20, అక్టోబర్ 2010, బుధవారం

పత్రికల తలరాతలు - భండారు శ్రీనివాసరావు

పత్రికల తలరాతలు - భండారు శ్రీనివాసరావు


పూర్వం సోవియట్ యూనియన్ కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న కాలంలో – ఇజ్వెస్తియా, ప్రావ్దా అనే రెండు రష్యన్ పత్రికలు రాజ్యం చేస్తూ వుండేవి. ఇజ్వెస్తియా ఆనాటి సోవియట్ ప్రభుత్వ అధికార పత్రిక. (ఇజ్వెస్తి అంటే ‘వార్త ’ అని అర్ధం). పొతే, ప్రావ్దా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. (ప్రావ్దా అంటే ‘నిజం’) వీటి సర్క్యులేషన్ కోట్లలో వుండేదంటే నమ్మడం కష్టం. కానీ నిజం. ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో నేను ‘రేడియో మాస్కో’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు – మాస్కోలో ప్రతి రష్యన్ పౌరుడి చేతిలో ఈ రెండింటిలో ఏదో ఒక పత్రిక విధిగా దర్శనమిచ్చేది. గోర్భచెవ్ - ‘గ్లాస్నోస్త్’ పుణ్యమా అని భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించిన రష్యన్లు – ‘ఇజ్వెస్తియా లో ప్రావ్దా లేదు – ప్రావ్దా లో ఇజ్వెస్తియా లేదు’ అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ‘వార్తలో నిజం లేదు- నిజంలో వార్త లేదు’ అన్నమాట.

ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ నడిపే పత్రికల్లో విశ్వసనీయత మాట అటుంచి – ఆ పత్రికలు వాటి కరపత్రాలుగానో, ప్రచార పత్రాలుగానో మిగిలిపోతాయి తప్ప – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల పటిష్ట పునాదులుగా పనికిరావన్న థియరీ ఒకటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండడం వల్లనే ఆకాశవాణి, దూరదర్శన్ వార్తలకు విశ్వసనీయత ప్రశ్నార్థకమయిందని చెప్పేవారు కూడా లేకపోలేదు.

ఇప్పుడు జరుగుతున్న చరిత్ర గమనిస్తుంటే – ఈ సిద్ధాంతానికి కూడా కాలం చెల్లిపోతున్నదన్న సూచనలు కానవస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలే కాదు – ప్రైవేటు రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల పరిస్తితి సయితం ఇందుకు భిన్నంగా లేదన్న భావన ఊపిరి పోసుకుంటోంది. పార్టీలనూ, ప్రభుత్వాలనూ తామే శాసించగలమన్న ధీమా ప్రబలడమే దీనికి కారణం. పైపెచ్చు, ఏదయినా విషయం ప్రజలకు చేరాలంటే ఈనాడు మీడియాను మించిన మార్గం లేకపోవడం కూడా ఈ ధీమాకు దన్ను ఇచ్చింది. అందుకే సమాజంలో మీడియా వారంటే అన్ని వర్గాల్లో అంత మన్ననా మర్యాదా. అలాగే అంత భయం బెరుకు కూడా.

గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

‘కలం కూలీ’గా తనను తాను సగర్వంగా చెప్పుకున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు జి. కృష్ణ గారన్నట్టు – ‘పత్రికల రాతలే వాటి ‘తలరాతలను’ మారుస్తాయి.

కామెంట్‌లు లేవు: