29, ఫిబ్రవరి 2012, బుధవారం

సమతూకం


సమతూకం


ఈ చరాచర సృష్టి జరక్క పూర్వం సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంపై  మఠం వేసుక్కూర్చుని  విశ్వ సృష్టిలో నిమగ్నమై వున్నాడు. సృష్టి కార్యంలోని  వింతలూ విశేషాలను పనిలో పనిగా తన సతీమణి సరస్వతీ దేవికి తెలియచేస్తున్నాడు.
‘చూడు వాణీ! హాటకగర్భురాణీ! మనం చేసే ప్రతిపనీ చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని చేయాలి. సమతూకం వుండేలా చూసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది’ అన్నాడాయన హెచ్చరికగా తన నాలుగు తలల్లో ఒకదాన్ని తడుముకుంటూ.
‘ఉదాహరణకు పది జింక పిల్లల్ని సృష్టించగానే సరిపోదు. వాటి సంఖ్యను అదుపుచేయడానికి కనీసం ఒక సింహాన్ని అయినా సృష్టించాలి.’
చదువులతల్లికి విషయం అర్ధమయింది.  ఎప్పుడూ ఏదో ఒకదాన్ని సృష్టిస్తూ ఆ పనిలోనే తలమునకలుగా వుండిపోయే శ్రీవారు ముచ్చట్లు మొదలు పెట్టడమే ఓ వింత. అందుకని వాయిస్తున్న వీణను కాసేపు పక్కనబెట్టి తన రెండు చెవులను ఆయనకు ఒప్పగించింది.      
‘చూశావు కదా ప్రపంచపఠంలో కానవస్తున్న  ఈ దేశాన్ని. దీన్ని అమెరికా అంటారు. ఈ దేశానికి నేనిప్పుడు సర్వ సంపదలు అనుగ్రహిస్తున్నాను. మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా దీన్ని తయారుచేస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ దేశానికి భద్రతా భావం  కొరవడేట్టు చేస్తున్నాను. లేకపోతే దీనికి పట్టపగ్గాలుండవు.’
‘ఇదిగో! ఇది ఆఫ్రికా! యావత్ ప్రపంచంలో ఎక్కడా కానరాని  ప్రకృతి రామణీయకతను దీని సొంతం చేస్తున్నాను.  అయితే అదేసమయంలో ఎక్కడాలేని విధంగా అతి దారుణమయిన ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తున్నాను.’
‘ఇదే దక్షిణ అమెరికా. ఈ దేశంలో ఎక్కడ చూసినా దట్టమయిన అడవులు. అందుకే, సమతూకంగా  నివాసయోగ్యమయిన భూమి అంతగా అక్కడి ప్రజలకు దొరక్కుండా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళంతట  వాళ్ళే అడవులను నరుక్కుంటూపోతారు.    ఆత్మహత్యాసదృశమయిన పనులతో వారిని వారే నాశనం చేసుకుంటారు.’
సృష్టికర్త మాటలను ఓ చెవితో వింటూ మరోవంక ఓరకంట విశ్వపఠంలో వివిధ దేశాలను  తిలకిస్తున్న  వాణీదేవి  చూపులు ఓ సుందర ప్రదేశం దగ్గర ఆగిపోయాయి.  అదేమిటన్నట్టు బ్రహ్మను చూపులతోనే ప్రశ్నించింది.
‘అదా! మొత్తం  నా సృష్టిలోనే అపూర్వమైన దేశం అది. పేద దేశమైనా ధార్మికంగా సంపన్నమైనది. ఎత్తయిన పర్వత శిఖరాలు, గలగలా పారే నదులు. చక్కటి అవగాహన వున్న ప్రజలు. యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా  మార్గ నిర్దేశనం చేయగల చేవ,సత్తా వున్న ఏకైక దేశం. అదే భారత దేశం’
వింటున్న వాణమ్మ నోరు తెరిచింది. కొంత ఆశ్చర్యంతోనూ, మరికొంత ఉత్సుకతతోనూ.
‘మరి మీరు చెబుతూ వస్తున్న సమతూక న్యాయం భారత దేశం విషయంలో ఏమయింది స్వామీ?’
‘తొందరపడకు సుందరవదనా! ఆ విషయం చెప్పేలోగానే నువ్వు నోరు తెరిచావు. చూడు మరి. భారత దేశానికి ఇరుగు పొరుగున ఎలాటి వారిని సృష్టించి పెట్టానో!’        

 బ్రహ్మదేవుడు నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తుంటే బ్రహ్మణి భర్త తెలివితేటలకు ఆశ్చర్యపోతూ మరో మారు నోరు తెరిచింది.
స్వస్తి.
(29-02-2012)

6 కామెంట్‌లు:

prasad చెప్పారు...

శ్రీనివాస రావు గారు,
క్షమించాలి.చిన్నపాటి అభ్యంతరం. భారత దేశం పేద దేశం కాదు జనాభాలో అధిక శాతం భారతీయులు మాత్రమే పేదవారు.
ప్రసాద్ శర్మ

విష్వక్సేనుడు చెప్పారు...

@ PRASAD గారు లాజిక్కులెతక్కండిక్కడ.
బండారు గారు ఇండియాకు కొంచెం లాజిక్కు మిస్ అయినట్లుంది. ఫినిషింగ్ ఇంకోచెం చురుగ్గా ఉండి ఉంటె బావుండేది. ఏమైనా బాగానే ట్రై చేసారు సార్.
ధన్యవాదాలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Prasad and @Vinod - ఇద్దరికీ ధన్యవాదాలు. ఇక్కడ లాజిక్కు సమస్య కాదు. సృష్టి ఆరంభం లోని మాట.అది గమనించాలని మనవి.- భండారు శ్రీనివాసరావు

Seetharam చెప్పారు...

హాటక గర్భు రాణి కదండీ? వ్యంగ్యము బావుంది. కానీ అమెరికా అంత సంపన్న దేశము కాదండీ. ఉత్తర ఐరోపా దేశాలు, మధ్య ప్రాచ్య దేశాలు అమెరికా తల తన్నినట్టు ఉంటాయి.
సీతారామం

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Seetharam - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సీతారాం - హాటక గర్భురాణి అని రాసి నా తప్పు సవరించుకునేలా చేశారు. ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు