18, ఫిబ్రవరి 2015, బుధవారం

హననం కాదు కావాల్సింది సహనం

(Published in 'SURYA' telugu daily on Thursday, 19-02-2015)

కాకతాళీయం అనండి యాదృచ్చికం అనండి ఇంకేదయినా అనండి పరస్పర విరుద్ధం, పరస్పర సంబంధం వున్న వార్తలు నిన్న బుధవారం వార్తాపత్రికల్లో దర్శనం ఇచ్చాయి.
అందులో ఒకటి ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల కార్యక్రమానికి హాజరయిన సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం.
ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సందర్భాలలో  ఏవిధంగా మాట్లాడుతారో అదే విధంగా అది  సాగిపోయింది, కాకపోతే మోడీ తరహా కొన్ని చమత్కారాలతో (సబ్ కా సాత్ ...సబ్ కా వికాస్).
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కు పాదంతో అణచి వేస్తాము'
మన దేశానికి చెందిన కురియా కోస్  అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యం దృష్టిలో వుంచుకుంటే,  ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాలకు ప్రాముఖ్యం వుంటుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ అయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు. మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం  ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ  వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.
కానీ అదే రోజు పత్రికల్లో మరో వార్త వచ్చింది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ.
'భారత దేశాన్ని హిందూ దేశం చేస్తారా' అంటూ సున్నీ ఉలేమా కౌన్సిల్, ఆర్.యస్,యస్. మైనారిటీ వ్యవహారాల ఇంచార్జ్  ఇంద్రేష్ జీ ని   నిలదీసినట్టు ఆ వార్త సారాంశం.
కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి హాజీ మహమ్మద్ నేతృత్వంలో కొంత మంది మత పెద్దలు ఇంద్రేష్ జీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో మైనారిటీలలో పెరుగుతున్న అభద్రతాభావాన్ని గురించి తెలియచేశారు.
'మా దేశ భక్తిని  నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలి? వందేమాతరం గీతాన్ని ఆలపించాలా? ఇది మా దేశం  అనుకుంటున్నాము.  గాంధీని మా నాయకుడిగా భావిస్తున్నాము' అని ఈ సమావేశంలో తెలియచెప్పినట్టు ఆ తరువాత హాజీ మహమ్మద్ విలేకరులతో చెప్పారు.
'1947 లో దేశ విభజన సమయంలో మా పూర్వీకులు జిన్నా వాదనతో, పాకీస్తాన్ వైఖరితో  ఏకీభవించకుండా ఈ దేశంలోనే  వుండిపోయారు. భారత రాజ్యాంగంపై  విశ్వాసం వుంచారు. ఇలా భారత్ నే నమ్ముకునివున్న  మావంటి ముస్లిం ల నుంచి ఆర్.యస్.యస్.  ఏమి ఆశిస్తోంద'ని  ఆయన ప్రశ్నించారు.
ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్డీన్ ఒవైసీ వ్యాఖ్యలపట్ల యెలా స్పందిస్తారని ఇంద్రేష్ తమని ఎదురు ప్రశ్నించినట్టు చెబుతూ, 'సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ ఎలాగో ఒవైసీ కూడా అంతే. ఒక ఎంపీ మాత్రమే' అని హాజీ మహమ్మద్ బదులిచ్చారు.   
ఇంతవరకు బాగానే వుంది, ఓ పక్క తాము భారతీయులమని చెబుతూనే, ఆర్.ఆర్.యస్. రూపం ఇచ్చిన భరతమాత చిత్ర పఠానికి నమస్కరించడం తమకు సుతరామూ మనస్కరించదని తేల్చి చెప్పారు. అలా చేయడం ఇస్లాం కు విరుద్ధం అన్నారు.
మన దేశం సంగతి ఇలా వుంటే అటు అమెరికాలో హిందూ దేవాలయం గోడలమీద విద్వేషం రెచ్చగొట్టే నినాదాలు కానరావడం మరో వివాదాంశం అయింది. అక్కడి హిందూ సంఘాలు ఈ సంఘటనపై మండిపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.


కాగా, గత ఆదివారం మరో భయంకరమైన ఉగ్రవాద చర్య చోటు చేసుకుంది. దాదాపు ఓ డజను మంది ఈజిప్షియన్ క్రిష్టియన్లను, ముస్లిం ఉగ్రవాద సంస్థ - ఐ.యస్.ఐ.యస్. కు చెందిన వారు,  సముద్ర తీరంలో బహిరంగంగా తలలు నరికి మట్టుబెట్టారు. ఆ దృశ్యాలను  యూ ట్యూబ్ లో పెట్టారు. ఇవి  చూసిన వారికి 'మనం నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా లేక పాత  రాతి యుగంలోనే వుండిపోయామా' అనే సందేహాలు తలెత్తుతున్నాయి.     
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ  హననం కాదు, కాసింత సహనం.
'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి.

(18-02-2015)
NOTE: Courtesy Image Owner 

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

చంద్రునికో నూలుపోగు


Published by 'Namaste Telangana' Telugu Daily on 17th Feb.2015, Tuesday.
(ఫిబ్రవరి 17 -  తెలంగాణా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు)


'కేసీఆర్' అనే ఒక బక్కపలచటి రాజకీయ నాయకుడి గురించి చాలా బాగా తెలుసు అని అనుకునేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇలాటి వారికి కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేసీఆర్ అర్ధం అయినట్టు అనిపించే అర్ధం కాని మనిషి. అలా అనిచెప్పి,  ఆయన పైకి ఒక రకంగా లోపల మరో రకంగా వ్యవహరించే వ్యక్తి అని అర్ధం కాదు.   
నవజాత  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలినాళ్ళలోనే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారుల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం - ఆయన్ని దగ్గరగా ఎరిగిన అనేకమందిలో కూడా, ఈయన మనకు తెలిసిన చంద్రశేఖర రావుగారేనా  అన్న అభిప్రాయం కలిగించింది.   
ఆ రోజు, ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను కేసీఆర్  ప్రసంగాన్ని ఆసాంతం టీవీ తెరపై ఇంట్లో కూర్చుని  చూడగలిగాను. 'మాటల మాంత్రికుడ'ని, 'మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తార'ని ఆయన గురించి అనుకోవడం కద్దు.  అయితే ఆ రోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  నవ తెలంగాణా లక్ష్యాలు వివరిస్తూ, తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన  ప్రసంగానికి శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీఆర్ కు బదులు కొత్త కేసీఆర్ కనబడివుంటాడని టీవీలో ఆయన ప్రసంగాని చూస్తూ, వింటున్న నాకు అనిపించింది. 'నవ తెలంగాణా యెలా వుండాలి' అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయన్న దానిపై అప్పటికే  నాకు అవగాహన వుంది. ఎందుకంటే నిరుటి అసెంబ్లీ ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన చేసిన అంతరంగ ఆవిష్కరణకు నేనూ ఒక  ప్రత్యక్ష శ్రోతను. అంచేత ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీఆర్  కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. 'తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు' అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చి వుండాలి. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామ'ని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, 'ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ రెండూ కూడా కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాల'ని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.
సరే. అవి  అధికారంలోకి వచ్చిన మొదటి రోజులు. చూస్తూ వుండగానే ఎనిమిదిన్నర పైచిలుకు మాసాలు గడిచిపోయాయి. అయినా ఆయన మాట తీరు కానీ, నడక తీరు కానీ లవలేశం కూడా మారలేదు.   కేసీఆర్ కి కలిసివచ్చిందీ, రానిదీ కూడా ఆయనలోని ఈ విలక్షణ లక్షణమే.  
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగిస్తున్న  విషయమే. ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్ణయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వేతో  సాధించింది ఏవిటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే వుంది. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీఆర్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు అయ్యారనే  చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా  వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్సెట్ పరీక్ష, 1956 నిబంధన, అయ్యప్ప సొసైటీలో ఇళ్ళ కూల్చివేతలు, కృష్ణా జలాల వివాదం, సచివాలయం తరపింపు నిర్ణయం   ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాస్పద అంశాలు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న నీలాపనిందలు.           
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖరరావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  'చమురు' లాటిది. ఈ విషయం కేసీఆర్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో, మాట్లాడే ప్రతి మాటలో  అది నిరంతరంగా  రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక 'తెలంగాణా స్పూర్తి' ఉండేలా చూసుకోవడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్థతోనే  తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. ఈ నేపధ్య కోణం నుంచి చూస్తే, 'కేసీఆర్ తరచుగా మాట మారుస్తారు, ఒకసారి చెప్పినదానికీ, మరోసారి అన్నదానికీ పొంతన వుండదు,  అది అయన అసలు నైజం' అనే వారూ వున్నారు. అయన ఏది చేసినా అది బంగారు తెలంగాణా కల నెరవేర్చుకోవడం కోసమే అని మనః స్పూర్తిగా నమ్మేవారు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు.  రాజకీయంగా అస్థిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీఆర్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీ.ఆర్.యస్. లోకి రప్పించే అంశానికే ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు  టీ.ఆర్.యస్. తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారంలో లేకపోతే   ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీఆర్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం  ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో అన్ని పార్టీల్లో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు అన్ని పార్టీల్లోనూ నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.
ఇన్ని నెలల పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిగా సాధించింది ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన చెబుతూ వస్తోంది ఒక్కటే. ఏమి చేశామన్నది కాదు ఏమి చేయాలి అన్నదానిపై ఆయన నిత్యం కసరత్తు చేస్తూ వస్తున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయంటున్నారు. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని కూడా అంటున్నారు. ఆయన ఆలోచనలు కొన్ని అబ్బురపరిచేవిగా వుంటాయి.  మరొకొన్ని 'ఇవన్నీ అయ్యే పనేనా' అన్న సందేహాలను రేకెత్తిస్తాయి.
సరే! కేసీఆర్ ను, ఆయన నడిపే తెలంగాణా  సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం  ప్రభుత్వానికి కూడా  అంతే అవసరం.  
తెలంగాణా ముఖ్యమంత్రిగా తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజుకల్లా ఆయన తన కలల్లో కొన్నింటినయినా సాకారం చేయాలనీ, చేయగలగాలని కోరుకుందాం!

(15-02-2015)  

16, ఫిబ్రవరి 2015, సోమవారం

ఈ పాడు మొగుళ్లని యెందుకు ప్రేమించాలంటే.....


పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన  కూర్చోబెట్టుకుని 'భర్త గీత' బోధించడం మొదలెట్టాడు.
'ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా!
'నువ్వు వూపిరి తిరగని పనితో  సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు కాఫీ కలిపి పట్రా అన్నాననుకో. ఎందుకనుకున్నావు. నీకు ఇబ్బంది అని తెలియక కాదు. ఆఫీసులో అలసిసొలసి ఇంటికొచ్చిన నాకు, నువ్విచ్చిన కాఫీ తాగగానే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక  అప్పుడు ఎంచక్కా నువ్వు ఇరుగింటి, పొరుగింటి అమ్మలక్కల  కబుర్లన్నీ ఏకబిగిన ఏకరువు పెట్టినా నాకేమీ అనిపించదు కనుక.
'నీతో కలిసి బజార్లో వెడుతున్నప్పుడు పక్కనుంచి ఓ అందమైన అమ్మాయి వెడుతుంటే నా  చూపులు ఆటోమేటిగ్గా అటే తిరిగిపోతాయి. ఏం చెయ్యను చెప్పు మగాడ్ని కదా! దాన్ని చూసి నువ్వు కంగారు పడిపోతుంటావు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే,  అలా బయట ఆడవాళ్ళను కొరుక్కుతినేలా చూస్తుంటానని నువ్వు నన్ను అస్తమానం కొరుక్కుతింటూ, ఆ నడిబజారులోనే ఉతికి ఆరేయాలని చూస్తావు.  కానీ నీకు తెలియంది ఒకటుంది. నీ అందం ముందు ఎవ్వరి అందాలయినా దిగదుడుపే. ఆ విషయం  ఒకటికి రెండు సార్లు  నిర్ధారించుకునేందుకే ఆడవాళ్లకేసి అలా చూస్తుంటాను.  పిచ్చి మొహానివి. నీకు అర్ధం అయి చావదు.
'నీ చేతివంట చెత్త అని అప్పుడప్పుడు అంటుంటాను. నిన్ను తప్పు పట్టాలని కాదు. నా రుచిపచుల్లో ఏవన్నా తేడాపాళాలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని మాత్రమే అలా వంకలు పెడుతుంటాను.
'నిజమే. రాత్రి పూట నేను పెట్టే గురక కర్ణ కఠోరంగా వుంటుందని నాకూ తెలుసు. నేను అంత హాయిగా గురకపెట్టి నిద్ర పోతున్నానూ అంటే ఏమిటి అర్ధం.  నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను యెంత ప్రశాంతంగా వున్నానో నీకు అర్ధం కావాలనే.
'మొన్న నీ పుట్టిన రోజు మరచిపోయిన మాటా నిజమే. చిన్న కానుక కూడా కొనుక్కురాని మాటా నిజమే. ఇల్లెగిరిపోయేటట్టు నానా యాగీ చేసావు కానీ నీకు తెలియని విషయం చెబుతా విను. గిఫ్టుల మీద తగలేసే డబ్బు నేనేమన్నా కట్టుకుపోతానా చెప్పు. ఏది మిగిలినా అది నేను తాళి కట్టి కట్టుకున్న నీకే కదా!
'నేను చెప్పే ఈ భర్తగీత  నీకు ఏమాత్రం నచ్చలేదన్న సంగతి నీ చేతిలో వున్న అప్పడాల కర్రే చెబుతోంది. ఇక ఆఖరుగా ఒక మాట చెబుతా. వినేసి, అప్పడాలకర్ర కింద పడేస్తావో, కింద వున్న కత్తిపీట చేతిలోకి తీసుకుంటావో అది నీ ఇష్టం.
'నన్ను నిలువునా నరికి ఉప్పు పాతర వేయాలని నీకు అనిపిస్తోంది. అయితే, హత్యానేరానికి, అందులోను మూడుముళ్ళు మెడలో వేసి, ఏడడుగులు కలిసి నీతో నడిచి నలుగురు ముందు పెళ్ళాడిన భర్తనే చంపడం అంటే అందుకు పడే శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ...........'


(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)

(నెట్లో సంచారం చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్

(Published by 'SURYA' telugu daily on Tuesday,17-02-2015)
(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు గడిచి వుంటాయి. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే సమతబ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ఆ ప్రదేశంలో వున్నట్టుంది.
అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్ కొందరితో కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, వాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండా, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని మాటల మాంత్రికుడుఅంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్  ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం  అంతా ఓ కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. ఆ అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం.


ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజునాటికయినా ఆయన కంటున్న 'బంగారు తెలంగాణా'  కలల్లో కొన్నయినా నెరవేరాలని కోరుకుందాం. (16-=02-2015)          

                                    

మాయమై పోతున్నవమ్మా!



ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే, వీసీఆర్ అనే ఆ పరికరం ఇళ్లల్లోనే  కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
ఆ మధ్య  పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
నెట్  ప్రపంచం ఆవిష్కృతమైన దగ్గరనుంచి లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే డైరెక్టరీతో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది. 


(శ్రీ కే.రమణాచారి) 

మాయమై పోతున్న అంశాలు మననం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయులు, తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు  కే. రమణాచారిగారి జన్మదినం సందర్భంగా హైదరాబాదు రవీంద్రా భారతి ప్రాంగణంలో జరుగుతున్న హరికధా ఉత్సవాలు, ఒకనాడు తెలుగునాట వూరూరా ప్రాచుర్యం పొందిన   హరికధను గుర్తుచేశాయి. హరికధల కధాకమామిషు తెలిసిన మిత్రులు ఆర్వీవీ కృష్ణారావు గారి మాటల్లో విన్న హరికధా గానం ఇది. చదవండి.
మనకు ఇష్టం లేని కబుర్లు ఎవరయినా  చెపుతుంటే ఈ హరికధలు చాల్లేవోయి అంటూ ఉంటాము.
కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు. హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. పండిత పామరులను  సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు. 
చాన్నాళ్ళుగా ఈ ఛానళ్ళ ప్రోగ్రాములు చూసి చూసి విసుగెత్తి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కాని భక్తీ ఛానల్ కాని చూడడం ఈ మధ్య తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. నిజంగా పెద్ద రిలీఫ్. మధ్య ఎస్.వి.బి.సి. ఛానల్ లో ఉమామహేశ్వరీ గారి హరికథ చూసాను. ఎంతో బాగా చెప్పారు. మరపున పడుతున్న మధుర జ్ఞాపకాలను తమ హరికధా గానంతో తట్టిలేపారు.
"ఈ నాటి పిల్లలకు కానీ,  ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.   హరికథ ఎంత గొప్పదో నాకు తెలుసు.  నేను కాలేజీ చదువు పూర్తయిన తరువాత కూడా హరికథ అంటే ఎంతో ఇష్ట పడే వాడిని.   ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
"యాభయ్, అరవై దశకాల్లో కూడా హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనే వారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళల సమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ, భారత, భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా అన్నమాట.  హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను జాగ్రతావస్తలోకి తెచ్చేందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమిషాలు వుండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు 'మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామ'నో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణదాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
ఆయన తర్వాత తరంలో నరసాపురం దీక్షిత్ దాసు గారు. మా అమ్మ గారు నారాయణ దాసు గారు దీక్షిత దాసు గారు ఇద్దరి కథలూ విన్నాను అని చెప్పారు.  నేను కూడా ఎందరో ప్రసిద్ధులయిన  విద్వాంసుల హరికథలు విన్నాను.  తోట్లవల్లూరులో మా నాన్నగారు రాయసం గంగన్న పంతులు గారు వేణు గోపాల  స్వామి దేవాలయం ఆఫీసర్ గా పనిచేసినప్పుడు  వైశాఖ పౌర్ణమి కల్యాణాలలోను,  శివాలయంలో శివరాత్రి, దసరా నవరత్రులలోను ఎంతో మంది పేరున్న వారు వచ్చి హరికథలు చెప్పే వారు. కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పేవారు.  'లలిత సరస గాన కళానిధే' అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే 'వాసుదేవ' అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు. ఇరవయ్యేళ్ళ తర్వాత నేను బెజవాడ రేడియోలో పని చేస్తున్నప్పుడు కూడా వారిని కలిసే అవకాశం నాకు దక్కింది.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పేదవారయినా పెద్ద మనసు వున్నవారు.  మేము బెజవాడలో త్యాగరాజ సంగీత కళా సమితి అనే సంస్థను ప్రారంభిస్తే ఇంట్లో వున్న  వెండి త్యాగరాజు ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి 'ఇదే మీ లోగో' అన్న గొప్ప హృదయం వున్నమనిషి ఆయన. ప్రాతఃస్మరణీయులు.
సొమ్ములు వాగ్దేవికి
సరసమ్ములు సంగీత సహజ సౌందర్య
విలాసమ్ములు, మధురమ్ములు, మా   
అమ్ముల తమ్ముల మనోహరాపముల్  –కరుణశ్రీ  


అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు. మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. నేను రేలంగిలో వున్నప్పుడు మావూళ్లో సుబ్రహ్మణ్య షష్టికి కధ చెప్పిన తరువాత మళ్ళీ వూళ్ళోవాళ్ళు పిలిపించి రామాయణం సీరియల్ గా వారం రోజులు చెప్పించారు.  ఆఖరి రోజున రామపట్టాభిషేకం నాడు దాసుగారిని ఘనంగా సత్కరించారు కూడా. అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టేవాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను ఓ అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యి అని అడిగి తీసుకునే వారు.
"వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు ర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారు గా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.   1996  ప్రాంతంలో నేను హైదరాబాద్ రేడియోలో పని చేస్తున్నప్పుడు తెనాలి నుంచి వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేసి ఆయన మరణించారు అని చెప్పి ఆయన్ను గురించి వివరిస్తూ ఉంటే ఆయన గొప్ప తనం నాకు తెలుసండీ  అని వార్తల్లో విపులంగా చెప్పాము. వార్తలు విన్న తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అంత బాధలో కూడా, 'చాలా బాగా కవర్ చేసారు' అని థాంక్స్ చెప్పాడు.  పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతం లోనే హరికథ చెప్పే వారు. సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. ఇలా రాసుకొంటూపోతే  చాలా  వున్నాయి. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఏ కధ అయినా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీ, నెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పేవారు.
తర్వాత తరంలో మనకందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నా, ఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు.  2005 లో నల్లకుంట శంకర్ మఠంలో 'దర్శనం' మాస పత్రికతో కలసి వారం రోజుల పాటు  హరికథా ఉత్సవాలు నిర్వహించారు  ప్రసార భారతి అప్పటి  సి.యి.వో. కే.ఎస్. శర్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడవారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే - మొదట్లో ప్రస్తావించిన ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  ఒకరు పేరిణి నాట్యం ద్వారా,  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
"ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు నిరుడు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం. యూనివర్సిటీ పీఆర్వో చెన్నయ్యగారికి ఏవన్నా దీన్ని గురించి తెలుసేమో, అడగాలి.  

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం లాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టు అని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో వోసారి చెక్ చెయ్యాలి.  వస్తే చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధాగాన కళాపరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి.
సాంస్కృతిక ప్రియుడయిన రమణాచారి గారు ఏవన్నా చేయగలుగుతారేమో చూడాలి. వారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు" (16-02-2015)