19, ఫిబ్రవరి 2022, శనివారం

కాశీనాధుని విశ్వనాధ్, కొన్ని జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు వారి పుట్టినరోజు)

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
మరోసారి 2017లో... సినిమాహాలు కాదది, దేవాలయం
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది. శంకరాభరణం గురించి కూడా చెప్పారు. “ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు” చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.

(19-02-2022)



18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఏడుకొండల వాడా ! – భండారు శ్రీనివాసరావు


తిరుపతి వెళ్లేవారికి సిఫారసు ఉత్తరాలు మొదలైన సాయం చేసేవాడిని కానీ నేను వెళ్ళింది చాలా తక్కువసార్లు. కొండమీద ఈ వీ.ఐ.పీ. ల గొడవ ఏమిటి, దేవుడి ముందు అందరూ సమానులే కదా! అనేది నా వాదన.
దీనికి మా పెద్దన్నయ్య జవాబు చెప్పాడు.
‘నిజమైన భక్తులు, ఆ మాటకు వస్తే సామాన్యజనం తిరుపతిలో సౌకర్యాల కోసం చూసుకోరు. వాళ్లకి అది టూరిస్టు ట్రిప్ కాదు. క్యూ లైన్లలో నానా అవస్థలుపడి దర్శనం చేసుకునేవారిని అడిగి చూడండి, దర్శనం తృప్తిగా అయిందని చెబుతారు. మధ్య తరగతి వారికి దేవుడి మీద కన్నా తమని దాటిపోయే వీఐపీ ల మీదే కన్ను. వారికి అలా ఎందుకు మాకు ఇలా ఎందుకు, అందరం సమానమే కదా అంటారు. అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో భక్తులు అందరూ అక్కడ ఉచితంగా పెట్టే రొట్టెలనే మహాప్రసాదంగా ఆరగిస్తారు. మనం తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా కాకుండా సంపన్నుల విహార ప్రదేశంగా మార్చి వేశాము”
మా అన్నయ్య మాటలు నాకు సదా గుర్తుకు వచ్చి అక్కడికి పోవడం దాదాపు మానుకున్నాను. ఎందుకంటే నేనూ మధ్యతరగతి వాడినే. ఆ మనస్తత్వం వున్నవాడినే.
ఇటీవల అనుభవంలోకి వచ్చిన ఓ విషయాన్ని తెలపడం కోసమే ఇది రాస్తున్నాను.
రెండు రోజుల క్రితం కొత్తగా పెళ్ళిచేసుకున్న ఓ జంట తెలంగాణా టూరిజం ప్యాకేజీలో ఫ్లైట్ లో తిరుపతి వెళ్ళారు. వరుడికి అమెరికాలో ఉద్యోగం.
తిరుపతి భీమాస్ లో, కాలకృత్యాల కోసం డ్రెస్ మార్చుకోవడానికి గదులు ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి కొండమీదకు తీసుకు వెళ్లి దర్శనం చేయించారు. తర్వాత ‘ఓ గంట టైం వుంది. మీరు ఎటైనా తిరిగి మళ్ళీ ఈ పాయింటుకు రండి. కిందికి దిగగానే భీమాస్ లో భోజనం’ అని చెప్పారు. అమెరికా కుర్రాడు ‘తిరుమల వచ్చి దేవుడి ప్రసాదం తినకుండా హోటల్ భోజనం ఏమిట’ని తిన్నగా వెంగమాంగ భోజన సత్రానికి భార్యను తీసుకువెళ్లి భోజనం చేశాడు. హైదరాబాదు నుంచి వెళ్ళిన తోటి ప్రయాణీకులు కింద భీమాస్ లో భోజనం చేశారు.
(18-02-2022)

అధికారులూ ! గొడ్డలి దాకా తేవద్దు!! – భండారు శ్రీనివాసరావు

 మా చిన్నప్పుడు పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు వచ్చేవి.

“అందాల సినిమా తార ఇలా చెబుతోంది.

”నా చర్మ సౌందర్యం కోసం నేనెప్పుడూ పలానా టాయిలెట్ సోప్ నే వాడతాను”

ఆ మాటలు నమ్మి ఆ  సబ్బు వాడేవారు ఎంతోమంది.

చర్మ సౌందర్యం బాగుపడక పోయినా ఓ రెండు రూపాయలతో ఆ ఆసక్తి ఆ అనురక్తి  తీరిపోయేది. 

ఇవ్వాళ    ఫేస్ బుక్ లో ఒక ప్రకటన చూశాను. ఇన్ఫోసిస్ సంస్థ స్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని ఇంటర్వ్యూ ఆ వీడియోలో వుంది (అయితే ఆయన వాయిస్ లేదు) .

ఆయన  చెప్పినట్టు రాసిన మాటల సారాంశం ఏమిటంటే పద్దెనిమిది వేలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది రాత్రికి రాత్రి పిల్లల్ని పెడుతుందని. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మడి చేత డబ్బు బదిలీ చేయించి అది ఎలా పెరుగుతుందో ప్రత్యక్షంగా చెప్పించారు, ఆవిడ చేతే.

ముందు చెప్పిన సినిమా తార ఆ సబ్బు పొరబాటున కూడా వాడివుండదు. అంతటి అందాల తార స్వయంగా చెప్పింది కదా అని సామాన్యులు అదే సబ్బు కొంటారు.

ఇప్పుడు నీలేకని గారి ఇంటర్వ్యూ పేరుతొ వచ్చిన ఈ లింక్  టెక్స్టు చూసినప్పుడు ఆ సినీ తార ప్రకటన గుర్తుకు వచ్చింది.

పైగా దీన్ని ప్రచురించింది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక. (న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కాదు, అయితే హైదరాబాదులోని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ బాధ్యులతో మాట్లాడితే, అది ఫేక్! దానికి  పత్రికతో సంబంధం లేదు అని చెప్పేశారు)

ఇది మోసం కాకపోవచ్చు. నిజంగానే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగవచ్చు. కొట్టేయలేము. కానీ, భవిష్యత్తులో  ఏదైనా స్కాం రూపం ధరిస్తే మాత్రం దీన్ని మించిన స్కాం మరోటి వుండదు.

అందుకే అధికారులూ! గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తేవద్దు అని విజ్ఞప్తి చేసేది. జనం మోసపోయి ఫిర్యాదులు చేయకముందే మేలుకోమని చెప్పేది.

(18-02-2022)

 

LINK:

Nandan Nilekani invests ₹892m in new trading platform to make ordinary people richer (crestmoreite.info)

 

కళ్ళల్లో నీళ్లె౦దుకు వున్నాయి? ఇందుకే కాబోలు

 

చాలా కాలం కిందటి ముచ్చట.
ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఓ పెద్ద హోటల్ కి వెళ్లాను. తిరిగొస్తుంటే జంధ్యాల, శంకరాభరణం శంకర శాస్త్రిగా ప్రసిద్దులయిన సోమయాజులు గారు, ఒక జిల్లా పోలీసు సూపరింటెండె౦ట్, (ఇప్పుడాయన అడిషినల్ డీజీ రాంక్ కాబోలు) ఒక చోట కూర్చుని కాలక్షేపం చేస్తూ కనబడ్డారు. నన్ను చూసి రమ్మంటే వెళ్లాను. ఆ కబుర్లలో కాలం తెలియలేదు. బాగా పొద్దుపోయింది. ఇక సర్వ్ చేసే టైం అయిపోయిందన్నాడు సర్వేశ్వరుడు. ‘మరి ఎలా’ అన్నాడు జంధ్యాల. ‘ఇలా’ అన్నాను నేను. పొలోమంటూ అందరం అర్ధరాత్రి దాటిన తర్వాత మా ఇంటికి చేరాము. చేరి మేము మా పని పూర్తి చేస్తుంటే మా ఆవిడ తన పని పూర్తిచేసి అందరికీ వేడి వేడిగా వడ్డించింది. పెద్దాయన సోమయాజులుగారు భోజనం అయిన తరువాత చేతులు కడుక్కుని ‘అన్నదాతా సుఖీభవ’ అని మా ఆవిడను మనసారా దీవించారు.
సుఖపడ్డది ఏమో కానీ ఇన్నేళ్ళ జీవితంలో ఇలాంటి దీవెనలు పుష్కలంగానే దొరికాయి మా ఆవిడకు.
అలాగే ఒక సాయంకాలక్షేప సమావేశంలో ఒకాయన కలిసారు. అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో వున్నారు. ‘నేను మీకు తెలవదు కానీ, మీ ఇంటికి చాలా సార్లు వచ్చాను. అర్ధరాత్రివేళ మీ మేనల్లుడు వెంకన్నతో కలిసి మీ ఇంటికి వచ్చేవాడిని. ఎక్కడ దొరక్కపోయినా మా అత్తయ్య ఇంట్లో భోజనం ఖచ్చితంగా వుంటుంది. లేకపోతే నిమిషాల్లో వండి పెడుతుందని వాడు ధీమాగా చెప్పి మీ ఇంటికి తీసుకువచ్చే వాడు. అన్నట్టే ఆవిడ ఏ మాత్రం విసుక్కోకుండా మాకు అప్పటికప్పుడు వేడిగా అన్నం పెట్టేవారు. ఆ ఆప్యాయత ఎలా మరిచిపోగలం చెప్పండి అంటూ ఆంటీ ఎలా వున్నారని అడిగారు.
ఏం చెప్పాలో తోచలేదు.
కానీ కళ్ళల్లో తడి తెలుస్తూనే వుంది.


(2019లో చనిపోయిన నా భార్య నిర్మల)


17, ఫిబ్రవరి 2022, గురువారం

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్ – భండారు శ్రీనివాసరావు


(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)

కేసీఆర్ ని దగ్గరగా చూసి పదహారేళ్ళ పైమాటే. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు, ఎన్నికల పొత్తుల గురించి చెప్పడానికి అనుకుంటా, బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిశాను. మధ్యలో కొంచెం ఎడం వచ్చింది కాని, నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్, ఎన్టీఆర్ క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మసీదుకు దగ్గరలో మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్ కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది. రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం. 'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్, కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’ అని ఆహ్వానానికి కొసరు. జర్నలిష్టుగా రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను. హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను. సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి తన అలవాటు ప్రకారం సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, వాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండా, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నదీ’ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు, ఒక రకంగా, ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా, వాటన్నిటిని ఆయన గుదిగుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో ‘ప్రత్యక్ష ప్రసారం’లో చూస్తున్న బెజవాడ మిత్రుడు ఒకరు ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్ ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెబుతున్నట్టుగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం. కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు. "వెనుక అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – అంతా ఓ కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత. సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి మరీ తినిపించేవారు. హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. ఆ అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు. అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన ఇలా అనేకం. ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని. ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ. ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు. అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి. అదే కేసీఆర్ ప్రత్యేకత. ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు.
(17-02-2022)



16, ఫిబ్రవరి 2022, బుధవారం

మాధవుడు ఏక పదమా! సమాసమా!! – భండారు శ్రీనివాసరావు

 “దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికి, ఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.

నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.

ఈ ఉదయం వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమాండోరి (ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి.  మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని. కొద్దిగా వణుకు వున్నా, మాట స్పుటంగా వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో నివాసం.

షరా మామూలుగా నమస్తే తెలంగాణా లోని నా వ్యాసం గురించి ప్రస్తావించారు. నా పట్ల  వారి ప్రశంసలు ఇక్కడ అప్రస్తుతం.

ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో  నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.

మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. వారు చెప్పిందే ఈవ్యాసం  శీర్షికలో పేర్కొన్న ‘మాధవుడు ఏక పదమా! సమాసమా!’

మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏకపదం అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారు, జగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.

మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారు, మీరు ఫ్రీగా వున్నారా! అని.

‘పరవాలేదు, నేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా వుంది, చెప్పండి అన్నాను వారితో.

‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారు, కవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.

‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి లోక విదితం. ప్రధమ కోపం అంటారు.

‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన ఇలా అన్నారు, నా పద్యాలకు అర్ధం అడక్కండి, కానీ రాయడానికి కారణాలు అడగండి చెబుతాను అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ  పూలదండను చేతితో నలుపుతున్నట్టు అనిపించి కొంత భయపడ్డారు కూడా.

ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు వెదజల్లారు.

రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను పుంభావసరస్వతి అని కీర్తించారు.

శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.

తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు చేశారట.

ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో  వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.

పాదాభివందనాలు శేషాచార్యుల వారూ. పరగడుపునే పరమాన్నం తినిపించారు.


(గుర్రం జాషువా)


(విశ్వనాధ సత్యనారాయణ)




(16-02-2022)           

 

“లచ్చన్నా! ఢిల్లీ పోదాం” అన్నారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్”

 

పొద్దున్నే ఫోన్ మోగింది.

“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ నమస్తే తెలంగాణా పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టుకోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే ఆయనకు అధికారిక కారు డ్రైవర్.  లక్ష్మన్న ఇంట్లో పెళ్లి జరిగితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో  డ్రైవర్ ఇంటికి వెళ్లి రావడం ఆ రోజుల్లో ఓ సంచలనం.

“ఎన్టీఆర్ గారు నన్ను ఎప్పుడూ లచ్చన్నా అని ఆప్యాయంగా పిలిచేవారు. అసలు నన్నిలా మొదటి సారి పిలిచింది ఆయన గారి భార్య బసవ తారకం గారు. ఓసారి జూబ్లీ హాలులో ఏదో అధికారిక విందు వుంటే, ముఖ్యమంత్రి గారినీ, వారి భార్య బసవతారకం గారినీ కారులో తీసుకు వెడుతున్నాను. అమ్మగారు కారులో కూర్చోగానే నాపేరు అడిగారు. లక్ష్మన్న అని చెప్పాను. ఆవిడ నవ్వుతూ ‘సరిపోయింది, రాముడికి లక్ష్మణుడు దొరికాడు” అని అంటూ ‘అంతేనా లచ్చన్నా’ అన్నారు. అంతే అప్పటి నుంచి నాపేరు లచ్చన్న అయిపోయింది”

లక్ష్మన్న మంచి ఉద్వేగంలో వుండి అనేక సంగతులు చెప్పుకొచ్చాడు.

“చివరిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఓసారి కారులో వెడుతుంటే “ఈసారి ఢిల్లీ వెడదాం పద. నువ్వూ వద్దువు కాని. దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే గట్టి లాస్ (చట్టాలు) కావాలి. ఇప్పుడున్నవి సరిపోవు. మనం వెళ్లి ఆ పని చేయాలి” అన్నారు. దురదృష్టం! ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు”

“ప్రతిపక్షంలో వున్నప్పుడు సభలో లేని సారుని కూడా సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి సారు అసెంబ్లీ గుమ్మం  తొక్కలేదు. నేనూ బయటకు వచ్చేశాను. సెలవు పెట్టి ఆయన గారి వద్దనే పనిచేశాను. మళ్ళీ  సారు ముఖ్యమంత్రి కాగానే నన్ను తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సీఎం గారు,  రామచంద్రరావు (పీఆర్వో) గారిని పిలిచి ‘లచ్చన్న ఉద్యోగం మళ్ళీ రెగ్యులరైజ్ చేయించండి. ఆ ఆర్డరు కాపీ తెప్పించి లచ్చన్నకు ఇవ్వండి’ అని చెప్పారు. అన్నట్టే నా ఉద్యోగం రెగ్యులర్ అయింది. నాలుగు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారు.

“మీ అన్నగారు (పర్వతాలరావు గారు, రామచంద్రరావు గారికి ముందు సీఎం పీఆర్వో) దేవుడు. లిఫ్ట్ బాయి దగ్గర నుంచి  డ్రైవర్లని, జవానులని చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా  అందర్నీ రోజూ  పలకరించి యోగక్షేమాలు అడిగేవారు.  ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. చేయదగిన, చేతనైన సాయం చేసేవారు, మరోసారి అడిగే పని లేకుండా.

“మీ గురించి చాలా ఏళ్ళుగా వాకబు చేస్తున్నా. టీవీల్లో కనబడేవారు. కానీ ప్రయత్నించినా మీ నెంబరు దొరకలేదు. చివరికి ఈరోజు నమస్తే తెలంగాణా పత్రికలో దొరికింది”

చెప్పాడు లచ్చన్న  ఉరఫ్  లక్ష్మన్న.



(16-02-2022)