2, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (174) – భండారు శ్రీనివాసరావు

ట ట టా ట ట టా ట ట టా
ఆఫ్రికా ఒక చీకటి ఖండం. అక్కడ ఈగలు కుడితే మనుషులు చచ్చిపోతారట.
సరిగా తెలియని విషయానికి చివర్లో ‘ట’ తగిలిస్తే అది నిజం అనిపిస్తుందని చిన్నతనంలో అలా చెప్పుకునేవారు. అలాగే వెనక మేము మాస్కో వెళ్లినప్పుడు, స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట, ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ, ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు.
అమెరికన్ ఆతిధ్యం
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా మనుమరాళ్ళ క్లాసు టీచరు మిసెస్ సూజన్ విల్సన్, ఆమె కుటుంబం హాలీడే కోసం ఇండియా వచ్చారు.
‘పనిలోపనిగా హైదరాబాదు కూడా చూసిరండి’ అని మా వాళ్ళు మా అడ్రసు ఇవ్వడంతో మా ఇంటికి వచ్చారు. చిన్న ఇంట్లో వుండడం వాళ్లకి వసతిగా వుండదేమో అన్న సందేహంతో మేము వారికోసం రెండు హోటల్ గదులు బుక్ చేసాము. అయినా వాళ్ళు మాతో పాటు మా ఇంట్లోనే మూడు రోజులు వున్నారు. పిజ్జాలు అవీ ఆర్డరు చేసినా వాళ్ళు వేలేసి ముట్టుకోలేదు. కూరలు, పచ్చళ్ళతో మా ఆవిడ పెట్టిన భోజనమే తిన్నారు. నేలమీదనే చాపలు పరచుకుని పడుకున్నారు. వున్న రెండు బాత్ రూముల్లోనే సర్దుకున్నారు. ఆటోలలో ఊరంతా తిరిగారు. అమెరికాలో తమ స్నేహితులకి కానుకలుగా ఇవ్వడానికి చార్మినార్ దగ్గర గాజులు కొనుక్కుని వెళ్ళారు. టాంక్ బండ్ బుద్ధ విగ్రహాన్ని చూసి ముచ్చట పడ్డారు. గోల్కొండ కోటలో కలియతిరిగారు. లైట్ అండ్ సౌండ్ షో చూశారు. వున్న మూడు రోజులు మాతో కలిసే వున్నారు కానీ, కలిసి ఉంటూ విడిగా ఉండడానికి ప్రయత్నించలేదు. అసౌకర్యంగా వున్నట్టు ఎక్కడా కనిపించకుండా హాయిగా మాతోనే వుండి, మన భోజనాలే చేస్తూ ఇంట్లో మనుషుల మాదిరిగా గడిపి వెళ్ళారు.
అదే మేము అమెరికా వెళ్లినప్పుడు ఇడ్లీ, దోసె దొరికే హోటళ్ళ మీద పడ్డామే కానీ, ఆ దేశపు ఆహార విహారాల ముచ్చటే పట్టించుకోలేదు. ఇతరులతో కలసిపోయే తత్వం, అంతటి విశాల హృదయం మాలో లేదని అనిపిస్తుంది.
మిసెస్ సూజన్ విల్సన్ భర్త మిస్టర్ గోర్డన్, రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు.
ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. మేము సియాటిల్ వెళ్ళినప్పుడు ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.
శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు.
అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో భేషజం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. అందరం భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. భోజనానికి ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.
“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”
మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం”
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
నా చిన్నతనంలో మా బామ్మ రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణసమయంలో భోజనానికి కూర్చున్నప్పుడు, మొదటి ముద్ద చేతిలో పెట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అప్పుడు అర్ధం అయ్యేది కాదు.
పూర్వాచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబాల్లో వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసే ముందు చేసే బలిహరణం అన్నమాట. దాన్ని ఆంతర్యం చాలా గొప్పది. మనం వుంటున్న ఈ భూమండలానికి పైనా కిందా అనేక లోకాలు వున్నాయి. వాటిల్లోని ఎన్నో కోట్ల జీవరాశులకు తృప్తి కలిగించడం దీని ఉద్దేశ్యం. ఈ విధమైన భూత తృప్తి భోజనానికి ముందూ తరువాత చేయడం విధాయకం. ఉత్తరాపోసన పట్టేటప్పుడు ‘ఇతర ప్రాణులను ఉద్దేశించి ఇది చేయడం జరుగుతోంది’ అని చెబుతారు.
బ్రాహ్మణులే కాదు ఇలా ఎవరయినా చేయవచ్చు. సమస్త భూతరాశి తృప్తి కోసం ప్రార్ధించవచ్చు.
ఇలా భోజనాత్పూర్వం సకల జనుల తృప్తి కోసం ప్రార్ధన చేయడం అనే ఆచారం ఇంకా అనేక దేశాల్లో, అనేక మతాల్లో వుంది.
అమెరికన్లు అనగానే విందుకు ముందు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.
అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.
చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ, మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.
కింది ఫోటోలు:
హైదరాబాదులో మిసెస్ సూజన్ కుటుంబం
సియాటిల్ లో సూజన్ దంపతుల ఆతిధ్యం
(ఇంకావుంది)

Like
Comment
Share
Facebook

1, జూన్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (173) – భండారు శ్రీనివాసరావు

 నాకో తీరని కోరిక. ఇక తీరదు కూడా.

కుటుంబంలోని వారందరూ అంటే నేనూ మా ఆవిడా పిల్లలు రోజులో ఒక్క పూటయినా కలిసి కూర్చుని భోజనం చేయాలని. ఈ కోరిక తీరక పోవడానికి నేనే కారణం. ప్రెస్ మీట్లు, డిన్నర్ల పేరుతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే వాడిని. అప్పటికి పిల్లలు గాఢ నిద్రలో వుండేవాళ్ళు. బారెడు పొద్దెక్కి నేను లేచేసరికి వాళ్ళు స్కూలుకు పోయేవాళ్ళు. ఈ విషయాన్ని నేను మిత్రులతో ఓ జోక్ గా చెప్పుకుని మురిసిపోయే వాడిని. రాత్రి పొద్దుపోయి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే మా పిల్లలు తలుపు తీయకుండా, మా నాన్న ఇంట్లో లేరని జవాబు చెబుతారని, ఆదివారం నాడు భోజనాల సమయంలో మా ఆవిడ నన్ను చూపిస్తూ ఇదిగో ఈయనే మీ నాన్న అని మా పిల్లలకు పరిచయం చేస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడిని.
ఇప్పుడు అమెరికాలో మా పెద్దబ్బాయి సందీప్ ను చూస్తుంటే, నా కోరికను వాడు తీరుస్తున్నాడు అనే భావన కలిగింది. ఎంచక్కా వున్న నలుగురు భోజనాల బల్ల వద్ద కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. నాకు చూడ ముచ్చటగా వుంటుంది.
ఇంట్లో అందరం కలిసి, ఒకసారయినా ఒకేసారి భోజనం చేయాలనే కోరిక ఇక తీరదు. ఎందుకంటే ఇద్దరు, మా ఆవిడ, మా రెండో వాడు శాశ్వతంగా దూరం అయ్యారు కాబట్టి.
తీరనివి ఎలాగూ తీరవు, అంచేత మా కోడలు భావన వారిద్దరూ లేరనే భావన రాకుండా నిరుడు 2024 లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక అపూర్వమైన కానుక ఇచ్చింది.
బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్
2024 సెప్టెంబర్ 17 న సియాటిల్ లో బయలుదేరి, బాల్టి మోర్ వెళ్లి 22 న వాషింగ్టన్ డీ సీ నుంచి మేరా భారత్ మహా అనుకుంటూ విమానం ఎక్కడం.
23 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చివరి వారం అంతా గిఫ్టులు కొనడంతోనే సరిపోయింది. ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ దొరికేవి అన్నీ అక్కడే రూపాయల్లో దొరుకుతున్నాయి. తేడా అల్లా మనదగ్గర సామాన్య మధ్యతరగతి జనాలకు అన్నీ దొరుకుతాయి, కానీ డబ్బులు దొరకవు.
తిరిగివెళ్ళే ఆలోచనల్లో వుండగానే, మా వాడు పోస్టులో వచ్చిన ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. తెరిచి చూసాను. అందులో ఫ్రేం కట్టిన ఒక సర్టిఫికెట్ వుంది.
" 2 trees have been planted in a U.S. National Forest in memory of
NIRMALA & SANTOSH BHANDARU "
నిజంగా ఇది నాకు జీవితంలో లభించిన బెస్ట్ గిఫ్ట్.
థాంక్స్ సందీప్, థాంక్స్ భావన.
Trees for a change
Give a gift, Restore a Forest
అనే నినాదంతో, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం తలపెట్టిన పథకాల్లో ఇదొకటి. 35 డాలర్లు చెల్లిస్తే మనం చెప్పిన వారి పేరు మీద ఇక్కడి నేషనల్ ఫారెస్ట్ లో ఒక మొక్కను నాటుతారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను పోస్టులో భద్రంగా పంపుతారు. ఆ మొక్క ఎక్కడ, ఏ ప్రాంతంలో నాటారో తెలిపే లోకేషన్ కూడా షేర్ చేస్తారు.
దేశం కాని దేశంలో మా ఆవిడ పేరుతో, నా రెండో కుమారుడి పేరుతో రెండు చెట్లు పెరగడం కంటే కావాల్సింది ఏముంది?
న్యూయార్క్ వంటి కొన్ని మహానగరాలను మినహాయిస్తే అడవులు లేని అమెరికాని ఊహించడం కష్టం. అడవుల్లోనే జనావాసాలను నిర్మించుకున్నారేమో అనిపించేలా ఎటు చూసినా ఎత్తైన వృక్షాలు, పచ్చని దృశ్యాలు.
మొదటిసారి, అమెరికా వెళ్లి వచ్చినప్పుడు నేను రాసుకున్న వాక్యాలు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి.
“ఆరు మాసాల పాటు చక్కని, కాలుష్యం లేని గాలి పీల్చాను. ఆరు నెలల పాటు మంచి, పరిశుద్ధమైన నీళ్ళు తాగాను”
జన్మాష్టమి
' అమ్మా సృష్టి '
' టెల్ మి తాతా '
' ఈరోజు జన్మాష్టమి. కృష్ణుడి పుట్టిన రోజు '
' హు ఈజ్ కృష్ణ '
' మురళి వాయిస్తాడు. నెత్తి మీద నెమలి పింఛం వుంటుంది ' అని ఇంగ్లీషులో చెప్పాను, కొంత వర్ణించి.
అంతే!
కింది చిత్రం తయారు చేసింది.
నా అమెరికా యాత్ర ధన్యం అయింది అనిపించింది.
ధన్యోస్మి కృష్ణా!
తోకటపా:
కంటికే కెమెరా వుంటే....
కొన్ని చూద్దామన్నా కంట పడవు. మరికొన్ని అనుకోకుండా కంటపడతాయి. చేతిలో సెల్ ఫోన్ సిద్ధంగా వున్నా, ఫోటో తీయలేని పరిస్తితి. తీస్తే పపారజ్జీ (సెలెబ్రిటీలను వెంటాడి, వేటాడి ఫోటో తీసే బాపతు) కింద జమకట్టే ప్రమాదం కూడా వుంది మరి. కంటికే కెమెరా వుంటే యెంత బాగుండు అనిపిస్తుంది అల్లాంటప్పుడు. (ఇప్పుడు ఏ ఐ ఆ ప్రయత్నంలోనే ఉన్నట్టుంది)
ఒక వేసవి కాలం మధ్యాన్నం హైదరాబాదులో మండుటెండలో కారులో ఇంటికి తిరిగొస్తుంటే, కేబీఆర్ పార్కు పక్కన చెట్ల నీడలో ఒక ముసలవ్వ, అవిటి వాడయిన తన పెనిమిటికి అన్నం ముద్దలు తినిపిస్తోంది. ఏమీ లేకపోయినా అన్నీ వున్న మనుషులు వాళ్ళు.
కాస్త దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మరో మనోహర దృశ్యం. మోటారు సైకిల్ పై ఓ యువ జంట. అతడి నెత్తిపై హెల్మెట్. వల్లెవాటు తలపై చుట్టుకున్న ఆ యువతి చేతిలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పిజ్జా, పిస్తా లాంటి ఓ ఆధునిక తినుబండారం. తనో ముక్క కొరికింది. చెలుడి ఆకలి తెలిసిందేమో, హెల్మెట్ పై సుతారంగా తట్టింది. అతగాడు ప్రియురాలి మనసు తెలిసినవాడి మాదిరిగా హెల్మెట్ కొద్దిగా పైకి ఎత్తాడు. ఆ అమ్మాయి చేతిలో తినుబండారాన్ని అతడి పెదవుల వద్దకు చేర్చింది. అతడో ముక్క కొరికి చెలికి థాంక్స్ చెబుతున్నాడు. ప్రేమకు సజీవ సాక్ష్యంలాంటి జంట.
ఈ రెండు దృశ్యాలు ఆవిరి అయిపోతున్న ఆప్యాయతలకి, ఆనురాగాలకీ మారు రూపాలు అనిపించింది.
చూడాలనే కోరిక వుండాలే కానీ, మహానగరాల్లో కూడా మనుషులు కనిపిస్తారు.
కింది ఫోటోలు:
అమెరికాలోని సియాటిల్ అడవుల్లో మా ఆవిడ నిర్మల, మా రెండో కుమారుడు సంతోష్ పేరిట రెండు మొక్కలు నాటినట్టు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్.
సృష్టి గీసిన శ్రీకృష్ణుడి ఊహాచిత్రం
సియాటిల్ లో మా పెద్దవాడు సందీప్ ఇంట్లో కలిసి భోజనాలు
(ఇంకావుంది)
Like
Comment
Share
Facebook