21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ



శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 37 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు."
అక్షర సత్యం. కానీ ఆ బాధ్యత భరించేందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

puranapandaphani- ధన్యవాదాలు. అయితే,మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఈ మిలియనీర్ రాజకీయులవద్ద సమాధానాలు వుండకపోవచ్చు ఫణి గారు- భండారు శ్రీనివాసరావు