26, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఇచ్చుటలో వున్న హాయీ!


ఇచ్చుటలో వున్న హాయీ!



చుట్టూ చిమ్మ చీకటి.  ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.  
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి  ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ  కాదు. కారు  ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.   
అనసూయకు చిన్నతనం నుంచీ  ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు   సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది.  పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త   పెంచి  పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది.  అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త  అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా  ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు.  కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట  ప్రయాణమేగా వెంటనే  తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్  లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి  మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా  ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు  లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ  కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె  మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే  కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి  పోయింది.  అతడు కాసేపు కారు చుట్టూ  తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా  చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు  సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది.  విధిలేని  పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ  మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ  క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది.  నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే  కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది.  కానీ, అతడికీ  తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో  నా ప్రయత్నం చేసాను. ఈ పనికి  డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి.  దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ  తేరుకునే లోగా అతడు మళ్ళీ   అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు.  నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు.  వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది.  కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె  చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు  మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు.   టీ చెప్పగానే అనసూయ ముందు  వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు  పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది.  పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన  మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన  రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా  డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత  ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న  చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని  అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్  సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది. (26-02-2012)         
     


3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అహా! ఆ సత్తెకాలపు వూహలు/కలలు ఎంత బాగున్నాయో!

Shivani చెప్పారు...

శ్రీనివాస రావు గారు మీ కథ అద్భుతం గా వుంది నిజమైతే, ఇలా జరిగితే బాగుండును అనిపించే లా వుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@SNKR and @Shivani - ఇతరులకు ఇచ్చిందే మనకు తిరిగివస్తుందన్నదే ఇందులో ఇతివృత్తం.ఈ వూహలు/కలలు నిజానికి నా సొంతం కావు. అక్షరాలే నావి - భండారు శ్రీనివాసరావు