24, జూన్ 2016, శుక్రవారం

జై జవాన్!

కొన్ని వీరోచిత గాధలు  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మన వీర సైనికుల సాహసాలను ఎత్తి చూపే ఒక సందర్భాన్ని  ప్రపంచ ప్రసిద్ధిగాంచిన  టైమ్ మేగజైన్ ప్రచురించింది.
నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం.
హిమాలయాల్లో  ఎన్నో వందల  అడుగుల ఎత్తున రెజాంగ్ లా కనుమలో  ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ కాపుకాస్తోంది.  మొత్తం నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనిక దళానికి జోధ్పూర్ కు చెందిన రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా వున్నాడు. నిజానికి దుర్భరమైన వాతావరణ పరిస్తితుల్లో ఆ సైనికులకు ఎన్నో అవసరాలు తీర్చాల్సి వుంది. అయితే వారికి అవేవీ లేవు  ఒక్క మనోధైర్యం, ఆత్మ విశ్వాసం తప్ప - అని టైం మేగజైన్ రాసిందంటే  అది వారి పట్టుదలకు చక్కటి కితాబు.
ఆ దళానికి పై అధికారులనుంచి ఒకే ఒక్క ఆదేశం. 'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా చూడండి.'
శత్రు సైన్యం సమాయత్తంగా వచ్చింది. ఇటు పక్క ఒక్క భారత సైనికుడు వుంటే అటుపక్క యాభై  మంది చైనా సైనికులు. సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునికమైనవి. పైగా అన్నుదన్నుగా వారికి వెనుకనుంచి అందే సహాయం విషయంలో కూడా వాళ్లు ఎన్నో రెట్లు మెరుగు.
నవంబర్ నెల.  ఆదివారం. చైనా సైన్యం దాడికి దిగింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు అంతులేకుండా  వస్తూనే వున్నారు. వారిని  నిలవరించడం భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. భారత సైన్యంలో ఒక్కొక్కడు యాభైమంది చైనా సైనికులకు సమాధానం చెప్పాల్సిన పరిస్తితి. శత్రువులు మిడతల దండు మాదిరిగా వస్తూనే వున్నారు. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటినుంచి మరో చోటికి వేగంగా కదులుతూ  తన సైనికులకు తానే ఒక దన్నుగా నిలబడ్డాడు. కానీ ఇంతలో శత్రు సైన్యం అతడిపై నేరుగా కాల్పులు జరిపింది. ఒక తూటా అతడి భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది. అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. శత్రువులపై కాల్పులు జరుపుతూనే పోయాడు. గాయాలతో రక్త స్రావం అధికం అయింది. మనిషి నీరసించిపోయాడు. ప్రాణాలతో మిగిలిన కొందరు భారత జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్ పడనివ్వలేదు. ఒక పెద్ద కొండ రాతివెనుకకు వెళ్ళగలిగాడు. అయితే అప్పటికే చాలా రక్తం పోయింది. యుద్ధరంగంలోనే వీరమరణం పొందాడు. భారత ప్రభుత్వం ఆ వీరుడిని పరమ వీరచక్ర పురస్కారంతో  గౌరవించింది.


అతడి దళంలోని అనేకమంది వీరోచితంగా పోరాడి అసువులు బాసారు. అయితే ప్రాణాలు పోయేలోగా ఒక్కొక భారత సైనికుడు  కనీసం అయిదుమంది శత్రువులను మట్టుబెట్టాడు.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు  చాలా దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన మృత సైనికుల చేతుల్లో తుపాకులు గురిపెట్టి వున్నాయి. ప్రాణం పోతున్నా వారు ఆయుధాన్ని ఒదలకుండా శత్రువులతో పోరాడారని అధికారులకు అవగతమైంది. కొందరి దేహాలు శత్రుసైనికుల దాడికి ఖండఖండాలుగా మారిపోయినా, వారిచేతుల్లో  తుపాకులు అలాగేవున్నాయి.
భారత సైనిక దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని స్వయంగా ఆహ్వానించాడు. శత్రువుల దాడికి ఛిద్రమైన వారి శరీరాలు కందకాల్లో కానవచ్చాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయి కనిపించాయి. ఒక సైనికుడి చేతిలో విసరడానికి తయారుగా వుంచుకున్న బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం మాత్రం లేదు.  చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన భారత మెడికల్  ఆర్డర్లీ  చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ దళ సైనికుల శవాలు వారి స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే శత్రు సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్ళారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్  హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి  ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు ఈ గ్రామం ప్రత్యక్ష సాక్షి. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ వూరిలోని ప్రతికుటుంబం ఒకరిని సైనికుడిగా యుద్ధ రంగానికి  పంపింది. ఈ చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన అనేకమంది అధికార్లు, జవాన్లు వున్నారంటే దీని ప్రత్యేకత  అర్ధం అవుతుంది.            


వార్తలలోని వ్యక్తులు

సూటిగా....సుతిమెత్తగా.......భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 26-06-2016, SUNDAY)
“చెన్నారెడ్డిని మంత్రి వర్గానికి వెలుపలా, వీ బీ రాజును మంత్రివర్గం లోపలా వుంచితే తంటాలు తప్పవు’ అని తెలుగు రాజకీయాలను పుక్కిటబట్టిన రాజకీయ విశ్లేషకులు గతంలో చెబుతుండేవారు. ఆ విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చేలా దేశంలో ఓ వివాదం సుళ్ళు తిరుగుతోంది.
“ఇతగాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి” అంటూ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులకు, ప్రధాన మంత్రులకు సిఫారసు లేఖలు రాస్తుండడం కద్దు. వాటిల్లో కొత్తదనం ఏమీ లేదు. కాకపొతే ఇదేవిధమైన అభ్యర్ధనతో ఒక  ఉత్తరం ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చింది. రాసినాయనే ఆ విషయం బయట పెట్టడం వల్ల అది బయటకి పొక్కింది.
ఆ ఉత్తరం రాసింది రాజ్యసభ సభ్యుడు, పాలక పక్షం బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి కావడం, ఆయన ఉద్యోగం నుంచి తీసివేయమని పట్టుబడుతున్న వ్యక్తి సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ కావడం ఈ అంశం వివాదాస్పదం కావడానికి దోహదం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రఘురాం రాజన్ ని మరికొంత కాలం కొనసాగిస్తే దేశ ఆర్ధిక పరిస్తితి సంక్లిష్టం అవుతుందని స్వామి తన లేఖలో హెచ్చరించారు.  ఆర్బీఐ  గవర్నర్ గా రాజన్ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా దేశంలో నిరుద్యోగ సమస్య  మరింత జటిలం అయ్యే ప్రమాదం వుందని కూడా స్వామి సూత్రీకరించారు. సుబ్రమణ్యస్వామి కూడా స్వయంగా ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు కావడం మూలాన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టలేము. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న మరి కొన్ని విషయాల కారణంగా రాజన్ పై స్వామి బాణాలు ఎక్కుపెట్టడానికి పైకి కనిపించని గుప్త కారణాలు ఏవో వుండవచ్చునన్న చర్చ మొదలయింది.
“రాజన్ మనదేశంలో నివసిస్తున్నా ఆయన నూటికి నూరుపాళ్ళు  పూర్తిగా భారతీయుడు కాదనీ, అమెరికా ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్ కార్డు పైనే ఆయన ఇంకా  కొనసాగుతున్నారని’ స్వామి చేసిన ఆరోపణ అంశాన్ని మరింత సంక్లిష్టం  చేసింది.



‘వివాదం వున్నచోట స్వామి వుంటారు,లేదా స్వామి వున్నచోట వివాదం వుంటుంది’ అని పేరుపడ్డ సుబ్రమణ్య స్వామి చరిత్ర అంతా సంచలనాలమయమే. ఏదో ఒక వివాదాన్ని రాజేసి, తద్వారా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి మీడియా దృష్టిని ఆకట్టు కుంటారనే అపప్రధ ఆయనపై వుంది. అయితే, నిజాయితీ, నిర్భయం అనే రెండు  లక్షణాలతో  స్వామి, అన్నన్ని వివాదాల నడుమ కూడా విద్యాధికుల మన్ననను, ఆదరణను  చూరగొంటున్నారు. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా గతంలో ఆయన చేసిన యుద్ధాలు, సాధించిన విజయాల వల్ల ఆయన చెప్పిన దాంట్లో నిజం వుండి తీరుతుందని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
రాజకీయంగా చేరదీసిన వారి మీదనే స్వామి కత్తి దూస్తాడు అని అంటుంటారు. ఇప్పుడు అల్లాగే జరుగుతోంది.
సరే! రఘురాం రాజన్  ఆర్బీఐ గవర్నర్ గా నియమితులయింది మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న యూపీఐ హయాములో. కాబట్టి ఆయన్ని తొలగించమని స్వామి కోరడంలో రాజకీయం కొంత ఉన్నప్పటికీ అర్ధం చేసుకోవచ్చు. రాజన్  ని వచ్చే సెప్టెంబరులో పదవీకాలం ముగియగానే సాగనంపడానికి అంతా సిద్ధం అయిన తరువాత కూడా స్వామి తన అంబుల పొదిలో నుంచి మరో బాణం తీసారు. ఈ సారి అది ఎక్కుబెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సలహాదారుడు అయిన అరవింద్ సుబ్రహ్మణ్యం మీద. రాజన్ నిష్క్రమణ తధ్యం అనిపించే నేపధ్యంలో ఆయన వారసుడిగా ఎంపిక కాదగ్గ వ్యక్తుల వరుసలో ఈ సుబ్రహ్మణ్యం పేరు కూడా వుండడం కాకతాళీయం కావచ్చు. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి పలానా వారిని తొలగించాలి, లేదా పలానా వారిని పలానా కారణాల మూలంగా తీసుకోకూడదు అనే వాదనల వల్ల సుబ్రమణ్యస్వామి మనస్సులో ఇంకేదయినా ఆలోచన వుందా అనే దిక్కుగా చర్చలు మళ్ళుతున్నాయి.  
రఘురాం రాజన్ కధాకమామిషు  తెలుసుకోవాలంటే పదమూడేళ్ళు  వెనక్కి వెళ్ళాలి.
2007 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్  అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం ఢిల్లీలో  జరుగుతోంది. ఆర్ధిక మంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్  ఆహ్లూవాలియా, ప్రధాని ఆర్ధిక వ్యవహారాల సలహా మండలి చైర్మన్ సి.రంగరాజన్, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయిన ఈ సమావేశం మధ్యలో ఒక ఆసక్తికరమైన అంశం చర్చకు వచ్చింది. ఈ నలుగురు వ్యక్తులు ఆర్ధిక వ్యవహారాల్లో దిగ్గనాధీరులే. కానీ అందరూ ముదిమి వయస్కులే. కాని కాలగమనంలో వీరి పాత్ర అర్ధాంతరంగా  నిష్క్రమిస్తే అప్పుడు  ఆర్ధిక వ్యవహారాలను సంభాలించే వ్యక్తి ఎవ్వరు? ప్రత్యామ్నాయం గురించి ముందుగా ఆలోచించి పెట్టుకోవాలి కదా!
ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఈ అంశం  ఆలోచించేలా చేసింది.  దాని ఫలితమే ఎక్కడో చికాగోలోని కళాశాలలో   ఆర్ధిక పాఠాలు చెప్పుకుంటున్న రఘురాం రాజన్ స్వదేశాగమనం.
తరువాతి సమావేశానికి రమ్మని రాజన్  కు కబురు వెళ్ళింది. వారాంతంలో,చికాగోలో కాలేజీలో పిల్లలకు పాఠాలు చెప్పడం పూర్తి కావడం ఆలస్యం, రాజన్ వెంటనే విమానం ఎక్కి ఢిల్లీ చేరుకునేవారు. విమానాశ్రయం నుంచి నేరుగా మీటింగుకు వెళ్లి తిరిగి అమెరికా వెళ్ళిపోయేవారు. మళ్ళీ సోమవారం యధావిధిగా క్లాసుకు హాజరయ్యేవారు. ఆ విధంగా కష్టపడుతూ రాజన్ భారత ఆర్ధిక సమస్యలకు సంబంధించి ‘వంద చిన్న  అడుగులు’  అనే ఒక నివేదిక తయారు చేసారు.  ఆ కృషిని మెచ్చుకుని ప్రధాని  మన్మోహన్ సింగ్, రఘురాం  రాజన్  ని బాగా  ప్రోత్సహించారు. ప్రధాన మంత్రికి ముఖ్య సలహాదారుడిగా ఏడాదిపాటు పనిచేసిన తరువాత, రాజన్,  2013 సెప్టెంబరులో  ఇరవై మూడో  గవర్నర్ గా రిజర్వ్  బ్యాంకులో   తదుపరి అడుగు పెట్టారు. అప్పటినుంచి ఆయనది ఒకటే లక్ష్యం, త్వరితగతిన క్షీణిస్తున్న  రూపాయి మారకం విలువని పటిష్టం చేయడం. ఒకటే గమ్యం, దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక మాంద్యాన్ని కట్టడి చేయడం. ఈ క్రమంలో భారతీయ బ్యాంకింగు వ్యవస్థను గాడిలో పెట్టాల్సి వచ్చింది. పేరుకుపోతున్న మొండి బకాయిలను తగ్గించే క్రమంలో అటు బ్యాంకులకు, ఇటు నల్ల ధనం కుబేరులకు ఆయన పంటికింద రాయిగా  మారారు.
ఈ దశలో కేంద్రంలో అధికార మార్పిడి జరిగింది. రాజన్  ని ఆర్బీఐ  గవర్నర్ ని చేసిన మన్మోహన్  సింగ్  మాజీ  ప్రధాని అయ్యారు. ఆయన స్థానంలో  బీజేపీ అధినేత నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. ఆరోజు నుంచే రఘురాం రాజన్  కు ఉద్వాసన తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తూవస్తున్నాయి. అయినా అవి వాస్తవ రూపం ధరించలేదు.

ఏ ప్రభుత్వానికయినా సొంత ఆర్ధిక విధానాలు  వుంటాయి. నరేంద్ర మోడీ అందుకు భిన్నం కాదు. మోడీది సొంత విధానాలతో ముందుకు పోయే స్వభావం. వాటిని అమలు పరచాలంటే అందుకు అనుగుణమైన వ్యక్తి ఆర్బీఐ  గవర్నర్ గా వుండడం అవసరం. అంచేత యూపీఏ హయాములో ఆ పదవిని పొందిన రాజన్  నిష్క్రమణ ఖాయం అని అందరూ అనుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుకు ఆయన ససేమిరా  అనడంతో ప్రభుత్వాధినేతలకు, రాజన్  కు  నడుమ పొరపొచ్చాలు ఏర్పడినట్టు వదంతులు చెలరేగాయి. అదే తరుణంలో  సుబ్రమణ్యస్వామి, ఆర్బీఐ  గవర్నర్  పదవి నుంచి రాజన్ ను తక్షణం తప్పించాలంటూ మొదలుపెట్టిన హడావిడి అంతాఇంతా కాదు. దరిమిలా  రఘురాం  రాజన్ తనకు తానుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. ‘సెప్టెంబరు  నాలుగున  పదవీకాలం పూర్తికాగానే తిరిగి చికాగో వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను’ అని ప్రకటించి, చాలాకాలంగా సాగుతున్న  వివాదానికి తెర దించారు.

కొందరికి పదవులు కీలకం, కొన్ని పదవులకు వ్యక్తులు కీలకం. ఆ పదవుల్లో వున్నవాళ్ళు తీసుకునే నిర్ణయాలు మొత్తం దేశాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ. అటువంటి పదవుల్లో  రిజర్వ్  బ్యాంకు  గవర్నర్ ఒకటి. యావత్ దేశ ఆర్ధిక వ్యవస్థ పునాదులు బలపడడం, లేదా కదలడం అనేది వీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి వుంటుంది.  దీర్ఘకాలంలో ఫలితాలు రాబట్టే పధ్ధతి  పాలకులకు రుచించదు.  తాత్కాలికమైనవి  అయినా సరే,  ఎన్నో కొన్ని ఫలితాలు తక్షణం  కనబడాలని కోరుకుంటారు. వారి అనివార్యతలు అలా వుంటాయి. అక్కడే పాలకులకూ, దార్శనికులకూ ఎడం పెరుగుతుంది. అదే ఇక్కడ జరిగి వుంటుంది.

ఈ ప్రపంచం ఏ ఒక్కరి మీదా ఆధారపడి నడవదు. అలా అని వ్యక్తుల శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం కూడా  సరికాదు. ఆర్బీఐ గవర్నర్ గా గత మూడేళ్ళలో తను అనుకున్నవి సాధించి చూపిన రఘురాం రాజన్  ఆ సమర్ధుల  కోవలోకి  వస్తారు. అంచేతే, రాజన్ నిష్క్రమణ అనంతర పరిణామాల ప్రభావం ఎలా వుండొచ్చు  అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. రాజన్ కు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గొప్పదనం తెలిసిన వాళ్ళు  ఆ దేశంలో పుష్కలంగా వున్నారు. చిత్రం ఏమిటంటే ఆయనలోని ప్రతిభను గుర్తించడానికి అమెరికాలో కూడా చాలా సమయమే పట్టింది. అవహేళనలు, అవమానాల తెరలు తొలిగిన తరువాతనే రాజన్ ఆ దేశంలో  ఓ వెలుగు వెలిగారన్న సంగతి మరవకూడదు.
2005 సంవత్సరంలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ రఘురాం రాజన్, అమెరికా ఆర్ధిక వ్యవస్థలో  పెరుగుతూ వస్తున్న పెనుముప్పులను  గురించి ప్రస్తావించారు. వాటిని నివారించడానికి,  పరిణామాల తీవ్రతను తగ్గించడానికి ఆయన కొన్ని సూచనలు చేసారు. అమెరికన్ ఆర్ధిక వేత్తలు ఆయన హెచ్చరికలను లేనిపోని అనుమానాలుగా  కొట్టి వేసారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి  లారెన్స్ సమ్మర్స్  ఏకంగా రఘురాం రాజన్  ని  ‘లడెట్టీ’  ( సాంకేతిక పురోగతిని వ్యతిరేకించేవాడు, అభివృద్ధి నిరోధకుడు అని స్తూలార్ధం) అని అభివర్ణిస్తూ  అవహేళన చేసారు. మూడేళ్ళ తరువాత  రాజన్ జోస్యమే నిజమయింది. అప్పుడు కానీ  రాజన్  గొప్పదనం ఏవిటో  అమెరికన్ ఆర్ధిక నిపుణులకు తెలిసిరాలేదు.

ఉపశృతి:
చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూలు పిల్లల్ని పెద్దయిన తరువాత  ఏమవ్వాలని వుందని టీచర్లు అడిగేవారు.  ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్  స్కూల్లో చదువుకున్న రఘురాం రాజన్     ఆ ప్రశ్నకు  ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా?
“భారత దేశానికి ప్రధాన మంత్రిని  కావాలి”
(24-06-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595     



23, జూన్ 2016, గురువారం

చూసే పుస్తకం


హాయిగా జారబడీ, బోర్లపడి, వెల్లకిలా పడుకుని, ఈజీగా, లేజీగా చదూకునే  పుస్తకం కాదిది. అలా చదవకూడదనే కాబోలు ప్రచురణ కర్తలు పుస్తకం డిజైన్ అలా చేసినట్టున్నారు.



చాలా విలువైన పుస్తకం. అంతేకాదు, బోలెడు ఖరీదయిన పుస్తకం కూడా! (కాకపొతే, ఇంతా అని ధర చెప్పలేదు, కానీ పుస్తకం హంగుల్ని బట్టి చూస్తే కాస్త ఎక్కువే వుండొచ్చు అనిపించేలా వుంది.)
వంద పేజీలు . అవీ మామూలివి కాదు, చక్కటి ఆర్ట్ పేపరుమీద రంగుల్లో ముద్రించిన పుస్తకం. కళాజ్యోతి ప్రింటర్స్ అంటేనే అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే ఈ పుస్తకాన్ని చదవచ్చు, చూడొచ్చు కూడా. ఎందుకంటే ఇందులో చదువుకునే పేజీలు  ఎన్ని వున్నాయో, కళ్ళతో చూసే చక్కటి ఫోటోలు కూడా  అన్ని పేజీల్లో కొలువు తీరాయి.
రాసింది వెనిగళ్ళ కోమల. ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. వివరాలు ఇక్కడే చెప్పేస్తే ఇక ఆవిడ గొప్పతనం తెలియని వారికి తెలిసే అవకాశం వుండదు. పలానా వారి భార్య అనో, పలానా వారి అమ్మ అనో వారి ఖాతాలో వేసేస్తారు. ఆవిడకీ సొంత వ్యక్తిత్వంవుంది. అది ఈ పుస్తకంలో ప్రతి పేజీలో ప్రతిఫలించింది. చిన్ననాటి కబుర్లు, తమ పెళ్ళినాటి ప్రమాణాలు, పిల్లల చదువులు అన్నీ ఓ గృహిణి కోణం నుంచి రాసినట్టు అనిపించినా అందులో గుప్తంగా ఒకనాటి తెలుగునాట తెలియని చరిత్ర దాగుంది.
రచయిత్రి తన గురించి తక్కువగా, ఇతరులని గురించి ఎక్కువగా రాసిన ఈ  జ్ఞాపకాల దొంతర ఇంగ్లీష్ తో పాటు  తెలుగులో కూడా వుంటే యెంత బాగుంటుందో అనిపించింది ఈ పుస్తకం ఆసాంతం చూసి, చదివిన తరువాత.
సుందర స్మృతుల పరిమళ గుచ్చం ఈ పుస్తకం.
దీన్ని రాసిన:

మిత్రుడు నరిశెట్టి ఇన్నయ్య భార్య కోమల గారికి అభినందనలు. అమెరికాలో సుప్రసిద్ధ జర్నలిష్టు రాజు నరిశెట్టి మాతృమూర్తి వెనిగళ్ళ కోమల గారికి శుభాకాంక్షలు    

జ్ఞాపకం


విరిగిన కాలుతో  ఇంట్లో ‘కాలుక్షేపం’ చేస్తున్న రోజుల్లో  నా కాలక్షేపం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ  డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్  కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
“ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో  పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!          

21, జూన్ 2016, మంగళవారం

ప్రధాని మోడీ యోగ మహిమ


సూటిగా.....సుతిమెత్తగా.........భండారు శ్రీనివాసరావు

మోడీ అనే రెండక్షరాలకు ఇప్పుడు యోగా అనే మరో రెండక్షరాలు జోడీ కలిసాయి. గత రెండు రోజులుగా ఈ రెండూ  దేశదేశాల్లో మారుమోగిపోయాయి. బుల్లితెరల పుణ్యమా  అని వాటి ప్రతిధ్వనులు ఇంటింటా వినిపించాయి కూడా.
భారత ప్రధాని మోడీ అభ్యర్ధన మేరకు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో,  అనేక దేశాల్లో దీన్ని పాటించారు. ఇది సాధించిన ఘనత ఆయన ఖాతాకే చేరుతుంది. ఇందుకు ఆయన్ని అభినందించి తీరాలి.
చండీఘడ్  లో ప్రధాన వేడుక ప్రధానమంత్రి మోడీ సమక్షంలో జరిగింది. దాదాపు ముప్పయివేలమంది యోగాభ్యాస విన్యాసాల్లో పాల్గొనడం, భద్రత కోసం అయిదు వేలమంది సాయుధ పోలీసులను నియోగించడం చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని  ప్రభుత్వం ఎంత ప్రతిష్టగా తీసుకుందో అర్ధం అవుతుంది. నిరుటిమాదిరిగానే  ప్రధాని  యోగాభ్యాసం కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యువతరానికి స్పూర్తిని కలిగించే ప్రయత్నం చేసారు.


న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం భవనంపై మెరిసిన భారతీయ యోగా లోగోతో సహా పత్రికలన్నీ యోగా ప్రాశస్త్యాన్ని వివరించడంలో పోటీ పడ్డాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ దినోత్సవాన్ని అంగరంగవైభోగంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కానవచ్చింది. పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాలో, అటు వైపువున్న మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఈ యోగా భజంత్రీలు మోగిన దాఖలా అంతగా కానరాలేదు. హైదరాబాదు  రాజభవన్ లో  గవర్నర్ నరసింహన్, వెలుపల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో యోగా దినోత్సవం జరిపారు.
దేశదేశాల్లో జరిగిన ఈ ఉత్సవాల క్లిప్పింగులు చూస్తుంటే, వాటిల్లో యోగా కంటే చూపరులను బాగా ఆకట్టుకునే  జిమ్నాస్టిక్ ప్రదర్శనల ఛాయలు ఎక్కువగా గోచరించాయి. నీళ్ళపై తేలుతూ యోగా విన్యాసాలు చేస్తున్న వారిని చూస్తుంటే అలానే అనిపించింది. దేశ వ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవాల్లో  భాగంగా అత్యంత శీతల ప్రదేశం సియాచిన్  లో భారత సైనికులు, అలాగే, కొన్ని చోట్ల వేలాదిమంది గర్భిణీ స్త్రీలు, పలు చోట్ల బాలబాలికలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అధికారులు, అనధికారులు,  భారతీయ జనతా పార్టీకి  చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎన్డీయే  భాగస్వామ్య పక్షాల నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా డే ని  విశ్వ వ్యాప్తంగా  జరుపుకోవడం  ఇది రెండో సారి. నిరుడు కూడా ఇలానే ఆర్భాటంగా నిర్వహించి, యోగా విశిష్టతను  వివరిస్తూ ఉద్బోధలు చేసారు. ఆ సందర్భంగా,  జనంలో యోగా స్పూర్తిని  రగిలించడానికి ప్రయత్నించిన నేతల్లో చాలామంది ఈ ఏడు జరిగిన యోగా వేడుకల్లో  కాళ్ళు ముడవడానికి సయితం కీళ్ళు సహకరించక  నానా  ఇబ్బందులు పడిన దృశ్యాలు  టీవీల్లో దర్శనమిచ్చాయి.  నేతల్లో చాలామంది సందర్భానికి తగ్గట్టుగా యోగా వైశిష్ట్యాన్ని గురించి యధాశక్తి  బోధలు చేస్తున్నారే కాని, వాటిని మనస్పూర్తిగా అను నిత్యమూ అభ్యాసం చేయడం లేదన్న విషయం తేటతెల్లం అవుతోంది.
ఈ మొత్తం తంతును టీవీల్లో చూస్తున్నవారికి ఇదంతా ప్రచార ఆర్భాటం అనే భావన కలిగింది. చక్కటి అంశాన్ని మోడీ ఎత్తుకున్నారు అని నమ్మేవారికి కూడా ఈ మాదిరి అభిప్రాయమే కలిగింది.
యోగాని ప్రపంచానికి ప్రసాదించింది పతంజలి అయినప్పటికీ, దాన్ని తొలిసారి  పరిచయం చేస్తోంది  నరేంద్ర మోడీ అనే స్థాయికి ప్రచార  స్థాయి సాగింది.  సాంఘిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు ఈ విషయంలో మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆర్భాటాన్ని  ప్రశ్నించిన వారిని అసహనంతో వ్యాఖ్యానిస్తున్నారు.   యోగా అంటేనే, శరీరాన్ని,  మనసును అదుపులో ఉంచుకోవడం. మరి వారు యోగా చేస్తున్నారో లేదో తెలియడం లేదు.
గతంలో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా వున్న  రోజుల్లో ధీరేంద్ర బ్రహ్మచారి అనే ఒకాయన వున్న సంగతి, ప్రధాని ప్రాపకంతో ఆయన దూరదర్శన్ జాతీయ ఛానల్లో జాతి మొత్తానికీ యోగాభ్యాసాలు బోధించిన సంగతి ఈనాటి తరానికి గుర్తుండక పోవచ్చు. ప్రధానికి  సన్నిహితుడు అనే ఒకే ఒక్క పేరుపొందిన ఈ ప్రముఖుడు,  ప్రధాని ఇందిర పేరుకు యెంత చేటు తెచ్చిందీ  బహుశా ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు.
ఇప్పుడు మరో యోగి పేరు విస్తృతంగా వినబడుతోంది. యోగా అనగానే ఆయన పేరు గుర్తు వచ్చేంతగా ఆయన పేరు ప్రఖ్యాతులు  పెరిగిపోయాయి. కానీ, ఆయన ఆధ్వర్యంలో తయారవుతున్న కొన్ని ఔషధ ఉత్పత్తుల విషయంలో చెలరేగుతున్న వివాదాలు కూడా తక్కువేమీ కాదు. ప్రోత్సహిస్తున్న పాలకులు ఈ విషయాలతో పాటు గత పాలకుల అనుభవాలను కూడా గమనంలో వుంచుకోవాలి.
భారతీయ యోగా సమస్త ప్రపంచానికి ఆరాధ్యనీయం కావడం చాలా గొప్ప సంగతి. కానీ,  యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆరాధనని కార్పొరేట్ శక్తులు వాళ్ళ పద్దతుల్లో దోపిడీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం.
పైసా ఖర్చు లేకుండా, మనుషుల   మానసిక, శారీరక ఆరోగ్యాలకు యోగా భరోసా ఇస్తుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. పేదలు అత్యధిక సంఖ్యలో వున్న మనదేశానికి  యోగా  ఆ రకంగా మన ప్రాచీనులు  ప్రసాదించిన  వరం. అలాంటి యోగా ఇంటింటికీ వ్యాప్తి చెందాలి. అంతే కాని, ఏడాదికోమారు తలచుకుని, మురిసిపోయి  మరిచిపోయే వ్యవహారం కాకూడదు.   
ప్రచారం కారణంగా యోగా పట్ల ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయితే ఇది వికర్షించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిదీ వ్యాపారమయమవుతున్న ఈ రోజుల్లో ఈ జాగరూకత మరింత అవసరం.
చాలామందికి గుర్తుండకపోవచ్చు.  1995 లోనే పసుపుకు  అమెరికా చట్టం ప్రకారం పేటెంటు హక్కు పొందే ప్రయత్నం జరిగింది. అప్పట్లో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి  డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.ఏ. మష్లేకర్ ఈ అంశంపై సవాలు చేయడం వల్ల ఆ దేశపు పేటెంటు హక్కుల కార్యాలయం వెనక్కి తగ్గింది. మళ్ళీ పేటెంటు హక్కుల విషయంలో పాలకుల అలసత్వం కారణంగా వేప ఆకుపై పేటెంటు హక్కును  ఒక అమెరికన్ కంపెనీ పొందగలిగింది. తులసీ దళాలకు కూడా పేటెంటు ముప్పు వచ్చి పడుతోంది. అలాగే బాస్మతీ బియ్యం. ఆ బియ్యం పేరు మార్చి కస్మతీ బియ్యం, టె క్స్మతీ బియ్యం పేరుతొ పేటెంటు హక్కులు ఇతర దేశాల కంపెనీలు పొందిన కారణంగా ఆ హక్కులు మనకు కాకుండా పోయాయి. ఈ నేపధ్యంలో, ఇంత ప్రజాదరణ పొందిన ఈ బహుళార్ధ సాధక యోగాపై పెట్టుబడిదారుల కన్ను పడకుండా వుండదు. విద్యా వైద్య రంగాలపై కార్పొరేట్ పెత్తనం తాలూకు దుష్ప్రభావాలు గమనించిన తరువాత అందరికీ  అందుబాటులో వుండే యోగా,  క్రమంగా   సామాన్యుడికి దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదంతా కొంతమందికి నిరాశావాదంలా కనిపించవచ్చు. కానీ, జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం తప్పు  కాదేమో!
ఇది సరే! అసలు దేశదేశాల్లో ఇంతటి ఆసక్తిని రగిలిస్తున్న భారతీయ యోగా గురించి కొన్ని చెప్పుకోవడం సబబుగా  ఉంటుంది.
పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితేసాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగంరెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాలప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూనన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటానుఅని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసాఅనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలుమొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీకాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుందిఅది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మటఅని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతోకర్మ యోగమురాజ యోగముభక్తి యోగముధ్యాన యోగముజ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడంమానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.
ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానముఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యముశమదమాది సాధన సంపదమోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము)రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం)అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాసఅంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించినపిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మరాజభక్తిధ్యానజ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమనియమఆసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణసమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరేమామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యంఅపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.
ఉపశ్రుతి:
పాతికేళ్ళకు పూర్వం నేను పూర్వపు సోవియట్ యూనియన్  రాజధాని మాస్కోలో ఉద్యోగంచేస్తున్నరోజులవి. రష్యన్ టీవీ నేషనల్ ఛానల్ ప్రైం టైంలో నాటి కమ్యూనిష్ట్ పార్టీ అధినేత, ఆ దేశాధ్యక్షుడు అయిన  మిహాయిల్ గోర్భచెవ్ తో సమానంగా టెలివిజన్ తెరపై గంటలు గంటలు కనిపించే అవకాశం దక్కిన ఏకైక వ్యక్తి ఒక సాధారణ భారతీయుడు అంటే నమ్మ శక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన పేరు లక్ష్మణరావు గారు. తెలుగు బాగా తెలిసిన కన్నడిగుడు. భారత రాయబార కార్యాలయం నడిపే ఇండియన్ స్కూలులో యోగా టీచరు. ఆయన ప్రతి రోజూ టీవీ ద్వారా రష్యన్ పౌరులకు యోగా పాఠాలు బోధించేవారు. దీనిబట్టి భారతీయ యోగాకి  అప్పట్లోనే విదేశాల్లో వున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595    



మీ నోట, మా మాట


ఇందాక ఓ ఛానెల్ విలేకరి ఫోను చేసాడు. ‘ఓ ప్రోగ్రాం చేస్తున్నాం, అభిప్రాయం కావాలి’అని.
రోజూ ఇది మామూలే కనుక ఇంటికి రమ్మన్నాను. రమ్మంటూనే విషయం ఏమిటని వాకబు చేసాను. ప్రస్తుతం సాగుతున్న యోగా ప్రచారం మీద అని చెప్పాడు. దానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తున్నాము కాబట్టి  నా అభిప్రాయం కూడా అలాగే ఉండాలన్నాడు. బహుశా వృత్తిలోకి కొత్తగా వచ్చినట్టున్నాడు. అభిప్రాయం పలానా విధంగా వుండాలి అని అతడు అడగడం, నేను అలానే చెప్పడంజరిగితే, అది అతడి అభిప్రాయం అవుతుంది కానీ, నాది కాదు కదా!

అదే అతడితో అన్నాను. అంతే! రెండు గంటలు అవుతున్నా పత్తా లేడు. 

శ్వేత రాత్రులు


ఈ రోజు జూన్ ఇరవై ఒకటి ‘సుదీర్ఘ దినం’ (పగటి సమయం సాధారణంగా కంటే ఎక్కువగా వుండడం). మిత్రుడు భీమేశ్వర రావు ఈ అంశం  గురించి పోస్ట్ పెట్టాడు. అది చదివినప్పుడు నాకు మా మాస్కో రోజుల్లోని ఓ అనుభవం గుర్తుకు వచ్చింది.
కమ్యూనిష్టుల ఏలుబడిలో లెనిన్  గ్రాడ్ గా పేరు మార్చుకున్న ఆ రష్యన్ నగరం మళ్ళీ తొంభయ్యవ దశకం మొదట్లో సెంట్  పీటర్స్ బర్గ్ గా  తన పూర్వ నామాన్ని ధరించింది.
మార్చి మొదటి వారం నుంచి జులై చివరి వరకు దాదాపు ఎనభయి రోజులు అనుకుంటాను  ఆ నగరంలో  ‘శ్వేత రాత్రులు’ పేరిట  ఉత్సవాలు జరుగుతాయి. ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు అక్కడికి చేరుకుంటారు. ఆ విశేషం ఏమిటంటే అన్ని రోజులూ అక్కడ పగలూ, రాత్రీ ఇరవై నాలుగు గంటలు పట్టపగలే. చీకటి పడదు. అర్ధరాత్రి కూడా నడి  బజార్లో నిలుచుని పుస్తకాలు చదువుకోవచ్చు. అందుకే వీటిని వాళ్ళు ‘శ్వేత రాత్రులు’ అని ముద్దుగా పిలుచుకుంటారు.


(అర్ధరాత్రి సూర్యుడు)

వైట్  నైట్స్  చూడడానికి వచ్చే పర్యాటకులతో ఇప్పుడా నగరం మూడు బార్లు, ఆరు హోటళ్ళ చందంగా వెలిగిపోతోంది.