5, జూన్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (177) – భండారు శ్రీనివాసరావు

 జోడుగుళ్ళ పిస్తోలు ఠా!

చిన్నప్పుడు దీపావళి సామాన్లు పెద్దవాళ్లు తేగానే, పిల్లల కళ్ళు వాటిల్లో పిస్తోలు, సింహం మార్కు తుపాకీ బిళ్ళల డబ్బాలమీద పడేవి. మతాబులు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు అయితే కాల్చుకోవడానికి చీకటి పడిన దాకా ఆగాలి. పిస్తోలు అలా కాదు, ఎప్పుడైనా కాల్చుకోవచ్చు.
సియాటిల్ లో వున్నప్పుడు ఒకరోజు మావాడు తుపాకుల దుకాణానికి తీసుకువెళ్లాడు. తుపాకీ కొనడానికి కాదు, నాకు చూపించడానికి.
ట్రిగ్గర్ నొక్కగానే వాయువేగంతో తూటా దూసుకుపోయే అరచేతిలో ఇమిడే చిన్నసైజు రివాల్వర్ల నుంచి, పేల్చగానే గుళ్ళ వర్షం కురిపించే ఏకే 47 తుపాకుల వరకూ పెద్ద సంఖ్యలో ఆ షాపులో గోడలకు వేలాడుతూ కనిపించాయి.
బెల్ వ్యూలో వున్న అనేక మారణాయుధాల దుకాణాల్లో WADE ఒకటి. కౌంటర్ మీద తుపాకులు అమ్మే షాపే కానీ, వెంటనే డెలివరీ ఇవ్వరు. పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన పిదప ఇస్తారు. అంతా ఆన్ లైన్ వ్యవహారమే కాబట్టి ఈ తతంగానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంతకు ముందు ఇలా కాదు. ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్టే వీటిని కూడా కొనుక్కునే వీలుండేది. ఆయుధాల వాడకాన్ని నియంత్రించడానికి కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఈ దుకాణంలోనే ఫైరింగ్ రేంజ్ వుంది. కొంత రుసుము చెల్లిస్తే నిజమైన పిస్తోలుతో/ తుపాకీతో కాసేపు ఢమఢమలాడించి రావచ్చు.
అప్పటికే షాపులో ఇద్దరు ముగ్గురు యువకులు ఆయుధాలు కొనుక్కునే పనిలో ఉన్నారు.
ఓ తండ్రి కుమారుడి పుట్టిన రోజు కానుకగా పిస్తోలు కొని ఇవ్వడం, ఆ పిల్లాడు అది పట్టుకుని స్కూలుకు వెళ్ళి టపటపా నలుగుర్ని కాల్చి చంపడం టకటకా జరిగి పోయింది ఈ దేశంలోనే. అదీ వారం రోజుల క్రితమే!
ఇది స్ఫురణకు రాగానే ఇది మనం మసిలే ప్రదేశం కాదని ఫొటోలు తీసుకుని బయటపడ్డాము.
అయిదే అయిదు నిమిషాలు.
నా విషయంలో ఇంకా తక్కువే. అదీ నా తెలివి తక్కువతనం వల్ల.
ఈసారి అమెరికా వచ్చేముందు ఓ విషయం గట్టిగా అనుకున్నాను. ఏమైనా సరే, ఈ వయస్సులో పిల్లలను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయరాదని.
లాంగ్ వీకెండ్ లో లెవెన్ వర్త్ నగరం వెళ్లి వద్దామని మావాడు అన్నాడు. పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు వెళ్ళాము. మా ఆవిడతో అప్పుడు కలిసి తిరిగిన ప్రదేశాలు మళ్ళీ చూసి రావాలని మనసులో కోరిక.
సియాటిల్ నుంచి రెండున్నర గంటలు ప్రయాణం చేసి లెవెన్ వర్త్ చేరుకున్నాము.
జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి. వేనాచీ నదీ తీరంలోని ఈ లెవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి, తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి. అలాగే జర్మన్ బీర్. ఎందుకో మేము వెళ్ళిన ఆదివారం రోజున ఎండ మండి పోతోంది. ఎర్రటి ఎండలో బీరు ప్రియులు రోడ్ల మీద క్యూల్లో నిలబడి తమ వంతుకోసం ఎదురు చూస్తూ వుండడం ఆశ్చర్యం కలిగించింది.
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ రుచి చూడడం పరవాలేదు. కానీ ఒకరకమైన మిర్చీ సాస్, ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటే చాలు, ఆ ఘాటుకు దిమ్మతిరిగిపోతుంది.
గతంలో తిరిగిన ప్రదేశాలే. అయితే ఈసారి మావాడు అడ్వెంచర్ పార్కు టిక్కెట్లు ముందుగానే బుక్ చేశాడు. ఇలాంటి అడ్వంచర్ లు చేయడం అవసరమా అని మనసులో ఓ మూల పీకుతోంది. భయం కంటే ఏదైనా జరగరానిది జరిగితే అవస్థలు పడేది నేనే కాదు పిల్లలు కూడా.
కొండలు, లోయల మీద సాగే అడ్వెంచర్.
వద్దనుకుంటూనే లోపలకు వెళ్ళాను. సందర్శకులతో కిటకిటలాడుతోంది. పెద్ద క్యూ. చివరికి మా వంతు వచ్చింది. అతడెవరో చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అడ్వెంచర్ మొదలయింది. ముందు వాహనంలో మా మనుమరాలు సృష్టి. తర్వాత నేను, ఆ తర్వాత మా అబ్బాయి, కోడలు. కంట్రోల్ మన చేతిలోనే వుంటుంది. ముందుకు నొక్కితే స్పీడ్ పెరుగుతుంది. వెనక్కి లాగితే వేగం తగ్గుతుంది అని ముందే చెప్పారు.
పట్టాలు నిలువుగా పైపైకి కనపడుతున్నాయి. పైకి చేరిన తర్వాత నిటారుగా కిందికి జారిపోతాం. అలాగే గుండ్రంగా మలుపులు తిరుగుతూ అగాధమైన లోయల్లోకి...
మధ్యలో ఓ కంట్రోల్ టవర్ నుంచి పరిశీలిస్తున్న ఓ అమ్మడు నా వైపు చేతులు ఊపుతూ సైగలు చేస్తోంది. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని వేగం పెంచాను. అపరిమితమైన స్పీడుతో అనేక వంకర్లు తిరుగుతూ లోయలు, కొండల మీదుగా జారి పోతూ ఎట్టకేలకు గమ్యం చేరింది.
ఆ తరువాత కాసేపటికి మా పిల్లలు వచ్చి, ఇంత త్వరగా ఎలా వచ్చావు అని అడిగేవరకూ నేను చేసిన పొరపాటు నాకు అర్ధం కాలేదు. ఆ అమ్మాయి వేగం తగ్గించమని సైగలు చేస్తే నేను పొరబాటుగా అర్ధం చేసుకుని వేగం పెంచాను.
ఈ అడ్వెంచర్ గురించి మన ఫొటో ఒకటి వాళ్ళే తీసి పది డాలర్లకు అమ్ముతున్నారు. ఎండ తగలకుండా పెద్ద టోపీ తగిలించు కోవడం వల్ల గుర్తు పట్టేలా లేదు.
ఈ లోకమే ఒక అద్దె ఇల్లు
ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిన ఇల్లే.
హైదరాబాదులో ఎన్ని ఇళ్ళు మారామో మాకే తెలియదు. అశోక్ నగర్, చిక్కడపల్లి మీదుగా మొదలై, పంజాగుట్ట దుర్గానగర్ కాలనీ, అమీర్ పేట, ఎర్రమంజిల్ ఐ ఏ ఎస్ క్వార్టర్స్, ఎల్లారెడ్డి గూడా, కృష్ణానగర్, మాదాపూర్ ఇలా అనేక చోట్లకు మారి చివరికి భూమి గుండ్రం అన్నట్టుగా మళ్ళీ ఎల్లారెడ్డి గూడాకే చేరాము.
78 ఏళ్ల వయసులో హైదరాబాదుకు వేల మైళ్ళ దూరంలో ఎక్కడో అమెరికాలో పశ్చిమ కొసన వున్న సియాటిల్ నగరం బెల్ వ్యూ లో MADRONA PARK కాలనీలో మా పెద్దవాడు కొనుక్కున్న ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూ అయిదు వారాలకు పైగా కాలక్షేపం చేశాను. ఒకరకంగా దర్జా జీవితం. ఏది ఎప్పుడు ప్రాప్తమో అప్పుడే దొరుకుతుంది.
అమెరికాలో అందరి ఇళ్లు ఇంచుమించు ఇలాగే అనే కంటే, ఇంతకంటే గొప్పగానే వుంటాయి. ఇండియా మధ్య తరగతి కళ్ళతో చూసే నా బోంట్లకి ఇదే గొప్ప అనేలా వున్న మాట నిజం.
నా పడక గది చాలా విశాలం. ఆనుకునే హోమ్ థియేటర్ హాలు, కాఫీ బార్, దీనికి తోడు అసలు బార్, మసాజు చైర్, బాత్ టబ్ వున్న రెస్ట్ రూమ్, అన్నింటికీ మించి నా మంచం పక్కనే గోడకు నాకు తోడుగా మా ఆవిడ ఫొటో.
ఇంతకంటే ఏం కావాలి?
చివరాఖరులో ఒక చిన్న మాట:
ఒక తరం కొందరు జర్నలిస్టులు, ముఖ్యంగా నా బోటివారు, రిటైర్మెంట్ తర్వాత కొంత ఆర్థికంగా స్థిరపడడానికి కారణం వారి ప్రయోజకత్వం కాదు. వారి పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకుని జీవితంలో పైకి ఎదగడం.
కింది ఫోటోలు:
బెల్ వ్యూ తుపాకుల దుకాణంలో
కొండలు, లోయల మీదుగా అడ్వెంచర్ చేస్తూ
లెవెన్ వర్త్ నగరంలో జర్మన్ బీరు సేవిస్తూ
మా వాడి గృహంలో తాపీగా కాలక్షేపం చేస్తూ
(ఇంకా వుంది)
All reactions:
4
1
Like
Comment
Share
Facebook

4, జూన్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (176) – భండారు శ్రీనివాసరావు

 క్వాలిటీ ఒకటే ధరలే వేరు

సియాటిల్ లో ఒకరోజు మధ్యాన్నం భోజనాలు అయ్యాక, ఓటీటీ లో ఓ అర్థం కాని సినిమా చూసిన తర్వాత బయటకి పోదాం అన్నారు. కారు డిక్కీలో చాలా సామాను సదిరారు.
అది చూసి, ఇంటికి తిరిగి వచ్చేసరికి పొద్దు పోతుందేమో అనుకున్నా. పైగా శుక్రవారం సాయంత్రం కూడా.
నేరుగా ఒక చోటికి వెళ్ళాము. ఏదో గోడౌన్ మాదిరిగా వుంది. అక్కడ వరుసగా కార్లు ఆగి ఉన్నాయి. వాటి నుంచి ఏవేవో సామాన్లు దింపుతున్నారు.
మా వంతు వచ్చింది. ఇంటి నుంచి తెచ్చిన సామాగ్రి, అంటే అంతగా వాడని, లేదా కొని అసలు ఎప్పుడూ వాడని షూస్, కోట్లు, దుస్తులు, పిల్లల బొమ్మలు, డెకొరేటివ్ గాజు వస్తువులు ఇలా ఎన్నో రకాలు అక్కడ దింపారు. అవన్నీ ఛారిటీ కోసం డొనేట్ చేస్తున్న సామాను అని నాకు అప్పటికి తెలియదు.
తరవాత ఆ గోడౌన్ ని ఆనుకుని పక్కనే వున్న GOOD WILL మాల్ లోకి వెళ్ళాము. అక్కడ లేని వస్తువు అంటూ లేదు. అవన్నీ నగర పౌరులు తమకు అట్టే ఉపయోగపడని, అవసరంలో వున్నవారికి ఇవ్వడానికి వీలుగా డొనేట్ చేసినవి. గుడ్ విల్ కంపెనీ వాటిని శుభ్రం చేసి, కొత్త వాటికి ఏమాత్రం తీసిపోకుండా వున్న క్వాలిటీతో, అవసరం వున్నవారికి అతి తక్కువ ధరకి విక్రయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఈ ఏర్పాటు. కంపెనీకి వచ్చిన ఆదాయాన్ని ఛారిటీకి ఇస్తారు. చాలా చౌకగా దొరికే ఈ షాపులో కొనుగోళ్లు చేయడానికి విరగబడతారని అనుకున్నా కానీ నా అభిప్రాయం తప్పయింది.
బయటకు వస్తున్నప్పుడు మా వాడు ఒక మాట చెప్పాడు, ఇన్నేళ్లుగా ఇక్కడ వుంటున్నా కూడా ఈ మాల్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అనీ, మీరు రాసుకోవడానికి ఏదైనా మ్యాటర్ దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో తీసుకు వచ్చాను అని.
తరువాత మార్షల్స్ అనే ఓ పెద్ద దుకాణానికి వెళ్ళాము. సైజులో కానీ, వస్తువుల లభ్యతలో కానీ, నాణ్యతలో కానీ, సిబ్బంది వ్యవహార శైలిలో కానీ రెండు మాల్స్ లో ఎలాంటి తేడా కనపడలేదు, ఒక్క ధరవరల విషయంలో తప్పిస్తే. అవే వస్తువులు. కానీ ధరల్లో హస్తిమశకాంతరం తేడా. (నిజానికి ఈ పదప్రయోగంలో తేడా అనే పదం అక్కరలేదు. హస్తిమశకాంతరం చాలు. కానీ తేడా అని రాయకపోతే కొందరికి తేడా కొడుతుంది. కొన్ని పదాలు కాలక్రమంలో అలా అలవాటు అయ్యాయి)
నలభయ్ ఏళ్ళ క్రితం మేము మాస్కో వెళ్ళినప్పుడు రేడియో మాస్కో వాళ్ళే ఇల్లు, ఇంటికి కావాల్సిన సామాను అన్నీ సమకూర్చారు. కొంత కాలం గడిచిన తర్వాత ఎంత కాలం ఈ పాత సామాను అనుకుని ముందు ఒక ఫ్రిజ్ కొన్నాము. మాస్కో వెళ్ళేవరకు మాకు ఫ్రిజ్ లేదు. అక్కడ ప్రతీదీ కారు చవకే కాబట్టి అలా వెళ్లి ఇలా కొనేసాము. కొన్న తర్వాత పాత ఫ్రిజ్ ఏం చేయాలనే మీమాంస ఎదురయింది. మాస్కో రేడియో వాళ్ళు రిటర్న్ చేయక్కర లేదన్నారు. ఆ అపార్ట్ మెంట్లో ఏదైనా సమస్యలు ఎదురయితే వచ్చి బాగు చేయడానికి ఒక మనిషి వున్నాడు. అతడిని పిలిచి ఫ్రిజ్ తీసుకోమని అంటే అతడు మమ్మల్ని ఎగాదిగా చూసి, డస్ట్ బిన్ లో పడేయమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఎంత ఖరీదు అయిన వస్తువు అయినా కూడా ఉచితంగా ఇస్తే ఎవరూ తీసుకోరని అర్థం అయింది.
తోకటపా:
అమెరికా అనేది అగ్ర దేశమే కాదు వింతలు విడ్డూరాల గడ్డ అనిపిస్తుంది కొన్ని కొన్ని వింటుంటే. విన్నవాటిలో నిజమెంతో కానీ, నిజమా అనిపించక మానదు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థల మాదిరిగా ఇక్కడ మనిషి జీవితంలో ప్రతి దశకు కొన్ని వయసు నిబంధనలు. అన్ని రాష్ట్రాలలో వీటి తీరు ఒక్కతీరుగా వుండక పోవడం మరో విడ్డూరం. దేనికి దానికి నిబంధనలు ప్రత్యేకం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి కనీస వయసు 21. డ్రైవింగ్ లైసెన్స్ కు 18. కొన్ని చోట్ల 16 ఏళ్లు సరిపోతాయిట. ఇక్కడ కారు లేకపోయినా, కారు నడపలేకపోయినా జీవితం క్లిష్టతరం అవుతుంది కాబట్టి ఈ వెసులుబాటు అంటారు. అయితే 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ 21 ఏళ్లు వచ్చేవరకు అర్ధరాత్రిళ్ళు కారు నడపకూడదు. ఒకవేళ అలా నడిపి ఆక్సిడెంట్ చేస్తే నేరమే కాకుండా వెహికిల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయలేరు.
మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు రాత్రి పదకొండున్నరకు ఎక్కడో డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వెడుతున్నారు. వాళ్లకు డ్రైవింగ్ కొత్త కాదు. అన్ని రకాల కార్లు నడపడంలో ప్రావీణ్యం వుంది. లైసెన్సులు కూడా వున్నాయి. కాకపోతే ఎవరికీ 21 నిండలేదు.
మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుతారు అనే సమయంలో, అడవి మార్గం కావడం వల్ల రోడ్డు మీద అడ్డంగా వచ్చిన ఓ జంతువును తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారిపోయి తలకిందులైంది. కార్లో వున్న ముగ్గురు సీటు బెల్టులు పెట్టుకోవడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. అడవి కావడం వల్ల మొబైల్ సిగ్నల్స్ లేవు. కాకపోతే, ప్రమాదం ఇంపాక్ట్ కు ఎయిర్ బ్యాగ్ బెలూన్లు తెరుచుకున్నాయి. అలా తెరుచుకోవడంతో ఆటోమేటిక్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది అనే సమాచారం క్షణాల్లో పోలీసులకు అందింది. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న కార్లలో ఇలాంటి సాంకేతిక సదుపాయం వుందట. దాంతో ప్రమాదంతో పాటు లోకేషన్ కూడా తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకోగలిగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలనందున, మరో పోలీసు వాహనాన్ని నిమిషాల్లో పిలిపించి ఆ ముగ్గుర్నీ ఇంటికి క్షేమంగా చేర్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోవడంతో కధ సుఖాంతం అయింది.
ఇదిగో ఇక్కడే ముందు చెప్పిన అంకెలు వాళ్లకు అక్కరకు వచ్చాయి.
డ్రైవ్ చేస్తున్న పిల్లవాడికి 18 ఏళ్లు. కానీ 21 నిండలేదు. కాబట్టి అర్ధరాత్రి 12 తర్వాత కారు నడపకూడదు. అయితే ఆక్సిడెంట్ జరిగిన టైం 11.40. ఇరవై నిమిషాలు ముందే జరిగింది కాబట్టి కేసు అవసరం రాలేదు . అదొక అదృష్టం. లైసెన్స్ రద్దు అయితే అమెరికాలో బతుకు దుర్భరం.
ఇక కారు ఇన్స్యూరెన్స్.
కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి కాబట్టి, వాటిని రిపేర్ చేయడం అసాధ్యంగా భావించిన, బీమా కంపెనీ వారు కొత్త కారు కొనుక్కోవడానికి గాను, అందుకయ్యే పూర్తి మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మూడు వారాలలోపే కొత్త వాహనాన్ని, తమకు ఇష్టం వచ్చిన మోడల్ ది, కాణీ అదనపు ఖర్చు లేకుండా కొనుక్కున్నారు.
జరిగింది ప్రమాదమే అయినా, రూల్స్ అన్నీ కలిసి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఇలాంటిదే మన దగ్గర జరిగితే పరిణామాలు ఎలా వుంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. పోలీసులనుంచి, బీమా కంపెనీల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కష్టాలు ఇన్నీ అన్నీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక్కడే ఒక విషయం చెప్పదలచుకున్నాను.
మాన్యులకు, సామాన్యులకు చట్టాలు ఒకే విధంగా అమలు జరిగితే,
మన దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా పౌరులు ప్రభుత్వాలు విధించే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించరు. ఉద్యమించరు.
కాకపొతే, అవి అమలు చేసే/ జరిగే తీరు పట్లే వారి కినుక.
కింది ఫోటోలు:
మొదటి రెండు GOOD WILL MALL
చివరి రెండు
MARSHAL'S MALL
(ఇంకావుంది)
All reactions:
8
1
Like
Comment
Share
Facebook