వినదగునెవ్వరు చెప్పిన –భండారు శ్రీనివాసరావు
రహదారులన్నీ నున్నగా ఎలాటి ఎగుడుదిగుళ్ళూ లేకుండా వుంటే చూడడానికి చాలా బాగా వుంటాయి. కానీ, వాటిపై వాహనాలు నడిపే వారు మంచి డ్రైవర్లుగా రూపుదిద్దుకోవడం కష్టం. అలాగే ఆకాశం ప్రశాంతంగా నిర్మలంగా వున్నప్పుడు విమానాలు నడిపే పైలట్లు చక్కని నైపుణ్యం కలిగిన విమాన చోదకులుగా తయారు కాలేరు. సమస్యలు లేని జీవితం కూడా అలాటిదే. ఆవిధమయిన జీవితం గడిపేవారు శక్తి వంతమయిన వ్యక్తిత్వం కలిగిన వారు కాలేరు. సమస్య వున్న చోటే అవకాశం వుంటుంది. దాన్ని వొడిసి పట్టుకోగలిగిన వారే విజయాలు సాధించగలుగుతారు.
జీవితంలో అన్నింటికన్నా పెద్ద భ్రమ ఏమిటంటే- ఇవాల్టి కంటే రేపు ఇంకా ఎక్కువ తీరుబడి వుంటుందని అనుకోవడం. చేతిలోవున్న ఐస్ క్రీం - కరిగి పోవడానికి ముందు తిన్నవాడే ఉత్తముడు.
మరుగుతున్న నీళ్ళల్లో మన ప్రతిబింబాన్ని చూడలేం. ఆలాగే, ఆగ్రహంతో వూగిపోయే వ్యక్తి వాస్తవాన్ని గ్రహించే పరిస్తితిలో వుండడు.
ఎవరో మెచ్చుకుంటారనో చప్పట్లు కొడతారనో ఏపనీ చేయవద్దు. జీవితం అన్నది జీవించడానికి కానీ మరెవరి మెహర్బానీకో కాదు. నలుగురిలో వునికిని చాటుకోవాలని అనుకోకూడదు. నలుగురిలో లేకపోయినా ఆ నలుగురూ మనం లేని విషయాన్ని గుర్తెరిగేలా మన వ్యక్తిత్వం వుండాలి.
జీవితంలో కెల్లా అత్యంత గొప్ప రోజు ఏదో తెలుసా! ఈ జీవితం నాదే అని ఎవరికి వారు నిర్ణయించుకున్న రోజే అతి మంచి రోజు. అంతేకాదు. నాది అనుకున్న జీవితాన్ని అతి గొప్పగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా నాదే అని గట్టిగా నిశ్చయించుకున్న రోజే భలే మంచి రోజు.
అభద్రతాభావం నుంచి పుట్టేదే అసూయ. సత్తా వున్న మనిషి దాన్ని దరిచేరనివ్వడు.
ప్రతి రోజూ మంచి రోజని అనుకున్నట్టయితే, ‘రేపు’ అనే రోజుని భగవంతుడనేవాడు అసలు సృష్టించేవాడు కాదేమో. అందువల్ల, ఆశించిన విధంగా ఈ రోజు గడవకపోతే పుట్టి మునిగేదేమీ వుండదు. రేపనేది వుందన్న ఆసతో ఆశ తో ఈ రోజును గడిపేయాలి.
గెలుపు వైపు ప్రయాణించే మార్గంలో రెండే రెండు అడ్డంకులు తగులుతాయి. ఒకటి నిరుత్సాహం. రెండోది అపజయం గురించిన భయం. ఈ రెంటినీ అధిగమిస్తే విజయం వచ్చి వొళ్ళో వాలుతుంది. (17-03-2011)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి