29, ఫిబ్రవరి 2012, బుధవారం

సమతూకం


సమతూకం


ఈ చరాచర సృష్టి జరక్క పూర్వం సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంపై  మఠం వేసుక్కూర్చుని  విశ్వ సృష్టిలో నిమగ్నమై వున్నాడు. సృష్టి కార్యంలోని  వింతలూ విశేషాలను పనిలో పనిగా తన సతీమణి సరస్వతీ దేవికి తెలియచేస్తున్నాడు.
‘చూడు వాణీ! హాటకగర్భురాణీ! మనం చేసే ప్రతిపనీ చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని చేయాలి. సమతూకం వుండేలా చూసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది’ అన్నాడాయన హెచ్చరికగా తన నాలుగు తలల్లో ఒకదాన్ని తడుముకుంటూ.
‘ఉదాహరణకు పది జింక పిల్లల్ని సృష్టించగానే సరిపోదు. వాటి సంఖ్యను అదుపుచేయడానికి కనీసం ఒక సింహాన్ని అయినా సృష్టించాలి.’
చదువులతల్లికి విషయం అర్ధమయింది.  ఎప్పుడూ ఏదో ఒకదాన్ని సృష్టిస్తూ ఆ పనిలోనే తలమునకలుగా వుండిపోయే శ్రీవారు ముచ్చట్లు మొదలు పెట్టడమే ఓ వింత. అందుకని వాయిస్తున్న వీణను కాసేపు పక్కనబెట్టి తన రెండు చెవులను ఆయనకు ఒప్పగించింది.      
‘చూశావు కదా ప్రపంచపఠంలో కానవస్తున్న  ఈ దేశాన్ని. దీన్ని అమెరికా అంటారు. ఈ దేశానికి నేనిప్పుడు సర్వ సంపదలు అనుగ్రహిస్తున్నాను. మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా దీన్ని తయారుచేస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ దేశానికి భద్రతా భావం  కొరవడేట్టు చేస్తున్నాను. లేకపోతే దీనికి పట్టపగ్గాలుండవు.’
‘ఇదిగో! ఇది ఆఫ్రికా! యావత్ ప్రపంచంలో ఎక్కడా కానరాని  ప్రకృతి రామణీయకతను దీని సొంతం చేస్తున్నాను.  అయితే అదేసమయంలో ఎక్కడాలేని విధంగా అతి దారుణమయిన ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తున్నాను.’
‘ఇదే దక్షిణ అమెరికా. ఈ దేశంలో ఎక్కడ చూసినా దట్టమయిన అడవులు. అందుకే, సమతూకంగా  నివాసయోగ్యమయిన భూమి అంతగా అక్కడి ప్రజలకు దొరక్కుండా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళంతట  వాళ్ళే అడవులను నరుక్కుంటూపోతారు.    ఆత్మహత్యాసదృశమయిన పనులతో వారిని వారే నాశనం చేసుకుంటారు.’
సృష్టికర్త మాటలను ఓ చెవితో వింటూ మరోవంక ఓరకంట విశ్వపఠంలో వివిధ దేశాలను  తిలకిస్తున్న  వాణీదేవి  చూపులు ఓ సుందర ప్రదేశం దగ్గర ఆగిపోయాయి.  అదేమిటన్నట్టు బ్రహ్మను చూపులతోనే ప్రశ్నించింది.
‘అదా! మొత్తం  నా సృష్టిలోనే అపూర్వమైన దేశం అది. పేద దేశమైనా ధార్మికంగా సంపన్నమైనది. ఎత్తయిన పర్వత శిఖరాలు, గలగలా పారే నదులు. చక్కటి అవగాహన వున్న ప్రజలు. యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా  మార్గ నిర్దేశనం చేయగల చేవ,సత్తా వున్న ఏకైక దేశం. అదే భారత దేశం’
వింటున్న వాణమ్మ నోరు తెరిచింది. కొంత ఆశ్చర్యంతోనూ, మరికొంత ఉత్సుకతతోనూ.
‘మరి మీరు చెబుతూ వస్తున్న సమతూక న్యాయం భారత దేశం విషయంలో ఏమయింది స్వామీ?’
‘తొందరపడకు సుందరవదనా! ఆ విషయం చెప్పేలోగానే నువ్వు నోరు తెరిచావు. చూడు మరి. భారత దేశానికి ఇరుగు పొరుగున ఎలాటి వారిని సృష్టించి పెట్టానో!’        

 బ్రహ్మదేవుడు నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తుంటే బ్రహ్మణి భర్త తెలివితేటలకు ఆశ్చర్యపోతూ మరో మారు నోరు తెరిచింది.
స్వస్తి.
(29-02-2012)

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఇచ్చుటలో వున్న హాయీ!


ఇచ్చుటలో వున్న హాయీ!



చుట్టూ చిమ్మ చీకటి.  ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.  
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి  ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ  కాదు. కారు  ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.   
అనసూయకు చిన్నతనం నుంచీ  ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు   సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది.  పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త   పెంచి  పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది.  అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త  అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా  ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు.  కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట  ప్రయాణమేగా వెంటనే  తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్  లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి  మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా  ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు  లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ  కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె  మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే  కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి  పోయింది.  అతడు కాసేపు కారు చుట్టూ  తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా  చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు  సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది.  విధిలేని  పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ  మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ  క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది.  నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే  కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది.  కానీ, అతడికీ  తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో  నా ప్రయత్నం చేసాను. ఈ పనికి  డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి.  దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ  తేరుకునే లోగా అతడు మళ్ళీ   అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు.  నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు.  వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది.  కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె  చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు  మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు.   టీ చెప్పగానే అనసూయ ముందు  వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు  పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది.  పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన  మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన  రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా  డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత  ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న  చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని  అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్  సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది. (26-02-2012)         
     


దేహమేరా వైద్యాలయం



దేహమేరా వైద్యాలయం

సీనియర్ పాత్రికేయులు, ‘కలం కూలీ’, కీర్తిశేషులు జి.కృష్ణ గారు తనకు తెలిసిన దేనినీ, జర్నలిజంతో సహా, తనకోసం వాడుకోని అభినవ పోతన. ఆయనకు  పుట్టుమచ్చల శాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. దేహంలో బయటకు కనిపించే పుట్టుమచ్చకు తోడుగా మరోచోట అదే శరీరంలో ఇతరులకు కాని రాని చోట మరో జోడు పుట్టుమచ్చ వుంటుందని ఆయన సిద్ధాంతం. నిజంగా నమ్మి చెప్పేవారో లేక నవ్వులాటకు చెప్పేవారో తెలియదు కాని ఆయన చెప్పిన చోట పుట్టుమచ్చ వుండడాన్ని నేను అనేక మార్లు గమనించాను. ‘పాడు దేహమిది తూటులు తొమ్మిది తుస్సుమనుట  ఖాయం’ అనే పాత సినిమా పాట ఈ మధ్య రేడియోలో విన్న రోజునే ఈ పాడు దేహంతో చేయగల అనేక ట్రిక్కులు గురించి చదవడం కాకతాళీయమే కావచ్చు కానీ అప్పుడు కృష్ణ గారు గుర్తుకొచ్చారు. ఆ చిట్కాల కధా కమామిషును   నలుగురితో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.

మానవ దేహం  అత్యంత సంక్లిష్టమైనది. తల వెంట్రుక కంటే తక్కువ మందం కలిగిన అనేక నాడులు, గ్రంధులు, రక్త నాళాలు శరీరంలో పెనవేసుకుని వున్న తీరు తెన్నులు గమనిస్తే సూపర్ కంప్యూటర్ లు కూడా ఓ లెక్క లోకి రావు. దేహంలో దాగున్న అనేక రహస్యాలు ఇంకా అనేకం వెల్లడి కావాల్సివుంది. తెలిసిన వాటిల్లో కొన్నింటిని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

·        గొంతులో గరగర అని టీవీల్లో ప్రకటనలు వస్తుంటాయి. అలాటి గరగర సమస్య తలెత్తినప్పుడు చెవిపై రుద్ది చూసుకోండి. అంతే! టీవీ ప్రకటనలో మాదిరిగా గరగర మాయం. చెవిలో నరాలు ఉత్తేజితమయినప్పుడు  గొంతులో కండరాలు బిగదీసుకుంటాయట. ఫలితం గొంతులో ఉపశమనం.

·        ఫోనులో మాట్లాడుతున్నప్పుడో, లేక నలుగురిలో వున్నప్పుడో అవతల వ్యక్తి చెప్పేది సరిగా వినబడడం లేదనిపిస్తే, వెంటనే కుడి చెవికి పని చెప్పండి. త్వరత్వరగా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు త్వరిత గతిన దాన్ని గ్రహించగల శక్తి  రెండు చెవుల్లో కుడి చెవికి ఎక్కువగా వుండడమే దీనికి కారణం. అలా అని  ఎడమ చెవి తక్కువదేమీ కాదు. మంచి సంగీతాన్ని ఆస్వాదించడం దానికే సాధ్యం సుమా!.

·        చిన్నప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా వుండడానికి పచ్చని చెట్టు వంక చూస్తూ వుండమని చెప్పడం చాలామందికి స్వానుభవమే. ఇప్పుడు మరో కొత్త ట్రిక్కు నేర్చుకోండి. సూది శరీరంలోకి దిగుతున్నప్పుడు చిన్నగా దగ్గండి. సూది దిగడం వల్ల కలిగే చురుక్కుమనే భావన వెన్నుపూస ద్వారా మెదడుకు చేరే సమయంలో వెన్నుపాములో దగ్గు వల్ల కలిగే వొత్తిడి, ఆ  నొప్పి తీవ్రత తెలియకుండా చేస్తుంది.(ట)

·        ముక్కు దిబ్బడ వేసినప్పుడు నాలుకను నోటి పైభాగానికి వొత్తి పెట్టి వుంచి, రెండు కనుబొమల నడుమ చూపుడు వేలిని నొక్కి పెట్టి వుంచితే మంచి ఉపశమనం కలుగుతుంది.
·        భుక్తాయాసం కలిగినప్పుడు ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోవాలి.  శ్వాసకోశనాళం కంటే ఉదరం దిగువన వుండడం వల్ల భుక్తాయాసం అధికం కావడం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి.
·        పంటి నొప్పి ఎక్కువగా  వుంటే కొద్దిగా ఐస్ తీసుకుని అరచేతి వెనుక వైపున రుద్దాలి. అలాగే బొటన వేలుకు, చూపుడు వేలుకు నడుమ భాగంపై ఐస్ మర్ధనా చేయాలి. మెదడునుంచి పంటికి నొప్పి గురించిన  సంకేతాలు అందించే నాడీ మార్గం దీనివల్ల ఉత్ప్రేరితం కావడం దీనికి కారణం.
·        ఒక్కోసారి డోసు ఎక్కువయినప్పుడు మందు బాబులకు తామువున్న ప్రదేశం గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ స్తితిలో చేతిని  బల్లకు ఆనించి కాసేపు నిలబడితే ఆ తీవ్రత తగ్గుతుంది. మనిషి స్తిరంగా నిలబడడానికి చెవిలో వుండే ఒక రకమయిన ద్రవం తోడ్పడుతుంది. మద్యం సేవించడం వల్ల ఆ ద్రవం పలచబడి మనిషి స్తిరంగా నిలబడే శక్తిని కోల్పోవడం వల్ల కళ్ళు తిరుగుతాయి. అలాంటప్పుడు  చేతిని బల్లకు ఆనించి నిలబడడం వల్ల మెదడుకు మరో రకమయిన సంకేతం వెళ్లి ప్రపంచం  గిర్రున తిరుగుతున్న భావనను అరికడుతుంది.  
·        వెక్కిళ్ళు వస్తున్నాయా? బొటన వేలిని, రెండో వేలిని కనుబొమలమీద వొత్తి పెట్టి వుంచండి. వెక్కిళ్ల సంగతి అవే చూసుకుంటాయి.

·        నీతి: ఉచిత సలహాలు కొండొకచో పనిచేయకపోవచ్చు.
·        ఉపసంహారం: తలలో పేల బాధ అధికంగా వున్న ఓ శాల్తీ కి ముళ్లపూడి వెంకటరమణ గారు ఓ జోకు ద్వారా ఇచ్చిన సలహా.  “ బ్రాందీలో ఇసక కలిపి తలకు పట్టించండి. బ్రాందీ సేవించిన పేలు ఆ మత్తులో చెలరేగిపోయి ఇసుకరేణువులతో ఒకదానినొకటి మోదుకుని చచ్చివూరుకుంటాయి.” 
     

(26-02-2012)

23, ఫిబ్రవరి 2012, గురువారం

నవ్వుల పువ్వుల ముళ్ళపూడి


నవ్వుల పువ్వుల ముళ్ళపూడి






(June, 28,1931 - Feb. 23, 2011)





తెలుగు నేలపై పుట్టి తెలుగులోనే రాసి ఆయన దురదృష్టవంతుడయ్యాడు.
ఆయన తెలుగులోనే రాయడం వల్ల తెలుగు నేలపై పుట్టిన  తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.
నవ్వించే సినిమాలకు, కవ్వించే సినీ రివ్యూలకు ముళ్ళపూడి ట్రేడ్ మార్క్.
రాజకీయ భేతాళ పంచవింశతిక – నేటికీ, ఏనాటికీ వర్తించే బుక్ మార్క్
తెలుగులో హాస్యరసం ముళ్లపూడి వారితోనే పుట్టింది.
నవ్వడం రానివారికి, నవ్వడం మరచిపోయిన వారికి ఆయన కాణీ ఖర్చు లేకుండా నవ్వడం నేర్పారు.
ముఖచిత్రానికి ‘అట్ట’హాసం అని పేరు పెట్టినా,
అప్పులు చేయడంలో ‘ఇంత’ ఆనందం వున్నదని చెప్పినా-
ఆ వెంకటరమణుడికే చెల్లు.
‘నిన్న రాసింది ఈ రోజు చదివితే మొన్నటి అప్పడంలా వుంటుంది’ అని రాసిన  ముళ్లపూడి వెంకటరమణ –
అక్షరాలా అక్షర బ్రహ్మ.
ఆయనకిదే నా సాక్షర నివాళి.
(ఫిబ్రవరి 23 – ముళ్లపూడి ప్రధమ వర్ధంతి సందర్భంగా)

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ



శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 37 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నవ్వడం మరచిపోతున్నామా!


నవ్వడం మరచిపోతున్నామా!



మా పక్కింటి పాపాయి – పది నెలల పాప – నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ  వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.
‘మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి’
ఈ వాక్యం రాసిపెట్టుకున్న కాగితాన్ని  ముప్పయ్ అయిదేళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా పెట్టుకునేవాడిని. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే – ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా  వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!’ అని చెప్పుకున్న రోజులవి.
‘నవ్వగలగడం ఒక భోగం -  నవ్వలేకపోవడం ఒక రోగం’ అని నవ్వు గురించి నవ్వుల రేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది. ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజం. హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు  రోగంలా అందర్నీ అంటుకుంటోంది.
విశ్వనాథవారు అన్నట్టు ఇదొక విషాదం. (20-02-2012)

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పిల్ల పిడుగులు





పిల్ల పిడుగులు



బాపు గారికి కృతజ్ఞతలతో 


టీచర్:  ఏకాంబరం ఈ ప్రపంచ పఠంలో అమెరికా ఎక్కడ వుందో కనుక్కో.
ఏకాంబరం:  ఇదిగో ఇక్కడ టీచర్.
టీచర్: సరే నువ్వు జవాబు చెప్పు లంబోదరం. అమెరికాని కనుక్కున్నది ఎవరు?
లంబోదరం:  ఏకాంబరం టీచర్.  

టీచర్: శంకరం నీరు ఈ పదానికి రసాయనిక ఫార్ములా ఏమిటి?
శంకరం: హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ
టీచర్ : ఏమిటా జవాబు ? ఎవరు చెప్పారలా !
శంకరం : నిన్న మీరే అన్నారు కదా టీచర్  నీటికి కెమికల్ ఫార్ములా ‘హెచ్ టూ ఓ’ అని.

టీచర్  : స్వప్నా ఇవ్వాళ మన మధ్య వుండి పదేళ్ళ క్రితం లేనిదేమిటి?
స్వప్న : నేనే టీచర్  

టీచర్: కోటయ్య కొడుకు గొడ్డలితో ఇంటి పెరట్లో వున్న బాదం చెట్టును అడ్డంగా నరికేశాడు. సుందరం నువ్వు చెప్పు కోటయ్య తండ్రి తన కొడుకును ఎందుకు దండించలేదు?
సుందరం: ఎందుకంటె ఇంకా కొడుకు చేతిలో గొడ్డలి వుండడం చూసి.

టీచర్ : ఒరే రాఘవా! భోజనానికి ముందు దేవుడిని ప్రార్దిస్తావా? నిజం చెప్పరా!
రాఘవ: ఆ అవసరం లేదు టీచర్. మా అమ్మ బాగా వంట చేస్తుంది.
టీచర్: గీతా నువ్వు కుక్క మీద రాసుకొచ్చిన వ్యాసం అచ్చం మీ అన్నయ్య రాసిన దానికి నకలుగా వుంది. కాపీ కొట్టావా!
గీత: లేదు టీచర్. ఇద్దరం ఒకే కుక్క మీద రాసాం.  

టీచర్: శేఖర్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. వినే వాళ్లకు ఇష్టం లేదని తెలిసి కూడా అదేపనిగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు?
శేఖర్: టీచర్! 
(19-02-2012)

18, ఫిబ్రవరి 2012, శనివారం

పది నోటు ఎటు పోయింది చెప్మా!



పది నోటు ఎటు పోయింది చెప్మా!







ముగ్గురు వెంగళప్పలు పట్నం వెళ్లి హోటల్లో ఓ గది తీసుకున్నారు.
ముగ్గురికీ కలిపి రోజుకు మూడువందల రూపాయలు అవుతుందని హోటల్ క్లర్కు చెప్పిన మీదట తలా ఒక వంద వేసుకుని ఆ మొత్తాన్ని అతడికి చెల్లించారు.
అయితే హోటల్లో వేడి నీరు రాకపోవడంతో హోటల్  యజమాని వారినుంచి రెండువందల యాభయ్ రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన యాభయ్ వారికి వాపసు చేయమని క్లర్కుకు చెప్పాడు. అతగాడు అందులో ఇరవై నొక్కేసి మిగిలిన ముప్పై ఆ ముగ్గురికీ తలా  పది చొప్పున  తిరిగిచ్చేశాడు.
అంటే ఏమిటన్న మాట.  ముందు ఇచ్చిన వందలో పది రూపాయలు వెనక్కి వచ్చాయి.  వందలో పది పోతే తొంబై చొప్పున  ముగ్గురూ హోటల్ కు రెండువందల డెబ్బై రూపాయలు చెల్లించినట్టయింది.  క్లర్కు కొట్టేసిన ఇరవైతో కలిపితే ఆ మొత్తం రెండువందల తొంబై. మరి  మిగిలిన పది రూపాయలు ఏమయిపోయినట్టు చెప్మా!
జవాబు చెప్పగలిగినవారికే ఆ పది రూపాయలు.  (18-02-2012)

16, ఫిబ్రవరి 2012, గురువారం

గాభరా



గాభరా



భార్య వంట చేస్తుంటే మొగుడు హడావిడిగా వొంటి౦ట్లోకి వచ్చాడు.
‘అదేమిటి పోపులో అన్ని మిరపకాయలు వేశావు. జాగ్రత్త! పేలి మొహం మీద పడేను సుమా!
‘అదిగో ఓ పక్క నేను చెబుతున్నా నువ్వు  వినడం లేదు.  ఒక్కసారి అంత నూనె పోశావు. పోపు మాడి వూరుకుంటుంది.  స్టవ్ తగ్గించు. బాగా తగ్గించు. వాటిని కలయ తిప్పు. గరిటేది? కనబడి చావదేమి? నేను చెబుతుంటే  అసలు నీకు వినబడుతోందా లేదా?
‘నువ్వెప్పుడూ ఇంతే. వంట చేస్తుంటే నా మాట చెవిన పెట్టవు కదా!
‘సరే కొద్దిగా ఉప్పు తగిలించు. అదెప్పుడూ మరచిపోతూనే వుంటావు. ఇంతకీ ఉప్పెక్కడ? కొద్దిగా వెయ్యి. వేసి గరిటతో తిప్పు. తిప్పు. తిప్పమన్నానా!. తిప్పమంటే అలా చూస్తావేమిటి?’
మొగుడి అఘాయిత్యం చూసి భార్యకు వొళ్ళు మండింది. అతగాడి వంక  తీక్షణంగా చూసింది.
‘ఏమంటున్నారు మీరు. ఈ మాత్రం వంట చేయడం నాకు రాదా. కాపురానికి వచ్చినప్పటినుంచి చేస్తున్న వంటే కదా. పక్కన నిలుచుని  ఏమిటీ సతాయింపు?’
‘ఇదిగో ఈ మాట అనాలనే  ఇలా చేసింది. నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుని నువ్వు చేసే సతాయింపు కంటే ఇదేమన్నా ఎక్కువా చెప్పు.’
(15-02-2012)  
(Note: Courtesy cartoonist).

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది



బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది  

వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఇదిగో ఈ ఇంటర్వ్యూ.
ప్రసిద్ధ రచయిత శ్రీ  మల్లాది వెంకట కృష్ణమూర్తి సంపాదకత్వంలో ఆరేళ్ళ క్రితం  (19-02-2006) ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com) అనే వెబ్ పత్రికలో శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన  ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నాకు మాత్రం అదే తొలిసారి. బహుశా  ఆఖరుసారి కూడా. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్  లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్  శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. ఇన్నేళ్ళ తరువాత దేనికోసమో వెతుకుతుంటే అదిప్పుడు నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా ఈ బ్లాగులో వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు (11-02-2012)


ఇంటర్వ్యూ కు ముందు శర్మ గారి  ఉపోద్ఘాతం :
తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 డిసెంబర్ లో    కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర  దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు – రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.
సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవాలుగా – మదర్  థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొంటారు. మదర్  థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా భద్రాచలం అడవుల్లో రాజీవ్ గాంధీతో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది.ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971  లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా చేరి  1975  దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987   దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు.సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా  2004 దాకా కొనసాగారు. అప్పటినుంచి దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా  దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.
పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు  1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్ర జ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి  పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో కిందటేడాది ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఇక్కడ చదవండి – సంపాదకుడు.
హైదరాబాదులోని  ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్  వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను. ‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు – ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.
ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?
జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.
ప్ర) దాన్ని భయమంటారా?
జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.
ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?
జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.
ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?                   
జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం  మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు  మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా  వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఆ తరువాత పదేళ్లకు సెక్స్ అవసరం వుండదు.’  దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?
జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై  నుంచి  యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.
ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది?  
జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు  కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు.  విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం  ప్రధానం.
ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?
జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.
ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?
జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్స పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు.  చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.
ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి? 
జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్తానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే.
ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?   
జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు.
ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?
జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను.  నాకు ఏడుగురు అక్కయ్యలు.  వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ  గమనించాను.  నాకు ఇరవై  ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి  ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.
ప్ర) వివాహ వేడుక లోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా? 
జ) బాపు తీసిన ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది.  నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి  లోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.
ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?
జ) మేం వద్దనుకున్నది ఆ ఆచారాలు, వ్యవహారాలనే కాని మొత్తంగా పెళ్లాన్నే కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు – ఉపాధి కావాలి’ అనీ అన్నాను. అప్పట్లో మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో  ఇలాటి భావాలు రావడానికి అదే కారణం. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు.  నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.
ప్ర) ప్రేమ ప్రణయం – వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?    
జ) వృత్తి రీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ.

“రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.
తెల్లారి చూస్తే అది నువ్వే”

“ఊహల్లో నేనూ
వూహించుకుంటూ నువ్వూ
వర్తమానాన్ని నష్ట పోతున్నాం”

వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.
ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి?  
జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడాలేదు. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి. మార్పు సహజమే. ఒప్పుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడ ధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది  అంటే –  పెండ్యులం  అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”
అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. (19-02-2006)

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మూడు మాటలు

మూడు మాటలు

విశ్వాసము


దేవుడిని విశ్వసిస్తామని చెప్పేవారేకాని నిజంగా మన ప్రార్ధనలకు మెచ్చి భగవంతుడు కోరిన వరాలు  ఇస్తాడని నమ్మేవాళ్ళు తక్కువే. విశ్వాసమనేది సంపూర్తిగా వుండాలి కాని అరకొరగా వుండకూడదని బోధించే చిన్న నీతికధ ఇది.
ఒక వూరిలో వానలు పడక పంటలు ఎండిపోయి వూరిజనం అల్లాడిపోతున్నారు. వూరి నడుమ వున్న గుడి వద్ద ఒక రాత్రంతా భజనలు చేస్తే వర్షాలు కురుస్తాయని ఎవరో చెప్పగా విని పిల్లాపీచుతో సహా వూళ్ళో  వాళ్లందరూ కట్టగట్టుకుని గుడి వద్దకు చేరుకున్నారు. ఒక పిల్లవాడు గొడుగుతో సహా వచ్చాడు. దేవుడి మీద, చేసే భజన మీదా అతడికున్న విశ్వాసం అది. నిజమయిన  విశ్వాసం అంటే కూడా అదే.

నమ్మకము

పసి పాపల్ని ఆడించడానికి తలిదండ్రులు ఒక్కోసారి వారిని గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ  వుంటారు. అలా చేస్తున్నప్పుడు పాప పడి పడి నవ్వుతుందే కాని కింద పడేస్తారేమోనని ఏమాత్రం భయపడదు. పడిపోకుండా తల్లీ తండ్రీ తనను భద్రంగా పట్టుకుంటారని ఆ పసి పాప నమ్మకం. నమ్మకం అంటే అదే.

ఆశ


ఎక్కాల్సిన సిటీ బస్సు  సకాలానికి వస్తుందనీ, ఆటో వాడు  ఎగస్ట్రా డబ్బులు అడక్కుండా రమ్మనగానే వస్తాడనీ సగటు జీవులు  ఆశ పడడంలో తప్పులేదు. ప్రతి రోజూ రాత్రి పడుకోబోయేముందు రేపు చేయాల్సిన పనులు గురించి ఆలోచించడం కూడా అత్యాశేమీకాదు. బతుకే  క్షణికమనీ,  పొద్దున్నే లేచి సూర్యోదయం చూడగలగడం అన్నదే  అనుమానమనీ ఖచ్చితంగా తెలిసి కూడా మరునాటి గురించి ఆలోచించడం మానవ సహజం. దీన్నే ఆశ అంటారు. నిజమయిన ఆశ ఇదే. కాకపొతే అలాటి ఆశ చచ్చినా దురాశ పుట్టినా ఆ మనిషి పుట్టుకే  వ్యర్ధం. (10- 02-2012)