27, మార్చి 2011, ఆదివారం

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

(  మార్చి27 వ తేదీ 'సూర్య ' దినపత్రికలో ప్రచురితం)


కాల్లో ముల్లా? కంట్లో నలుసా? ముందు దేన్ని తీయాలన్న శషభిషలో వున్నట్టుంది ఢిల్లీ లో కాంగ్రెస్ అధినాయకత్వం.
ప్రత్యేక రాష్ట్ర వాదం, సమైక్య వాదం ఒక సమస్య అయితే, సీమాంధ్ర లో జగన్ దూకుడుకు కళ్ళెం వేయడం యెలా అన్నది పార్టీకి మరో జటిల సమస్య. ఈ రెంటికీ, ‘పైపూత’ వైద్యంతో చికిత్స చేయాలని చూసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ రెండు సమస్యల విషయంలో అధిష్టానానికి పూర్తి అవగాహన వుందని పార్టీ స్తానిక నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ఎవరికీ విశ్వాసం కుదరడం లేదు. అధిష్టానవర్గం అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ ఢిల్లీ నుంచి తరచూ వెలువరించే ప్రకటనలు, హెచ్చరికలు గమనిస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్తితి తెలిసిమాట్లాడుతున్నారని అనుకోవడానికి నమ్మకం చిక్కడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు గత ఏడేళ్ళకు పైగా కాంగ్రెస్ అధికారంలో వున్నప్పటికీ – ‘వున్నామా లేమా!’ అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన దుస్తితిలో పడిపోవడం ఆ పార్టీ దురదృష్టం. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం చెలాయిస్తూ కూడా పార్టీని మరింత పటిష్టం చేసుకోవడం సంగతి అటుంచి, చీలికలు పేలికలు కాకుండా చూసుకోలేని పరిస్తితి. రెండేళ్లక్రితం వరకు ఇది కలలో కూడా వూహించలేని విషయం. ఈ పరిణామం పూర్తిగా స్వయంకృతం. దిద్దుబాటు చర్యలపేరుతో ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయే కానీ కలసి రావడం లేదు. ముఖ్యమంత్రుల మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ పర్యవేక్షకుల మార్పు ఏదీ కూడా పరిస్తితులను సమూలంగా మార్చలేకపోతున్నాయి. దీనికి కారణం అధిష్టానానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పట్టు సన్నగిల్లడమయినా కావాలి లేదా తాత్సార ధోరణి ఒక్కటే సమస్యలను పరిష్కరించగలదన్న అభిప్రాయానికి వచ్చయినా వుండాలి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తగు వ్యవధానం వున్నప్పుడు పరిష్కారాలను వాయిదా వేస్తె వచ్చే నష్టం ఏముంటుందన్న ధీమా అయినా ఈ అలసత్వానికి కారణం కావచ్చు.

భవిష్యత్తులో ఎన్నికల పరంగా దీనికి భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తే అది ఆ పార్టీకి జరిగే నష్టంగా భావించి సరిపుచ్చుకోవచ్చు . కానీ, కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న ఈ వేచిచూసే సాచివేత వైఖరి వల్ల వాస్తవంగా నష్ట పోతున్నది మాత్రం రాష్ట్ర ప్రజానీకం. గెలిపించి గద్దె మీద కూచోబెట్టిన పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పరిపాలనను పక్కనబెడితే ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరబాటే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైన వ్యవధి వుంది కదా అన్న ధీమాతో రాష్ట్రాన్ని, రాష్ట్ర సమస్యలను ఇలానే నిర్లక్ష్యం చేస్తూ పోతే, పర్యవసానాలు పార్టీ భవిష్యత్తును మరోరకంగా నిర్దేశించే ప్రమాదం వుంది. ఓటమి’ అనాధ లాటిది. పరాజయానికి ఎవ్వరు బాధ్యత తీసుకోరు. అదే విజయం అయితే – ఆ గెలుపుకు కారణం ‘నేనంటే నేనని’ అనేకమంది సిద్ధం అవుతారు. శాసన మండలికి శాసన సభ నుంచీ, స్తానిక సంస్తల నుంచీ జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ సూత్రాన్నే మరోమారు తేటతెల్లం చేసాయి.

శాసన సభ నుంచి జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీల అధినాయకత్వాలే విజయం కోసం నానా పాట్లు పడ్డాయి. వున్న బలం గెలుపుకు చాలకపోయినా, లేని బలంతో కొత్త బలుపును నిరూపించుకోవాలని అన్ని పార్టీలు సిద్ధాంతాలను, సూత్రాలను నిస్సిగ్గుగా గాలికి వొదిలేశాయి. సాంకేతికంగా, చట్టపరంగా కొన్ని పార్టీలు గెలిచివుండవచ్చు. మరికొన్ని వోడిపోయి వుండవచ్చు. కానీ, నైతికంగా చూసినప్పుడు అన్నీ వోడిపోయాయనే చెప్పాలి.

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలుచేశాయి. గెలుపే ధ్యేయంగా సాగిన ఈ ఎన్నికల్లో రాజకీయాలకు అంటిన మకిలి ఓ పట్టాన వొదలడం కష్టం. శత్రువు శత్రువు మిత్రుడు అన్న రాజకీయ నీతిని అడ్డం పెట్టుకుని తొక్కని అడ్డదోవంటూ లేదు. పొత్తులు పెట్టుకోవడంలో, పోటీ పెట్టడంలో ఎత్తులు,పై ఎత్తులు, విచ్చలవిడిగా సాగిన ధన ప్రవాహం, ఎవరు యే పార్టీ అన్న దానితో నిమిత్తం లేకుండా గెలుపే పరమావధిగా బట్టబయలయిన స్తానిక నేతల వ్యవహారం - రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని కొంతవరకు ఆవిష్కరించగలిగాయి. అంతేకాదు, ఈ రెండు ఎన్నికల్లో తమ నిర్వాకానికి ఆయా పార్టీలు ఇచ్చుకుంటున్న సంజాయిషీలు చూస్తుంటే, ఒకే నాలుకతో రెండు రకాలుగా యెలా మాట్లాడవచ్చో సులభంగా బోధపడుతుంది.

ఎదురయిన పరాభవాన్ని సమర్ధించుకుంటూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు – ప్రజాభిప్రాయాన్ని మదింపు వేసుకోవడంలో వారి అభిజాత్యానికి అహంకారానికి అద్దం పడుతున్నాయి. ఓటమి నుంచి హుందాగా గుణపాఠం నేర్చుకోవడానికి బదులు అదొక ఓటమే కాదనే పద్దతిలో సమర్ధించుకునే క్రమం ప్రజల్లో వారిని పలుచన చేస్తోంది. ఉదాహరణకు కడప జిల్లానే తీసుకుంటే, అక్కడ జరిగిన ఎన్నికల్లో సర్వశక్తులు వొడ్డి పోరాడింది కాంగ్రెస్ పార్టీయే. ఇంచార్జ్ మంత్రితో సహా జిల్లాకు చెందిన మంత్రులందరినీ సమరాంగణంలో మోహరించినా, సాక్షాత్తు వైయస్సార్ సోదరుడు, రాష్ట్ర మంత్రి వివేకానంద రెడ్డి జిల్లాలోనే మకాం వేసి కాపుకాసినా, చివరాఖరుకు కాంగ్రెస్ కు జన్మతః విరోధి అయిన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయినా, - పది వోట్ల తేడాతో ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయిన విషయాన్ని తేలిగ్గాతీసుకుంటున్న తీరు ఆక్షేపణీయం. కింద పడ్డా పైచేయి మాదే అన్న రీతిలో – కడప జిల్లాలో కాంగ్రెస్ పరిస్తితి పటిష్టంగానే వుందని బీరాలు పలకడం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా శోభ స్కరం రం కాదు. ఎన్నికల్లో డబ్బు స్వైరవిహారం చేయడం వల్లనే తమ అభ్యర్ధులు ఓడిపోయారంటూ అధికార పార్టీ చేస్తున్న వాదనలకు సయితం సరయిన పునాదులు లేవు. పైగా అలాటి ఆరోపణలు అధికారంలో వున్న పార్టీ చేస్తే నమ్మేవారు వుంటారని అనుకోవడాన్ని మించిన భ్రమ మరోటి వుండదు. ఈ ఎన్నికల్లో వోటు హక్కు కలిగిన స్తానిక సంస్తల ప్రజాప్రతినిధుల పదవీ కాలం మరికొద్ది నెలల్లో ముగియనున్నందున, జగన్ వర్గం డబ్బు వెదజల్లి వారిని టోకుగా కొనుగోలుచేశారని, అలాటి టక్కుటమార విద్యల్లో పట్టాలు పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులే ఆరోపించడం మరింత విడ్డూరంగా వుంది. ఇలా ఓటమిని సమర్ధించుకునే నాయకులు, శాసన సభ నియోజకవర్గం నుంచి విధాన మండలికి అంతకు కొద్ది ముందు జరిగిన ఎన్నికల విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారు. సొంత పార్టీ వారే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ కారణంగా, విధానమండలి ప్రస్తుత ఉపాధ్యక్షుడే ఓటమి అంచువరకు వెళ్లి , ప్రాధాన్యతా వోట్ల పుణ్యమా అని గట్టెక్కిన సంగతి వారు వీలునుబట్టి మరచిపోయినా జనాలకు మాత్రం ఇంకా గుర్తుంది. సభలో వున్న సంఖ్యాబలాన్ని బట్టి కాకుండా మిగులు ఓట్లకు అదనపు ఓట్లను రాబట్టుకుని మరో అభ్యర్ధిని అదనంగా గెలిపించుకోవడం అన్నది చట్టబద్ధమే అయినా, అది అనైతిక విధానాలకు మార్గం వేసే ప్రమాదం వుందన్న విషయం గుర్తెరిగి కూడా ఆ మార్గాన్నే ఎంచుకోవడం కాంగ్రెస్ వారికే మింగుడు పడలేదు. పార్టీ అధికార అభ్యర్ధి మహమ్మద్ జానీ గెలుపోటముల మధ్య చాలాసేపు కొట్టుమిట్టాడిన వైనం , ఎన్నికల ఎత్తుగడలు కొండొకచో ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం వుందనడానికి మరో ఉదాహరణ. ప్రాధాన్యతా ఓట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి రాజకీయ చతురతను అద్భుతంగా ప్రదర్శించి, నిలబెట్టిన అభ్యర్ధుల నందరినీ గెలిపించుకోగలిగారన్న ఆనందం అధికార పార్టీకి ఆవిరై పోయింది. పోతే, కోడింగ్ విధానం ద్వారా ‘రహస్య బాలెట్’ లోని రహస్యాన్ని బట్టబయలుచేసే వ్యవహారాలు ఎంతవరకు చట్ట సమ్మతం అన్నదానిపై కూడా సమగ్రమయిన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు బయటపెట్టాయి. అదేవిధంగా, మరికొద్ది కాలంలో పదవీకాలం పూర్తయ్యే తరుణంలో స్తానిక సంస్తల ప్రజా ప్రతినిధులను ఓటర్లుగా పెట్టి ఎన్నికలు జరిపే బదులు, వాటికి కొత్తవారు ఎన్నికయినదాకా ఆగి ఈ ఎన్నికలు నిర్వహించి వుంటే సరిపోయేది. అమ్ముడుపోయారన్న అపవాదు ఇప్పుడున్న వారికి మిగిలేది కూడా కాదు.

ఏదయితేనేం –ప్రత్యక్ష ప్రజాతీర్పు కాకపోయినా –శాసన మండలికి జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయపార్టీల బలాబలాలను కొంతమేరకయినా ప్రజలముందు వుంచాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు తమకు ముందు ముందు రాజకీయంగా మేలుచేస్తాయని తెలుగు దేశం పార్టీ నమ్మడానికి ఈ ఫలితాలు దోహదం చేసాయి. పసికూనగానే వున్న యువనేత పార్టీ నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనకపోయినా తన అభ్యర్ధులను స్వతంత్రులుగా నిలబెట్టి కాంగ్రెస్, టీ.డీ.పీ. లకు దీటుగా, వాటితో సమానంగా ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును ప్రదర్శించి చూపింది. రానున్న కాలంలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి తగిన ఊతం ఇచ్చాయి. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే -ఇంకా రెండేళ్లు అధికారం లో వుంటామన్న ఆశ మినహా భవిష్యత్తు అంధకార బంధురమే అనిపించేలా వున్నాయి ఈ పార్టీ సాధించిన విజయాలు.
అయితే, అఖిలభారత స్తాయిలో చూసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమయిన రాష్ట్రం. ఎందుకంటె, ఈ రాష్ట్రం నుంచి గెలిచిన పార్టీ ఎంపీలే కేంద్రంలో యుపీఏ ప్రభుత్వానికి ప్రాణ వాయువు అందిస్తున్నారు. కానీ, వారంతా ప్రాంతీయ ప్రాతిపదికపై రెండుగా చీలిపోయి కునారిల్లుతు వుండడం పార్టీ అధిష్టానానికి కలిసి వచ్చింది. మంత్రి పదవుల పంపిణీలో సంఖ్యాబలానికి తగ్గ వాటా దక్కకపోయినా, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ లలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినా, అభివృద్ధి పధకాల మంజూరులో ఆంధ్ర ప్రదేశ్ కు చిన్న పీట వేసినా ఎవరూ కిమ్మనలేని పరిస్తితి.

ప్రాంతీయ విభేదాలతో సతమవుతూ, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ నలుగురిలో నగుబాటు అవుతున్న సొంత పార్టీ ఎంపీల వ్యవహారం నానాటికి తీసికట్టు చందంగా తయారవుతూ వుండడంతో, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు కొత్త కాని సరికొత్త పార్టీ ఇంచార్జ్ - గులాం నబీ అజాద్ సర్దుబాటు చర్యలకు నడుం బిగించారు. ఆదిలోనే హంసపాదు మాదిరిగా, ఇరుపక్షాలను ఒక్క చోట చేర్చి మాట్లాడడం ‘జాదూ సామ్రాట్’ గా పేరున్న అజాద్ కు కూడా సాధ్యం కాలేదంటే పరిస్థితులు ఎంతగా ముదిరి పోయాయో అర్ధం అవుతుంది. కలివిడిగా కాకపోయినా, విడివిడిగా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ ఎంపీలతో ఎట్టకేలకు సమావేశం కాగలిగానన్న తృప్తి మాత్రం ఆయనకు మిగిలింది. తెలంగాణా మినహా మరే ఇతర ప్రతిపాదన కూడా తమకు ఎంత మాత్రం సమ్మతం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పామని తెలంగాణా ఎంపీలు తరువాత బయట మీడియాతో బల్లగుద్ది మరీ చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు మాత్రం కొంత లౌక్యం ప్రదర్శించారు.. తెలంగాణా ప్రస్తావనే రాలేదని వాళ్ళు స్పష్టం చేసారు. అయితే, రాష్ట్రం లో పార్టీ పరిస్తితి ఆశాజనకంగా లేదన్న విషయాన్ని ఆజాద్ చెవిన వేసారు.

వరసగా రెండు పర్యాయాలు అధికార పీఠం ఎక్కిన యుపీఏ సర్కారుకు మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటె, రాహుల్ ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలన్న సోనియా అభిలాష నెరవేరాలంటే, రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే పార్టీ ఎంపీల సంఖ్య ఇతోధికంగా వుండేట్టు చూసుకోవాలి.కనీసం ఇప్పటికంటే తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఈ దృష్ట్యా అయినా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి వుంటుంది. జగన్ పార్టీ విషయంలో తాత్సారమయినా, టీ. ఆర్. ఎస్. విలీన ప్రతిపాదన అయినా ఈ కోణం నుంచి ఆలోచించి చేస్తున్నవే అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వుంది. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లుతాయో లేదో ఓ మేరకు తెలిపే అవకాశం వుంది. అందుకే, తెలంగాణా అయినా, జగన్ వ్యవహారం అయినా అప్పటివరకు ఇంత తాత్సారం.(26-03-2011)



9 కామెంట్‌లు:

Pavani చెప్పారు...

శ్రీనివాసరావు గారు, ఇదే ప్రశ్న నేను ఇంతకుముందు కూడా బ్లాగుల్లో కొంతమందిని అడిగాను..అసలిప్ఫుడు కాంగ్రెస్ కాని, కేంద్ర ప్రభుత్వం కాని ఏమి చెయ్యాలని మీరనుకుంటున్నారు..తాత్సారం, సాచివేత ఇలాంటి మాటలు పక్కనపెట్టి అసలు వాళ్ళేమి చేస్తే రాష్ట్రం సుఖ సంతోషాలతో కళ కళ లాడుతుందో చెప్పగలరా?

1. తెలంగాణా ఇచ్చారనుకుందాం..అప్పుడు కొస్తాంధ్రా-రాయలసీమ వాళ్ళు సంతోషంతో తలూపుతారా?
2.తెంగాణా ఇవ్వరనుకుందాం..అంటే ఇప్పటి పరిస్తితే..ఇదెలాగు బావోలేదని తెల్సు.
3. చర్చలకు పిలిచి సంధి కుదర్చటం చెయ్యాలా..ఇది మంచి ఆలొచనే.కాని ఎవరొస్తున్నారు సార్ చర్చలకు.అన్ని పక్షాలు కలిసి కూర్చోని మాట్లాడుకోని ఒక డెసిషన్ కి వచ్చే పరిస్తిది వుందా? తెలంగాణా ఇస్తున్నామని చెప్తే తప్ప చర్చలకే రామని ఒకరు..ఇస్తే రామని ఇంకొకరు.
రాష్ట్రంలో నాయకులు తమలో తాము కొట్టుకొవటం మానేసి,కాస్త బుర్ర పెట్టి ఒక సొల్యూషన్ వెదుకుదామని నిబధతతో వుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం చెయ్య కలిగేది సున్నా.! ఊరికే తేలిక కాబట్టి తిట్టుకోవటం తప్ప మన లాంటి పెద్ద రాష్త్రం మీద కేంద్రం సొంత డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ప్రస్తుతం లేవు. చిదంబరం గారు తెలుసో తెలియకో ఒకసారా తప్పు చేసి నాలిక్కర్చుకున్నారు.

We the people of AP and the leaders of AP are chiefly responsible for our own fate on this. We should lead the way and center will act as a facilitator. Those days of strong center are gone for good. It is too naive to think our leaders abide by the decisions of the center or center has the capability to thrust its will on 8.4 cr population(not 10 cr as some people would like to quote as AP population).
In case of Jagan..that is an internal issue to Congress party..I personally believe they under estimated Jagan.Again that is their internal party problem which they have to resolve among themselves.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@పావని లేదా @పవని - ఈ విషయంలో తుది నిర్ణయం కేంద్రానిదే. అది రాష్ట్ర విభజన కావచ్చు లేదా సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ కావచ్చు.తాత్సారం వల్ల నష్టపోతున్నది మాత్రం ఇరు ప్రాంతాల ప్రజలే.-భండారు శ్రీనివాసరావు (చక్కటి అభిప్రాయం తెలిపారు. కానీ వివరంగా సమాధానం ఇవ్వడానికి మెయిల్ అడ్రెస్ ఇస్తే బాగుండేది)

Pavani చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Pavani చెప్పారు...

oh..silly me! Lol

అజ్ఞాత చెప్పారు...

మొయిలీ పోయే , ఆజాద్ వచ్చే డుమ్ డుమ్ డుమ్ డుమ్

రెడ్డొచ్చె మొదలెట్టు లాగా ఆజాద్ వచ్చాడు, మళ్ళీ కొత్తగా చర్చించండి అనడం (ఆయనకసలు సమస్యేమిటి? అని తెలియనట్టు!), ఆటావిడుపు, నాన్చే టెక్నిక్ మాత్రమే! ఏదో పత్రికల వారు అవసరంకొద్దీ ఆజాద్ ఏదో పేద్ద పుడంగి అని పొగిడేస్తుంటారు గాని, J&K ముఖ్యమంత్రిగా వుండలేక దిగిపోయి ఇలా థర్డ్ పార్టీగా ప్రాబ్లం సాల్వింగ్ పనుల్లో కుదిరిపోయారన్నది మాత్రం వాస్తవం. ఈయనతో కొన్నేళ్ళు లాగిచ్చి, మళ్ళీ ఏ తివారినో, ముఖర్జీనో వచ్చి మళ్ళీ 'పాప ఎందుకు ఏడుస్తోంది?' అని అడగక మానరు. :)

అజ్ఞాత చెప్పారు...

కేంద్రం చేయాల్సిన పనులు:
1)రాష్ట్రపతి పాలన విధించి, ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొడుతున్న అలగా నాయకులను విచారణ లేకుండా జైల్లో 2-3ఏళ్ళు తోయడం
2) ఉస్మానియా యూనివర్సిటీని నడిబొడ్డునుండి, నాలుగు దిక్కుల్లో పొలిమేరల్లోకి తరలించేయడం
3) పొలిటీషియన్స్ పై ఆదాయపు పన్ను శాఖతో దాడులు చేయించడం, దండుకున్న ఆస్థులను వెలికి తీయించడం.

Pavani చెప్పారు...

Snkr గారు,
1. మీ మొదటి సూచనని అమలు చెయ్యటమంటే--ప్రతి నాయకుడు వాళ్ళని వాళ్ళే జైల్లో పెట్టేసుకొవటం

2.రెండొ దాన్ని చూస్తే--ఒకే చోట ఉన్న ఉద్యమకారులో, గూండాలో,సమర వీరులో -వాళ్ళని నలు చెరుగులా ప్రభుత్వమే విస్తరింపచెయ్యటం

3. మూడోది..మొదటి దాని లాంటిదే.అందరూ దొంగలే అయినప్పుడు..ఎవరి మీద ఎవరు దాడి చెయ్యలి.

ఏమో నబ్బా ఒక్కటి కూడా practical గా లేదు.

అజ్ఞాత చెప్పారు...

పైకి అలా అనిపిస్తుంది. కొద్దిగా లోతుగా ఆలోచిస్తే, ప్రస్తుతం వున్నదానికన్నా పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక ఇంతకన్నా చెప్పలేనబ్బా! :)

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాస రావు గారు,
ఇన్ని విషయాలు మీకే తెలిస్తే కాంగ్రెస్ వారికి తెలియకుండా ఉంటాయా? వారికి తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేక ఉన్నారు? ముఖ్యంగా జగన్ విషయం లో ఎమీ చెయగలిగారు? ఎందుకు గమ్ముగా ఉన్నారు అనే అసలు విషయం మీద మీరు వ్యాసం రాస్తే చదవాలని ఉంది.

*తాత్సార ధోరణి ఒక్కటే సమస్యలను పరిష్కరించగలదన్న అభిప్రాయానికి వచ్చయినా వుండాలి.*
కేంద్రంలో గాని రాష్ట్రం లో గాని ఈ సారి అధికారంలో వచ్చిన తరువాత తాత్సారం చేయకుండా వీరు చేసినదేమైనా ఉందా? ఇంత తాత్సారం చేస్తున్నా ఏ పత్రికవారు కూడా మన్మోహన్ గారిని పల్లెత్తు మాట అనరు .
అదే పి.వి. గారి విషయం లో ఆయనని మౌనముని, నిర్ణయాలు తీసుకోకుండా వాయిదాలు వేస్తాడని ఆయన మీద పత్రికల వారు చాలా జోక్స్ రాసేవారు. వాస్తవం గా పి.వి. గారిలా నిర్ణయాలు తీసుకొని అమలు జరిపిన ప్రధానులు అరుదు. ఉదా|| కాష్మీర్ లో ఎన్నికలు, పంజాబ్ ఉగ్రవాద సమస్య పరిష్కారం మొదలైనవి రాస్తే ఎన్నో వస్తాయి.కాని మీడీయా ఆరోజుల్లో అతనిని విలువ తగ్గించటానికి, నవ్వుల పాలు చేయటానికి ఎంత చేయాలో మీడీయా అంతా చేసేది. అదే మన్మోహన్ గారు కీలక నిర్ణయలు తాత్సారం చేస్తున్నా మీడీయా ఒక్క మాట ఎందుకు అనదు? మీకు తెలిస్తే ఒక టపా రాసేది?

Srinu