15, డిసెంబర్ 2010, బుధవారం

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

అద్దంలో మొహం ఎలా కనబడుతుంది?

ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.

మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.

అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.

పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.

నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏన్నర్ధం కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.

అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?

ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో మీడియా వీటికి మరింత ఊతం ఇస్తోంది.

నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాటి వొడిదుడుకులు కొత్తేమీ కాదన్నది ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకుల భావం. ఈరకమయిన తిరుగుబాటుదార్లు లోగడ ఎంతోమంది పార్టీని వొదిలిపెట్టి వెళ్లి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తమది బలుపుకాదు వాపు అని తెలుసుకుని మళ్ళీ పార్టీలో బుద్ధిగా చేరిపోయిన గతాన్ని గుర్తుచేయడం వారి వాదం లోని భాగం. కొత్తొక వింత అన్న చందాన జనం జగన్ ని చూడడానికి వెడుతున్నారని కొందరూ, గత ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ సభలకు వచ్చిన జనాలను గుర్తుచేస్తూ – అప్పుడేమి జరిగిందో ఇప్పుడూ అదే జరగబోతోందని మరికొందరూ, డబ్బులు వెదజల్లే స్తోమత వుండాలే కానీ ఈ మాత్రం జనం తమ సభలకూ వస్తారని ఇంకొందరూ తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న వాడినీ వేడినీ
మరో మూడేళ్ళు పైబడి కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అధికారం వున్నప్పుడు అంటిపెట్టుకు తిరిగే వీరవిధేయులు అది దూరం కాగానే అంత త్వరగానే దూరం జరుగుతారనే రాజకీయ ధర్మసూక్ష్మాలను జగన్ వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాసేవమీద కన్నా జగన్ కు ముఖ్యమంత్రి గద్దెపై యావ ఎక్కువన్నది వారు ఎక్కుబెడుతున్న విమర్శనాస్త్రాలలో ప్రధానమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరవాత వారసత్వంగా లభించాల్సిన ముఖ్యమంత్రి పదవిని తనకు దక్కనివ్వ లేదన్న అక్కసుతో, పార్టీ అధిష్టానంపై కక్ష కట్టి కొత్త పార్టీ పెట్టేందుకు జగన్ సిద్ధపడ్దాడన్నది ఆ బోంట్ల మరో ఆరోపణ. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమని గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని మరో పార్శ్వం. ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా కలయ తిరగడం వెనుక, పైకి కనబడని రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది జగన్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానానికి చేరవేసిన ఆంతరంగిక సమాచారం.

ఏతావాతా ఏమయితేనేమి – ఏడాది గడవకముందే ఈ ప్రచారం పనిచేసింది. జగన్ కూ, ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నడుమ దూరం పెరిగింది. వైఎస్సార్ జీవించి వున్నంతవరకు ఢిల్లీ నాయకులవద్ద ఆటలు సాగని వైఎస్ వ్యతిరేకులకూ, వైఎస్ హయాములో రాష్ట్ర వ్యవహారాలపై పట్టు కోల్పోయిన అధిష్టాన దేవతలకూ- వైఎస్ ఆకస్మిక మరణం ఒక మహత్తర అవకాశంగా దొరికింది. స్వతంత్ర భావాలుకలిగి, పిన్న వయస్సులోవున్న జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరో నాలుగేళ్ళు రాష్ట్రం వంక కన్నెత్తి చూసే అవకాశం, పెత్తనం చేసే సావకాశం వుండదనే వైఎస్ వ్యతిరేకుల మంత్రం అధిష్టానం పై పనిచేసింది. ఫలితం- అధికార పగ్గాలను రోశయ్యగారికి అప్పగించడం. తాత్కాలిక ఏర్పాటు అన్నది శాశ్వితంగా కొనసాగే సూచనలు కానరావడంతో జగన్ వర్గం లో అలజడి మొదలయింది. పార్టీలో, ప్రభుత్వంలో నామమాత్రపు గుర్తింపు లేకపోవడం ఆ వర్గాన్ని అసహనానికి గురిచేసింది. ప్రజలకిచ్చిన మాట పేరుతొ ఓదార్పు యాత్ర ప్రారంభించడం ఒక్కటే జగన్ వర్గానికి ప్రత్యామ్నాయంగా మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేకులు- ఈ యాత్రకు రాజకీయ రంగు పులమడం జగన్ వర్గానికి బాగా కలిసొచ్చింది. వైఎస్ హఠాన్మరణంతో గుండె పగిలిన వారి కుటుంబాలకు సొంత డబ్బుతో ఆర్ధిక సాయం అందించేందుకు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించడం జగన్ పట్ల సానుభూతిని పెంచింది. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన ‘రాజకీయం’ సాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది. జగన్ అంశాన్ని పిల్ల కాకి వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం – రోశయ్యను ముఖ్యమంత్రిగా తొలగించి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర పార్టీపై తన పట్టును మరో మారు ప్రదర్శించింది.

ఇటు జగన్ కూడా ఈ రాజకీయ క్రీడలో ఏమాత్రం వెనుకబడకుండా మరో అడుగు ముందుకు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్నీ, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్నీ వొదులుకుని, తల్లి విజయమ్మతో అసెంబ్లీకి రాజీనామా చేయించి అధిష్టానంపై తొలి యుద్ధభేరి మోగించాడు. అటు పార్టీ పెద్దలు కూడా త్వరత్వరగా పావులు కదిపి జగన్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఎదురు దెబ్బతీసారు. గత్యంతరం లేని స్తితిలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, భవిష్యత్తులో వాటి ప్రాబల్యానికి నాంది పలికారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అనుసరించిన వ్యవహార శైలి సీనియర్ సహచరులకు మనస్తాపం కలిగించినప్పటికీ – స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రి మళ్ళీ లభించాడని సాధారణ జనం సంతోషించారు. యువకుడు, విద్యాధికుడు స్వయంగా క్రీడాకారుడు అయిన కొత్త ముఖ్యమంత్రి, సమధికోత్సాహంతో పనిచేసి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మంచి పేరు తెచ్చుకోగలడని చాలామంది ఆశించారు. కానీ మంత్రుల శాఖల పంపిణీలో తలెత్తిన విభేదాలు, వాటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ యాత్రలు - ఈ ఆశలపై నీళ్ళు చల్లాయి. అలాగే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నమొదటి రోజునుంచీ సొంత పార్టీలో చెలరేగిన లుకలుకలు ఆయన ప్రతిష్టను పెంచకపోగా కొంతమేరకు మసకబార్చాయనే చెప్పాలి. మంత్రివర్గ కూర్పులో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, బలహీనవర్గాలను చిన్న చూపు చూసారన్న విమర్శ కొత్త ముఖ్యమంత్రికి తగిలిన తొలి దెబ్బ.

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించే సమయంలో కూడా తన వయస్సుకు తగ్గ వ్యవహారశైలిని ఆయన ప్రదర్శించ లేకపోయారన్నది ఆయన ఎదుర్కుంటున్న మరో విమర్శ. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖరరెడ్డి కానీ ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకున్న దాఖలాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలలో పర్యటించినప్పుడు, మండుటెండలో  ఇసుక మేట వేసిన పొలాల్లో చెమటలు కక్కుతూ తిరుగుతూ - ప్రభుత్వం ప్రజల వెంటే వుందన్న భరోసా కలిగించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మరోపక్క, అదేసమయంలో - జగన్, చంద్రబాబు, చిరంజీవి - బాధిత ప్రాంతాల్లో కలయ తిరిగి తమ పర్యటనల నుంచి రాజకీయ ప్రయోజనం రాబట్టుకునే ప్రయత్నం చేసిన విషయాలను ఉదహరిస్తున్నారు.

అలాగే, రైతు సంక్షేమ రాజ్యం తెస్తామన్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి –శాసనసభలో ప్రతిపక్షాలు, రైతుల దుస్తితిపై లేవనెత్తిన వివాదాలను సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్తితిలో పడిపోవడం మరో విషాదం. అలాగే విద్యార్ధుల అరెస్ట్ వ్యవహారం –అసెంబ్లీ స్పీకర్ గా విశేష అనుభవం గడించిన కిరణ్ కుమార్ రెడ్డికి గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారనే అపవాదును అంటగట్టింది. శాసన సభ జరుగుతున్న సమయంలోనే కొందరు పార్టీ శాసన సభ్యులు జగన్ అనుకూల వైఖరిని బాహాటంగా ప్రదర్శించడం నూతన ముఖ్యమంత్రికి అదనపు తలనొప్పిగా మారింది.

తెలంగాణా ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుందని బాధ్యతలు స్వీకరించగానే ఆర్భాటంగా ప్రకటించి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం, స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే డిప్యూటీ స్పీకర్ తోనే శాసన సభ సమావేశాలను ముగించాలని చూడడం – ముఖ్యమంత్రి స్వతంత్ర వ్యవహార శైలికి అద్దం పట్టేవిగా లేని విషయాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ముళ్ళ కిరీటం వంటిదని ఈపాటికే అర్ధం అయివుండాలి. ఒక్క కిరీటం మాత్రమె కాదు ముందున్న దారి కూడా ముళ్ళ బాట మాదిరిగానే కానవస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఈ నెలాఖరులో ఎదురవబోతోంది. యావదాంధ్రలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఆలోపునే వెలువడబోతోంది. ఈ లోపున రైతు సమస్యలపై తాడో పేడో తేల్చుకోవడానికి అటు జగన్, ఇటు చంద్రబాబు సంధించిన నిరాహార దీక్షల తూటాలు పేలబోతున్నాయి. కేసుల ఎత్తివేత గురించి విద్యార్ధుల ఆందోళన, వాళ్ల పక్షాన నిలబడుతున్న టీ ఆర్ ఎస్ తాకిడినీ ప్రభుత్వం ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వుంది. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా సొంత పార్టీలో రాజుకుంటున్న ‘కుంపట్ల’ విషయం సరేసరి.

బహుశా ఇన్ని రకాల వొత్తిళ్లకు ఏకైక ఉపశమనం ‘ఆటలు’ మాత్రమె అనే నిర్ణయానికి వచ్చి- స్వయంగా క్రీడాకారుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ప్రారంభోత్సవం సందర్భాన్ని అనువుగా తీసుకుని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపు బాడ్మింటన్ ఆడి సేదదీరే ప్రయత్నం చేసి వుంటారని అనుకోవాలి. (15-12-2010)

వినదగునెవ్వరు చెప్పిన:  'నిన్న మొన్నటివరకు తెలివిలవాడినన్నఅహంకారంతో ఈ ప్రపంచాన్నే మార్చాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలివినపడ్డాను. అందుకే నన్ను నేనే మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చాను.'   

4 కామెంట్‌లు:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

>>ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు.

This is too good. Nice Summary. ఈ మొత్తం వ్యవహారంలో ఒక వ్యూహకర్తగా జగన్ తనని తాను బాగానే ఋజువు చేసుకున్నడనే అనిపిస్తుంది. చాలా మంది అనుకున్నదానికి వ్యతిరేకంగా, జగన్లో రాజకీయ పరిణతీ, అవగాహనా పుష్కలంగా వున్నాయనేది ఇప్పటి వరకూ జరిగిన దాంట్లో రుజువయ్యింది.

Jwala's Musings చెప్పారు...

చాలా బాగుంది, ఏదైనా పత్రికకు పంపుతే మంచిదేమో!
జ్వాలా నరసింహారావు

Jwala's Musings చెప్పారు...

ఈ రోజు సూర్య దినపత్రికలో నీ ఆర్టికల్ చదివాను. బావుంది.
దాని లింక్ పంపిస్తున్నాను.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=7&ContentId=9510
జ్వాలా నరసింహారావు

prasad sarma చెప్పారు...

పెద్దలు శ్రీనివాస రావు గారికి,
నమస్కారం. మీ శుభాకాంక్షల సందేశానికి ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2011 సంవత్సరం అత్యంత ఆనంద దాయకం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బై ది వే మీరు స్వర్గీయ తిలక్ గారితో మీకు, మన న్యూస్ రూంకు సంబంధించిన ఇతర మితృల ఞాపకాలు వ్రాస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను.

కృతఞతలు.
ప్రసాద్ శర్మ
ఆకాశవాణి న్యూస్ రూం మాజి క్యాజువల్ ఉద్యోగి.
రోశయ్య గారి మాజీ పి.యస్.