17, డిసెంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (41) - భండారు శ్రీనివాసరావు

 

 

 సాపేక్షమేకష్టమైనాసుఖమైనా!

దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.

ఈ తుపాను అదికాదు. దివి సీమ తుపానుకు చాలా ఏళ్ళ ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు. పైగా ఇప్పటిలా బాలసారలు చేసి తుపానులకు నామకరణాలు చేసే పద్దతులు లేవు ఆ రోజుల్లో.

ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచిరెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతోపెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతోఅమ్మలక్కల పచ్చీసు ఆటలతో హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ మూలన పడేసిన లాంతర్లుబుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలుటిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదుమేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదుమా ఒక్క ఊరే కాదుఅనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు తెలవదు.

దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రభలో ఒక వ్యాసం రాస్తూ. ఈ తుపాను గురించి ఉదహరించాను.  బహుశా దీన్ని నెట్ ఎడిషన్ లో చదివారేమో తెలియదు, అమెరికాలో వుంటున్న బోడేపూడి సత్యంబాబు గారు  గారు నాకొక మెసేజ్ పెట్టారు. దాని సారాంశం ఇది.

‘నమస్కారం శ్రీనివాసరావు గారు,

‘మీరు ఉదహరించిన తుఫాన్ 1960 ల్లో వచ్చింది. శలవులకు  హైద్రాబాద్ నుండి మా ఊరు దెందుకూరుకు వచ్చాము మేము. మీ ఇంట్లో ఎలా అయితే ఇబ్బందులు పడ్డారో, మా ఇంట్లోను అలాగే పడ్డాము. మేమే కాదు, మా ఊరిలోని వారందరి పరిస్థితి అలాంటిదే. అప్పుడు వరదలకు  మధిర వంతెన కొట్టుకుపోయింది. తొండల గోపవరం ఎగువన ఉన్న ఎఱ్ఱుపాలెం ఏరు వంతెనది కూడా అదే పరిస్థితి. అలా వర్షం పడుతూనే ఉంది. అలా ఒక రోజు గడిచిన తరువాత తొండల గోపవరంలో ఆగిపోయిన మద్రాస్ ఎక్సుప్రెస్ నుండి, కొద్దిమంది మా ఊరు వచ్చి తమ పరిస్థితిని వివరించారు.  ఆగిపోయిన రైల్లో చాలా మంది చిన్న పిల్లలు, వయోవృద్ధులు పడుతున్న ఇబ్బందులను గూర్చి వివరించారు. మా స్నేహ బృందమంతా కలసి చిన్న పిల్లలకు పాలు, మజ్జిగ, తీసుకు వెళ్ళాము. సహాయమందినవారు సంతోషించారు. కాని, ఆకలి బాధను తట్టుకోవడం కష్టమైన పరిస్థితి.  ఏదైనా సాయం చేద్దాము అంటే రైలు మా ఊరికి చాలా దూరంలో పట్టాలపై నిలిచివుంది. మేము రైల్లో వున్న అధికారులకు, సిబ్బందికి ఒక సూచన చేశాము. రైలును కొద్ది దూరం నడిపి, మా ఊరికి దగ్గరగా తీసుకువస్తే ప్రయాణీకులకు అవసరమైన భోజనాన్ని వండించి పెట్టగలమని చెప్పాము. ముందు వాళ్ళు మా మాటను నమ్మలేదు. అప్పుడు కొంతమంది అధికారులు మాతోపాటుగా మాఊరు వచ్చారు. ఊరి ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలని అన్నారు. అప్పుడు మా నాన్న గారు బోడేపూడి రాఘవయ్య గారే ఆ గ్రామానికి అధ్యక్షులు. (ఆ రోజుల్లో గ్రామ పంచాయతి ప్రెసిడెంట్ అనేవారు, సర్పంచ్ అనే పదం వాడుకలోకి రాలేదు)  విషయాన్ని వివరించి, సహాయాన్ని కోరితే, మేము చెప్పిన మాటనే వారు కూడా చెప్పారు. కొన్ని గంటల తరువాత, రైలు మా ఊరు సమీపానికి వచ్చింది. గ్రామస్తులందరూ కలిసి,  అట్టి విపత్కర పరిస్థితిలో, అనుకోని అతిధులను ఆదరించారు. అట్టి సమయంలో కూడా, ఆచారాలను నియమబద్ధంగా పాటించేప్రయాణీకులను బ్రాహ్మణుల ఇళ్లకు అతిథులుగా పంపారు. వర్షం వెలిసిన తరువాత ప్రయాణీకులు అందరూ, మధిర నడుచుకుంటూ వెళ్ళి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొస మెరుపు ఏమంటే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గారు రేడియోలో మా ఊరి పేరును ప్రస్తావించి, మా గ్రామ వాసులకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తరువాత కొన్ని రోజులకు కేంద్ర రైల్వే మంత్రి రామ్ సుభాగ్ సింగ్ గారు, సహాయ మంత్రులు వచ్చి, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామంటే, మా నాన్న గారు మా ఊరికి రైల్వే స్టేషన్ కావాలన్నారు. (అంతకు పూర్వం మాఊరుకు స్టేషన్ ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అప్పటి ప్రభుత్వం ఆ స్టేషన్ ను నిషేధించింది. మా ఊరికి బదులుగా తొండల గోపవరానికి శాశ్వత స్టేషన్ ను నిర్మించారు. కేంద్ర మంత్రి  అప్పటికప్పుడు మా వూరికి స్టేషన్  మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది. తరువాత, నిర్వహణా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేవారు కరువయ్యారు. ఇప్పుడు స్టేషన్ సదుపాయం లేదు కాని, ఆర్టీసి బస్ సర్వీస్ లు వచ్చాయి. అంచేత,  ప్రయాణ సౌకర్యాలకు ఏమీ ఇబ్బంది లేదు.

పాత విషయాలు స్పురణకు తెచ్చినందుకు కృతజ్ఞతలు’

సత్యంబాబు బోడేపూడి (అమెరికా)

 

తోక టపా: పూచిన ప్రతి పువ్వూ దేవుడి పాదాలను చేరలేదు. కొన్నిటికే ఆ అదృష్టం. అలాగే రాసిన ప్రతిదీ అందరికీ చేరకపోయినా, చేరాల్సిన కొందరికి కొన్ని చేరతాయి అనడానికి ఇదే రుజువు.

తుపాను వెలిసిన తర్వాత ఊళ్ళో చందాలు పోగుచేసాము. ఆ మొత్తాన్ని ఎవరికి పంపాలో తెలియలేదు. అంధ్రపత్రిక దినపత్రిక వారు తుపాను సహాయ నిధిని సేకరించడం మొదలుపెట్టారు. మేము మా దగ్గర వున్న డబ్బుని అ పత్రికకి మని ఆర్డర్ చేశాము. కొన్నాళ్ళ తర్వాత దాతల జాబితాలో కంభంపాడు పౌరులు అనే పేరుతో మా విరాళాన్ని ప్రచురించారు. మా ఊరికి వచ్చే పత్రికలు రెండే రెండు, ఒకటి గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు చందా కట్టి తెప్పించే అంధ్రపత్రిక. రెండోది కమ్యూనిస్ట్ పార్టీ తరపున వూరి ప్రెసిడెంటుగా ఎన్నికయిన బోడేపూడి నరసింహా రావు గారు పోస్టులో తెప్పించే విశాలాంధ్ర.

ఆంధ్రపత్రికలో  మా ఊరు పేరు వచ్చిన రోజున  సిద్ధాంతి గారి ఇంటి దగ్గర ఒకటే కోలాహలం.

(ఇంకా వుంది)

16, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (40) - భండారు శ్రీనివాసరావు

 

 ఇప్పటిమాట కాదు. అరవై ఏళ్ళ పైమాటే.

మద్రాసు జనరల్ ఆసుపత్రి బీటు చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది.

పక్కనే ఎవరికోసమో ఎదురుచూస్తున్న లక్ష్మి అనే అమ్మాయి (పేరు తరువాత తెలిసింది) అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటరు పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగాపోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలాకొట్టుకుంటున్నవారిని అందరితోపాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే పరిగెట్టుకు వెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓటాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురునలుగురు ఆపకుండాపోయారు. మరి కిరాయి ఎవరిస్తారని మరో  టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ హాస్పటల్ కి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యంవల్ల ఆ ఇద్దరిలో ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న విలేకరి హృదయం ద్రవించింది.

నిరక్షరాస్యురాలయిన ఓకూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకునిముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి హాస్పటల్ కు చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పేపర్లో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ ‘అనే శీర్షికతో రాసిన ఆ వార్త నగరంలో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్,  లక్ష్మికి పాతికరూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజుకూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆరోజుల్లో అది పెద్దమొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచిస్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు.. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్త చీరెను కానుకగా పంపించాడు. పాఠకులనుంచి దాదాపు వెయ్యిరూపాయల సాయం అందింది. వంద రూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆయువతి తరువాత అదే విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అది  చదివిన కంచికామకోటి పీఠాధిపతిపరమాచార్య ఒక ఇత్తడిగిన్నెను ఆమెకు కానుకగా పంపించారు.

ఇంతకీ అసలువిషయంఏమిటంటే -

ఆ వార్త వేసిన  పేపరు హిందూ. ఆ వార్త రాసింది అందులో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్.

ఈ కధా నాయకుడు, తదనంతర కాలంలో  హైదరాబాదులో హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ అయ్యారు. నేను  హైదరాబాదు రాకముందు నుంచి కూడా ఆయన నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు. 

ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.

సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. అల్లినగరం మీదుగా జొన్నచేలమధ్య కాలిబాట పట్టుకుని,  నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం ప్రసాద్ గారు  పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.

పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు, ఆకాశంలో  గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి, ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.

మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము. 

ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు. 

ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. 

కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.

అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.

దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.

ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు. కే.ఎల్.రావు గారి కుమార్తె, ఐ.ఏ.ఎస్. అధికారి సుజాతా రావు గారికి  ఈ విషయం చాలా సార్లు చెప్పాను. ఆవిడ కూడా వెళ్లి చూద్దాం అన్నారు. హైదరాబాదులో వున్నప్పుడు పని ఒత్తిళ్ళ కారణంగా వీలు పడలేదు. తరువాత ఢిల్లీ పోస్టింగు. అక్కడే రిటైర్ మెంటు. ఇక కుదురుతుందని నేనూ అనుకోవడం లేదు.

నీటి పారుదల నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ రంగాల్లో కె.ఎల్.రావు ( కానూరి లక్ష్మణ రావు అసలు పేరు. కృష్ణా జిల్లా కంకిపాడు వాస్తవ్యులు) గారికి ఒక ఇంజినీరుగా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఒక అంతర్జాతీయ సదస్సులో కె.ఎల్.రావు గారు ఆశువుగా చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆలకించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ముగ్ధుడు అయ్యారు. ఆ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు ఆయన్ని అధికార పార్టీ తరపున విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయించారు. అదే నియోజక వర్గం నుంచి రావు గారు ముమ్మారు లోకసభకి ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి,  ఇందిరాగాంధీ మంత్రి వర్గాల్లో ఆయన మంత్రిగా వున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు కాకపోయినా,  నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో, నిర్మాణంలో ఆయన పాత్ర అద్వితీయం. రాతితో, మట్టితో ఆనకట్ట నిర్మాణం ఏమిటని ఎద్దేవా చేసిన వాళ్ళు వున్నారు.

‘మనది పేద దేశం. నిరక్షరాస్యులైన పనివాళ్లు కోట్లలో వున్నారు. వారికి ఎంతోకొంత జీవన భృతి కల్పించాలి అంటే ఇలాంటి నిర్మాణాలే తగినవి అని ఆయన గట్టిగా వాదించి అలాగే సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. దేశంలో ఆ రోజుల్లో నిర్మితమైన అనేక సాగు నీటి ప్రాజెక్టులు, ఆనకట్టల వెనుక కె ఎల్ రావు గారి పాత్ర వుంది. నీటిపారుదల పితామహుడు అనే పేరు ఆయనకు వుంది.  సాగర్ ఎడమ కాలువ ద్వారా కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగునీరు అందేలా చేశారు. వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. తమకు సేవచేసిన మనిషిని గుర్తు పెట్టుకుని మూడు సార్లు గెలిపించిన ఆ ఓటర్లే నాలుగో సారి ఓడించడం రాజకీయాల్లోని చమత్కారం.

కింది ఫోటోలు:


(హిందూ రాజేంద్ర ప్రసాద్)


(డాక్టర్  కే.ఎల్ .రావు)


(ఇంకా వుంది)





ఈరోజు అన్ని వ్యాపకాలకు స్వస్తి

  

ఏనాడు తనని గురించి తాను ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింతమనిషి, 1971 డిసెంబరు  16 న, నా జీవితంలో వెలుగులు విరజిమ్ముతూ ప్రవేశించింది. నలభయ్ ఎనిమిదేళ్లు ఆ సహజీవనం కొనసాగింది. ఉన్నట్టుండి ఓ అర్ధ రాత్రి నన్ను ఒంటరివాడిని చేసి మాయమై పోయింది. ఆ వెలుగుల క్రీనీడలో నా అయోమయపు ప్రయాణం సాగుతోంది. ప్రతి ఏడాది ఇదే రోజున రాత్రి పన్నెండు గంటలు కొట్టగానే ఆదమరచి నిద్రపోతున్న నన్ను లేపి, సుతారంగా నుదుట ముద్దు పెట్టి,  శుభాకాంక్షలు  చెప్పేది. అప్పటిదాకా ఆ రోజు మా పెళ్లి రోజని నాకు గుర్తు వచ్చేది కాదు. పిచ్చి పెళ్ళాం. పిచ్చిగా నన్ను ప్రేమించింది.  అందుకే  నన్ను పెద్దమనసుతో మన్నించేది.



Where ever you are,  Happy many returns of the day my dear wife Nirmala.  

16-12-2024

15, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (39) - భండారు శ్రీనివాసరావు

 


అలా వరసగా పరీక్షలు తప్పుతూ నాకు నేనుగా తెచ్చిపెట్టుకున్న సెలవులను మా స్వగ్రామం కంభంపాడులో కులాసాగా గడుపుతున్న రోజుల్లో ...కొన్ని పాత దస్త్రాలు నా కళ్ళపడ్డాయి. చదువు సరిగా అంటక పోయినా విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి నాకు చిన్నతనం నుంచే వుండేది. అదే తరువాతి కాలంలో నేను ఎంచుకున్న వృత్తిలో ఎదగడానికి లేదా కొనసాగడానికి  దోహదం చేసింది. ఎప్పటిదో బ్రిటిష్ జమానానాటి  ఆ దస్త్రాలను మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రాఘవరావు పదిలపరచడం నిజంగా గొప్ప విషయం. వాటి ద్వారా మా ఊరి గురించిన కొన్ని వివరాలు తెలిశాయి.  

1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం  ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా  అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు  ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే  ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే  ఇప్పటికి అక్షరాలా తొంభయ్ మూడు సంవత్సరాలు గడిచాయి.  అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది. 

‘DETAILED LIST OF JOINTLY REGISTERED  HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.

వివరాల్లోకి వెడితే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. ఇది అప్పటి మాట. (అయితే ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో సమగ్ర భూసర్వే సర్వే జరుగుతోందని,  అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే పూర్తయి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. దశల వారీగా జరుగుతున్న ఈ పని కొంత పూర్తి అయిందని, ఇది పూర్తయితే  భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని ఓ చిన్ని చిన్ని ఆశ) 

ఇదలా ఉంచితే, తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. (ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా మా ఊరికి సేద్యపు నీరు అందుతోంది) సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో  128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవికాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు.  సాగుకు పనికి రాని భూమి 3,440 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగాగ్రామంలో భూమిశిస్తు మొత్తం  4720 రూపాయలు వసూలు అయ్యేది.   9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా  తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని  కట్టివేసే దొడ్డి అన్నమాట.  నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు. 

1929 వ సంవత్సరం జమాబందీ  లెక్కల ప్రకారం, ఊరి మొత్తంలో  1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా)  675 గొర్రెలు, మేకలు వుండేవిట. 

అంత పాత కాలంలోనే ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా భూముల సర్వే గ్రామాల వారీగా జరిపి రికార్డులని భద్రపరిచారు అంటే అలనాటి రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేసేదో అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే  మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు, అరకలు   ఉండేవి. ఇప్పుడు ఆ పాడీ లేదు, పశువులూ లేవు. వెనుకటి రోజుల్లో పెరుగు, మజ్జిగ అమ్మడం నేను చూడలేదు. కొనుక్కోవడం అసలు ఎరగం. వూళ్ళో ఎవరింటికి అయినా చుట్టాలు వస్తే పాలూ, పెరుగూ ఇరుగింటి పొరుగింటి వారే పంపేవారు. వచ్చిన  బంధువులు పడుకోవడానికి నులక మంచాలు, నవారు మంచాలు  కూడా పంపేవారు. ఏదైనా సందర్భం వచ్చి ఊళ్ళో పదిమందికి భోజనాలు పెట్టాల్సి వస్తే, ఎవరి చెంబులు,  గ్లాసులు వాళ్ళే వెంట తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం అనుకునే  మా ఊళ్లోనే వంట సామాన్లు, వడ్డన సామాన్లు, మీల్స్ టేబుల్స్, కుర్చీలు  అద్దెకు ఇచ్చే టెంటు హౌస్ లు రెండు మూడు వున్నాయి.   

వూరి నిండా కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు. వీటికి   మాత్రం కొదవలేదు. అందరి చేతిలో సెల్ ఫోన్లు. బస్తీలలో లాగే పల్లెల్లో కూడా ఓ  మాటా లేదు, ముచ్చటా లేదు. ఎవరి ప్రపంచం వారిదే.

కింది ఫోటో:


(Courtesy Cartoonist)







(ఇంకా వుంది)

14, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (38) - భండారు శ్రీనివాసరావు

 

మాది 1962 హెచ్.ఎస్.సి. బ్యాచ్. ఈ ఒక్క సంగతి గుర్తు పెట్టుకుని వున్నట్టయితే, లేదా సమయానికి గుర్తు వచ్చి వున్నట్టయితే ఇవ్వాళ నా నెలవారీ  పెన్షన్ ఓ పాతిక వేలు పెరిగివుండే అవకాశం వుండేది. నాది మతిమరపు జాతకం కదా! కర్ణుడి లాగా సమయానికి గుర్తురాలేదు. బంగారం లాంటి అవకాశం చేజారి పోయింది. అందుకే కదా నన్ను నేను జీరో అనుకునేది. ఉత్తి జీరో కాదు, బిగ్ జీరో. ఆ కధేమిటో మరోసారి సమయం  వచ్చినప్పుడు చెబుతాను.

ఆ ఏడాది కారణం తెలియదు కాని, 1962 హెచ్.ఎస్.సి. యాన్యువల్ పరీక్ష రోల్ నెంబర్లు రాష్ట్రం మొత్తంలో ఖమ్మం, రిక్కబజార్ హై స్కూలు నుంచి మొదలు పెట్టారు. ఒకటి, రెండు, మూడు ఇలా అన్నమాట.  నా రోల్ నెంబరు ఏడు.  ఏడంటే ఏడే. ముందు వెనుక మరో అంకె లేదు. హాల్ టికెట్ మీద ఏడు నెంబరు చూడగానే, కాపురం చేసే  కళ కాళ్ళ మెట్టెలు చూస్తే తెలిసినట్టు, నా పరీక్ష ఫలితం పరీక్ష రాయక ముందే నాకు తెలిసిపోయింది. ఇది కాక మరో అదృష్ట సంఖ్య వచ్చినా ఫలితం మారదని కూడా నాకు  తెలుసు.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికి ఓట్ల లెక్కింపుకు ముందే ఫలితం పట్ల ఓ అంచనా ఉంటుందని అంటారు. అలాగే విద్యార్ధికి కూడా ఫలితం పట్ల ముందుగానే ఓ అంచనా వుంటుంది. కాకపోతే, రిజల్ట్స్ వచ్చేవరకు మేకపోతు గాంభీర్యం. మినిమం సెకండ్ క్లాస్. హయ్యర్ సెకండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ బూకరింపులు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నాదీ అలాగే ముగిసింది. ఒకటి కాదు, రెండు సార్లు. ఒకటి ఒంటరి అంకె. నాకు నచ్చదు.  

పరీక్షలు రాయడం పూర్తయింది. తప్పడం తప్పదు అనే విషయం కూడా మనసుకు రూడి అయింది. కాబట్టి కంభంపాడు వెళ్లి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేయడం మంచిదని అక్కడికి బిస్తరు కట్టాను. మా పెద్దన్నయ్య ఎప్పుడూ ప్రయాణాలకి సూట్ కేసులు వాడే వాడు కాదు. ఆ రోజుల్లో చాలామంది హోల్దాల్ వాడేవాళ్ళు. దానికా పేరు ఎందుకో నాకయితే తెలియదు. బహుశా హోల్డ్ ఆల్ అయివుంటుంది.  దానికి రెండు వైపులా బట్టలు పెట్టుకునే జాగా వుంటుంది, దాన్ని రెండుపక్కలా మధ్యకు మడిచి బెల్ట్ తో బిగించేవాళ్లు. ప్రయాణాలకు చాలా అనువుగా వుండేది. కొంతమంది దాన్ని బిస్తరు అనేవాళ్ళు.

మొత్తం మీద మా ఊరు చేరాను. ఊరు చేరగానే నాకు వంటికి కొత్త రక్తం పట్టినంత హుషారు. బారెడు పొద్దెక్కి లేచినా అడిగేవాళ్ళు వుండరు. పనివాళ్లు లేపడానికి చూసినా మా బామ్మ వాళ్ళని కసిరేది, పిల్లాడు ఒళ్ళు మరచి నిద్రపోతుంటే చూడలేరా అని వాళ్ళ మీద గయ్యిమనేది. సాయంత్రం అయ్యేసరికి తుమ్మల బీడు పక్కన పారే వాగు ఇసుకలో చెడుగుడు (కబడ్డీ)  ఆడేవాళ్ళం. కూత ఎంత పెడితే అంత ఘనం. మా ఊరి స్కూలుకు బయట నుంచి మాస్టర్లను వేయడం మొదలయింది. మల్లయ్య గారనే కొత్త టీచరు వచ్చారు. ఆయన తన వెంట షటిల్ ఆటను పట్టుకొచ్చారు. బ్యాట్లు,బంతులు కొని ఆట ఆడేవాళ్ళం. ఆయనే అది ఎలాఆడాలో చెప్పాలి. స్కోరు గమ్మత్తుగా వుండేది. ఇరుపక్షాలు  సమానం అయితే లవ్ ఆల్ అనేవారు. ఆటలో ఈ లవ్వు ఏమిటని నవ్వుకునేవాళ్ళం. పాటలు బాగా పాడేవాడు. ఘంటసాల లాగా పాడుతాను అని ఆయనకో నమ్మకం. మహేశా పాపవినాశా కైలాస వాసా ఈశా అనే పాట ఎక్కువగా పాడేవాడు. ఊళ్ళో చిన్నపిల్లలను దగ్గరకు తీసి చిన్న చిన్న నాటికలు వేయించేవాడు. మా ఇంట్లోనే వాటి రిహార్సల్స్ నడిచేవి.  

వరి కళ్లాల సమయంలో మా బామ్మగారు వెళ్లి రాత్రి పూట అక్కడే పడుకునేది. ఒక్కోసారి ఆమెను ఇంట్లోనే వుండమని నేను వెళ్ళే వాడిని. పగటి పూట బాగానే వుండేది. ఎడ్ల చేత తొక్కించడం, చేటలతో ధాన్యం చెరిగి రాశిగా పోయడం, కుండలతో అంటే మట్టివి కావు, ధాన్యం కొలతకు వాడే ఇత్తడి గుండిగలతో కొలిచి బస్తాలు నింపడం, సరదాగా గడిచేది. కట్టె మిఠాయి తట్టలలో పెట్టుకుని కళ్లాల దగ్గరికి తీసుకువచ్చి అమ్మేవారు. మానెడు వడ్లు కొలవడం, హాయిగా తినడం. రాత్రి పూట బాగా చలి వేసేది. రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగేది కాదు. అందుకని వరి గూడులో నేను కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి వీలుగా, ధృవ ప్రాంతాలలో నివసించే  ఎస్కిమోలు మంచుతో ఇండ్లు నిర్మించుకున్నట్టు చిన్న గూడు చేసి నేను అందులో పడుకోగానే మళ్ళీ వరిగడ్డితో మూసేసే వారు. అందులో వెచ్చగా పడుకుని నిద్రపోయేవాడిని. కాపలా కోసం పంపిస్తే నిద్రపోతావా అని మా బామ్మ నన్ను ఆ డ్యూటీ నుంచి తప్పించింది.

మా  బామ్మ రుక్మిణమ్మ గారికి ముగ్గురు కుమార్తెలు. ఆమె పెద్ద కుమార్తె అంటే మా పెద్ద మేనత్త రంగనాయకి భర్త, ఖమ్మం జిల్లాకు చెందిన కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈ అన్నదమ్ములకు ఇద్దరికీ ఖమ్మం, వరంగల్ జిల్లాలలో వందల ఎకరాల భూమి.  మా పెద్ద మేనత్త మొగుడు పెద్ద లాయరు కూడా. పిత్రార్జితంతో పాటు వకీలుగా మంచి పేరు, గట్టి ఆస్తులు సంపాదించారు. లక్ష్మీ నరసింహారావు గారి పెద్ద కుమారుడు రామచంద్ర రావు గారికి మా రెండో అక్కయ్య శారదను మేనరికం ఇచ్చారు.

రెండో మేనత్త కమలా బాయి  భర్త  ఖమ్మంలో పెద్ద వకీలు, అంతకంటే పెద్ద భూస్వామి అయిన పర్చా శ్రీనివాసరావు గారు. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆయనకు పెద్ద బంగ్లా వుండేది. అది పాత తెలుగు సినిమాల్లో జమీందారుల భవనంలా కనిపించేది. ఎత్తయిన మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్దహాలు, దానికి ఇరువైపులా వరండాలు, మళ్ళీ వెనకవైపు మరో హాలు, ఇరువైపులా గదులు ఇలా చాలా విశాలంగా వుండేది. ఆయన ఆఫీసు గదిలో ఒక సీలింగు ఫ్యాను వుండేది. సీలింగు ఎత్తుగా వుండడం వలన అవసరం అయినప్పుడు ఫ్యానును కిందికి దించుకునే ఏర్పాటు వుండేది. మా మేనత్త మొగుడు కూర్చునే వకీలు కుర్చీ, దానికి ఎదురుగా పెద్ద మేజా బల్ల, అటూ ఇటూ క్లయింట్లు కూచోవడానికి కుర్చీలు చాలా అట్టహాసంగా ఉండేవి. ఆయన ప్రాక్టీసు కూడా అలానే వుండేది. ఇది కాక ఖమ్మం జిల్లాలో వాళ్ళ స్వగ్రామం మండవలో  భారీ ఆస్తులు ఉండేవి. దానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో కూడా భూములు ఉండేవి. వాటిమీద వచ్చే అయివేజు కూడా భారీగానే వుండేది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. పీవీ నరసింహా రావు గారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం వుండేది. ప్రధాని అయిన తరువాత కూడా పీవీని పేరుతొ సంబోధించే చనువు ఉన్న మనిషి శ్రీనివాసరావు గారు. ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ఆయన ఖమ్మంలో  బాలికల పాఠశాల ఏర్పాటుకు దోహదపడ్డారు.

దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా మా బామగారి అమ్మగారు చెల్లమ్మగారుమా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తరదక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూపిల్లలకు భారతభాగవతాల్లోని పద్యాలుకధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికిసంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. మా వూళ్ళో అప్పుడు పాతికముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి.

తోకటపా:

మా  భండారు వంశ వృక్షానికి చెందిన ఒక కొమ్మ తాలూకు కొన్ని  రెమ్మలు, మా రెండో అక్కయ్య కొలిపాక శారద కుటుంబ సభ్యులు అన్నమాట,  ఈరోజు అంటే 2024 డిసెంబరు 14 శనివారం నాడు  హైదరాబాదులోని ఒక పెద్ద హోటల్లో కలిసారు. ఎవరి కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా, మేనమామలుగా నన్నూ, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారిని పిలవడం ఆనవాయితీ.  వెళ్లాం. దాదాపు ఎనభయ్ మంది దాకా  వచ్చారు. గ్రూపు ఫోటో తీసుకోవడానికి వీలు లేకపోయింది. సందర్భం మా పెద్ద మేనత్త రంగనాయకి గారి చిన్న కూతురు శ్రీలక్ష్మి (ఖమ్మం నుంచి మొదటి లేడీ గ్రాడ్యుయేట్) కుమారుడు గోపి షష్టి పూర్తి. గోపి నాన్నగారు సింగరాజు ప్రభు గారు కేంద్ర ప్రభుత్వంలో అనేక విభాగాల్లో ఉన్నతోద్యోగాలు  చేసి రిటైర్ అయి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. వారి వయసు కేవలం తొంభయ్ సంవత్సరాలు.

(కింది ఫోటోలో ఫుల్ స్లీవ్స్ తెల్ల షర్ట్ టక్ చేసుకున్న వ్యక్తి. ఎక్కడికైనా సరే స్వయంగా కారు నడుపుకుంటూ వెడతారు. ఇక నా పక్కన ఉన్న శ్రీలక్ష్మి (పాపాయి వదిన) ఎనభయ్ ఏళ్ల వయసులో కూడా వంట చేస్తుంది. మాలాంటి వాళ్ళం పొతే వండి పెడుతుంది. అమ్మతరపు చుట్టాలమని మా అన్నదమ్ముల పట్ల ఆపేక్ష. ఫోటోలో కుడి పక్కన మా అన్నయ్య రామచంద్రరావు గారు. 80, 90, 78, 80 వరుసగా వయసులు అన్నమాట)



ఈ నలుగురిలో నేనే చిన్నవాడిని.    

(ఇంకా వుంది)