26, నవంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (17 ) - భండారు శ్రీనివాసరావు

 మా తాతగారు పర్వతాలయ్య గారికి భద్రాద్రి రామునిపై గురి. మా ఊరు నుంచి బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ భక్తి కారణంగానే కొడుకులకు రాఘవరావు అని, రామప్రసాద రావు అని పేర్లు పెట్టుకున్నారు.

ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు.  వారిద్దరికీ సంతానం లేకపోవడం వల్ల మా బాబాయి రామప్రసాద రావుగారిని  రెండో తాతగారు లక్ష్మి నారాయణ గారు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారిని మూడో తాతయ్య సుబ్బారావు గారు చిన్నతనంలోనే  దత్తు తీసుకున్నారు. తాతగారు పర్వతాలయ్య గారికి చిన్నతనంలోనే ఎనిమిదవ ఏట పెళ్లయింది. ఆప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట. ఇద్దరివీ పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులోనే,  ఇదిగో ఈకధ,  ఆమె నోట మొదటిసారి బయటకు వచ్చింది. (మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు రాసిన భండారు వంశం చరిత్రలో ఈ విషయాలు వెల్లడించారు) అలా పిల్లలు పుట్టడం దోషం అని భావించి  పుట్టగానేరోజుల బిడ్డగా వున్న మా నాన్నగారిని ఎరుకల బూశమ్మకు దానం ఇచ్చారట. ఆమె పిల్లవాడిని తన గుడిసెకు తీసుకుపోయింది. తరువాత ఆ పసివాడిని గంపలో పెట్టుకుని ‘పండ్లోయమ్మ పండ్లు’ అంటూ బూశమ్మ వూళ్ళో  తిరుగుతుంటేచెల్లమ్మగారు వెళ్లి,  ‘మాకు ఓ పండు కావాలి అమ్ముతావా’ అని అడిగి,  సోలెడు సజ్జలు బూశమ్మకు  ఇచ్చి పిల్లవాడిని కొనుక్కుని ఇంటికి తీసుకు వచ్చిందట. అలాఆ దోష పరిహారం జరిగిందన్నమాట. ఆ రోజుల్లో నమ్మకాలు అలావుండేవేమో మరి.

పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహ లలాటం, మురుగులు ధరించేవారు. మితభాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడుసాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు.

మా బామ్మగారిది పొరుగు గ్రామం కాకరవాయి (కాకరాయి). తండ్రి కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూపొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930 ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు తాతగారి హయాములో కాలిపోయిన భవంతి స్థానంలో ఇల్లు కట్టారని అంటారు. చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతంభాస్కర రామాయణంకంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కానిమా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కానిమా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు సంతకం పెట్టడం వరకు నేర్పించారట.

మా పెద్దన్నయ్య, అక్కయ్యలకు వారి చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు చదువు చెప్పేవారు.   తన దగ్గర చదువుకునే పిల్లల్ని,  ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మా అన్నయ్య, అక్కయ్యలు కలిసి చెల్లెమ్మగారికి,  ‘చదివినారు’ అనే పదం రాయడం నేర్పారు. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ‘ఇవ్వాళ  మీరు చదవలేదు’ అని రాస్తానని  వారిని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని వారికి తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక ‘చదివినారు’ అనే రాసిచ్చేది.

ఆమె ఎప్పుడూ తావళం తిప్పుకుంటూ, దైవ ధ్యానం చేసుకుంటూపిల్లలకు భారతభాగవతాల్లోని పద్యాలుకధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాలమీద పట్టు చిక్కడానికి,  సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం.

ఆమె  దాదాపు  95 సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంతపటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు  ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షంలోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పడుకుంది.

మా వూళ్ళో అప్పుడు పాతికముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి. మా చినతాతగార్లు ఇద్దరు సనాతన సంప్రదాయవాదులు. ఆ రోజుల్లో వైదికులు  చనిపోతే  వైదికులే మోయడంనియోగులు పోతే నియోగులే మోయడం వుండేది. సామాన్యంగా ఒకరికొకరు శవవాహకులుగా వుండేవారు కాదు. అలాటిది చెల్లమ్మగారు పోయినప్పుడు వైదీకులు అయిన ఇంగువ వెంకటప్పయ్యగారు కూడా ముందుకు వచ్చి మోశారు. ‘ఆమె ఎంతో పుణ్యాత్మురాలు. పరమ భాగవతోత్తమురాలు. సతతం రామనామ స్మరణలోనే జీవితం వెళ్ళతీసింది’ అని వెంకటప్పయ్య గారు అనేవారు. మా పెద్దన్నయ్యే ఆమెకు అంత్యక్రియలు చేశారు.

కింది ఫోటో:

భర్త, తండ్రి, కుమారుడు అందరూ  గతించినప్పటికీ ఎంతమాత్రం ధైర్యం కోల్పోకుండా ఒంటి చేత్తో గంపెడు సంసారాన్ని సంభాలిస్తూ, సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడిన మా బామ్మ రుక్మిణమ్మ గారు.   




(ఇంకావుంది) 

25, నవంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (16 ) - భండారు శ్రీనివాసరావు

 

ఆవు వెంట దూడలు కూడా (మా అక్కయ్య వెంట మేము) వచ్చాయని మా బావగారు అప్పుడప్పుడు జోక్ చేస్తుండేవారని మా అన్నపూర్ణక్కయ్య చెబుతుండేది. ముందు మా పెద్దన్నయ్య, తర్వాత నేను, ఆ తర్వాత పెళ్ళికావాల్సిన మా ఏడో అక్కయ్య భారతి ఇలా అందరం మా సరసక్కయ్య వెంట బావగారి ఇంటికి చేరినవాళ్ళమే. అలా పైకి నవ్వులాటకు అన్నా, పెట్టుపోతల విషయంలో ఆయనది వెన్నపూస మనస్తత్వం. నిజానికి నా చదువు ఒక దారికి రావడానికి అయినా, మా ఏడో అక్కయ్యకు పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేయడంలో అయినా, మా బావగారి పాత్ర గొప్పది. ఆయన ఇంటి పేరిట వారు, నూజివీడు జమీందార్ దగ్గర దివానుగా పనిచేసిన తుర్లపాటి భైరవేశ్వరరావు గారు ఆయనకు జ్ఞాతులు. ఆయనకు బెజవాడ గాంధీ నగర్ లో విజయ ఫిలిమ్స్ ఎదురుగా ఒక పెద్ద మేడ వుంది. ఆయన కుమారుడు పాండురంగారావు మద్రాసులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఏడో అక్కయ్యకు ఆ సంబంధం ఖాయం చేశారు. అప్పటికి మా నాన్నగారు కాలం చేశారు. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారే అంతా నెత్తిన వేసుకుని పెళ్లి జరిపించారు. మా పెద్ద వదిన గారి పెద్దనాన్న కొండపల్లి రామచంద్ర రావు గారెకి బెజవాడ విజయ టాకీసు ఎదురు రోడ్డులో పెద్ద మేడ వుండేది. ఇప్పుడు దాని ముందు షాపులు వచ్చినట్టున్నాయి. ఆ ఇంటి ముందు జాగాలో పెళ్లి పందిరి వేసి (అప్పటికి షామియానాలు లేవు) పెళ్లి చేశారు. మా వూరి నుంచి హనుమయ్య గారనే వంట బ్రాహ్మణుడు బెజవాడ వచ్చి, గాడి పొయ్యి తవ్వి గుండిగెలతో  వంటలు వండడం నాకు గుర్తు. మద్రాసులో చదువుతున్న మా బావగారి స్నేహితులు చాలామంది పెళ్ళికి రావడంతో మా వాళ్ళు కంగారు పడుతుంటే, హనుమయ్య గారు తాపీగా ఏం పర్వాలేదు మరో పాతికమంది వచ్చినా ఏం లోటు రాకుండా చూసుకుంటానని  హామీ ఇచ్చి అన్నట్టుగానే పెళ్లి వారి నుంచి ఏ మాటా రాకుండా చూశారు. భైరవేశ్వర రావు గారు వయసులోనే కాకుండా మనిషి కూడా చాలా పెద్దమనిషి. లోటుపాట్లను పెద్దమనసు చేసుకుని, మనసులోనే పెట్టుకుని  శుభకార్యంలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా హుందాగా వ్యవహరించారు. ఆ విధంగా మా ఏడో అక్కయ్య వివాహం కూడా జరిగి పోయింది. ఇద్దరు అక్కయ్యలది ఒకే ఊరు కావడంతో నాకు చాలా వెసులుబాటుగా వుండేది.

ఈ పెళ్లి జరగడానికి చాలా కాలం క్రితమే మా నాన్నగారు రాఘవయ్య గారు ఏదో తెలియని జబ్బుకు గురై మంచాన పడి, కాలం చేశారు. మనిషి చనిపోవడం అంటే ఏమిటో నాకు  తెలియని చిన్న వయస్సులోనే కన్ను మూసాడు.

కంభంపాడులో చనిపోతే,  యాభయ్ మైళ్ళ దూరంలో వున్న బెజవాడకు ఆ కబురు అందడానికి రెండు రోజులు పట్టింది. కబురు మోసుకొచ్చిన బ్రాహ్మడు ఏదో చెప్పడం, మా అక్కయ్య గుండెలు బాదుకుంటూ ఏడవడం లీలగా గుర్తు. బస్సు పట్టుకుని పెనుగంచిప్రోలు వెళ్లి, బండి కట్టుకుని కంభంపాడు చేరే సరికి, దహన కార్యక్రమాలు పూర్తయి,  కర్మతంతు మొదలయింది. కర్తగా మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు గుండుతో కనబడ్డారు. వచ్చిన చుట్టపక్కాలు నన్ను పొదివి పట్టుకుని ఏడుస్తుంటే, ఏమీ అర్ధం చేసుకోలేని వయస్సు. అప్పటినుంచి మా నాన్నగారి ఆబ్దీకాలు ఏటా పెడుతూనే వచ్చాము. కంభంపాడులో ఈ తద్దినాలకు ఒక ఉత్సవ రూపం కలిగించిన ఘనత మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుది. డిసెంబరులో వచ్చే ఈ తద్దినానికి చుట్టపక్కాలందరికీ నవంబరు నుంచే పిలుపులు వెళ్ళేవి. తద్దినాలకు పిలుపులు ఏమిటని అంతా ఆశ్చర్యపోయేవారు. ఉత్త పిలుపులతో సరిపుచ్చకుండా పదేపదే వరస ఉత్తరాలు రాసి అందరికీ గుర్తు చేసేవాడు. ఏడుగురు అక్కయ్యలూ, బావలూ, వారి పిల్లలూ, నలుగురం అన్నదమ్ములం అందరం ఏటా ఒకచోట కలిసే సందర్భంగా మారిపోయింది మా నాన్న తద్దినం. మా చిన్నక్కయ్య నవ్వుతూ అనేది, మా ఇంట్లో పెళ్ళిళ్ళు తద్దినం లాగా సింపుల్, తద్దినాలు మాత్రం పెళ్ళిళ్ళు లాగా చాలా పెద్దఎత్తున జరుగుతాయని. పక్కజిల్లా ఖమ్మం జిల్లా రెబ్బవరంలో వుండే మా రెండో బావగారు రామచంద్ర రావు గారు  రెండు గుడిసె బండ్లలో పెద్ద పెద్ద గిన్నెల్లో తోడు పెట్టిన పెరుగు, వాళ్ళ తోటలో పండిన పండ్లు, కాసిన కాయకూరలు పెట్టి ముందు రాత్రే ఆ బండ్లను బయలుదేరతీసేవారు. కుటుంబం అంతా బస్సులో బొమ్మకల్లు చేరే సరికి ఆ బండ్లు కూడా అక్కడికి చేరేవి. బస్సు దిగి ఆ బండ్లు ఎక్కి వత్సవాయి మీదుగా, వేములవరం, అక్కడి నుంచి బళ్లబాటలో కంభంపాడు చేరుకునే వారు.  మా ఇంటి బ్రాహ్మణులు ఇంగువ వెంకటప్పయ్య గారు చాలా శాస్త్రీయంగా ఆ కార్యక్రమం చేసేవారు. దాంతో భోజనాల వేళ మించిపోయేది. చివరికి ఇది అందరికీ అలవాటయి పోయింది. తద్దినం భోజనం అంటే సాయంత్రం నాలుగు దాటాల్సిందే. ఇక ఊరబంతి పూర్తయ్యేసరికి రాత్రి బాగా పొద్దు పోయేది. పెట్రోమాక్స్లైట్లు పెట్టి చిన్న పిల్లలనాటికలు, డాన్సులతో ఊరివారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది.  దశాబ్దాలపాటు ఈ బరువును మా మూడో అన్నయ్య, బాధ్యతను మా పెద్దన్నయ్య మోశారు.  వారిద్దరూ కన్ను మూసిన తరువాత, తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్ర నుంచి కర్త పాత్రకు మారాను. మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గురించి కొంత చెప్పాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన పూనుకుని ఊరి పొలిమేరలో వున్న మా తోటలో అమ్మా నాన్నల గుడి కట్టించాడు. దీనికి మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు అమ్మపర్తి అని నామకరణం చేశారు. అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించాడు. ఆ ప్రదేశం మా కుటుంబానికి రాజ్ ఘాట్.  ఎవరం మా ఊరు వెళ్ళినా, అమ్మా నాన్నల గుడికి వెళ్లి దండం పెట్టుకుని రావడం ఆనవాయితీగా మారింది. 

విషాదం ఏమిటంటే చనిపోయిన మా పెద్దన్నయ్య, మూడో అన్నయ్య స్మారక స్తూపాలు  కూడా ఆ చెంతనే నిర్మించాల్సి రావడం. 

కింది ఫోటోలు: 

కంభంపాడులో మా అమ్మా నాన్నల గుడి. చనిపోయిన మా అన్నగార్ల స్మారక స్తూపాలు. మా నాన్నగారి అంతిమ ఘడియల్లో మా బావగారు హనుమంతరావు గారు తన దగ్గర వున్న కెమేరాతో తీసిన మా నాన్న అస్పష్ట చిత్రం. దీని ఆధారంగా మా రెండో అన్నయ్య రామచంద్ర రావుగారు ఒక చిత్రకారుడి సాయంతో గీయించిన మా నాన్న గారి ఊహా చిత్రం. 











(ఇంకా వుంది)

24, నవంబర్ 2024, ఆదివారం

పద్నాలుగు పక్కన అయిదు సున్నాలు

  

నేనో పెద్ద జీరో అని మొదలు పెడితే నా బ్లాగు (bhandarusrinivasarao.blogspot.com) వాడు పద్నాలుగు పక్కన అయిదు సున్నాలు చేర్చి నా బ్లాగ్ వ్యూయర్స్ సంఖ్య 14,00,000 దాటిపోయిందని అంటున్నాడు. 

ఏదో విధంగా కొన్ని లక్షలు నా ఖాతాలో చేరాయి, బ్యాంకు ఖాతాలో కాకపోయినా. (బ్యాంకులో చేరినా ఖర్చు చేసుకుంటూ ఆనందించే వయసు ఎప్పుడో దాటి పోయాను, ఇప్పుడు ఈ లక్షలే కోట్లతో సమానం) 

బ్లాగు వీక్షకులందరికి ఒక్క నమస్కారంతో సరిపుచ్చుతున్నాను.



(Courtesy Image Owner)


అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (15 ) - భండారు శ్రీనివాసరావు

 మా బావగారు హనుమంతరావు గారు కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. అంచేత ఆయనకు చదువు విలువ డబ్బు విలువ రెండూ తెలుసు. తన అవసరాలు తగ్గించుకుని అవసరంలో ఉన్న చదువుకుంటున్న విద్యార్ధులకు చేతనైనంత సాయం చేసేవారు. ఆ రోజుల్లో వారాలు చేసుకుని చదువుకునే పిల్లలు పిల్లలు వుండేవాళ్ళు. ఈ తరం వారికి అసలు ఇదేమిటో తెలియకపోవచ్చు. వారంలో ఏడు రోజులూ ఒక్కొక్క రోజు వారం ఒప్పుకున్న వారింటికి పోయి, వాళ్ళు పెట్టింది తిని వెళ్లి చదువుకునేవారిని వారాలబ్బాయి అనేవారు. మా బావగారింటికి కూడా ఇలా వారాల పిల్లలు వస్తుండే వాళ్ళు. సోమవారం వచ్చిన పిల్లాడు మళ్ళీ అదే వారం నాడు వచ్చేవాడు కాబట్టి, పేర్లు, మొహాలు తెలిసినా కూడా పెద్ద పరిచయం పెంచుకోవడానికి వీలుండదు. ఇంట్లోనే ఆరుగురు పిల్లలం వుండేవాళ్ళు. కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి మాకు మేము చాలు. కాకపోతే మా బావగారు కోర్టుకు వెళ్లి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవరకు మాత్రమే వెసులుబాటు. ఆయన ఇంట్లో వుంటే ఎమర్జెన్సీ. అందరం గప్ చుప్!

ఇంట్లో పనులను, పనులు అంటే అంట్లు తోమడం కాదు,  వయసుని బట్టి చేసేవాళ్ళం. పొట్టు పొయ్యి మధ్యలో రోకలి పెట్టి పొట్టు గట్టిగా కూరడం, కాగులో నీళ్ళు పోసి కాగ బెట్టడం, మంచి నీళ్ళ కూజాలో నీళ్ళు పట్టడం,  ఫినాయిల్ తో గదులు తుడవడం, బజారుకు పోయి సరుకులు తీసుకురావడం ఇలాటి పనులన్న మాట. ఇక్కడ స్వపర బేధం లేదు. సొంత పిల్లలకు కూడా ఈ చాకిరీ తప్పదు. ముందే చెప్పినట్టు ఏ వయసుకు తగిన పని ఆ వయసువాళ్ళం చేసేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పనులు చేయడం మా అందరికి సరదాగా వుండేది. బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మరింత మనసు పెట్టి చేసేవాళ్ళం. మా అక్కయ్య కూడా కనిపెట్టి చూస్తూ కష్టం తెలియకుండా ఏవో అప్పచ్చులు చేసి పెట్టేది. ఇంటి ఖర్చుకు ఇచ్చిన డబ్బుల్లో కొంత పొదుపు చేసి, బావగారు కోర్టు నుంచి వచ్చేలోగా తలా పావలా ఇచ్చి మ్యాట్నీ సినిమాకు పొమ్మనేది.  ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన రేడియోలో ఇంగ్లీష్ వార్తలు విని రేడియో కట్టేసి ఇంటి ఖర్చులన్నీ తీరిగ్గా ఒక డైరీలో రాసేవాడు. ఇలా ఏళ్ళ తరబడి రాసిన డైరీలు ఆయన బల్ల సొరుగులో దాచి పెట్టేవాడు. కాస్త ఎరుక తెలిసిన తర్వాత నాకిదంతా దండగమారి వ్యవహారంలా అనిపించేది. రూపాయి ఆపైన అయితే పర్వాలేదు, అణా, అర్ధణా ఖర్చు కూడా రాసేవాడు. ప్రతి కాణీ లెక్క చెప్పడానికి మా అక్కయ్య చాలా ఇబ్బంది పడేది. అడిగిన వచ్చాయి  డబ్బు ఎంతయినా లేదు అనకుండా ఇచ్చేవాడు. అయితే లెక్క తప్పకుండా చెప్పాలి. అదొక్కటే రూలు. మేము పెద్దయి ఉద్యోగాల్లో కుదురుకున్న తర్వాత కూడా చిన్నచిన్న అవసరాలకు పాతికా, యాభయ్ రూపాయలు కావాల్సి వస్తే, ఆయన బ్యాంకు తెరిచే టైముకు అంటే రాత్రి తొమ్మిదిన్నరకు వెళ్లి జమాఖర్చులు రాసుకుంటున్న మా బావగారి బల్ల పక్కన ఏమీ మాట్లాడకుండా కాసేపు నిలబడే వాళ్ళం. ఆయన తలెత్తి చూసి ఏం మిస్టర్ ఈ టైములో వచ్చావు, డబ్బు కావాలా అనేవారు. ఒకవేళ ఆయన మమ్మల్ని  గమనించక పొతే, మా అక్కయ్యే కల్పించుకుని, వాడు వచ్చి చాలాసేపు అయింది, ఏం కావాలో కాస్త కనుక్కోండి అనేది. ఏమైతేనేం చేబదులు అవసరం అయితే ఇలా చేస్తే చాలు అని మాకు బోధ పడింది. కానీ నా తరహా వేరు కదా! జీరో తెలివితేటల బుర్ర కదా! పాతికా యాభయ్ కోసం ఇంత టైం వేస్టు ఎందుకని, నేను ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లోనే సిటీ బస్సులో వన్ టౌన్ కు వెళ్లి మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి అవసరం యాభయ్ అయితే  వంద రూపాయలు వడ్డీకి తెచ్చేవాడిని. అవసరం అయినప్పుడు బస్సులో వెళ్లి అప్పు తెచ్చిన వాడిని, అవసరం  తీరాక, జీతం వచ్చినప్పుడు అప్పు తీర్చి  నగ వెనక్కి  తీసుకురావడానికి బద్దకించేవాడిని.  ఆ విధంగా  మా ఆవిడకు పుట్టింటి వారు పెట్టిన  ఉంగరాలు, ముక్కు పుడకలు  కృష్ణార్పణం చేశాను. తను ఈ విషయంలో నన్ను ఒక్క మాట అనేది కాదు. ఇంటి కోసమే కదా అని సరిపుచ్చుకునేది. అదే బాకీలు మా బావగారి దగ్గర చేస్తే ఇలా జరిగేది కాదు. నా ముట్టె పొగరుకు మా ఆవిడ మూల్యం చెల్లించింది. నేనూ మనిషినే కదా! రష్యా నుంచి మధ్యలో ఓసారి సెలవు మీద హైదరాబాదు వచ్చినప్పుడు  మా ఆవిడకు రెండు జతల బంగారు గాజులు కొనిపెట్టాను. ఆ సంగతి తెలిసి మా హనుమంతరావు బావ హాస్యంగా అన్నాడు, ఈ వైభోగం ఎన్నాళ్ళులే అని. ఆయన అన్నట్టే, మాస్కోకి తిరుగు ప్రయాణం రోజునే మా ఆవిడను హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు. చుట్ట పక్కాలు అందరూ తలా ఓ చేయి వేశారు. కానీ కొత్తగా కొన్న చేతి గాజులకి  కాళ్ళు వచ్చాయి. మరి ఇలాంటి నిర్వాకాలు చేసే వాడిని బిగ్ జీరో అనక ఏమంటారు. ఒకరు అనే లోగా నన్ను నేనే అనుకుంటున్నాను.    

 

బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్న నాకు హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. మంచీ చెడ్డా మాట్లాడుకున్న తర్వాత విజయవాడ  వదిలి హైదరాబాదు వెళ్ళాలనే నిర్ణయం ఖరారు అయింది, నండూరి రామమోహన రావు గారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా. ‘మా పత్రిక ఓ ట్రైనింగ్ సెంటర్ అయింది మీ వంటి వాళ్లకి, కొన్నాళ్ళు పనిచేయడం, పని నేర్చుకుని వెళ్ళిపోవడం అన్నారాయన నిష్టూరంగా నేను రేడియో ఉద్యోగం గురించి చెప్పగానే.  

 

ఆంధ్రజ్యోతిలో దాదాపు అయిదేళ్లు ఉద్యోగం వెలిగించి హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగంలో చేరడానికి తట్టా బుట్టా సదురుకున్నాము. మామూలుగా అయితే మాది రెండు రిక్షాల్లో పెట్టుకుని కొత్త ఇంటికి వెళ్ళగల తక్కువ సామానే. కానీ ఏదో ప్రభుత్వ బ్యాంకు వాళ్ళు జర్నలిస్టులకు తలా ఒక వేయి రూపాయలు అప్పిస్తాం రమ్మన్నారు. పోలోమని పరిగెత్తాం. ఇలా పరిగెత్తిన వాళ్ళలో తదనంతర కాలంలో ప్రముఖ పత్రికలకు ఎడిటర్లు అయిన వాళ్ళు కూడా వున్నారు. వాళ్ళు ఆ అప్పుతో సైకిళ్ళు కొనుక్కున్నారు. ఇంటి పక్కనే ఆఫీసు. సైకిల్ అనవసరం ఓ ఇనుప బీరువా కొనుక్కుందాం అంది మా ఆవిడ. అడక్క అడక్క అడిగింది అని  గాంధీ నగరం వెళ్లి ఓ దుకాణంలో స్టీలు బీరువా బేరం చేసి, ఇంటికి వాళ్ళే షరతుపై ఆరువందల్లో ఒక బీరువా కొని, మమతా హోటల్లో భోంచేసి, ఊర్వశి దియేటర్లో సినిమా చూసి ఇంటికి చేరాము. ఇప్పుడు హైదరాబాదు చేరడానికి అదే భారం అయింది. దానికోసం లారీలో పంపాల్సిన పరిస్థితి. టీవీ భాషలో చెప్పాలి అంటే ఓ వెయ్యి రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్తి. పరిస్థితి ఇదీ అని చెబితే  ఆ మొత్తం ఆయనే సదిరే వారు. కానీ నా మానసిక పరిస్థితి వేరు కదా!

అందుకే నా తరహాలో ఆలోచించి మర్నాడు ఫస్ట్ బస్సు ఎక్కాను, పెనుగంచి ప్రోలు వెళ్లడానికి. అక్కడ ప్రాధమిక పాఠశాలలో  ప్రధానోపాధ్యాయుడిగా  పాతికేళ్ళ క్రితం పదవీ విరమణ చేసి నెలకు చిన్న మొత్తంలో పించను పుచ్చుకుంటున్న మా బంధువును ఒకరిని  కలవడానికి.

‘రేడియోవాళ్ళు  నీకెంత జీతం ఇస్తారు?

వెళ్లి కలవగానే ఆయన నన్ను అడిగిన ప్రశ్న.

మా కుటుంబంలో చిన్నా పెద్దా అందరికీ ఆయన మామయ్యే. చంద్రం మామయ్య. ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పాతికేళ్ళ క్రితం  రిటైరయి నెలకు ఎనభయ్ రూపాయలు పించను పుచ్చుకుంటున్నాడు. కొంత భూమీ పుట్రా వుంది. దాని మీద అయివేజు, పించను డబ్బులు కలిపి పొదంగా, ఏ చీకూ చింతా లేకుండా  జీవితం గడుపుతున్న పెద్దమనిషి ఆయన. నిక్కచ్చిగా వ్యవహారం చేసే తత్వం కాబట్టి నికరంగా ఎంతో కొంత రొక్కం చేతిలో వుండేవుంటుంది. అందుకే ఆయన గుర్తు వచ్చాడు.

బేసిక్ 325, ఇతర అలవెన్సులు అదనం” అని మాత్రం వుంది నాకొచ్చిన నియామక పత్రంలో.

1975లో ఆంధ్రజ్యోతిలో నా నెల జీతం అక్షరాలా నూట డెబ్బయి అయిదు. అప్పటికి అయిదేళ్ళు అయింది అక్కడ చేరి.

“ఖచ్చితంగా తెలియదు కానీ, 325 మాత్రం నికరం.” నా జవాబు.

అప్పుడాయన నాకు జీవితానికి సరిపడే భగవద్గీత చెప్పాడు. అది ఆచరిస్తే జీవితపు చరమాంకంలో అందరూ ఆయనలాగే నిశ్చింతగా కాలం గడిపే వాళ్ళేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.

“ఒరేయ్ సన్నాసీ. (ఆయన అందర్నీ అలాగే పిలుస్తాడు) నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకో. అలవెన్సులూ అవీ కలిపి నీకు అయిదు వందలు వస్తుందనుకుందాం. అందులో 499 ఖర్చు పెట్టుకో. పరవాలేదు, సుఖపడతావు. అయిదు వందలూ తగలేయి. సుఖపడక పోయినా కష్టపడవు. ఒకర్ని చేయి చాచి అడిగే దుస్థితి రాదు. వచ్చేది అయిదు వందలు అయితే, ఒక్క రూపాయే కదా అని 501  ఖర్చు పెట్టావు అనుకో. ఇంతే సంగతులు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఆదాయాన్ని మించి చేసే ఆ ఒక్క రూపాయి ఖర్చయినా, అప్పయినా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో  వందలు, వేరుగా పెరిగి నీ మెడకు చుట్టుకుంటుంది. మెడలోతు గోతిలో పడతావు సుమా!”

ఇలాంటి మాటలు చెవికెక్కే వయసు కాదు నాది. పైగా అవన్నీ చాదస్తం మాటలు అని కొట్టిపారేసే వయసు.

చంద్రం మామయ్య  నేను అడిగిన చేబదులు సర్దుబాటు చేసాడా అన్నది కాదు ప్రశ్న. చివరికి  ఆయన చెప్పినట్టే జరిగిందన్నది నా జవాబు.  

 

తత్వం బోధపడే వేళకు అనుభవం వస్తుంది. కానీ ఏం లాభం?

 

కింది ఫోటో :

మట్టి కూజా  (గూగుల్ సౌజన్యం  



(ఇంకా వుంది)

23, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (14 ) - భండారు శ్రీనివాసరావు

 


నేను అంతవరకూ మా ఊళ్ళో గడిపిన జీవితం వేరేగా వుండేది.

జారిపోతున్న నిక్కరును పైకి లాక్కుంటూ, కారుతున్న  ముక్కును  చొక్కాతోటే తుడుచుకుంటూ బొందు (చెక్క ఫ్రేం ఉన్న) పలక బలపం  పెట్టుకున్న గుడ్డ సంచీ ఊపుకుంటూ మిగిలిన పిల్లలతో  కలిసి మా ఇంటికి కొంచెం  దూరంలో వున్న మా బడికి  వెళ్ళేవాడిని. దారిలో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆగి అక్కడ చెట్టు నీడలో కాసేపు ఏవో ఆటలు ఆడి తీరికగా బడికి చేరే వాడిని. ఆలస్యంగా వచ్చిన నన్ను చూసి అప్పయ్య మాస్టరు గుడ్లు ఉరిమి చూసేవాడు. చచ్చే భయం వేసేది. ఇంటికి వచ్చి మా బామ్మతో చెబుతాడేమో అని. కానీ అది కాసేపే. పలక మీద అ ఆలు దిద్దించే వారు. రాసిందే రాయడం అంటే చీకాకు వేసేది. దిద్ది దిద్ది అ అనే అక్షరం ఒక పెద్ద సున్నా మాదిరిగా తయారయ్యేది. పైగా దిద్దేటప్పుడు అ అంటూ నోటితో పెద్దగా అంటూ దిద్దాలి. క్లాసు క్లాసంతా అ ఆ అంటూ వుంటే  ఏదో గుళ్ళో ఓంకార నాదంలా మారు మోగేది. మా చేత ఇలా దిద్దించడం మొదలు పెట్టి అప్పయ్య మాస్టారు పై క్లాసు పిల్లల దగ్గరికి వెళ్ళే వాడు. అదెక్కడో కాదు, మాకు అడుగు దూరంలో, మా పక్కనే. అలా అన్ని క్లాసులకు ఆయనే మాస్టారు. మాకు అ ఆ లు, మరో క్లాసు వారికి ఎక్కాలు, ఇంకో క్లాసు వారికి గుణింతాలు.  ఇలా మధ్యాన్నం దాకా సాగేది. అంతసేపు కుదురుగా కూర్చోవడం చేతకాని, అలవాటులేని నేను మరికొందరం వెళ్లి చిటికిన వేలు చూపి, బయటకు వెళ్ళాలి అని అడిగే వాళ్ళం. ఆయనకు ఇష్టం లేకపోయినా సరే పొమ్మని చేత్తో కసిరేవారు. మేము బయట పడి దగ్గరలో వున్న చింతతోపులో దూరి మళ్ళీ ఆటలు. అక్కడికి దగ్గరలోనే ఉన్న నీలిబావి వద్దకు వెళ్ళే వాళ్ళం. నిజానికి అది బావి కాదు. నీలి మందు తయారు చేయడం కోసం కోసం గచ్చుతో దాన్ని నిర్మించారు. అసలు నీలి మందు అంటే ఏమిటో, ఎలా తయారు చేస్తారో, ఎందుకు వాడతారో నాకు ఇప్పటికీ తెలియదు. మా ధ్యాసల్లా ఎక్కడో ఒకచోట చేరి ఆడుకోవడం. మా ఈ పిల్ల చేష్టలు అన్నీ అప్పయ్య మాస్టారు నోటంట వినీ వినీ మా అమ్మ నిర్ధారణకు వచ్చేసింది వీడు ఈ ఊళ్ళో ఇలా వుంటే చెడిపోవడం ఖాయం అని.  ఇలా వుండగా, ఆ ఏకోపాధ్యాయ పాఠశాలకు భద్రయ్య గారని మరో మాస్టారిని వేశారు. ఆయన రాకతో అప్పయ్య గారికి కొంత పని భారం తగ్గింది కానీ, మాకు కష్టాలు పెరిగాయి. ఆయన బయట నుంచి వచ్చిన వాడు, కనుక ఊరివాళ్ళతో మొహమాటాలు లేవు. కాబట్టి మా చిటికినవేలు ట్రిక్కులు పట్టించుకునేవాడు కాదు. దాంతో ఆయన్ని మంచి చేసుకోవడానికి ఇంటి నుంచి కూరగాయలు, వేరు శనగ కాయలు పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. వద్దు అనకుండా తీసుకునేవాడు. తర్వాత మామూలే. వంగతోట దగ్గర సామెత.

అసలు ఈ బడిని  అప్పయ్య గారి తండ్రి శివరాజు నాగభూషణం గారు ఒక వీధి బడి మాదిరిగా ఇంటి అరుగు మీద మొదలు పెట్టి, ఊరివారి సహకారంతో సంపాదించిన స్థలంలో నాలుగు మట్టి గోడలు లేపి మధ్యలో ఒకే ఒక దూలంతో వేసిన పాకబడిగా మార్చారు. తరువాత ప్రభుత్వం తీసుకున్నట్టుంది. మా అన్నయ్యల చదువులు అన్నీ ఈ బడిలోనే మొదలయ్యాయి. ఈ బడి అరుగు బడిగానే వున్నప్పుడు రెబ్బారం నుంచో మరెక్కడి నుంచో గుర్తు లేదుకానీ ఒక పంతులు గారు ఉపాధి నిమిత్తం మా ఊరు వచ్చి మా  అన్నయ్యలకు ఇంట్లోనే చదువు నేర్పే వాడని విన్నాను. ఆయన మహా కోపిష్టి. మాట వినకపోతే గోడకుర్చీ వేయించేవాడట. కోదండం వేయించడం (దూలానికి తలకిందులుగా వేలాడ తీయడం) వంటి శిక్షలు కూడా వుండేవి.  మా పెద్దన్నయ్య కాలంలో పలకలు, బలపాలు  లేవని, ఇసుకలో వేలితో  అక్షరాలు దిద్దించే వారని కూడా విన్నాను.  

మొత్తానికి నా చదువు మొదటి తరగతి కూడా పూర్తి కాకుండానే ముగిసింది. కంచికి  చేరుతుంది అనుకున్న కధ కాస్తా మలుపు తిరిగి బెజవాడ చేరింది.

బెజవాడ అనగానే చాలామందికి చాలా గుర్తుకు వస్తాయి కానీ నాకు వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎల్వీ రమణ అనే లంక వెంకట రమణ. ఈయన ఎవరంటారా? తెలుసుకోవాలంటే  ఈ కధను రెండు దశాబ్దాలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేయాలి. బెజవాడనుంచి విజయవాడకు మారాలి.

అవి నేను విజయవాడ లబ్బీపేట ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంధ్ర ఆంగ్లభాషల్లో దిట్ట. మధ్యాన్న భోజనసమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయేవాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే  నా భోజనం. ఆయన అక్కడే చాప మీద  వరదరాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని, మధ్య మధ్య మా ఆవిడ చేసిపెట్టిన పకోడీలు నోట్లో వేసుకుని నములుతూ   అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి. అలా చెప్పిన కబుర్లలో బెజవాడ గురించి తాను చేసిన పరిశోధన గురించి అనేక విషయాలు చెబుతూ వుండేవారు.

“చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ చూసిన బెజవాడ ఎలా ఉండేదో రమణ చెప్పాడు. క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్యరాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి పుణ్యక్షేత్రం.  (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి  తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు.  బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లావాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.  

ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.

ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా  మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.

హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు.

ఈ విషయాలు రమణ నోటంట విన్న తరువాత ఆయన మీద నాకున్న గౌరవం వేయి రెట్లు పెరిగింది. కృష్ణానది మీద ప్రకాశం బరాజ్ కట్టక ముందు ఒక ఆనకట్ట వుండేది. దాని పూర్వాపరాలు కూడా రమణ గ్రంధస్థం చేశాడు.

కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాలనుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల  తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా  పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి  134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణమూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలనిసమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ, అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగిపోతుందనీ, ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది. ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. కష్టం వుంది. చిందించిన స్వేదం వుంది.

డెబ్బయ్ ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం. ఆ తర్వాత ప్రకాశం పంతులు గారి పూనికతో ప్రస్తుతం ఉన్న కృష్ణా బ్యారేజి నిర్మాణం జరిగింది. ఆయన స్మృత్యర్థం దానికి ప్రకాశం గారి పేరు పెట్టారు.

ఇక బెజవాడ అంటే చటుక్కున గుర్తుకు వచ్చే మరో  పేరు  దాసు కృష్ణ మూర్తి. ఆయన తనను తను వలస పక్షిని అని చెప్పుకుంటారు. అమెరికాలో స్థిర పడడానికి పూర్వం బెజవాడలో 27 ఏళ్ళు, హైదరాబాదులో 29 ఏళ్ళు, ఢిల్లీ లో 20 ఏళ్ళు నివసించారు. ఇప్పుడు ఆయన వయసు 98. 2004 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి. హిందూ పత్రిక హైదరాబాదు రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన దాసు కేశవరావు గారికి స్వయానా అన్నగారు.  బ్లాగులో నేను రాసిన బెజవాడ కబుర్లు చదివి తన బెజవాడ జ్ఞాపకాలు గురించి  ఇంగ్లీష్ లో  ఈ మెయిల్ చేశారు. దాన్ని తెలుగు చేశాను.

‘బెజవాడ గురించి చెప్పుకునే ముందు, ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాలి అనేది వారి ఉవాచ.  ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషనులోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.

‘జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూబిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.

‘ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పుపడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమోపోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  

‘ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలుస్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.

‘బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.

‘అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమారెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

‘సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావుశ్రీరంజనిరామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    

‘సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

‘అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతిపుష్పవల్లితో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావురామబ్రహ్మంహెచ్ ఎం రెడ్డిబీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్రనిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డమాలపల్లి,ఇల్లాలుగృహలక్ష్మి.వందేమాతరందేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనోకొల్హాపూర్కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే’ అని దాసు కృష్ణమూర్తిగారు రాసారు.

ఇలాంటి చరిత్ర కలిగిన బెజవాడలోకి నేను అడుగుపెట్టాను, మా అక్కయ్య పుణ్యమా అని. లేకపోతే, ఆ మారు మూల పల్లెటూరిలో అడిగేవాడు, చెప్పేవాడు లేక అల్లరిచిల్లరగా తిరిగి ఏమై పోయేవాడినో!

కంభంపాడులో మాదిరిగా కాకుండా, మా అక్కయ్య వాళ్లింట్లో దినచర్య వేరు. అప్పటికే వాళ్లకు ఇద్దరు పిల్లలు. మా బావగారి అన్నగారు సత్యనారాయణ గారు తుర్లపాడు కరణం. ఒక రోజు పొలంలో పాము కరిచి చనిపోయాడు. ఆయనకు ఇద్దరు మొగపిల్లలు. రమణరావు (రమణప్ప), వెంకటేశ్వరరావు (వెంకటి), ఒక ఆడపిల్ల సీత.  తండ్రిలేని ఆ పిల్లల్ని బెజవాడ తీసుకువచ్చి పెంచుతున్నారు. అలాగే నరసింహమూర్తి అని దూరపు చుట్టం తాలూకు అబ్బాయి.  మా బావగారి పిల్లలు, శాయిబాబు, సత్యవతి. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు కూడా అక్కడే వుండి చదువుకుని, తర్వాత అన్నపూర్ణమ్మ హాస్టల్ లో చేరి ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని ఎల్ ఎల్ బి కోర్స్ చేయడానికి హైదరాబాదు వెళ్ళాడు.

ఆరుగురు పిల్లలు ఉన్న ఇల్లు రణగొణధ్వనులతో వుండాలి. కానీ నిశ్శబ్దంగా వుండేది. కారణం మా బావగారు. ఆయన చేతిలోని  పేనుబెత్తం.

కింది ఫోటోలు : (Courtesy image owner)

ప్రకాశం బరాజ్ నిర్మాణానికి ముందు బెజవాడ వద్ద కృష్ణా ఆనకట్ట


దశాబ్దాల కిందటి విజయవాడ రైల్వే స్టేషన్

 

(ఇంకా వుంది)