా చెప్పారు. రుచి ఒకేలాగా వుంటుంది, మనవైపు ఇరానీ హోటల్లో చాయ్ రుచిలాగా.- భండారు శ్రీనివాసరావు