12, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - ఐదో భాగం - భండారు శ్రీనివాసరావు


ఊలిచ్చ వావిలోవా


ఇది మాస్కోలో మేము వుండే ప్రాంతం. ఊలిచ్చ అంటే రష్యన్ భాషలో స్ట్రీట్ (వీధి) అని అర్ధం. వావిలోవా స్ట్రీట్ లో రేడియో మాస్కోకు 14 అంతస్తులు కలిగిన ఒక నివాస భవనం వుంది. రేడియో మాస్కో విదేశీ విభాగంలో ప్రపంచంలోని 86 భాషల్లో ప్రసారాలు సాగుతుండేవి. ఇందులో తెలుగుతో సహా 14 భారతీయ భాషలు ఉండేవి. వీటికి సంబంధించిన విదేశీ భాషా నిపుణులను ఆయా దేశాలనుంచి ఆహ్వానిస్తుండేవారు. వీరంతా కుటుంబాలతో సహా నివసించడానికి ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. మేము ఇండియా నుంచి రాగానే తీసుకువచ్చి దింపిన భవనం - రేడియో మాస్కవా దోం - ఇదే. ( మాస్కోని మాస్కవా అంటారు. దోం అంటే రష్యన్ లో భవనం ) . బయటకు వెళ్ళే పని లేకుండా ఇందులోనే రెస్టారెంట్, హెయిర్ కటింగ్ సలూన్ మొదలయిన వసతులతో పాటు ఎలాంటి అవసరం వచ్చినా సాయపడడానికి సిబ్బంది రేయింబవళ్ళు సిద్దంగా వుంటారు

.
 ఇంటికి కూతవేటు దూరంలో 'ప్రోదుక్తి' దుకాణం వుంది. ఇందులో అన్ని రకాల పాల పదార్ధాలు, పాల ఉత్పత్తులు దొరుకుతాయి. మరికొద్దిదూరంలో- 'రీనక్' అనే మార్కెట్ వుంది. గోర్బచేవ్ ప్రవచించి అమలు చేసిన గ్లాస్నోస్త్, పెరిస్త్రోయికా సిద్దాంతాల నేపధ్యంలో ఆవిర్భవించిన 'నయా' మార్కెట్ 'రీనక్'. ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్ధాలు దొరుకుతాయి. అయితే, బయట షాపుల్లో కంటే ధరలు ఎక్కువ. ఉత్పత్తి ఖర్చుని బట్టి వస్తువు ధర ఉండాలనే సూత్రం ప్రాతిపదికగా ఈ మార్కెట్లు కొత్తగా వెలిసాయి. సామ్వ్యవాద దేశమయిన సోవియట్ యూనియన్లొ సాధారణంగా నిత్యావసర వస్తువల ధరలు అందరికీ అందుబాటులో వుండడం సహజం. కమ్యూనిస్ట్ సమాజం గురించి విన్నంతలో నేను అర్ధం చేసుకున్నది అది. కానీ అక్కడ పరిస్తితి ఊహకు అందనంతగా వుంది.

చవక అనే పదం కన్నా చవక

మా బామ్మ చెబుతూ వుండేది 'తన చిన్న తనంలో పుట్టెడు వడ్లు (పది బస్తాలు) రూపాయికి అమ్మేవారని.

మాస్కోకి వచ్చిన తరవాత బామ్మ చిన్ననాటి రోజులు మా అనుభవంలోకి కూడా వచ్చాయి.

మేము వచ్చిన కొత్తల్లో ఇండియాకు ఫోన్ చేసినప్పుడు - 'అక్కడ చవగ్గా ఏమి దొరుకుతాయి?' అని మా వాళ్ళు అడిగేవారు. 'అన్నీ చవకే' అని జవాబు చెబుతుండేవాళ్ళం.

మన రూపాయికి నూరు పైసలు మాదిరిగానే రష్యన్ రూబుల్ కు వంద కోపెక్కులు. ఒక కోపెక్కు కు దొరికే వస్తువులు కూడావున్నాయి. అగ్గిపెట్టె, కోడిగుడ్డు లాంటివి ఒక కోపెక్కు పెట్టి కొనుక్కోవచ్చు. గాలన్ పెట్రోలు ముప్పయి కోపెక్కులు. పది రూబుళ్ళు మనవి కావనుకుంటే కారు ట్యాంక్ నింపుకోవచ్చు. పాలకూ, పెట్రోలుకూ ధరలో తేడా వుండదు. ఒక్క మాస్కోలోనే కాదు- దేశ వ్యాప్తంగా ధరవరలన్నీ ఒకే మాదిరిగా వుండడం మరో విశేషం. పల్లెల్లో, బస్తీల్లో అంతా సమానమే. పైగా ప్రతి వస్తువు మీదా దాని ధర ముద్రించి వుంటుంది.ఆఖరికి ప్రతి కోడిగుడ్డు పై కూడా.  బేరసారాలకు తావు లేకపోవడం, ధర గురించిన బాధ లేకపోవడం - ఇవన్నీ భాష తెలియని మా బోంట్లకి వరంగా మారింది.

అయితే , పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్ సిద్దాంతాల అమలు ప్రభావం కొద్ది కొద్దిగా ధరవరలపై పడుతూ వచ్చి అయిదేళ్ళ తరువాత ఇండియాకు తిరిగి వచ్చే నాటికి మేము వచ్చిన మాస్కో ఇదేనా అన్నంతగా మారిపోయింది. ఇంతకుముందు పేర్కొన్న 'రీనక్' వంటి మార్కెట్లు అన్ని రంగాల్లో ప్రవేశించి - దశాబ్దాలతరబడి 'మార్పు' అంటే తెలియని సోవియట్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసాయి.
మాస్కో గోంగూర
మాస్కోలో పనిచేసే విదేశీయులకు వేతనాలు అధికంగా లభిస్తాయి కాబట్టి, రీనక్ వంటి మార్కెట్లలో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు. కాకపొతే, అక్కడ లభించే ఆహార పదార్ధాలలో తొంబయి శాతం మాంసాహారులకి పనికివచ్చేవే. ఒకటీ అరా కానవచ్చే ఆకుకూరల్లో- కొన్నింటిని మా ఆవిడ 'శబరి' లాగా కొరికి చూసి - గోంగూర 'పులుపు' కు కాసింత అటూఇటూ గా వున్న ఒక ఆకుకూరకు 'గోంగూర' అని నామకరణం చేసింది. ఆ తరవాత- మాస్కోలో మేమున్న అయిదేళ్ళూ - వచ్చిన అతిధులకు ఆ గొంగూరతోనే ఆతిధ్యం. అంతే కాకుండా - మాస్కోలో వున్న యితర తెలుగు కుటుంబాల్లో కూడా 'రీనక్ గోంగూర' ప్రధాన అధరువుగా మారిపోయింది.
('కన్ను కొట్టని కరెంటు దీపాలు' గురించి మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

1 వ్యాఖ్య:

శివ చెప్పారు...

Gongura Story is very good. When were in Mumbai, we too had similar experience with some other type of leaves.