ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావు
ముప్పయ్యేళ్ళక్రితం రేడియోలో వార్తలు చదివే న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి – వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది పనికొస్తుందన్నది ఆయన భావన.
రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.
‘పది నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు’ అనుకోవడానికీ-
‘పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది’ అని సరిపెట్టుకోవడానికీ ఎంతో తేడా వుంది.
సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.
నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి – ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.
కాలం వేగంగా మారుతోంది. వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా – బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది. స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే – వార్తలు వింటున్న శ్రోతకు ‘కంటిన్యుటీ’ వున్న భావన కలుగుతుంది.
రేడియోకి వార్తలు పంపేటప్పుడు – సూటిగా, స్పష్టంగా, సరళంగా – అనే మూడు పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.
(చాలా సంవత్సరాలక్రితం ఆంద్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ – రేడియో విలేకరులకోసం నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయిన అభ్యర్ధుల నిమిత్తం తయారు చేసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి – రచయిత)
2 కామెంట్‌లు:
ఎన్నాళ్లయిందండీ మీ వార్తలు విని! ఎలా చదవకూడదో తెలియడానికి అప్పట్లో మీకు ఆ రికార్డింగ్ భద్ర పరచుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడైతే రెండు రోజులు నిరంతర వార్తా స్రవంతులు "చూస్తే" సరి! తెల్సి పోతుంది. ళ, ని శ ని ఎలా ఖూని చేసి అవతల పారెయ్యాలో స్పష్టంగా తెలుస్తుంది.
నా అభిమాన న్యూస్ రీడర్లు ..కందుకూరి సూర్యనారాయణ గారు, దుగ్గిరాల పూర్ణయ్యగారు, అద్దంకి మన్నార్ గారు,మావిళ్ళ పల్లి రాజ్యలక్ష్మి గారు, మరియు బలదేవానంద సాగరుడు! సంస్కృతం అర్థం కాకపోయినా "ఈయం ఆకాశవాణి" అంటూ ఆయన వార్తలు మొదలెట్టగానే వినాలనిపించేది. కందుకూరి సూర్యనారాయణ గారు "ఆకశ్శ వాణి"అంటూ మొదలెట్టడం చిన్నప్పుడు భలే వింతగా ఉండేది. హైద్రాబాదు నుంచి CSR ఆంజనేయులు గారు, డి. వెంకట్రామయ్య గారు చదివే వార్తలు బాగుండేవి. చిత్రంగా నాకు లేడీ న్యూస్ రీడర్లెవరూ అంతగా గుర్తు లేరు. విజయవాడ నుంచి కొప్పుల సుబ్బారావు గారు ఇంకా చదువుతూనే ఉన్నారు. ప్రయాగ రామకృష్ణ గారి వార్తలు కూడా బావుండేవి,.ఆయన ఇంగ్లీష్ డిక్షన్ చాలా బావుండేది. డైరెక్టర్ అనడానికి డిరెక్టర్ అనీ, ఫైనాన్స్ అనడానికి ఫినాన్స్ అని వాడేవారు.
ప్రాంతీయ వార్తల్లో "ఇప్పుడే అందిన వార్త" అనగానే మామూలుగా వింటున్న వాళ్ళం కూడా అలర్ట్ అయిపోయి చెవులు రిక్కించే వాళ్ళం, "ముఖ్య మంత్రి మరణించారు" లాంటి అశనిపాతాలేమైనా వినిపిస్తారేమో అని!
విలేకరికీ, న్యూస్ రీడర్ కీ తేడా చక్కగా చెప్పారు. చదవడం, చెప్పడం..!
బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి