8, సెప్టెంబర్ 2024, ఆదివారం

జోడు గుళ్ళ పిస్తోలు ఠా!

జోడుగుళ్ళ పిస్తోలు ఠా! - భండారు శ్రీనివాసరావు 

ట్రిగ్గర్ నొక్కగానే వాయువేగంతో తూటా దూసుకుపోయే చిన్న పిస్తోళ్ళ నుంచి, పేల్చగానే గుళ్ళ వర్షం కురిపించే ఏకే 47 తుపాకుల వరకూ పెద్ద సంఖ్యలో గోడకు వేలాడుతూ కనిపించాయి.
బెల్ వ్యూ లో వున్న అనేక మారణాయుధాల దుకాణాల్లో (WADE) ఒకటి. కౌంటర్ మీద అమ్మే షాపే కానీ, వెంటనే డెలివరీ ఇవ్వరు. పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన పిదప ఇస్తారు. అంతా ఆన్  లైన్ వ్యవహారమే కాబట్టి ఈ తతంగానికి ఎక్కువ సమయం పట్టదు. 
ఈ దుకాణంలోనే ఫైరింగ్ రేంజ్ వుంది. కొంత రుసుము చెల్లిస్తే నిజమైన పిస్తోలుతో/ తుపాకీతో కాసేపు ఢమఢమలాడించి రావచ్చు.
అప్పటికే షాపులో ఇద్దరు ముగ్గురు యువకులు ఆయుధాలు కొనుక్కునే పనిలో ఉన్నారు. 
వారం రోజుల క్రితం కుమారుడి పుట్టిన రోజు కానుకగా పిస్తోలు ఇవ్వడం,  ఆ పిల్లాడు అది పట్టుకుని స్కూలుకు వెళ్ళి టపటపా నలుగుర్ని కాల్చి చంపడం టకటకా జరిగి పోయింది ఈ దేశంలోనే.
ఇది స్ఫురణకు రాగానే ఇది మనం మసిలే ప్రదేశం కాదని ఫొటోలు తీసుకుని బయట పడ్డాము.
7-9-2024











7, సెప్టెంబర్ 2024, శనివారం

మిచ్ఛామి దుఃఖడం

తప్పులున్న క్షమించగలరు – భండారు శ్రీనివాసరావు

పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ‘సారీ’ అనే పదం ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చేసిన తప్పులను దేవుడికి నివేదించి క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారంలోకి వచ్చింది. (Courtesy : Dr. Balaji Utla )
 దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖఃడం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
దుఖఃడం అంటే దుష్కృ త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వకాలంలో ఎనిమిదో రోజున , భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘ నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.

అమెరికాలో ఈరోజు చవితి. 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ పండుగ, పూజ ఘనంగా జరిపాము. ఈసారి చేయలేదు. కారణం గత ఫిబ్రవరిలో మా రెండో వాడి ఆకస్మిక మరణం.

5, సెప్టెంబర్ 2024, గురువారం

నా తొలి గురువుకు వందనం



చిన్నప్పుడు నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు.

తెలిసినదల్లా మాష్టారంటే శివరాజు అప్పయ్య పంతులు గారు.

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా.

మాచిన్నప్పుడు,  గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంధ్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. వూరు మొత్తానికీ అదే పేపరు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

అప్పయ్య  మాస్టారు  ఇప్పుడు లేరు, ఆయన జ్ఞాపకాలు ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న మా వంటి వారిదగ్గర పదిలంగా వున్నాయి.
గరుభ్యోనమః 🙏


ఈ లోకమే ఒక అద్దె ఇల్లు


“ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను
ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు. 

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ,
రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్
కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను.
గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని
స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి
మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు
వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే
దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు
వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే
అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు
చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని
అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను
గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి
వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది. 

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని.
అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు,
ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే  కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన
వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు. 

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా 
ఆర్డర్ వచ్చింది. 

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము. 

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా పని చేసి రిటైర్ అయిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు సొంత ఇల్లు లేకుండానే దాటి పోయారు.
తన ఉద్యోగ పర్వంలో కోట్ల రూపాయల ఇంటి రుణాలు మంజూరు చేసి స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారికి అమెరికాలో వుంటున్న అబ్బాయి కొనేంతవరకు సొంత ఇల్లు లేదు.
ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద  పదేళ్ళకు పైగా సీపీ ఆర్వో గా పని చేసిన మితృడు జ్వాలా నరసింహారావు కు కొడుకు కొనే దాకా స్వంత ఇల్లు అమరలేదు.
ఇంకా నేనెంత?
అసలు ఈ లోకంలో అందరూ నివసిస్తోంది అద్దె ప్రపంచంలో. పై వాడు ఎప్పుడు ఖాలీ చేయమంటే అప్పుడు తట్టాబుట్టా సదురుకోకుండానే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి.

టపాని మించిన తోక టపా:
ఇది రాయడం కోసమే అసలు టపా.
78 ఏళ్ల వయసులో హైదరాబాదుకు వేల మైళ్ళ దూరంలో ఎక్కడో అమెరికాలో పశ్చిమ కొసన వున్న సియాటిల్ నగరం బెల్ వ్యూ లో MADRONA PARK కాలనీలో మా పెద్దవాడు కొనుక్కున్న ఇంటిలో  విశ్రాంతి తీసుకుంటూ వున్నప్పుడు ఈ పాత విషయాలు అన్నీ సినిమా రీలులా కళ్ళ ముందు తిరిగాయి. ఏది ఎప్పుడు ప్రాప్తమో అప్పుడే దొరుకుతుంది.
అమెరికాలో అందరి ఇళ్లు ఇంచుమించు ఇలాగే అనేకంటే ఇంతకంటే గొప్పగానే వుంటాయి. ఇండియా మధ్య తరగతి కళ్ళతో చూసే నా బోంట్లకి  ఇదే గొప్ప అనేలా వున్న మాట నిజం. 
నా పడక గది చాలా విశాలం. ఆనుకునే హోమ్ థియేటర్ హాలు, కాఫీ బార్, దీనికి తోడు అసలు బార్, మసాజు చైర్, బాత్ టబ్ వున్న రెస్ట్ రూమ్, అన్నింటికీ మించి నా మంచం పక్కనే గోడకు నాకు తోడుగా మా ఆవిడ ఫొటో.
ఇంతకంటే ఏం కావాలి?

చివరాఖరులో ఒక చిన్న మాట:
ఒక తరం జర్నలిస్టులు రిటైర్మెంట్ తర్వాత కొంత ఆర్థికంగా స్థిరపడడానికి కారణం వారి ప్రయోజకత్వం కాదు. వారి పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకుని జీవితంలో పైకి ఎదగడం.

2, సెప్టెంబర్ 2024, సోమవారం

అయిదే అయిదు నిమిషాలు

అయిదే అయిదు నిమిషాలు. నా విషయంలో ఇంకా తక్కువే. అదీ నా తెలివి తక్కువతనం వల్ల. 

ఈసారి అమెరికా వచ్చేముందు ఓ విషయం గట్టిగా అనుకున్నాను. ఏమైనా సరే, ఈ వయస్సులో పిల్లలను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయరాదని. 

లాంగ్ వీకెండ్ లో లెవెన్ వర్త్ నగరం వెళ్లి వద్దామని మావాడు అన్నాడు. పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు వెళ్ళాము. మా ఆవిడతో అప్పుడు కలిసి తిరిగిన ప్రదేశాలు మళ్ళీ చూసి రావాలని మనసులో కోరిక. 
సియాటిల్ నుంచి రెండున్నర గంటలు ప్రయాణం చేసి లెవెన్ వర్త్ చేరుకున్నాము.
 జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి. వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి. అలాగే జర్మన్ బీర్. ఎందుకో నిన్న ఆదివారం ఎండ మండి పోతోంది. ఎండలో కూడా బీరు ప్రియులు రోడ్ల మీద క్యూల్లో నిలబడి వుండడం ఆశ్చర్యం కలిగించింది.

 

ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి, తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా ‘సాస్’ లను మచ్చుకు రుచి చూపిస్తారు.  వైన్  రుచి  చూడడం  పరవాలేదు  

 గతంలో తిరిగిన ప్రదేశాలే. అయితే ఈసారి మావాడు అడ్వెంచర్ పార్కు టిక్కెట్లు ముందుగానే బుక్ చేశాడు. ఇలాంటి అడ్వంచర్ లు చేయడం అవసరమా అని మనసులో ఓ మూల పీకుతోంది. భయం కంటే ఏదైనా జరగరానిది జరిగితే అవస్థలు పడేది నేనే కాదు పిల్లలు కూడా. కొండలు, లోయల మీద సాగే అడ్వెంచర్. వద్దనుకుంటూనే లోపలకు వెళ్ళాను. సందర్శకులతో కిటకిట లాడుతోంది. పెద్ద క్యూ. చివరికి మా వంతు వచ్చింది. అతడెవరో చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అడ్వెంచర్ మొదలయింది. ముందు వాహనంలో మా మనుమరాలు సృష్టి. తర్వాత నేను, ఆ తర్వాత మా అబ్బాయి, కోడలు. కంట్రోల్ మన చేతిలోనే వుంటుంది. ముందుకు నొక్కితే స్పీడ్ పెరుగుతుంది. వెనక్కి లాగితే వేగం తగ్గుతుంది అని ముందే చెప్పారు.
పట్టాలు నిలువుగా పైపైకి కనపడుతున్నాయి. పైకి చేరిన తర్వాత నిటారుగా కిందికి జారిపోతాం. అలాగే గుండ్రంగా మలుపులు తిరుగుతూ అగాధమైన లోయల్లోకి... మధ్యలో ఓ కంట్రోల్ టవర్ నుంచి పరిశీలిస్తున్న ఓ అమ్మడు నా వైపు చేతులు ఊపుతూ సైగలు చేస్తోంది. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని వేగం పెంచాను. అపరిమితమైన స్పీడుతో అనేక వంకర్లు తిరుగుతూ లోయలు, కొండల మీదుగా జారి పోతూ ఎట్టకేలకు గమ్యం చేరింది. 
ఆ తరువాత కాసేపటికి మా పిల్లలు వచ్చి, ఇంత త్వరగా ఎలా వచ్చావు అని అడిగేవరకూ నేను చేసిన పొరపాటు నాకు అర్ధం కాలేదు.
ఈ అడ్వెంచర్ గురించి మన ఫొటో ఒకటి వాళ్ళే తీసి పది డాలర్లకు అమ్ముతున్నారు. ఎండ తగలకుండా పెద్ద టోపీ తగిలించు కోవడం వల్ల గుర్తు పట్టేలా లేదు.

 ఈ అడ్వెంచర్ పార్క్ గురించి యూ ట్యూబ్ లింక్:

https://youtube.com/shorts/Cv_LD0l5YeM?si=VUqLbpvDF2vAump1

31, ఆగస్టు 2024, శనివారం

ఆవకాయతో అన్నం

ఎప్పుడో ముప్పై ఏళ్ల నాటి జ్ఞాపకం. మాస్కో యూనివర్సిటీలో చదువుకునే తెలుగు పిల్లలు ఇలా మా ఇంటికి వచ్చి మా ఆవిడ అప్పటికప్పుడు వండి పెట్టిన భోజనం చేసి, డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని నాలుగు కబుర్లు చెప్పి వెళ్ళే వాళ్ళు. వీటికి పిలుపులు వుండవు. ఎవరికి తీరిక దొరికినప్పుడు వాళ్ళు రావడమే!
దేనికీ ఏ కొరతా లేని ఆ దేశంలో మనం ఇష్టపడి తినే (ఆవకాయతో అన్నం) భోజనానికి ఎప్పుడూ కరువే.

కధలు రాస్తారా?


"రాయను, చెబుతాను"
" ఓహ్! మీరూ ఆ బాపతేనా!"
"ఏ బాపతు?"
" అదే! ఇంటికి ఆలస్యంగా వచ్చి భార్యలకు కధలు చెప్పే మొగుళ్ల బాపతు"
" మరీ అలా కాదు"
"అయితే ఓ కధ చెప్పండి, వింటాను"
"వింటాను అన్నవాడికి చెప్పకపోతే కధాహత్యా పాతకం చుట్టు కుంటుందని మా గురువు గారు చెప్పారు. చెవులు ఇలా పారేసి, నోరలా మూసుకోండి"
"......"

అనగనగా ఒక అనసూయ - భండారు శ్రీనివాసరావు 

చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ కాదు. కారు ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.
అనసూయకు చిన్నతనం నుంచీ ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త పెంచి పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు. కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట ప్రయాణమేగా వెంటనే తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్ లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి పోయింది. అతడు కాసేపు కారు చుట్టూ తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది. విధిలేని పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది. నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది. కానీ, అతడికీ తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో నా ప్రయత్నం చేసాను. ఈ పనికి డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి. దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ తేరుకునే లోగా అతడు మళ్ళీ అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు. నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు. వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది. కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు. టీ చెప్పగానే అనసూయ ముందు వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది. పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్ సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది.