16, జనవరి 2010, శనివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-ఎనిమిదో భాగం)





దేవుడంటే నమ్మకం లేని దేశంలో పిల్లలే దేవుళ్ళు 

దేశంలో పిల్లలే ప్రత్యేకం అనుకుంటే - వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యెక ఆసుపత్రులు,ప్రత్యెక స్కూళ్ళు, ప్రత్యెక ఆహారం, ప్రత్యెక దుస్తుల దుకాణాలు, ప్రత్యెక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గవున్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు,దువ్వెనలు, బ్యాటరీతో పనిచేసే బుల్లి బుల్లి హెయిర్ డ్రై యర్లు మొదలయినవన్నీ అమ్మే ప్రత్యెక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈతకొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు,మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు,పడక గదులు - అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం - మరికొన్నింటి ధరలు నామమాత్రం.
మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదాను, ఉద్యోగాన్ని బట్టి కాకుండా వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు ఉండడంవల్ల మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.



మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండే వాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.
వృద్ధులు - కురు వృద్ధులు
సోవియట్ యూనియన్ జనాభా తక్కువే కానీ వృద్ధుల సంఖ్య ఎక్కువే.
రేపెలా గడుస్తుంది అన్న బెంగ లేకపోవడం, చవుకగా లభించే పౌష్టికాహారం, శుభ్రమయిన గాలీ నీరూ ఇవన్నీ సోవియట్ పౌరుల ఆయు ప్రమాణాలను గణనీయంగా పెంచడానికి దోహదం చేసి వుంటాయనుకోవచ్చు. ప్రతివారికీ పని చూపించే బాధ్యత ప్రభుత్వంపై వుండడం, పిల్లలను కనడమే కానీ చదువు సంధ్యలు చూడాల్సిన అవసరం లేకపోవడం వీటన్నిటి వల్లా ఆరోగ్యం తొణికిసలాడే వృద్దులే ఎక్కువగా కానవస్తారు. ఎనభయి దాటిన స్త్రీలు కూడా గోళ్ళు గిల్లుకుంటూ ఇంటి పట్టున వుండరు. పూలూ పళ్ళు అమ్ముకుంటూ కనబడతారు. ఆత్మాభిమానానికీ, ఆత్మ స్తయిర్యానికీ ప్రతీకలుగా నిలబడతారు.
సామాన్యుల స్వర్గం
పౌర సదుపాయాలను అన్నిటినీ సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. చలి దేశం కాబట్టి - నిత్యావసరాల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేకుండా నివాస భవనాలకు దగ్గరలోనే షాపులు ఉండేవి. పాలు,వెన్న, కోడిగుడ్లు అమ్మే దుకాణాలను 'ప్రోదుక్తి' అని పిలిచేవారు. అలాగే స్కూళ్ళు, దేస్కిసాద్లు (చైల్డ్ కేర్ సెంటర్లు ) సలూన్లు, పిల్లల ఆసుపత్రులు అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉండేట్టు చూసారు.
(పిలవకుండానే పలికే డాక్టర్ల గురించి మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.





--

3 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

This is really good and very interesting. Continue the Contemporary History-politics
Jwala Narasimha Rao

kvsv చెప్పారు...

సర్, ఆనాటి రష్యాను ఆవిష్కరిస్తున్న మీ నుంచి ఈనాటి రష్యా ని కూడా చూడాలని వుంది కొంత పరిశోదించి మాకు అందచేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

Jwala's Musings చెప్పారు...

పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్నికోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పుచెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి దారితీసింది. దురదృష్టవశాత్తు, ఎల్లలెరుగని ప్రపంచాన్ని స్థాపించాలని కలలుకన్న మార్క్స్ స్వప్న సౌధాలకు బీటలు పడి, సామ్యవాదంనుండి సామ్రాజ్యవాదం దిక్కుగా పయనం చేసిందనడానిటికి ఉదాహరణగా రష్యా మిగిలిపోయింది. అదే సమయంలో, అతిపెద్ద ధన స్వామ్య దేశంలో, సామ్యవాద సిద్ధాంతాల అమలుకు సంస్కరణల పేరుతో అంతో-కొంతో అంకురార్పణ జరగడం విప్లవాత్మకమే. మార్క్స్ కలలు కన్న "ఎల్లలెరుగని సమాజం" అంటే ఇలాంటి మార్పే. ఇప్పుడు రష్యాకు-అమెరికాకు-అన్ని దేశాలకు తేడా లేదు. వర్తమాన రష్యా గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ నిత్యం పత్రికల్లో కనిపిస్తూనే వున్నాయి. కనపడని దాన్ని భండారు శ్రీనివాసరావు ఆవిష్కరిస్తున్నాడు. ఆస్వాదిద్దాం.

వనం జ్వాలా నరసింహా రావు