24, ఫిబ్రవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (94) – భండారు శ్రీనివాసరావు

 

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య
ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో మరో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య.
1936 ఏప్రిల్ 15న వెంకటకృష్ణారావు, అన్నపూర్ణమ్మ దంపతులకు గుడివాడ దగ్గర అంగలూరులో దుగ్గిరాల పూర్ణయ్య జన్మించారు. గుడివాడ ఏ ఎన్ ఆర్ కళాశాలలో బియ్యే చదివారు. భీమవరంలో ఎం.ఎ. ఇంగ్లీషు, పిమ్మట భగల్పూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పొలిటికల్ సైన్స్. చదువు మీద ఆసక్తితో ఉద్యోగంలో చేస్తూ కూడా పుణే విశ్వవిద్యాలయం నుంచి నుంచి ఎల్ ఎల్ బి చేశారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ.
కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు.
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు. ఆయన ఆహార్యం కూడా పల్లెటూరి రైతుని తలపించేదిగా వుంటుంది. ఇస్త్రీ చేయని చొక్కా మాదిరిగా నలిగిన దుస్తుల్లో కనిపించేవారు.
ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. కనపడని వారిని, వినపడే వారి గొంతుకలే జనాలకు దగ్గర చేసేవి. సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ముభావకంగా, అంతర్ముఖంగా వుండేవారు. అంతమాత్రాన మానవ సంబంధాలకు దూరం కాదు. మన వైపు నుంచి ఎవరైనా ఢిల్లీ వెళ్లి రేడియోలో తెలుగు విభాగానికి వెడితే, పరిచయం లేకపోయినా క్యాంటీన్ కు తీసుకువెళ్లి చాయ్ ఇప్పించి మాట్లాడి పంపించేవారు.
గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది దుగ్గిరాల పూర్ణయ్య గారని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
అయితే పూర్ణయ్య గారిది వీటిని పట్టించుకునే తత్వం కాదు, పట్టించుకోవాలనే తాపత్రయం లేని మనిషి. వ్యక్తిగత ప్రచారాలకు దూరం.
వారిది కృష్ణా జిల్లా లోని అంగలూరు గ్రామం. తన గ్రామం మీద ఆయన గారికి ఎంతటి మక్కువ అంటే , రిటైర్ అయిన తర్వాత ఢిల్లీలో కొనుక్కున్న ఇంటిని ఏదో ఒక ధరకు అమ్మేసి స్వగ్రామంలో స్థిర పడ్డారు. భౌతిక సంపదలపై లేనిపోని అనురక్తిని పెంచుకోకపోవడం కారణంగా చెబుతారు.
ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి శేష జీవితం గడుపుతూ 2020 మార్చి ఇరవై తొమ్మిదిన కన్నుమూశారు.
చివరి దశలో ఆరోగ్యపరమైన సమస్యలతో శారీరకంగా కృశించిన స్థితిలో ఆయన్ని చూడడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన్ని చూసి వచ్చిన రేడియో సహచరులు, రచయిత నాగసూరి వేణుగోపాల్ చెప్పారు.
చక్కటి కంఠాన్ని వరంగా ఇచ్చిన దేవుడు, దారుణమైన వృద్ధాప్యాన్ని పూర్ణయ్య గారికి శాపంగా ప్రసాదించడం విధి వైపరీత్యం.
కింది ఫోటో:
దుగ్గిరాల పూర్ణయ్య



(ఇంకా వుంది)

లక్షమందికి కోటి కైమోడ్పులు

 

అయాం ఎ బిగ్ జీరో మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటికి 93 భాగాలు పూర్తయ్యాయి. మరి కొంచెంసేపట్లో  94 వ భాగం పోస్టు చేయబోతున్నాను. నేను రాసిన ప్రతిదీ నా వ్యక్తిగత బ్లాగు https://bhandarusrinivasarao.blogspot.com/2025/02/93.html#google_vignette లో పోస్టు చేయడం అలవాటు. కొంచెం సేపటి క్రితం నా బ్లాగు  వీక్షకుల సంఖ్య అక్షరాలా పదిహేను లక్షలకు చేరుకుంది. అయాం ఎ బిగ్ జీరో మొదలు పెట్టినప్పుడు ఈ సంఖ్య పద్నాలుగు లక్షలు. అంటే లక్షమంది ఈ జీరోని అభిమానిస్తూ చదువుతున్నారన్న మాట. నిజానికి వీరు నా అభిమానులు కారు. రేడియో అభిమానులు. రేడియో మీది అభిమానంతో నా రాతల్ని అభిమానిస్తున్నారు.

అందుకే ఈ లక్షమందికి పేరుపేరునా కోటి కైమోడ్పులు తెలియచేసుకుంటున్నాను. రేడియో బతికే వుంది, దానికి మరణం లేదు అని మరోమారు రుజువైంది. (ఇక్కడ రేడియో అంటే నేను పనిచేసిన ఆకాశవాణి)

భండారు శ్రీనివాసరావు 







23, ఫిబ్రవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (93) – భండారు శ్రీనివాసరావు

 


"వార్తలు  చదువుతున్నది అద్దంకి మన్నార్"  


“మన్నార్. అంటే మన  తెలుగు వాడేనా. కాకపొతే,  తెలుగులో ఈయన చేత వార్తలు ఎందుకు చదివిస్తున్నారు? “ఇంటి పేరు అద్దంకి కదా! తెలుగువాడే అనడానికి వేరే రుజువెందుకు?”

ఇలా సాగేవి చర్చలు  చిన్నప్పుడు ఊళ్ళల్లో పంచాయతీ  రేడియో వింటూ.

అద్దంకి మన్నార్ పదహారణాల తెలుగువాడు.  పూర్తి పేరు అద్దంకి ఎంబెరు మన్నార్. మాటా, పలుకూ, ఆహార్యం ఇలా అన్నింటా తెలుగుతనం తొణికిసలాడేది. పైగా సంప్రదాయానికీ, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన వాడు.

మన్నార్ కుమారుడు అద్దంకి రాం కుమార్ కూడా రేడియోలోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మా వార్తా విభాగంలోనే పనిచేస్తూ అందరికీ తలలో నాలిక మాదిరిగా ఉండేవాడు. ఎప్పుడో పూర్వ కాలంలో  రేడియోలో తమ గొంతు వినిపించిన అనేక మంది ప్రసిద్దుల స్వరాలను రాం కుమార్ భద్రపరిచి ఉంచాడు. తండ్రికి నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. 

ఆయన మన్నార్ గురించి చెప్పిన ఓ కధనం ఆసక్తిదాయకంగా వుంది.

“చాలా ఏళ్ళ క్రితం రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓసారి ఢిల్లీలోని పార్లమెంటు  భవనంలోని ఒక సమావేశ మందిరంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. భోజన విరామానికి కొద్దిసేపటికి   ముందు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు గారు కాసేపు అనర్ఘలంగా తెలుగులో ప్రసంగించారు. ఎన్టీఆర్ మాట్లాడిన అంశాలను, రాజీవ్ గాంధి తన పక్కనే కూర్చున్న పీవీ నరసింహారావు గారిని అడిగి తెలుసుకున్నారు.

“భోజన విరామ సమయంలో పీవీ పనుపున ఇద్దరు అధికారులు పక్కనే వున్న రేడియో స్టేషన్ కు వెళ్ళారు. తెలుగు విభాగంలో అప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్ కూర్చుని పని చేసుకుంటున్నారు. అనువాదపు పని అని చెప్పగానే పూర్ణయ్య గారు నేను బులెటిన్ చూసుకుంటాను, మీరు వెళ్లండని మన్నార్ గారికి పురమాయించారు. మన్నార్ వెళ్లి పీవీ గారిని కలిసారు. భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన (ఎన్టీఆర్) మాట్లాడతారు, అదేదో విని రాసి తనకిమ్మన్నారు, పీవీ.  ఆయనతో ఉన్న చనువుతో మన్నార్, ‘అయ్యా. నేను ముక్కస్య ముక్క అనువాదం చేయలేను. అందులో ఎన్టీఆర్ గారిది గ్రాంధిక తెలుగు’ అనడంతో పీవీ నవ్వేశారు.

ఎన్టీఆర్  తో  మన్నార్ కి కూడా పరిచయం వుంది. తన ప్రసంగాన్ని అనువదించేందుకు మన్నార్ ని పిలిపించారని ఎన్టీఆర్ కి  అర్ధం అయింది. భోజన విరామం తర్వాత ఆయన తెలుగు జోలికి పోకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే ప్రసంగం పూర్తి చేశారు”

అద్దంకి మన్నార్ ఆకాశవాణి తరపున మాస్కో వెళ్లి రేడియో మాస్కోలో కొంతకాలం పనిచేశారు. ఆ రోజులలో తన అనుభవాలను వివరిస్తూ ‘ప్రావ్దా’ అనే చిన్ని పుస్తకాన్ని రచించారు.     

మల్లాది సూరిబాబు గారు ఆంద్రభూమి పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాస పరంపర ఒకదానిలో అద్దంకి మన్నార్ గారి ప్రసక్తి వుంది. ఈ వ్యాసం చదివిన తర్వాతనే మన్నార్ న్యూస్ రీడర్ కాకముందు విజయవాడ రేడియో కేంద్రంలో కొన్నేళ్ళు అనౌన్సర్ గా పనిచేసిన విషయం తెలిసింది.

అందులో మల్లాది గారు ఇలా రాసారు.

“మాటల్లో గంభీరతస్పష్టతచక్కని శృతిపలుకులో మాధుర్యం ఎనౌన్సర్‌ కు వుండవలసిన లక్షణాలు. మనిషి ఎదురుగా లేకుండా, కంటికి కనిపించకపోయినా గొంతు మాత్రం చెవికి ఆకర్షణగా వినాలనిపించేలా వుండాలి.
ఎనౌన్సర్ వేరు. న్యూస్ రీడర్ వేరు. చదివే విధానంలో తేడా వుంటుంది. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైన తొలి రోజుల్లో 1959లో ఎనౌన్సర్‌గా చేరి, న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధుడైన ‘ఎంబెర్ మన్నార్’ ని  ఈతరం వారెరుగరు.
విలక్షణమైన గొంతు, 20 నిమిషాల్లో చదవవలసిన వార్తల్ని పదే పది నిమిషాల్లో వేగంగా అత్యంత స్పష్టంగా చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈ అద్దంకి మన్నారు. స్వగ్రామం నూజివీడు సమీపంలోని చిన్న గ్రామం కానుమోలు. రేడియోకు కొన్ని ప్రమాణాలున్నాయి. బహిరంగంగా మనం ఇష్టపడి అభిమానించి ఎన్నుకున్న రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో ‘తోలు తీస్తాతాట తీస్తా’ లాంటి మాటలున్నా యథాతథంగా వార్తల్లో చెప్పరు. చెప్పకపోవటమే రేడియోకున్న గౌరవం. ఖండించారనో, గర్హించారనో, కొన్ని సున్నితమైన అందమైన పదాలు వాడి సరిపెట్టిహుందాగా తప్పుకుంటారు. కల్పలతచిత్రతరంగిణి లాంటి సినిమా పాటల కార్యక్రమాలను సమర్పించటంలో మన్నార్‌కు సాటి మరొకడు లేడనిపించుకున్న ఎనౌన్సర్ అనతికాలంలోనే న్యూస్ రీడరైఢిల్లీ నుంచి వార్తలు చదివేవాడు.
వార్తల ‘లైవ్’ స్టూడియోలో కూర్చుని చివరి నిమిషంలో అందే వార్తనైనా అందంగాఅనువదించేసితొట్రుపాటు పడకుండా ఆ వార్త చదవటం మన్నార్ ప్రత్యేకతగా చెప్పేవారు. వార్తలు చదివే వారిలో ‘నాటకీయత’ ఉండదు. ఉండకూడదు కూడా. వార్తలను ఒక ప్రవాహంలాధారలాసొగసుగాస్పష్టంగా చదివి కీర్తిని మాత్రమే సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి మన్నార్”

(మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)

కింది ఫోటో : సాహిత్య అభిమాని బ్లాగు నుంచి సుధామ సౌజన్యంతో 

అద్దంకి మన్నార్




(ఇంకావుంది)

22, ఫిబ్రవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (92) – భండారు శ్రీనివాసరావు

 

“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు

ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసువిజయవాడహైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి

ఉదయం  ఏడుగంటల సమయంలోనోలేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతివాక్యాలను విరుస్తూ,  అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ  తెలుసు. అయితే,  రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని  ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదుఆసేతుహిమాచలం హై పవర్ రేడియో  ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.

 
స్క్రిప్ట్ ఒకటే. చదివేది అదే మైకు ముందు. మరి రేడియో వార్తలు చదివే వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ నుంచి గతంలో తెలుగు వార్తలు చదివిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాణీ.
నిజమే. ఎవరు చదివినా అవే వార్తలు. కానీ చదవడంలో ఓ విరుపు. చదువుతూ చదువుతూ ఎక్కడో ఓ మెలిక. వార్తకు తగ్గట్టు స్వరంలో హెచ్చుతగ్గులు. వీటిని బట్టే ఆ రోజుల్లో శ్రోతలు వార్తలు మొదలయిన తర్వాత కూడా చదివే వ్యక్తి ఎవరన్నది సులువుగా గుర్తు పట్టేవాళ్ళు.
అద్దంకి మన్నార్ వార్తలు చదువుతుంటే  జెట్ విమానంలా ఉరుకులు పరుగులు పెట్టినట్టు సాగిపోయేవి. దుగ్గిరాల పూర్ణయ్య గారు కంచు కంఠంతో నింపాదిగా చదివేవారు. కందుకూరి సూర్య నారాయణ గారు ప్రతి వాక్యాన్ని తనదైన శైలిలో ముగించేవారు. మామిళ్ళపల్లి  రాజ్యలక్ష్మి గారిది మరో తరహా. నిండుగా సాగిపోతున్న గంగా ప్రవాహం మాదిరిగా వుండేది. జోళిపాల్యం మంగమ్మ గారు వార్తలు చదువుతుంటే మరి కాసేపు అలా అలా వినాలి అనిపించేలా వుండేది. ఏడిద గోపాల రావు గారు వార్తల్ని చదువుతుంటే ముచ్చట్లు చెబుతున్నట్టు ముచ్చటగా ఉండేవి.  చొప్పదంటు లాంటి వార్తలకు కూడా ఆ మహానుభావులు జీవం పోసేవారు. అందుకే శ్రోతలను అంతగా ఆకట్టుకోగలిగారు. (దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులోమాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)


ఢిల్లీలో ఆకాశవాణికి  చాలా పెద్ద వార్తా విభాగం వుంది. అనేక జాతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారం చేస్తుంటారు. ప్రసార భారతి ఏర్పాటు అయిన తరువాత ఆయా దేశీయ భాషల్లో బులెటిన్లు రూపొందించే విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలుగు వార్తా విభాగాన్ని యావత్తూ, సిబ్బందితో సహా హైదరాబాదుకు మార్చారు. ఢిల్లీలోని ఆకాశవాణి జనరల్ న్యూస్ రూమ్ లో ఇంగ్లీషులో జాతీయ వార్తలతో కూర్పు చేసిన  బులెటిన్ కాపీని హైదరాబాదుకు పంపితే, ఆ వార్తల్ని  న్యూస్ రీడర్లు తెలుగులోకి తర్జూమా చేసుకుని చదువుతున్నారు. కాకపొతేప్రాధాన్యతను బట్టి కొన్ని స్థానిక వార్తలను కూడా ఆ బులెటిన్ లో చేరుస్తారు.

 

శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు,  మాస్కో వెళ్ళి అక్కడ ఆ రేడియో వార్తలు చదివి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. అదేమిటో ఢిల్లీలో పనిచేసి వచ్చిన వాళ్ళలో చాలామంది ఫుల్ సూటు ధరించి, చేతిలో బ్రీఫ్ కేసుతో  కనపడేవాళ్ళు. న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేసిన ఎం.ఎస్.ఆర్. కృష్ణారావు గారు కూడా అదే తీరు. ఫుల్ సూటు, టై, తలపైన ఫెల్ట్ హ్యాట్. ఢిల్లీ అలవాటేమే తెలియదు. ఇదే ఆహార్యంతో సిటీ బస్సులో నిలబడి ప్రయాణం చేస్తుంటే చాలా చిత్రం అనిపించేది. అలాగే అప్పుడప్పుడు సెలవు మీద హైదరాబాదు వచ్చి, రేడియో స్టేషన్ కు వచ్చి అందర్నీ పలకరించే ఏడిద గోపాల రావు గారు కూడా ఫుల్ సూటు, చేతిలో బ్రీఫ్ కేసు. మరి అదే  ఢిల్లీలో, అండమాన్ లో పనిచేసి వచ్చిన గోవాడ సత్యారావు గారికి     సూట్ల గోల అంటలేదు. ఆయన మామూలు ప్యాంటు చొక్కాతోనే ఆఫీసుకు వచ్చేవారు. న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారి తరహా పూర్తి విభిన్నం. పంచె, మోచేతులవరకు వున్న చొక్కా. చేతిలో చుట్ట.  పరిచయం లేనివాళ్లు ఆయన్ని ఒక రాజకీయ నాయకుడు కాబోలు అనుకునే వాళ్ళు. ఉర్దూ న్యూస్ రీడర్ వసీమక్తర్ మాత్రం సూట్ల దగ్గర నుంచి, లాల్చీ పైజామా వరకు అనేక రకాల దుస్తులు ధరించేవాడు. కాకపోతే చేతిలో వెలిగే సిగరెట్ అదనం.  

ఆ రోజుల్లో నేను పనిచేసిన  ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు,  ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బందిఅంటే న్యూస్ ఎడిటర్లురిపోర్టర్లుబులెటిన్ టైప్ చేసే వాళ్లురెండో గదిలో తెలుగుఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.

నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారుకరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణారావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారున్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారుసరేఆ వరసలో అసిస్టెంట్ ఎడిటర్ రిపోర్టింగ్ హోదాలో  నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని. వీరిలో ఎం ఎస్ ఆర్ కృష్ణారావు గారు, ఆహార్యం ఆంగ్ల పద్దతిలో సూటూ బూటయినా, స్వచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. మమ్మల్ని కూడా అలాగే  మాట్లాడమని కోరేవారు. ఏదయినా చెప్పబోతూ మా మిసెస్ అంటే వెంటనే అభ్యంతరం చెప్పేవారు. మిసెస్ అంటే మిస్ట్రెస్, అలా అనడం తప్పు, నా భార్య అని చెప్పమని పట్టుబట్టేవారు. సరే! ఇది కొంత వినోదంగా కూడా వుండేది. ఆఫీసులో సీరియస్ వాతావరణాన్ని కొంత చల్లబరిచేది. 

 

మరో గదిలో తిరుమలశెట్టి  శ్రీరాములు గారుఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే  ఒక చేతిలో వెలిగించిన సిగరెట్మరో చేతిలో న్యూస్ బులెటిన్ పేపర్లు  పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేము పనిచేసే  చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగు వేసుకుంటూ, నింపాదిగా  స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వచ్చేటప్పుడు మళ్ళీ సిగరెట్ అంటిస్తే న్యూస్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి అయిపోయేది. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే,  శ్రీరాములు గారు మాత్రం   తాపీగా నడుస్తూ  మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే,  దాన్ని చదువుకుంటూ అలాగే అంతే  నిదానంగా నడుస్తూ వెళ్ళేవారు కాని,  ఆయనలో ఏమాత్రం ఆందోళన కానికంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. ఇంత నిదానంగా, నింపాదిగా, తాపీగా  వుండే మనిషి గుండెపోటుతో మరణించడం ఒక విషాదం.

అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్ఉర్దూ న్యూస్ రీడర్ తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించుకునేవారు.

కింది ఫోటో :

తిరుమలశెట్టి శ్రీరాములు గారు



 

(ఇంకా వుంది)

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (91) – భండారు శ్రీనివాసరావు

  

వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ

కందుకూరి రామభద్రరావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కవి, పండితుడు, రచయిత. గోదావరీ తీర ప్రాంతంలో ప్రసిద్ధ కవులైన  దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, కాటూరి వెంకటేశ్వరరావు మొదలైన భావకవులకు ఆయన సమకాలికులు. వీరందరూ కలిసి నవ్య సాహిత్య పరిషత్ పేరుతొ ఒక సంస్థని నడిపేవారు. కందుకూరి రామభద్రరావు గారు  కవిమాత్రమే కాదు, చక్కని వక్త కూడా. తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి దిగ్గజాలు సయితం రామభద్రరావుగారి ప్రసంగ పాటవానికి పరవశులయ్యారని చెప్పుకునేవారు. రేడియో ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు’ అనే కవిత వీరి కలం నుంచి జాలువారినదే.  టీచరుగా పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా విజయవాడ ఆకాశవాణిలో విద్యావిషయిక కార్యక్రమాల ప్రొడ్యూసరుగా కూడా అయన పనిచేశారు.   

ఈ రామభద్రరావుగారి పుత్రుడే ఈ వ్యాసానికి ప్రేరణ అయిన శ్రీ కందుకూరి సూర్యనారాయణ.

వీరిది రాజమండ్రి దగ్గర రాజవరం.

సూర్యనారాయణ మద్రాసులో ఎమ్మే చేసారు. ఏడాది ఎదురు చూసినా సరైన ఉద్యోగం రాలేదు. అలా రోజులు దొర్లిస్తున్నప్పుడు, 1960 లో  ఆంధ్రజ్యోతి ఎడిటర్  నార్ల వెంకటేశ్వరరావు గారు, రామభద్రరావు గారిపట్ల ఉన్న మిత్రవాత్సల్యంతో, ఆయన కుమారుడు అయిన సూర్యనారాయణకు తమ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చారు. విద్వాన్ విశ్వం అసిస్టెంట్ ఎడిటర్. నండూరి రామమోహన రావు సీనియర్ సబ్ ఎడిటర్, తుర్లపాటి కుటుంబరావు, ఎల్లోరా, వీరభద్రరావు  ఇతర సహోద్యోగులు.

అలా ఓ ఏడాది  గడిచిన తర్వాత, న్యూస్ రీడర్ ఉద్యోగాలకు  రేడియో వాళ్ళు ఇచ్చిన ఒక ప్రకటన చూసి దరఖాస్తు చేసారు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. హైదరాబాదులో ఇంటర్వ్యూ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు. సూర్యనారాయణగారిని ఢిల్లీలో న్యూస్ రీడర్ గా సెలక్ట్ చేసారు. అదే సమయంలో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ గార్లను కూడా న్యూస్  రీడర్లుగా ఎంపిక చేశారు.

1962 లో ఢిల్లీ వెళ్లి ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్ గా చేరిపోయారు. అప్పటికే అక్కడి తెలుగు వార్తావిభాగంలో శ్రీయుతులు పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బుచ్చిరెడ్డి, తిరుమలశెట్టి శ్రీరాములు పనిచేస్తున్నారు. శ్రీమతి జోళిపాల్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు తరువాత చేరారు.    

1967 లో మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం వచ్చింది.  సూర్యనారాయణ గారికి మాస్కో పోవాలని మనసులో పడింది.  కానీ ఆయనది రేడియోలో కాంట్రాక్టు ఉద్యోగం. స్టాఫ్ ఆర్టిస్ట్ కేటగిరీ. ప్రభుత్వ కొలువు కాదు. మాస్కో పంపడానికి రేడియో వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళాలి. మంచి ఉద్యోగం. ఎందుకు పోగొట్టుకోవాలి అని హితైషులు సలహా చెప్పారు. ఉన్న ఉద్యోగం వదులుకోవాలి అనే షరతు నచ్చని కందుకూరివారు, ఆ ఆఫర్  తిరస్కరించారు. దాంతో ఆఫీసు వారే దిగివచ్చి, మూడేళ్ళలోపు తిరిగొస్తే ఉద్యోగం ఉంటుందని హామీ ఇవ్వడంతో ఆయన మాస్కో ప్రయాణానికి అవరోధం తొలిగి పోయింది.

1967 లో మాస్కో వెళ్ళారు. ప్రాస్పెక్ట్ మీరా ప్రాంతంలో అపార్ట్ మెంటు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత  కుటుంబాన్ని పిలిపించుకున్నారు. అలా మాస్కో రేడియోలో తెలుగు ప్రసారాలను ఆయన మొట్ట మొదటిసారి ప్రారంభించారు. (ఇక్కడ ఓ స్వవిషయం ప్రస్తావించడం  అసందర్భం కాదనుకుంటున్నాను. సూర్యనారాయణ గారు మొదటి సారి మాస్కో నుంచి, రేడియో మాస్కో ద్వారా  తెలుగులో వార్తలు చదవడం ప్రారంభిస్తే, 1991 లో నేను అదే మాస్కో నుంచి అదే రేడియో మాస్కో ద్వారా చిట్టచివరిసారి తెలుగు వార్తలు చదివి అక్కడి తెలుగు ప్రసారాలకు మంగళం పాడాను. మా ఇద్దరి నడుమ తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు గార్లు రేడియో  మాస్కోలో పనిచేశారు.)

రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన తరువాత సూర్యనారాయణ గారి పనితీరు నచ్చి మరో ఏడాది పొడిగించారు. అలా మొత్తం మీద దాదాపు మూడున్నరేళ్ళు మాస్కోలో గడిపి, 1970 లో ఢిల్లీ తిరిగివచ్చారు.

ఆశ్చర్యం. ఢిల్లీ రేడియోలో ఉద్యోగం సిద్ధంగా వుంది. వెంటనే చేరిపోయారు. కానీ తరువాత తెలిసిందేమిటంటే ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ ఆయన సీనియారిటీ కోల్పోయారు. 1995 లో రిటైర్ అయ్యారు. ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు. భార్య శ్రీమతి కందుకూరి మహాలక్ష్మి. మంచి రచయిత్రి. నాలుగు కధా సంపుటాలు వెలువరించారు. 2020లో చనిపోయారు.

‘ఇన్నేళ్ళ మీ రేడియో జీవితంలో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగిందా?’

ఫోనులో గంటకు పైగా హైదరాబాదు నుంచి ఢిల్లీ లో వున్న కందుకూరి సూర్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత నేను అడిగిన ప్రశ్న ఇది.   

‘మీరూ రేడియోలో పనిచేసారు కదా! మీకు తెలియంది కాదు. జనరల్ న్యూస్ రూమ్ లో అనేక భారతీయ భాషా విభాగాలు వుంటాయి. అన్నింటికీ కలిపి ఉమ్మడిగా బులెటిన్ తయారు చేసి వివిధ విభాగాలకు పంపిస్తారు. మనం కొత్తగా కలపడం కానీ, లేదా ఉన్నది తీసివేయడం కానీ జరగడానికి వీల్లేదు. ఒకసారి  ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు నలుగురితోపాటు నన్నూ పిలిచి సత్కరించారు. నాతో  పాటు వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు కూడా పురస్కారాలు స్వీకరించారు. రేడియో తెలుగు వార్తల్లో చెప్పడానికి అధికారులు అభ్యంతర పెట్టారు. చివరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ పేరు లేకుండా తెలుగు వార్తల్లో చివరన చేర్చడానికి వారిని ఒప్పించేందుకు  చాలా కష్టపడాల్సి వచ్చింది.

‘సరే! మీరు అడిగారు కాబట్టి, ఇంకో సంగతి చెబుతాను. అరవైలలో కాబోలు గోవధను నిషేధించాలని కోరుతూ సాధువులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు భవనానికి దగ్గరగా వుండడం వల్ల రేడియో స్టేషన్ నుంచి ఇంటికి పోయే వీలు లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. దాంతో రెండ్రోజులు ఆఫీసులోనే వుండిపోవాల్సి వచ్చింది. అక్కడే పడక, అక్కడే భోజనాలు’ 

తొంభయ్యవపడికి ఏడాది దూరంలో వున్న వయస్సులో కూడా ఆయన స్వరంలో ఎలాంటి మార్పు లేదు.  స్పుటంగా వుంది. అంతసేపు మాట్లాడినా అలసట కనబడలేదు. స్వరాన్ని వరంగా పొందిన ధన్యుల్లో ఆయన ఒకరు.

అందుకే రేడియో వార్తలు చదివే రోజుల్లో కందుకూరివారికి అంతమంది అభిమానులు.

పాత్రికేయ మిత్రుడు, వ్యూస్ ఛానల్ ఎడిటర్  కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం గతంలో ఒకసారి  ఢిల్లీలో వున్న సూర్యనారాయణ గారితో ఫోన్లో మాట్లాడి,  డమ్మీ వార్తల బులెటిన్  చదివించి రికార్డు చేశారు.  ఆ లింక్ నాకు పంపారు.   

వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ లింక్ కింద ఇస్తున్నాను.

https://www.youtube.com/watch?v=K439p1kvmhs 

కింది ఫోటో: 

ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు కందుకూరి సూర్యనారాయణ గారితో నేను 



 


(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (90 ) – భండారు శ్రీనివాసరావు

రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ రేడియో గురించి రాసిన పోస్టులపై వచ్చిన అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీ రాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.
ఒక వార్త సేకరించడానికి, ఆ వార్తలను క్రోడీకరించి ఒక బులెటిన్ గా రూపొందించడానికి ఆకాశవాణి వార్తా విభాగంలో విలేకర్లు, ఎడిటర్లు ఎవరెంత కష్టపడినా, చివరికి శ్రోతల చెవిలో చేరేది న్యూస్ రీడర్ల నోటి మీదుగానే. వారి ఉచ్ఛారణ, స్వర మాధుర్యం, చదివే తీరు ఇవన్నీ కలిసి వార్తకు ప్రాణం పోస్తాయి. శ్రోతలను వినేలా ఆకట్టుకుంటాయి.
అలాంటి తెలుగు రేడియో న్యూస్ రీడర్లు గురించిన కొంత సమాచారం.
న్యూఢిల్లీ నుంచి:
కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, వావిలాల రాజ్యలక్ష్మి. సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్పకాలం)
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.
పెద్ద విశేషమేమిటంటే, మహాకవి శ్రీ శ్రీ సయితం కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు అనౌన్స్సర్ల సంఘం వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యేక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు (రిటైర్డ్) గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి.
విజయవాడ కేంద్రం నుంచి: జ్యోత్స్నాదేవి (తరువాత హైదరాబాదుకు మారారు), ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు ఈ ముగ్గురు పర్మనెంట్ న్యూస్ రీడర్లు. వీరిలో జ్యోత్స్నాదేవి అమెరికాలో సెటిల్ కాగా, ప్రయాగ రామకృష్ణ రిటైర్ అయ్యారు. కొప్పుల సుబ్బారావు రిటైర్ అయిన కొద్ది కాలానికే మరణించారు.
ప్రస్తుతం ఆ కేంద్రంలో పర్మనెంట్ న్యూస్ రీడర్లు వున్నట్టు లేదు, అందరూ క్యాజువల్ న్యూస్ రీడర్లే అని తెలిసింది. పొతే విజయవాడ నుంచి చాలామంది క్యాజువల్ అంటే అప్పుడప్పుడు వార్తలు చదివినవారిలో రెంటాల కల్పన (ప్రస్తుతం అమెరికా నివాసి), ఓంకార్, సాధన, గారపాటి నరసింహారావు వున్నారు. హైదరాబాద్ లో కాజువల్ న్యూస్ రీడర్ గా వున్న జీడిగుంట నాగేశ్వరరావు కొంతకాలం ప్రతివారం బస్సులో విజయవాడ వెళ్లి ఆదివారం ఉదయం వార్తలు చదివేవారు. విజయవాడ నుంచి వార్తలు చదివిన వారిలో, అరుణ, ఆరవల్లి జగన్నాధస్వామి, తూములూరి రాజేంద్రప్రసాద్. వీళ్ళలో జగన్నాధస్వామి ప్రస్తుతం హైదరాబాద్ స్టేషన్ లో ఎఫ్.ఎమ్.న్యూస్ కి క్యాజువల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారని విన్నాను. ఒక టీవీ ఛానల్ లో వార్తలు చదువుతున్న రామకృష్ణ, మరో టీవీలో వాయిస్ ఓవర్ చెపుతున్న శ్యామ్ కూడా విజయవాడ నుంచి వార్తలు చదివారు.
ఇక హైదరాబాదు నుంచి – నళినీమోహన్, డి.రాధాకృష్ణారావు, తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, మాడపాటి సత్యవతి, భండారు శ్రీనివాసరావు (అప్పుడప్పుడు, అసలు న్యూస్ రీడర్లు లభ్యం కాని రోజుల్లో అవసరార్థం వార్తలు చదవాల్సి వచ్చేది. అలాగే అయిదేళ్ళు రేడియో మాస్కో- మాస్కో నుంచి తెలుగు వార్తలు. నాకంటే ముందు కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు రేడియో మాస్కోలో పనిచేశారు. లిదా స్పిర్నోవా, విక్టర్ అనే తెలుగు తెలిసిన రష్యన్లు కూడా వార్తలు చదివేవారు. ఆ రోజుల్లో రాదుగ (విదేశీ భాషల రష్యన్ ప్రచురణ సంస్త) లో పనిచేసే ఆర్వీయార్ (ప్రముఖ రచయిత, రాళ్ళభండి వెంకటేశ్వరరావు) అప్పుడప్పుడు వార్తలు చదివేవారు) ఎం.ఎస్. లక్ష్మి (హైదరాబాదు ఎ ఐ ఆర్ కరస్పాండెంట్)
పోతే, హైదరాబాద్ నుంచి క్యాజువల్ న్యూస్ రీడర్ల విషయానికి వస్తే,
సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కొద్దికాలం చదివారు. అలాగే, ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు) రేడియోలో చేరక పూర్వం అతి కొద్దికాలం వార్తలు చదివారు.
కాజువల్ న్యూస్ రీడర్లలో మరికొందరు: పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి, మృణాలిని, పార్వతీ ప్రసాద్, వేదగిరి రాంబాబు, చంద్రమోహన్ (ప్రముఖ క్రీడా విశ్లేషకులు), జీడిగుంట నాగేశ్వర రావు, కృష్ణమోహన్ (జర్నలిస్ట్), జె. చెన్నయ్య, (ఓపెన్ యూనివర్సిటీ మాజీ ప్రధాన పౌర సంబంధ అధికారి), షర్ఫుద్దీన్ (షరీఫ్), రామ్మోహన్ నాయుడు, జొన్నలగడ్డ రాధాకృష్ణ, బుద్ధవరపు రామకృష్ణ (జర్నలిస్టులు), ప్రసాదరెడ్డి, అయాచితుల రవికిషోర్ (ఆంధ్రజ్యోతి), పొణంగి బాలభాస్కర్, చుండూరి వెంకట రంగారావు, అక్కరాజు నిర్మల్, పోపూరి మురళీకృష్ణ, వెంపటి కామేశ్వరరావు, సీహెచ్ రామఫణి, లలితారెడ్డి, భమిడిపాటి జ్యోత్స్న, ముదిగొండ సీతా శైలజ, అద్దంకి రాం కుమార్, మునిపల్లి వీణ
జీవన స్రవంతి చదివిన వారు : 1975 లో ఈ కార్యక్రమం మొదలు పెట్టిన దాదిగా 1987 లో మాస్కోవెళ్ళేంత వరకు నేనే చదివేవాడిని. తదనంతర కాలంలో చాలా కాలం వనం జ్వాలా నరసింహారావు, బుద్ధవరపు రామకృష్ణ, రాంపా, క్రొవ్విడి వెంకట రాజారావు, తిప్పారెడ్డి లక్ష్మారెడ్డి, వేదగిరి రాంబాబు, విద్యారణ్య. అద్దంకి రాం కుమార్.
ఇక ఈ జాబితా చివర్లో ప్రథముడు ఎవరయ్యా అంటే అద్దంకి రాం కుమార్.
మహాత్మా గాంధి, జవహర్ లాల్ నెహ్రూ. లాల్ బహదూర్ శాస్త్రి ఇలా ఎవరి స్వరాలు కావాల్సివచ్చినా, ఆ క్యాసెట్లకు కేరాఫ్ అడ్రసు రాం కుమార్. గోదావరి వంతెన మీద నుంచి రైలు వెడుతున్న చప్పుడు కావాలంటే రాం కుమార్. తుపాను గాలి హోరు, పారే నీటి గలగలలు, గుర్రపు డెక్కల చప్పుడు, నాకు తెలిసి ఇలాంటి రికార్డులు అన్నీ అతడి వద్ద సిద్ధంగా ఉండేవి. ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయం వారికి శంఖం ఊదుతున్నశబ్దంతో పనిపడింది. అప్పుడు కూడా శ్రీరాంకుమార్ సాయం కావాల్సి వచ్చింది. ఈ అమూల్య సంపదను డిజిటలైజ్ చేసాడో లేదో తెలియదు. ఇతడు ఢిల్లీ నుంచి హైదరాబాదు బదిలీ అయివచ్చిన తర్వాత న్యూస్ యూనిట్ లో కొందరికి పని లేకుండా పోయింది అంటే విడ్డూరం కాదు. ఆల్ రౌండర్. తనది కాని పనులు చేయడంలో ముందుంటాడు. రేడియో ఒక వ్యసనం. ఆ వ్యసనం వల్ల అతడికి మంచే జరిగింది. గొప్ప గొప్ప అవార్డులు లభించాయి. 2004 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుగా లక్ష రూపాయల నగదు అవార్డుతో సత్కరించింది. ప్రమోషన్ మీద రిటైర్ అయ్యాడు. నేను రిటైర్ అవడానికి కొన్ని సంవత్సరాలు ముందు అతడు మా యూనిట్ లో చేరాడు. ఆ కొద్ది కాలంలోనే అతడిలోని విభిన్న కోణాలను నేను చూడగలిగాను. పేరుకు మాత్రమే ప్రొడక్షన్ అసిస్టెంట్. కానీ రేడియోలో అతడికి తెలియని విద్యలేదు. అవుట్ డోర్ రికార్డింగు, ఎడిటింగ్ తో పాటు, వార్తలు చదవడం, జీవన స్రవంతి, వార్తావ్యాఖ్య, వార్తావాహిని ఇది అది అని లేకుండా అన్నిట్లో అతడి ముద్ర వుంది. అద్దంకి మన్నార్ గారి అబ్బాయి కదా!. వారసత్వంగా అబ్బిన లక్షణాలు.
(నేను రిటైర్ అయి ఇరవై ఏళ్ళుదాటింది. లబ్ధ ప్రతిష్టులు, తమ స్వరంతో రేడియో వార్తలకు, కార్యక్రమాలకు జీవం పోసిన తెలుగు న్యూస్ రీడర్లలో కానీ, క్యాజువల్స్ లో కానీ ఎవరయినా ఈ జాబితాలో కనిపించకపోతే, నూటికి నూరుపాళ్ళు ఆ తప్పు నాదే!)

కింది ఫోటో:
అద్దంకి శ్రీ రాం కుమార్



(ఇంకా వుంది)






19, ఫిబ్రవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (89 )- భండారు శ్రీనివాసరావు


 

ఆరేడేళ్ళక్రితం వరకు నాది ఊరుకుల పరుగుల జీవితమే. కాలు ఒకచోట పెట్టి నిలబడింది లేదు. 2005 లో రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఉరుకులు  మరో విధంగా, వివిధ టీవీ ఛానల్ చర్చల రూపంలో కొనసాగాయి. మా ఆవిడ మరణంతో 2019లో మొదటి బ్రేక్ పడింది. 2024 లో నా రెండో కుమారుడి ఆకస్మిక మరణంతో పూర్తిగా చతికిల పడింది. 

నా  జీవితంలో రేడియో ఉద్యోగం అనేది ఒక అరాచక పర్వం. నేను పనిచేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలో. కానీ ఏ ఒక్కరోజు నియమ నిబంధనలకు కట్టుబడి కానీ, లోబడి కానీ పనిచేయలేదు. పైగా  నా బల్ల మీద అడ్డం కింద  ‘ఇక్కడ నేనెవరికీ బాసును కాను, ఎవరూ నాకు బాసులు కారు’ అని ఒక కాగితం మీద రాసిపెట్టేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఆఫీసు టైములూ  గట్రా లేవు. ఆఫీసులో మొహం చూపిస్తే ఆ రోజు వచ్చినట్టు. చూపక పోతే బయట ఎక్కడో ఆఫీసు పని మీద, వార్తా సేకరణలో వున్నట్టు. ఇలా అందరికీ సాధ్యం అవుతుందా. కాదు. అలా వీలుండదు కూడా. నూటికో కోటికో కూడా అసాధ్యం. మరి నా విషయంలో అలా ఎందుకు సాధ్యపడింది? అందుకే అరాచకపర్వం అన్నది. ఇలా మినహాయింపులు పొందడానికి నా తత్వం కూడా ఉపయోగపడింది.

ఆలిండియా రేడియో ఒక పెద్ద సామ్రాజ్యం అనుకుంటే అందులో మా న్యూస్ యూనిట్ (ప్రాంతీయ వార్తా విభాగం) సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన ఓ చిన్న  సామంత రాజ్యం. సామంత రాజ్యం అని ఎందుకు అన్నాను అంటే మేము చేసే పని లేదా చూసే పని రేడియో వార్తలు. సేకరించడం, వాటిని గుదిగుచ్చడం, బులెటిన్లు తయారు చేయడం, వాటి అనువాదం సరిగా వుందా లేదా చూసుకోవడం, సరిగ్గా వేళకు  వార్తా ప్రసారం జరిగేలా జాగ్రత్త పడడం ఇవీ క్లుప్తంగా మా విభాగం బాధ్యతలు. వీటిల్లో స్థానికంగా వుండే ఇతర రేడియో పెద్దలకు సంబంధం వుండదు.   ఢిల్లీలో వుండే కేంద్ర వార్తా విభాగానికి మాత్రమే మా విభాగం జవాబుదారీ.

మరి ఇందులో నా పాత్ర ఏమిటి?  నేను చేసిన ఉద్యోగం పేరు అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) .  అధికారిక  విధులను బట్టి చూస్తే నిజానికి ఏమీ లేదు, వార్తా సేకరణ తప్పిస్తే. కానీ నేను నా పరిధి దాటి వ్యవహరించాను. 

శ్రీయుతులు  పన్యాల   రంగనాధ రావు గారు, నర్రావుల సుబ్బారావు గారు, మల్లాది రామారావు గారు, ఆర్ వీ వీ కృష్ణారావు గారు, ఆకిరి రామకృష్ణారావు గారు, ఆసయ్య  గారు, జేబీ రాజు  గారు  ఇలా చాలామంది న్యూస్ ఎడిటర్లు మితిమించిన  వాత్సల్యం చూపి నా విశృంఖలతను పెంచి పోషించారు. 

అయితే, తత్వం అని చెప్పాను కదా! అదే ఇంత ఆరాచకానికి కారణం.

హైదరాబాదు కేంద్రం నుంచి రోజుకు ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం మూడు  న్యూస్ బులెటిన్లు ప్రసారం అవుతాయి. వాటిని ఎడిట్ చేయడం ఎడిటర్ల పని. వారికి సహాయంగా అసిస్టెంట్ ఎడిటర్ న్యూస్ అనే హోదాలో  మాడపాటి సత్యవతి గారు పనిచేసేవారు. 

ఒక్కోసారి ఆ బాధ్యత నాకు అప్పగించేవారు. క్రమంగా నా పని ఉమ్మడి కుటుంబంలో కాపురానికి వచ్చిన కొత్త కోడలు మాదిరిగా తయారయింది. వారానికి మూడు రోజులు ఉదయం రేడియో స్టేషన్ కు వెళ్ళి వార్తలు ఎడిట్ చేసేవాడిని. హెడ్ లైన్స్ పెట్టే బాధ్యత కూడా నాదే.

ఇంటి నుంచి రానూ పోనూ ఆఫీసు వాహన సౌకర్యం వుండేది. ఉదయం పూట రెగ్యులర్ న్యూస్ రీడర్లు  రాకపోతే క్యాజువల్ న్యూస్ రీడర్లను బుక్ చేసేవారు, సురమౌళి , గుడిపూడి శ్రీహరి, పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గార్లు అప్పటికే రేడియో వార్తల పఠనంలో ఉద్ధండులు. కొంతకాలం మృణాలిని గారు కూడా ఉదయం వార్తలు చదివేవారు.  ఇక రెగ్యులర్ న్యూస్ రీడర్లు  తిరుమలశెట్టి  శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న దేవి గార్లు సరేసరి. వాళ్ళు చదివే వార్తలు వింటూ పెరిగిన వాడిని.  శ్రీనివాసరావు అన్నీ పనులు చేయగలడు  అని అనిపించుకునే నా తాపత్రయంతో  వాళ్ళలో కొందరు తమ బాధ్యతలను నాకు వదిలేసేవాళ్ళు. ఎడిట్ చేసే బాధ్యత క్రమంగా అనువాదం చేయడం వరకు పెరిగింది. ఆంధ్రజ్యోతిలో కాలాలకు కాలాలు అనువాదం చేసిన అనుభవం ఇలా అక్కరకు వచ్చింది. అదే క్రమంలో జీవన స్రవంతి, వార్తా వాహిని కార్యక్రమాల నిర్వహణ, వ్యాఖ్యానం, పఠనం, అసెంబ్లీ సమీక్షల పర్యవేక్షణ  అలా అదనపు బాధ్యతలు భుజానికి ఎక్కి కూర్చున్నాయి.

ఇలా రోజుకు ముప్పూటలా ఆఫీసు పనులు చేసుకుంటూ, ఆరు పూట్లా నా సొంతపనులు, ఇతరుల పనులు చక్కబెట్టుకుంటూ  కాలం దొర్లిస్తున్న  సమయంలో ..

ఒకానొక రోజు ఉదయం.

రేడియో వార్తల సమయం దగ్గర పడుతోంది. నా పనిలో నేనున్నాను.  న్యూస్ రీడర్ జాడలేదు. అప్పటికే బులెటిన్ మూడువంతులు సిద్ధం చేశాను. ఫోను మోగింది. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను అని సంజాయిషీ. ఫోను పెట్టేసి బులెటిన్ కాగితాలు క్రమపద్దతిలో సర్దుకుని పూనకం పూనినట్టు  స్టూడియోకి బయలుదేరాను. ఆ రోజుల్లో మా వార్తా విభాగం మెయిన్ స్టూడియోకి దూరంగా రేడియో ఆవరణలో ఒక పక్కగా వుండేది. అప్పటికి ఇప్పుడు వున్న స్టూడియో కట్టలేదు.  ఎవరైనా అనౌన్సర్‌లు ఖాళీగా వున్నారేమో అని వాకబు చేశాను. ఎవ్వరూ దొరకలేదు. వార్తల టైము పది నిమిషాలు వాళ్ళకి ఖాళీ సమయం. ఆ సమయంలో కాస్త బయటకి వెళ్లి, చాయ్ తాగి, గాలి పీల్చుకు వస్తారు. నేను ఒక్కడినే స్టూడియోకి వెళ్ళడం చూసి డ్యూటీ ఆఫీసరు పరిగెత్తుకుని వచ్చారు. నేను లైవ్ ప్రోగ్రాములకి కొత్త అని ఆయనకు తెలుసు. జీవన స్రవంతి, వార్తావాహిని లైవ్ కాదు. ముందుగా రికార్డు చేసి ప్రసారం చేస్తారు. వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో లైవ్ గా ప్రసారం చేస్తారు. డ్యూటీ ఆఫీసరు నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. దగ్గు వస్తే ఫేడర్  కిందికి లాగాలని, మళ్ళీ పైకి జరుపుకుని వార్తలు చదవాలని చెప్పి వెళ్ళి పోయాడు.

నేను న్యూస్ రిపోర్టర్ ని. వార్తలు చదవడం నా డ్యూటీ కాదు. పైపెచ్చు వార్తలు చదివే వాళ్ళు ఆడిషన్  టెస్టులో పాసవ్వావాలి.  పై అధికారుల అనుమతులు కావాలి. చెప్పాకదా! నా తత్వం గురించి. ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. సమయం మించకుండా వార్తా ప్రసారం మొదలు కావాలి. అంతే !

ఫేడర్ అంటారో ఇంకేమీ అంటారో నాకు తెలియదు. దాన్ని పైకి లాగి మొదలు పెట్టాను.

“ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  భండారు శ్రీనివాసరావు ..”

ఆ విధంగా మొదలయిన నా అరాచక పర్వం ఆకాశవాణిలో ఏళ్ల తరబడి సాగింది.

అరాచకం అంటూ మొదలవ్వాలి కానీ అది కొనసాగుతూనే వుంటుంది. ఆ విశేషాలు మరోసారి.

కింది ఫోటో:

ఆకాశవాణి స్టుడియోలో నేను.



(ఇంకా వుంది)