8, అక్టోబర్ 2024, మంగళవారం

సాయంత్రం కలుద్దామా

సాయంత్రం కలుద్దామా!

"మీరు అమెరికా నుంచి వచ్చినట్టు ఫేస్ బుక్ లో మీ పోస్టు ద్వారా తెలిసింది. మీకు వీలుంటే కలుద్దాం. కారు పంపుతాను"

కాదనడానికి కారణం కనపడలేదు, ఒకటి తప్ప. అదే చెప్పాను. చాలా కాలంగా రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దాదాపుగా అస్త్ర సన్యాసం చేసాను. సొంత గొడవలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. గతంలో ఏళ్ల తరబడి వ్యాసాలు రాస్తూ వస్తున్న పత్రికా సంపాదకులకు కూడా ఇదే విషయం చెప్పి సెలవు తీసుకున్నాను.
రాజకీయాలతో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రాజకీయంతో ఎంతోకొంత ముడిపడిన వారిని కలుసుకోవడం, వారితో కొంత సేపు గడపడం అంటే కొంచెం ఇబ్బందే. కానీ పిలిచిన వాళ్ళు అనేక ఏళ్లుగా పరిచితులు. గతంలో అనేక మార్లు కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్న ఆత్మీయులు. అంచేత కాదనలేక సరే అని వెళ్ళాను.
నిజంగా ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. రాజకీయాలే కాదు, పరస్పరం విభేదించుకునే ఏ ఒక్క అంశం ప్రస్తావనకు రాలేదు. హాయిగా మనసారా కబుర్లు చెప్పుకున్న సాయంత్రంగా గుర్తుండి పోయింది.
ఇద్దరిలో ఒకరు సీతయ్య. ఎవ్వరి మాటా వినని సీతయ్య. ఏపీ హక్కుల పరిరక్షణ అనే ఏకైక అంశం తీసుకుని అవిశ్రాంత పోరాటం చేస్తున్న చలసాని శ్రీనివాస్.
రెండో వ్యక్తి తెలంగాణ ప్రయోజనాలు ప్రధానం అని మనసారా నమ్మే పద్మారెడ్డి గారు. నమ్మిన సిద్ధాంతాల దృష్ట్యా ఒకరికొకరు చుక్కెదురు.
అందుకే సంక్షేపించింది.

ఒకప్పుడు నేను పని చేసిన రేడియో ఎవరి కనుసన్నల్లో అయితే పనిచేసేదో, ఆ మంత్రిత్వ శాఖకు సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రి, కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారికి స్వయంగా సోదరుడు  పద్మారెడ్డి గారు. వీరిద్దరూ నాకు చిరకాలంగా పరిచితులు.
అందుకే రాజకీయాలు వద్దు అనే నిబంధనతో వెళ్ళాను.
ఇద్దరూ పెద్ద మనుషులు. పెద్ద మనసు చేసుకుని నా అభ్యర్థన మన్నించారు.
వెళ్ళగానే ఒక విషయం నన్ను ఆకర్షించింది. మరో విషయాన్ని గుర్తుకు తెచ్చింది.

పీవీ నరసింహారావు గారు భారత ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో, ఆయన సమీప బంధువులకు ఒక మేరకు భద్రత కల్పించారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రధాని, ముఖ్యమంత్రితో ప్రమేయం లేకుండా భద్రతా విభాగం ఈ ఏర్పాట్లు చేస్తుంది.
ఆ రోజుల్లో ప్రధాని సమీప బంధువు నాతో ఒక మాట చెప్పారు. గతంలో హాయిగా రిక్షాలో ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళేవాడిని. అదే ఇప్పుడు ఈ తుపాకీ వాడిని వెంటబెట్టుకుని ఆటోలో వెళ్లాల్సి వస్తోంది అని.
అది గుర్తుకు వచ్చి పద్మారెడ్డి గారి వెనుక ఎవరైనా సాయుధ పోలీసులు ఉన్నారేమో అని ఆసక్తిగా చూసాను. ఎవ్వరూ కనపడలేదు. ఎప్పటి మాదిరిగానే, వారి అన్నగారు జైపాల్ రెడ్డి గారిలాగా మందహాసంతో కానవచ్చారు. ఆశ్చర్యం అనిపించింది.
ఆశ్చర్యం ఎందుకంటే, పద్మా రెడ్డి గారు ఎవ్వరో కాదు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వయానా పిల్లనిచ్చిన మామగారు.

7-10-2024

7, అక్టోబర్ 2024, సోమవారం

ఓ ఫొటో ముచ్చట



ఫోటో ఏముంది? తీసినవాళ్ళ పనితనాన్ని బట్టి దాని గొప్పతనం. 
ఈ ఫొటో తీసింది ఆషామాషీ ఫోటోగ్రాఫర్ కాదు. ఆకాశవాణిలో తన స్వరంతో, ఫేస్ బుక్ లో తన కలంతో ఆకట్టుకుంటున్న ప్రముఖ రేడియో న్యూస్ రీడర్ తురగా ఉషారమణి. 
ఎనిమిదేళ్ళ క్రితం నేను నా పుట్టిల్లు రేడియో స్టేషన్ కు వెళ్ళినప్పుడు తన మొబైల్ తో క్లిక్ అనిపించింది. బాగా తీసావమ్మా అంటే జీవితాంతం గుర్తు పెట్టుకునే ఓ సర్టిఫికెట్, నాకు మరో గుర్తుగా ఇచ్చింది. పోలికలో ఉత్ప్రేక్ష అనిపిస్తే మన్నించండి. శ్రీ శ్రీకి చలం యోగ్యతాపత్రం లాగా భావిస్తా. అదే ఇది.

"సందర్భం వచ్చింది కాబట్టి:

నాకు శ్రీనివాస రావు గారు నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి తెలుసు. తెలియడమే కాకుండా నేను ఆయనని తరచూ చూస్తూ వచ్చాను. కనీసం వారానికి ఒక సారి అన్నంత తరచుగా. ఆయన 35 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అది అందరికీ కనిపిస్తున్నదే. 
ఆయన చాలా ఫొటోజెనిక్. ఫొటోజెనిక్ అంటే కెమెరాకి సరిపడే లుక్స్ అనే కాదు. పోర్ట్రయిట్ ఫొటోస్ తీయడం ఎక్కువగా  ఇష్టపడే నాకు ఆయనలో రెండు మూడు విలక్షణమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి, స్పాంటేనిటీ. అంటే చటుక్కున ముఖంలోకి నవ్వు వచ్చేస్తుంది. కళ్ళల్లో కూడా ఆ నవ్వు reflect అవుతుంది. రెండు comfort. అంటే ఏ ఒక్క క్షణంలోనూ, పరధ్యానంగా ఉన్నా, అలెర్ట్ గా ఉన్నా ఆయన అంతే relaxed గా ఉంటారు. మనసులో ఆలోచనల్లో అలజడి లేదన్న విషయం ఆయన face లో ప్రతిఫలిస్తుంది. మూడోది involvement. శ్రీనివాస రావు గారు జనాలతో ఉన్నప్పుడు తన సొంత గోల కాక అవతలి వాళ్ళ మీద దృష్టిపెట్టి, వాళ్ళ మాటలు ఆసక్తితో వింటూ, participate చేస్తుంటారు. దానితో అసలు ఈ కెమెరా గొడవ ఆయనకీ పట్టదు. These are the traits which make him a great subject for portraits any time and in any light. ఫోటో తీసే వాళ్ళు కూడా 'ఆహా, భలే తీసానే' అనుకునేట్లు. :)  
నా observations. కాదంటే చెప్పండి."

అని సవాలు విసురుతోంది పైగా. 
ఎంతయినా నా గురుపత్ని తురగా జానకీరాణి గారి అమ్మాయి కదా!
థాంక్స్ ఉషా!

తోకటపా:
చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో రామప్ప గుడికి ఎక్స్ కర్షన్ కు తీసుకు వెళ్ళారు. ఆ రోజుల్లో కెమెరా అంటే ఎంతో అపురూపం. ఒక్క ఫొటో దిగితే చాలు జీవితం ధన్యం అనుకునే కాలం. 
కొందరు ఫారెన్ టూరిస్టులు అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అందులో ఒక దాంట్లో నేను పడ్డాను అని నా నమ్మకం. ఆ ఫొటో చూసుకునే అవకాశం ఈ జన్మకు వుండదు అని తెలిసికూడా, జన్మకు సరిపడా మురిసిపోయాను.
చిన్నతనపు అజ్ఞానంలో కూడా ఎంతో మధురిమ వుంటుంది.

5, అక్టోబర్ 2024, శనివారం

నా మీద నాకే అసూయ

నా మీద నాకే అసూయ - భండారు శ్రీనివాసరావు 

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.
"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"

2019 లో కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల హఠాత్తుగా కన్నుమూసింది. 
ఈ ఏడాది (2024) ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్ తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు. వాడికి తల్లి అంటే ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.

అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే  జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే చెప్పరాని ఆనందం, చెప్పుకోలేని బాధ రెండూ పడుగుపేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.

కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా  వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.

 దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే   నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టినరోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే  2019లో  కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు  పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు. 
సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది.  వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు. 
నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద  కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంటుంది.
  
 
మా ఆవిడ వుండివుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా కొడుకు బతికి వుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.

దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో,  ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత? 

కింది ఫోటో:
అమెరికాలో  గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఆలూమగలం.
ఇదొక బంగారు జ్ఞాపకం.


4, అక్టోబర్ 2024, శుక్రవారం

కాశీ అయోధ్య యాత్రలు



అక్టోబర్ రెండు, 2024.
వారాణాసి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. కాశీలో మేము మూడు రోజులు బస చేసింది చెన్నై కి చెందిన ప్రముఖ నగల వ్యాపార సంస్థ GRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిథి భవనంలో. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి  కారులో గంట ప్రయాణం. సెప్టెంబరు 29 సాయంత్రం  లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం బయటకు  రాగానే, యాత్ర ఆరంభం అదిరింది. ట్రావెల్స్ తరపున కొందరు వచ్చి, హైదరాబాదు నుంచి వచ్చిన మా పద్నాలుగు మందికి దండలు వేసి మరీ స్వాగతం చెప్పారు, ఏదో స్టార్ హోటల్ మర్యాదల మాదిరిగా. సిద్ధంగా వుంచిన మూడు ఇన్నోవా కార్లలో జీ ఆర్ టి గెస్ట్ హౌస్ కి చేరాము. భవనం మొత్తం గ్రానైట్ తో తీర్చి దిద్దారు. లోపలకు అడుగుపెట్టగానే గ్రానైట్ తో నిర్మించిన చిన్న వినాయకుడి గుడి. స్వామికి దణ్ణం పెట్టుకుని, పక్కనే వున్న పెద్ద లిఫ్ట్ లో  మాకు కేటాయించిన నాలుగో అంతస్తుకు చేరాము. చివరికి మంచాలు కూడా గ్రానైట్ వే కావడం విశేషం. మా అందరికీ ఒకే అంతస్తులో గదులు ఇచ్చారు. ప్రతి గదిలో మూడు పడకలు. చక్కటి ఏసీ సదుపాయం. వారణాసిలో అంత వేడి వాతావరణం వుంటుందని అస్సలు  ఊహించలేదు. 
GRT గెస్ట్ హౌస్ లో బస చేసినవారికి  ఉదయం బెడ్ కాఫీ, తరువాత కాసేపటికి  బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం కాఫీ/ టీ, రాత్రి డిన్నర్ ఉచితం.  గది అద్దె రోజుకు 1680 రూపాయలు. అయితే అన్నీ టైము ప్రకారం జరుగుతాయి. కొంచెం ముందుగా కానీ, కాస్త ఆలస్యం అయినా కానీ సర్వీసు వుండదు. బయటకు పోవాల్సిందే.  డైనింగ్ హాల్, కుర్చీలు, బల్లలు అన్నీ శుభ్రంగా వున్నాయి. వంటలు రుచిగా, శుచిగా తయారు చేశారు. వేడివేడిగా అన్నం, ఒక కూర, పప్పు, పాయసం, సాంబారు, రసం. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం, దోసె, చట్నీ సాంబారు. సాంబారు మాత్రం తప్పనిసరి. చెన్నై వంటవాళ్లు కాబట్టి సాంబారు రుచి స్పెషల్. బఫే పద్దతి.  వడ్డన చేసే వాళ్ళు నవ్వు మొహంతో ఏదీ కాదనకుండా, లేదనకుండా అందర్నీ ఒకే మాదిరిగా కనుక్కున్నారు. 
మా కాశీ ప్రయాణానికి ఒక కారణం వుంది. సెప్టెంబర్ 30 మా అన్నయ్య రామచంద్ర రావు గారి పుట్టిన రోజు. ఆ రోజున కాశీ వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అనే ఆకాంక్షతో పెట్టుకున్న యాత్ర ఇది. ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోనే సింపుల్ గా కేక్ కట్ చేయించి, కుటుంబ సభ్యులు అందరం మా అన్నావదినల ఆశీర్వాదం తీసుకున్నాం.
ఆన్ లైన్లో ముందుగానే  బుక్ చేసిన హారతి దర్శనం కోసం అర్థరాత్రి రెండు గంటలకు కాశీ విశ్వేశ్వరుడి దేవాలయానికి వెళ్ళాము. అలాగే పక్కనే అమ్మవారి దర్శనం. ఈ దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళు వెయ్యికి మించరు. కొంచెం క్యూ పద్దతి పాటిస్తే పదిహేను ఇరవై నిమిషాల్లో అందరికీ చక్కటి దర్శనం లభించేది. గర్భగుడిలో లింగాన్ని చేతితో తాకి బయటకు వచ్చాము. (స్పర్శ దర్శనం)
ముప్పయ్యేళ్ల క్రితం మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చి దిద్దారు. గర్భగుడిలో తోపులాట గురించి కాస్త అసహనం వ్యక్తం చేసిన వారిని మరోవైపు దేవుడ్ని దర్శించిన తృప్తితో, భక్తి పారవశ్యంతో బయటకు వచ్చిన వారిని చూస్తే ఒక సత్యం బోధపడింది. ఏదో గొప్పగా జరుగుతుందని ఊహించుకుని వచ్చిన వారు మొదటి రకం. వారికి దేవుడి మీద కంటే కూడా పరిసరాలను గమనించడంలోనే ఆసక్తి జాస్తి. ఇందులో నాబోటి వాళ్ళు కూడా వున్నారు. మా బృందంలో చాలామంది, అలాగే భక్తుల్లో అనేకులు  చక్కటి  దర్శనం లభించింది అనే తృప్తితో గుడి నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే వారి దృష్టి ఆ దేవదేవుడిపైనే లగ్నమై వుంది. అర్ధనిమీలిత నేత్రాలతో శివ స్తోత్రాలు బిగ్గరగా చదువుతూ సాగుతున్న వారిని చూస్తే వీరుకదా నిజమైన భక్తులు అనే భావన కలిగింది. 
  
గంగమ్మ తల్లి వరద మీద వున్న కారణంగా బోట్లు తిరగడం లేదు అనే సమాచారం కొంత నిరాశ పరిచింది. బోటు నుంచి గంగాహారతి చూసే అవకాశం లేదు. చిన్న చిన్న సందుల్లో వెళ్లి చూసే ప్రయత్నం చేశాము. పితృ పక్షాల సమయం ఏమో తెలియదు, శివుడికి ప్రీతికరమైన సోమవారం మహత్యమో  తెలియదు, ఊరి మీద ఊరు పడ్డట్టు ఎక్కడ చూసినా భక్త జన సందోహం. అంత జనంలో ఇంతమందిమి అందులో ఒక చంటి పిల్ల తప్పిపోకుండా చూసుకోవడం మరో పెద్ద సమస్య. 
దేవాలయ సందర్శన అనేది ఒక పర్యాటక వ్యవహారంలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పరిసరాలు కనపడవు, దేవుడు తప్ప. అలాకాకుండా విహార యాత్ర మాదిరిగానో, వీ వీ ఐ పీ దర్శనాలు చేసుకునే ఇతరులతోనో పోల్చిచూసుకోవడంతోనే సరిపెడితే పరిసరాలు కనపడతాయి కానీ, దేవుడు కనపడడు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. కానీ జర్నలిస్టు బుద్ధి కదా! కనపడకూడనివి మాత్రమే కనపడతాయి. దుర్గంధ భూయిష్టంగా వున్నఆ సందులన్నీ ఫోటో తీయాలనే తలంపు బలవంతాన మానుకున్నాను. పైగా మర్నాడే స్వచ్చభారత్ వార్షికోత్సవం. భక్తుల ఓరిమి మీద అధికారులకు పూర్తి నమ్మకం.  పైగా సెక్యూరిటీ జోన్ కారణమా అన్నది  తెలియదు, కనెక్టివిటీ సమస్య. అంచేత వెంటనే బయలుదేరి  గెస్ట్ హౌస్ కు వచ్చేశాము. 
మర్నాడు అయోధ్య ప్రయాణం. దాదాపు అయిదు గంటలు రోడ్డు మార్గంలో. దోవలో వరసగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించారు. ఒకే రహదారిపై అన్ని ఫ్లై ఓవర్లు వెంటవెంటనే నిర్మించడం ఆశ్చర్యం అనిపించింది.  అటూ ఇటూ కలిపి నాలుగు లేన్ల రోడ్డు.  మధ్యలో ఓ యాభయ్ కిలోమీటర్లు సింగిల్ రోడ్డు.
కాశీలో మాదిరిగానే అయోధ్యలో కూడా గుడి చుట్టుపక్కల ఇరుకు సందులు. మాకిచ్చిన టైం స్లాట్ ఒంటి గంట నుంచి మూడు. సమయానికి చేరగలుగుతామా లేదా అనే సందేహం. మా అన్నయ్య కుమారుడు సుభాష్ జీఎస్టీలో ఉన్నతాధికారి. ట్రాఫిక్ పోలీసులను ఒప్పించి దగ్గరి దారిలో తీసుకు వెళ్ళడం వల్ల సరిగ్గా మాస్లాట్ టైం ముగిసేలోగా గుడికి చేరగలిగాము. 
ముందుగానే టిక్కెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నoదువల్ల శ్రమ లేకుండా బాల రాముడి దర్శనం సులభంగా, చాలా త్వరితంగా జరిగింది. 75 ఏళ్లు నిండిన మాలో ఆరుగురికి వీల్ చైర్ సౌకర్యం లభించింది. మాలో కొందరు రెండో మారు కూడా దర్శనం చేసుకున్నారు. అక్కడ  ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయిన నాడు, అయోధ్య రామమందిరం కన్నుల పండువగా తయారవుతుంది.  తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించిన స్టార్ హోటల్ రామాయణంలో భోజనాలు చేసి మళ్ళీ కాశీ చేరే సరికి బాగా పొద్దు పోయింది.
మర్నాడే తిరుగు ప్రయాణం. ఈలోగా ఒక కబురు తెలిసింది. గంగలో పడవలపై ఆంక్షలు తీసేసారు అని. వెంటనే పోలోమంటూ బయలుదేరి కేదార్ ఘాట్ చేరుకుని ఒక మోటారు బోటులో అన్ని ఘాట్లు చూసుకుంటూ గంగలో కలయ తిరిగాము. చుట్టూ గంగ పారుతూ వున్నా కూడా ప్రతిఒక్కరికీ ఆ ఎండలో దిగచెమటలు పట్టాయి. ఒకళ్లిద్దరం తప్పిస్తే మిగిలిన వాళ్ళు అందరూ బోటు  దిగగానే గంగలో స్నానాలు చేశారు. గ్రీన్ ఆటోలు (బ్యాటరీతో నడిచేవి) పట్టుకుని అందరం గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చేసరికి ఫ్లయిట్ టైమ్ అయింది. పన్నెండున్నర తర్వాత కానీ, గెస్ట్ హౌస్ లో  లంచ్ మొదలు కాదు. నిరాహారంగానే బయలుదేరి కార్లు ఎక్కి కూర్చున్నాము. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, కాశీకి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలులేదు, మీకు అయిదు నిమిషాల్లో అన్నం వడ్డిస్తాను, రండి అని పిలిచాడు. అతని పేరు ముత్తు. గెస్ట్ హౌస్ క్యాంటీన్ ఇన్చార్జి. 
మాతా అన్నపూర్ణేశ్వరి దయ, మన ప్రాప్తం అనుకుంటూ వెళ్లి,  వేడి వేడిగా వడ్డించిన భోజనాలు చేసి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాము. అసాధ్యం అనుకున్న గంగాస్నానంతో పాటు అన్నపూర్ణమ్మ తల్లి ప్రసాదం కూడా దొరకడం మా అదృష్టం.

తోకటపా:
ఇళ్ళల్లో కళ్ళముందే పెరిగి పెద్దయిన పిల్లలు, తమ తలితండ్రులకు ఒక దశలో  కుడి భుజం అవుతారు. భుజాలు ఒక్కటే కాదు, కాళ్ళూ చేతులు కళ్ళూ అన్నీ వాళ్ళే అనడానికి మా ఈ కాశీ యాత్రే ఉదాహరణ. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు,  మా వదిన విమలాదేవి గారు ఈ విషయంలో మహా అదృష్టవంతులు. వెళ్లిన గ్రూపులో దెబ్బయి దాటిన వాళ్ళం ఆరుగురం వున్నాం. మా అన్నయ్య పిల్లలు జవహర్, సుభాష్, లాల్, వారి భార్యలు రేణు, హేమ, దీప, మా కోడలు నిషా, మా మేనల్లుడు రామచంద్రం  భార్య కరుణ అస్తమానం వాళ్ళు కష్టపడుతూ, మేము  ఏమాత్రం  కష్టపడకుండా కనిపెట్టి చూసారు. వాళ్ళూ మరీ చిన్నవాళ్లేమీ కాదు, కానీ పెద్ద మనసున్న వాళ్ళు.  
హైదరాబాదు నుంచి ఎప్పటికప్పుడు మా యోగ క్షేమాలు కనుక్కుంటూ అప్పటికప్పుడు అవసరమైన సాయం, లోకల్ ట్రాన్స్పోర్ట్, గంగలో తిరగడానికి బోటు వంటివి ఏర్పాటు చేసిన మరో గొప్ప వ్యక్తి వున్నారు. వారి పేరు రమేష్ గారు. మా అన్నయ్య పెద్ద కుమారుడు జవహర్ వియ్యంకులు. వీరందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. పోతే, రెండేళ్ల పైచిలుకు వయసున్న నా మనుమరాలు జీవిక అర్ధరాత్రి లేపినా, ఏడిపించకుండా లేచి బుద్దిగా స్నానం చేసి గుడికి వచ్చింది. వీల్ చైర్ లో నాతో పాటు కూర్చోమన్నా వినకుండా అంతంత దూరాలు నడిచే తిరిగింది. 
వీటన్నిటి వెనుక మనకు తెలియని అర్థం కాని ఏదో అదృశ్య శక్తి వుంది అనుకోవడంలో తప్పేమీ లేదు.
అలాగే అనుకుంటూ యాత్ర పూర్తి చేసుకుని, తిరిగి ఇండిగో ఎక్కి ముందు అనుకున్న విధంగానే అక్టోబర్ రెండో తేదీ సాయంత్రానికి  క్షేమంగా అందరం హైదరాబాద్ చేరాము.
(ప్రయాణంలో కనెక్టివిటీ సమస్య కారణంగా పోస్టు చేయడం కొంచెం ఆలస్యం అయింది)

కింది ఫోటోల్లో వారణాసి ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం, గంగలో పడవ ప్రయాణం, అయోధ్యలో రామాయణం హోటల్లో భోజనం,  ప్రయాణం చివర్లో గ్రూపు సభ్యులు, చివర్లో కడుపు చల్లబరచి పంపిన గెస్ట్ హౌస్ కిచెన్ ఇన్ చార్జ్ ముత్తుతో నేను.  

04-10-2024

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సోషల్ మీడియా

సోషల్ మీడియా – భండారు శ్రీనివాసరావు 
నాకు బాగా గుర్తు. గతంలో ‘కలం’ తిరిగిన పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్టికిల్ లేదా వార్త రాస్తూ ఏదైనా అనుమానం కలిగితే ఏమాత్రం భేషజం లేకుండా తమ దగ్గర పనిచేసే జూనియర్లను, లేదా ఫోను చేసి తోటి జర్నలిస్టులను అడిగి సందేహ నివృత్తి చేసుకునే వారు. తాము రాసిన దాంట్లో ఎలాటి పొరబాటు దొర్లకూడదు అనే నిబద్ధతే వారినలా చేయిస్తోంది అనుకునేవాడిని. 
ఇప్పుడు సోషల్ మీడియా అలాంటి విషయాల్లో బాగా అక్కరకు వస్తోంది, సరిగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశం ఉన్న పాత్రికేయులకు.నా రాతల్లో చిన్న పొరబాటు దొర్లినా వెంటనే ఎత్తి చూపుతున్నారు. ఇందుకు నేను చిన్నబుచ్చుకోవడం లేదు. పైగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దొర్లిన పొరబాట్లను సవరించుకోగల వెసులుబాటు వున్న మీడియం ఇది. 
నాకు అర్ధం అయిందేమిటంటే ప్రస్తుతం సమాజంలో చైతన్యం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. చూసినవీ, విన్నవీ, చదివినవీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారు. చక్రాంకితాలు వేసుకున్న కొందరు రాజకీయ పార్టీల అభిమానులని మినహాయిస్తే చాలామంది, చాలా వరకు చక్కని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. 
అయితే కాస్తంత ఓపిక కావాలి, రాళ్ళల్లో నుంచి బియ్యం ఏరడానికి.

28, సెప్టెంబర్ 2024, శనివారం

నాలాంటి మొగుళ్ళ ఘోష ఒక్కటే


తొమ్మిదేళ్ల క్రితం  ముచ్చట:

'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే  వ్యవధి  కూడా  లేదు'

అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బాబీ (మా కజిన్) ఫోను. నేను వెళ్ళేసరికే అంతా అయిపోయింది. 
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు, చివర్లో కొద్ది రోజులు మినహాయిస్తే.
 కొన్నేళ్ళ క్రితం  శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో  కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి మాత్రం వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణారావు గారు, జ్వాలా నరసింహారావు వారింటికి (శాస్త్రి భవన్ అని మేము సరదాగా పిలుచుకునే వాళ్ళం. నిజానికది షరా మామూలు, మామూలు ఇల్లే) వెళ్లి కులాసాగా సాయంకాలక్షేపం చేసి వచ్చి  కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు. 
 
శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
 
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు.  అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ  'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే  మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో  'కట్టె'. అంతే.

శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఆస్పత్రి ఆవరణలోనే ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో  కనిపించని వేదాంతం వుంది.

"యాభయ్ ఆరేళ్ళు నాతో కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, వున్న ఒక్క పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒంటరిగా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు  బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా  చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన.  ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి  కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే,  'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పోతే భయపడుతుంది' అనేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు 
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
( ఇప్పుడు  ఆయన దారిలోనే నేనూ)

కింది ఫోటో: కాశీ యాత్రలో  భాగంగా శాస్త్రి దంపతులతో మా దంపతులం

26, సెప్టెంబర్ 2024, గురువారం

ఎంత కష్టం! ఎంత కష్టం!


ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకువుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి  క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వతంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!
పునాదులు తవ్వకుండా ఏ భవన నిర్మాణం సాధ్యం కాదు. ఆ సమయంలోనే అధికారులు అడ్డు కోగలిగితే ఇలాంటి కూల్చివేతలకు ఆస్కారం ఉండదు కదా! 
ఇది పొలిటికల్ పోస్టు కాదు. అన్ని పార్టీల హయాముల్లో కూడా ఈ కూల్చివేతల పర్వాలు వింటున్న పురాణాలే!