15, మార్చి 2011, మంగళవారం

బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

(మార్చ్ 15వ తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.


రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన ఇంగ్లీష్ ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు ‘మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు’ అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.


పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశన స్తలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, స్తలాలకు ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు ఇళ్ళ స్తలాలు అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు స్తలాలను పేదవారికి ఇళ్ళ స్తలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ స్తలాల కేటాయింపు అనేది ‘అదనపు పెద్దరికాన్ని’ కట్టబెట్టింది. కేటాయించిన స్తలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత ‘పక్కాగా’ అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో ‘పక్కా ఇళ్ళ పధకం’ అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రదానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈ నాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు – లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం


ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి ‘తిలాపాపం తలా పిడికెడు’ చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.


సరే! ఆరోపణలంటే గిట్టని వారు చేస్తారని కొట్టిపారవేయవచ్చు. కానీ, సాక్షాత్తూ శాసన సభకు సమర్పించిన ప్రభుత్వ నివేదికలోనే కళ్ళు చెదిరే కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నప్పుడు కాదనడం ఎలా! రాష్ట్రంలో పేద కుటుంబాలకోసం ప్రభుత్వం – అది యే పార్టీ అయినా కానీ - 1982 నుంచి ఇప్పటివరకు నిర్మించి ఇచ్చిన ఇళ్ళ వివరాలు ఈ నివేదికలో పొందుపరిచారు. పేద వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే మహత్తర కార్యక్రమం తమ హయాం లోనే బాగా ఊపందుకుందని గొప్పలు చెప్పుకోవాలన్న తాపత్రయంతోనో ఏమో కానీ – సంబంధిత మంత్రిగారు తమ నివేదికలో సంవత్సరాలవారీగా లెక్కలు ఉదహరిస్తూ – రాష్ట్రంలో ఇంతవరకూ అక్షరాలా ‘తొంభయి తొమ్మిది లక్షల పందొమ్మిదివేల నూట నలభయ్ తొమ్మిది’ ఇళ్ళ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో పేదకుటుంబాల సంఖ్య కొంచెం అటూఇటూగా రెండు కోట్లు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారికి కట్టించి ఇచ్చిన ఇళ్లు ఇంచుమించు ఒక కోటి. ఈ నెలాఖరుకల్లా మరో ఎనభయ్ వేలు పూర్తికాగలవని అంచనా. రెండుకోట్ల పేద కుటుంబాలలో దాదాపు సగానికి తలదాచుకునే గూడు అమరిందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక ఇందిరమ్మ పధకం కింద మరో 30 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న ప్రభుత్వ హామీనీ, మొన్నటికి మొన్న రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన అర్జీలను కూడా కలుపుకుంటే మరో పదిహేను లక్షల ఇళ్లూ – అన్నీ కూడుకుంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండువంతుల కుటుంబాలకు ఏదో ఒకవిధమయిన గూడు అమరుతున్నట్టే అనుకోవాలి. అయినా ప్రభుత్వం ద్వారా అందే పేదల ఇళ్లకు ఏటేటా గిరాకీ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదని సర్కారు గణాంకాలే చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నామని ఓ పక్క గొప్పలు చెప్పుకుంటూ, మరో పక్క పేదల సంఖ్య యే ఏటి కాయేడు పెరిగిపోతున్నదని వెల్లడించే ఈ అంకెలు, సంఖ్యలు ప్రభుత్వాలకు యే మాత్రం శోభనివ్వవు.





అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని ‘భూ భాగోతంగా’ ముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండిన వాడు, కడుపు మండిన వాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే నిజమయిన పాలకుల అసలయిన కర్తవ్యం. (14-03-2011)



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

డిసెంబరు 9 ప్రకటన వచ్చినపుడు మొత్తం ఎం.ఎల్.ఏ లు అందరూ రాజీనామా చెసారు పార్టీలకు అతీతంగా. అందరికీ వ్యాపారాలున్నయా. మిగిలిన వారు సుముఖంగా వుంటే ఒకరిద్దరు అడ్డు పడితె ఆగిపోతుందా?.

అసలు హైదరాబాదు లో ఒక సమైక్య సభ ప్రశాంతంగా పెట్టుకోగలిగే వాతావరణం వుందా. అసలు తెలంగాణా వాడైనా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వుందా. అలాంటి పరిస్థితి రానంత వరకూ మీరు కబుర్లతో భరోసా ఎంత ఇచ్చినా నమ్మే స్థితి వుండదు. సెటిలర్స్ ఒక ఫోరం పెట్టుకోవాల్సి రావటం దేనికి సంకేతం, అది భయం చేత అని ఎందుకు అనుకోకూడదు?.