11, జనవరి 2010, సోమవారం

మార్పు చూసిన కళ్ళు -ఆనాటి మాస్కో అనుభవాలు- నాలుగో భాగం-భండారు శ్రీనివాసరావు





మంచు కాలం


మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.

ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే' ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి.



ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను మంచు సమాధులలోనే ఉంచేసి , మెట్రో రైళ్ళ పయినే రాకపోకలు సాగిస్తుంటారు.

అదిగో నవలోకం





భూగర్భంలో కొన్ని వందల అడుగుల దిగువన నిర్మించిన ఒక అద్భుత నిర్మాణం 'మాస్కో మెట్రో'. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మెట్రో రైళ్ళు - తెల్లవారు ఝామునుంచి అర్దరాత్రివరకు నిరంతరం సంచరిస్తూ లక్షలమంది ప్రయాణీకులను గమ్యాలకు చేరవేస్తుంటాయి. చిత్రమేమిటంటే- భూమిపయిన మెట్రో స్టేషన్ వున్నచోట 'ఎం' అనే అక్షరం రాసిన గుర్తు మాత్రమే వుంటుంది. ('ఎం' అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో మాదిరిగానే రష్యన్లోకూడా రాస్తారు) అక్కడనుంచి భూగర్భంలోని స్టేషన్ కు చేరడానికి ఎస్కలేటర్లు వుంటాయి . అయిదు కోపెక్కుల (రష్యన్లకు మన అయిదు పైసలతో సమానం) నాణెం అక్కడి మిషన్లో వేయగానే ఎస్కలేటర్లలోకి వెళ్ళే ద్వారం ఆటోమాటిక్ గా తెరుచుకుంటుంది.


 ఒక్కసారి అయిదు పైసలు వేసి ఏదయినా ఒక మెట్రో లోకి ప్రవేసించామంటే చాలు, దానితో మాస్కో నగరం భూగర్భంలో నిర్మించిన సుమారు నూట నలభయి స్టేషన్ లకు యెంత దూరమయినా, ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు.


 ఒక స్టేషన్ కు మరో స్టేషన్ కు పోలిక లేకుండా విభిన్న ఆకృతులతో, సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వాటిని నిర్మించిన విధానం అపూర్వం. భూ ఉపరితలానికి వందల అడుగులలోతున అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతి లో పట్టపగలులా మెరిసిపోయే మాస్కో మెట్రో స్టేషన్ లు మయసభలను మరిపిస్తూ మానవ నిర్మిత కట్టడాల ప్రశస్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నయా అన్నట్టుగా వుంటాయి.

 అంత లోతున డజన్లకొద్దీ నిర్మించిన సొరంగ మార్గాలలో మెట్రో రైళ్ళు మెరుపు వేగంతో పరుగులుతీస్తుంటాయి. రైల్ వెళ్లి పోయిందే అన్న బెంగ లేకుండా ఒక దానివెంట మరొకటి నిమిషాల వ్యవధిలో రాకపోకలు సాగిస్తుంటాయి.


 రైలు ప్లాటు ఫారం మీదకు రాగానే తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకుంటాయి. ప్రయాణీకులు దిగినదాకా ఆగి ఎక్కాల్సిన వాళ్ళు తోపులాటలు లేకుండా ఎక్కుతుంటారు. ఈ రైలు తప్పిపోతే ఇలా అనే భయం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. మరో నిమిషంలో మరో రైలు వస్తుందనే భరోసా వారికి ఆ ధైర్యాన్ని ఇస్తోంది. ఒకసారి పిల్లలతో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎక్కగలిగారు కానీ నేనూ మా ఆవిడా ఎక్కేలోగానే రైలు కదిలింది. చిన్నపిల్లలయినా ఏమాత్రం కంగారు పడకుండా పక్క స్టేషన్ లో దిగిపోయి మా కోసం ఎదురుచూశారు. వెనువెంటనే వచ్చిన మరో మెట్రో రైలు లో వెళ్లి మేము వారిని కలుసుకున్నాము. మెట్రో గురించిన మరో విశేషం ఏమిటంటే - సమయ పాలన. నేను అక్కడవున్న అయిదేళ్ళు ఒక విషయం గమనించాను. మెట్రోలో మా ఆఫీసు కు వెళ్ళడానికి పద్నాలుగు నిమిషాలు పట్టేది. ఏరోజునా అరనిమిషం తేడా కూడా వచ్చేది కాదు. అంత ఖచ్చితంగా రైళ్ళు నడిచేవి.

(మాస్కోలో 'గోంగూర ' గురించి మరోసారి).

NOTE: All the images in this blog are copy righted to their respective owners.



--

6 కామెంట్‌లు:

kvsv చెప్పారు...

చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది థాంక్ యు వెరీ మచ్.. మీ అనుభవాలు అందరికీ పంచుతున్నందుకు ..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

very many thanks. any objection to share thoughts?

kanthisena చెప్పారు...

కాస్త ఏమరుపాటుగా ఉండేసరకి మెరుపువేగంతో మీ మాస్కో అనుభవాలను పేర్చినట్లుంది. ఇప్పుడు మొదలుపెట్టి వరుసగా చదివేస్తాను.అలనాటి మాస్కో చరిత్రకు అద్దం పడుతున్న మీ శైలికి అభినందనలు. మీ మాస్కో అనుభవాలను తప్పక పుస్తక రూపంలో తీసుకురండి. ఈ విషయమై సీరియస్‌గా ఆలోచించగలరు. నేనయితే మీ అనుభవాలను నిధిలా దాచుకుంటున్నాను.

Saahitya Abhimaani చెప్పారు...

Sreenivasa Rao garu,

The metro trains of Moscow are just like our Mumbai locals with regard to punctuality and running time. But crowding is more in Mumbai. I travelled in Mumbai Trains for 3 years and never I was late to our Office.

I request you to post all your Moscow experiences in one post. That would be great to read at one go and get all the information provided by you so patiently.

tejoviraat చెప్పారు...

Hello!
This is P.Tejoviraat from Hyderabad.
One small correction in Mr.Shiv Ramprasad Garu's statement.
I too travelled in Mumbai local trains. But there is a wast and uncomparable difference between Mumbai & Masco Metro(according to Mr.B.Srinivasa Rao)

tejoviraat చెప్పారు...

Hello!
This is P.Tejoviraat from Hyderabad.
One small correction in Mr.Shivaramprasad Garu's statement.
I too travelled in Mumbai local trains. There is wast and uncomparable difference between Mumbai & Mascow metro(As I read from Mr.B.Srinivasa Rao)