16, సెప్టెంబర్ 2024, సోమవారం

జీవనయానం

జీవనయానం - భండారు శ్రీనివాసరావు 

నడుస్తూనే వున్నాను
గత  డెబ్బయ్ ఏడేళ్లుగా,
వాగులు  వంకలు దాటుకుంటూ
దారులు డొంకలు వెతుక్కుంటూ 
నడుస్తూనే వున్నాను 
కొన్ని చోట్ల నా దారి రహదారి
పలు చోట్ల దారంతా వరద గోదారి
ముళ్ళకంపలు, చీకు మొక్కలు,
గుంటలు, గతుకులు.
పడుతూ లేస్తూ
నడుస్తూ వస్తుంటే అదోరకం  ఆనందం
అలా నడుస్తూ పోతుంటే మరో రకం విషాదం 
ఈ నడక ఎన్నాళ్ళో తెలియదు
పరుగులాంటి నడకకు చివరి మజిలీ ఏదో  తెలుసు
కానీ చేరేదేప్పుడో మాత్రం  తెలవదు
అయితే ఈ నడకలో నేను వొంటరిని కాను
నాతోపాటు కోటానుకోట్లమంది భుజం భుజం కలిపి నడుస్తూనే వున్నారు
వారిలో కొందరే తెలుసు, కొందరసలే తెలియదు
చాలా మంది ఎవ్వరో తెలియదు కానీ కలిసి నడవక తప్పదు
కొందరి భాష తెలుసు మరికొందరి యాస తెలుసు
చాలామంది ఊసే తెలవదు
నడిచి నడిచి ఒక్కోసారి అలసట అనిపిస్తుంది.
కానీ ఆగే పని లేదు,  ఆగడం మన చేతిలో లేదు
ఆగితే మాత్రం ఆగినట్టే
ఇక అక్కడితో నడక ఆగినట్టే
అదే ఆఖరి అడుగు
అదే చివరి మజిలీ 
కలిసి నడుస్తున్న వాళ్ళు లిప్తపాటు ఆగి చూస్తారు
అంతే!
మళ్ళీ నడక మొదలెడతారు.
నన్ను దాటుకుంటూ ముందుకెడతారు
నేను అక్కడే ఆగిపోతాను  
అయినా ఈ జీవన యానం అంతటితో  ముగిసేది కాదు 
ముగిసినట్టు అనిపించినా నిజానికి అది ముగింపు కాదు
తెలియని మరో ప్రయాణానికి కొనసాగింపు.

Note: Courtesy Image Owner

15, సెప్టెంబర్ 2024, ఆదివారం

సృష్టి జననం

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం 2003 సెప్టెంబర్ 15 వ తేదీన మా పెద్ద కుమారుడి చిన్న కుమార్తె సృష్టి, రెంటన్ లోని వ్యాలీ మెడికల్ సెంటర్ లో జన్మించింది. అందుకోసమే నేను మా ఆవిడ నిర్మల ఇద్దరం పురిటి సమయానికి కొద్ది రోజులు ముందుగానే సియాటిల్ చేరుకున్నాము. ఆడపిల్ల అనగానే మా ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు. 
మళ్ళీ ఇన్నేళ్లకి మనుమరాలు పుట్టిన రోజున నేను అమెరికాలో వుండడం యాదృచ్చికం. 
వెనుక ఫోటోలో ఉన్న మా ఆవిడ తన ముద్దుల మనుమరాలికి ఆశీస్సులు అందిస్తోందని నా నమ్మకం. 
చిన్నారి (ఇక్కడి లెక్కల ప్రకారం ఇక ఎంతమాత్రం అది చిన్నది కాదు, వయోజనురాలు) సృష్టికి నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.

ఎలా తినాలి అంటే ఇలా



పెద్ద హోటలే! ఏమున్నాయో చెబితే పర్వాలేదు కానీ, ఏది ఎలా తినాలో కూడా బొమ్మలు గీసి మరీ చెబితే ఎలా, అన్నప్రాశన నాడు తినిపించినట్టు. ఇంకా నయం గోరుముద్దలు చేసి నోట్లో పెడతాం అనడం లేదు.
శుక్రవారం సాయంత్రం బెల్ వ్యూ డౌన్ టౌన్ లోని ఆ హోటల్ కు చేరుకునేసరికే అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బయట కూర్చోవడానికి చాలా సోఫాలు, కుర్చీలు వున్నాయి. మాకు పిలుపు రావడానికి దాదాపు గంట పట్టింది.
లోపల విశాలమైన అయిదారు హాల్స్ వున్నాయి. ప్రతి దాంట్లో గుండ్రటి టేబుల్స్. వాటి చుట్టూ కూర్చుని చాలామంది డిన్నర్ చేస్తున్నారు. బహుశా నా లెక్క ప్రకారం లోపల మూడు వందలకు పైగా వున్నట్టున్నారు. నిశ్శబ్దం పాటిస్తున్న జాడ లేదు. ఇరవై ఏళ్లకు పూర్వానికి ఇప్పటికీ  నాకు అమెరికా జీవన విధానంలో కొట్ట వచ్చినట్టు కనపడిన మార్పు ఇదే. మొబైల్  ఫోన్ల మహత్యం అనుకుంటా.  
మాకు ఒక టేబుల్ చూపించారు. దానిమీద 'ఎలా తినాలి ?' అని రాసి వున్న డిస్ ప్లే బోర్డు కనిపించింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా తినాలో కూడా వాళ్ళే చెబుతారన్న మాట. 
బెల్ వ్యూ డౌన్ టౌన్ లో  DIN TAI FUNG అనేది ఓ పెద్ద చైనీస్ రెస్టారెంట్. చాలా అంటే చాలా ఖరీదైనది కూడా. 
XIAO LONG BAO అనే నోరు తిరగని వంటకం ఆ హోటల్ స్పెషాలిటీ.అది ఎలా తినాలి అని తెలియ చెప్పడానికే ప్రతి టేబుల్ మీద ఒక డిస్ ప్లే బోర్డు పెట్టారు.
ఇరవై ఏళ్ల చైనీస్ యువతి వచ్చి ఫుడ్ ఆర్థర్ తీసుకుంది. 21 ఏళ్లు దాటితే కానీ హాట్ డ్రింక్స్ సర్వ్ చేయరు. మా పక్క టేబుల్ మీద ఒక కుర్రాడు తన గుర్తింపు కార్డు చూపడం కనిపించింది. పైకి అంత వయసున్న వాడిలా లేడు. అందుకే వయసు ధ్రువ పరచుకోవడానికి సర్వరిణి అతడ్ని గుర్తింపు కార్డు అడిగింది. ఆ తర్వాతే డ్రింక్ ఆర్డర్ తీసుకుంది. మద్యం విషయంలో నిబంధనలను చూసీ చూడనట్లు వదిలేయకుండా పద్ధతిగా వ్యవహరించిన తీరు నన్ను ఆకట్టుకుంది.

ఆర్డరు తీసుకున్న కాసేపటికి గుండ్రటి చెక్క పళ్ళేలలో ఆ నోరు తిరగని పదార్థాన్ని అందరికీ సర్వ్ చేశారు. తీరా చూస్తే చిన్న సైజు నూనెలో వేయించని పూర్ణంబూరెల మాదిరిగా వున్నాయి. వీటిని ఓవెన్ లో వేడి చేసి ఇస్తారు. అవి ఎలా తయారు చేస్తారో చూడవచ్చు కూడా. చిన్న చిన్న పిండి ముద్దలను చేతితో అదిమి అందులో ఏదో పదార్థం కూరను కూరి, వుండగా చుట్టి ఓవెన్ లో కాసేపు వుంచి చెక్క పళ్ళేలలో పెట్టి వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు.
అలాగే ఉడికించిన ఆకు కూరలు వగైరా.   చైనీస్ కదా తినడానికి చాప్ స్టిక్స్ ఇచ్చారు. 
ఈ తతంగాన్ని యావత్తూ నేను ఆస్వాదిస్తున్నాను కానీ, తినే తిండిని కాదని అర్థం చేసుకున్న మా కోడలు భావన ఇంటికి రాగానే వేడిగా అన్నం వండి వడ్డించింది.
అన్నదాతా సుఖీభవ!

నీతి: ఇంట్లో వండి పెట్టేవాళ్ళు వున్నప్పుడే బయట ఇలాంటి ప్రయోగాలు చేయాలి.

14, సెప్టెంబర్ 2024, శనివారం

భర్త గీత

భర్త గీత – భండారు శ్రీనివాసరావు 

పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని 'భర్త గీత' బోధించడం మొదలెట్టాడు.
'ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా!
'నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు కాఫీ కలిపి పట్రా అన్నాననుకో. ఎందుకనుకున్నావు. నీకు ఇబ్బంది అని తెలియక కాదు. ఆఫీసులో అలసిసొలసి ఇంటికొచ్చిన నాకు, నువ్విచ్చిన కాఫీ తాగగానే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక అప్పుడు ఎంచక్కా నువ్వు ఇరుగింటి, పొరుగింటి అమ్మలక్కల కబుర్లన్నీ ఏకబిగిన ఏకరువు పెట్టినా నాకేమీ అనిపించదు కనుక.
'నీతో కలిసి బజార్లో వెడుతున్నప్పుడు పక్కనుంచి ఓ అందమైన అమ్మాయి వెడుతుంటే నా చూపులు ఆటోమేటిగ్గా అటే తిరిగిపోతాయి. ఏం చెయ్యను చెప్పు మగాడ్ని కదా! అది చూసి నువ్వు కంగారు పడిపోతూ, మెలికలు తిరిగిపోతుంటావు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, నీ అందం ముందు ఎవ్వరి అందాలయినా దిగదుడుపే. ఆ విషయం ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకునేందుకే ఆడవాళ్లకేసి అలా చూస్తుంటాను. పిచ్చి మొహానివి. నీకు అర్ధం అయి చావదు.
'నీ చేతివంట చెత్త అని అప్పుడప్పుడు అంటుంటాను. నిన్ను తప్పు పట్టాలని కాదు. నా రుచిపచుల్లో ఏవన్నా తేడాపాళాలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని మాత్రమే అలా వంకలు పెడుతుంటాను.
'నిజమే. రాత్రి పూట నేను పెట్టే గురక కర్ణ కఠోరంగా వుంటుందని నాకూ తెలుసు. నేను అంత హాయిగా గురకపెట్టి నిద్ర పోతున్నానూ అంటే ఏమిటి అర్ధం. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను యెంత ప్రశాంతంగా వున్నానో నీకు అర్ధం కావాలనే.
'మొన్న నీ పుట్టిన రోజు మరచిపోయిన మాటా నిజమే. చిన్న కానుక కూడా కొనుక్కురాని మాటా నిజమే. ఇల్లెగిరిపోయేటట్టు నానా యాగీ చేసావు కానీ నీకు తెలియని విషయం చెబుతా విను. గిఫ్టుల మీద తగలేసే డబ్బు నేనేమన్నా కట్టుకుపోతానా చెప్పు. ఏది మిగిలినా అది నేను తాళి కట్టి కట్టుకున్న నీకే కదా!
'నేను చెప్పే ఈ భర్తగీత నీకు ఏమాత్రం నచ్చలేదన్న సంగతి నీ చేతిలో వున్న అప్పడాల కర్రే చెబుతోంది. ఇక ఆఖరుగా ఒక మాట చెబుతా. వినేసి, అప్పడాలకర్ర కింద పడేస్తావో, కింద వున్న కత్తిపీట చేతిలోకి తీసుకుంటావో అది నీ ఇష్టం.
'నన్ను నిలువునా నరికి ఉప్పు పాతర వేయాలని నీకు అనిపిస్తోంది. అయితే, హత్యానేరానికి, అందులోను మూడుముళ్ళు మెడలో వేసి, ఏడడుగులు కలిసి నీతో నడిచి నలుగురు ముందు పెళ్ళాడిన భర్తనే చంపడం అంటే అందుకు పడే శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ...........' 
(నెట్లో సంచారం చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)

బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో :

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అడ్డు కట్టలు



నిజమే! కొన్ని కొన్ని చాలా అత్యల్ప విషయాలే వినడానికి ఎంతో వింతగొలుపుతాయి అదేమిటో.
తెలుగు టీవీ సీరియల్స్ అంటే ఎలర్జీ. కొన్నాళ్ళు వాటిని చూస్తూ పొతే ఎలర్జీ అదే పోతుందన్నాడు ఒక ఉచిత సలహాదారు. ఆ మాటలు విని,  వరసగా రెండు రోజులు పనిగట్టుకుని సీరియళ్ళు చూసేసరికి ఆశ్చర్యంగా ఎలర్జీ మాయమయింది. కాకపొతే అవి అలవాటుగా మారుతుందేమో అన్న భయం పట్టుకుంది.
ఈ సీరియళ్ళలో నాకు నచ్చిన అంశం ఒకటి కనబడింది. టీవీ చర్చల్లో మాదిరిగా కాకుండా ఒక పాత్ర మాట్లాడుతుంటే మరో పాత్ర అడ్డం రాదు. ‘ఎంతపని చేసావు లక్ష్మీ’ అంటూ ఆమె మొగుడు ఓ అయిదు పేజీల డైలాగు మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చుకుంటూ, సగం కళ్ళతో మాట్లాడుతూ పోతుంటే ఆ భార్య పాత్ర పాపం కిమ్మనకుండా ఆసాంతం వింటుంది. అంతా అవనిచ్చి అప్పుడు మొదలు పెడుతుంది తన ఇన్నింగ్స్. ఇక ఆ మొగుడుగారు కూడా, టీవీ చూస్తున్న మనతో పాటు మరో శ్రోతగా మారిపోతారు. భార్య కడిగి గాలించి పారేస్తుంటే మౌనశ్రోతగా మిగిలిపోయి అప్పుడప్పుడూ క్లోజప్పులలో కళ్ళు విప్పార్చి చూస్తూ అలా ఒక శిలా విగ్రహంలా నిలబడి పోతాడు.
సంసారాల్లో మొగుడూ పెళ్ళాల నడుమ మాటామంతీ నడిచినా, అలాగే ఒకరి మాట మరొకరు ప్రశాంతంగా వినే వెసులుబాటు వున్నా ఇక ఆ సంసారంలో అపార్ధాల సీన్లకు అవకాశం ఉండదని, ఆ సంసార రధం నల్లేరు మీద బండిలా నడిచిపోతుందని ఓ సైకాలజిస్ట్ రాసిన గ్రంధంలో చదివిన జ్ఞాపకం.
అసలీ టెక్నిక్ పాండవోద్యోగ విజయాలు నాటకంలోనే వాడారని మా మేనల్లుడు అంటాడు. కృష్ణుడు పద్యం అందుకుని రాగయుక్తంగా పాడి చివర్లో పట్టుకున్న రాగాన్ని ఓ అరగంట సాగదీసి ముగించే వరకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడు కిరీటం సర్దుకుంటూ, మీసం దువ్వుకుంటూ వుండిపోతాడేకాని, తను పాడాల్సిన పద్యం వెంటనే ఎత్తుకోడు. అయినా ఆ నాటకానికి ఆ రోజుల్లో ‘రేటింగులు’ భేషుగ్గానే వున్నాయి.

టీవీ చర్చల్లో పాల్గొనే వాళ్లకి ఈ పాఠాలు ఎవరు చెబుతారు చెప్మా!


Courtesy Cartoonist Krishna garu

జ్ఞాపకాల రీలు

https://www.facebook.com/share/r/1AkAMoCjc3/?mibextid=D5vuiz

బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్

బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్

అమెరికాలో అందమైన ఆఖరి వారం నడుస్తోంది. 
ఈ నెల 17 న సియాటిల్ లో బయలుదేరి బాల్టి మోర్ వెళ్లి 22 న వాషింగ్టన్ డీ సీ నుంచి మేరా భారత్ మహా అనుకుంటూ విమానం ఎక్కడం. 
23 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చివరి వారం అంతా గిఫ్టులు కొనడంతోనే సరిపోయింది. ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ దొరికేవి అన్నీ అక్కడే రూపాయల్లో దొరుకుతున్నాయి.
కొద్ది సేపటి క్రితం మా వాడు పోస్టులో వచ్చిన ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. తెరిచి చూసాను. అందులో ఫ్రేం కట్టిన ఒక సర్టిఫికెట్ వుంది.

" 2 trees have been planted in a U.S. National Forest in memory of 
NIRMALA & SANTOSH BHANDARU "

నిజంగా ఇది నాకు జీవితంలో లభించిన బెస్ట్ గిఫ్ట్.
థాంక్స్ సందీప్, థాంక్స్ భావన.
Trees for a change 
Give a gift, Restore a Forest 
అనే నినాదంతో, 
చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం తలపెట్టిన పథకాల్లో ఇదొకటి. 35 డాలర్లు చెల్లిస్తే మనం చెప్పిన వారి పేరు మీద ఇక్కడి నేషనల్ ఫారెస్ట్ లో ఒక మొక్కను నాటుతారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను పోస్టులో భద్రంగా పంపుతారు. ఆ  మొక్క ఎక్కడ, ఏ ప్రాంతంలో నాటారో తెలిపే లోకేషన్ కూడా షేర్ చేస్తారు.
దేశం కాని దేశంలో మా ఆవిడ పేరుతో నా రెండో కుమారుడి పేరుతో రెండు చెట్లు పెరగడం కంటే కావాల్సింది ఏముంది? 
పైగా ఇక్కడ అడవుల్లో చెట్లు నరకడం నిషిద్ధం మాత్రమే కాదు, నేరం కూడా.
12-9-2024