8, ఆగస్టు 2024, గురువారం

పుట్టిన రోజున దేవుడి కానుక



ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే,  నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద  78 దాటుతున్నావు.  నువ్వు అడగకుండానే నీకో  అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించి వచ్చాను. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా విను. ఇక నుంచయినా నువ్వు  ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే నేనిచ్చే  వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో  కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే,  ఇక నాకిది కావాలి, అది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి  నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’

5, ఆగస్టు 2024, సోమవారం

కొడుకే తండ్రిగా మారిన వేళ


'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '

1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి యాభయ్యవ పుట్టిన రోజునాడు నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి  పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు. 
సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి. 

' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '

ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.

ఇంటికి వచ్చిన తర్వాత  తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.

3, ఆగస్టు 2024, శనివారం

అమెరికాలో కలిసిన మంతెన సత్యనారాయణ రాజు గారు

వీరు ప్రకృతి వైద్యం రాజు గారు కాదు.
ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్ లో గత రెండు పదిహేడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఐ టీ నిపుణులు. మరో బాదరాయణ సంబంధం నాకు ఫేస్ బుక్ లో ఫాలోయర్. రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చి ఈ ఉదయం నన్ను కలిశారు. 
తన పేరు మంతెన సత్యనారాయణ రాజు అని పరిచయం చేసుకున్నారు.
ఫేస్ బుక్ లో పేరు Satya Mantena. 
సహృదయులు. 
managudi.org అనే బ్లాగ్ నడుపుతున్నారు. తెలుగునాట వున్న అన్ని చిన్నా పెద్ద దేవాలయాలు, వాటి ఆస్తిపాస్తులు మొదలయిన సమస్త వివరాలను కష్టపడి సేకరించి ఒకే చోట పదిలపరుస్తున్నారు
వారి కృషి అభినందనీయం.

కింద ఫోటో రాజు గారితో నేను. నేను అని ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మధ్య నన్ను ఫోటోల్లో చాలా మంది గుర్తుపట్టడం లేదు (ట)

Licking of Worry

 
నాకు ఇంగ్లీష్ గొప్పగా రాదు అని తెలుసు కానీ, అమెరికాలో నా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్ కలిసి చెప్పేవరకు నా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంత గొప్పగా వుంది అని నాకు తెలవదు.
' మామయ్యా! (నిజానికి తాత వరస, ఏదో మర్యాద కోసం మామయ్య అంటుంటారు) నేను నీ ఫేస్ బుక్ ఫాలోవర్ ను '
నేను గర్వంగా తల ఎగరేసే లోగా వాక్యం పూర్తి చేశాడు ఇలా.
' నువ్వు రాసిన Licking of worry పోస్టు చదివాను '
పైకి లేస్తున్న నా తల నేలకు వాలిపోయింది, నేను ఇంత దరిద్రపు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ ఎలా రాయగలిగాను అనే ఆలోచనతో తల బద్దలు కొట్టుకున్నాక అసలు విషయం బోధపడి నవ్వుకున్నాము.
నేను ఆ పోస్టుకు పెట్టిన శీర్షిక 'నాకేల చింత? '
గూగులమ్మ ఎంచక్కా '' అనే పదాన్ని 'నాకడం' అనే  కోణంలో అర్థం చేసుకుని, 'Licking of Worry ' అనే సరి కొత్త అనువాదాన్ని పరిచయం చేసింది. 
మాయా బజార్ సినిమాలో పింగళి గారి డైలాగ్ గుర్తుకు వచ్చింది.
కొత్త పదాలు, కొత్త భాషలు ఇలాగే పుడతాయి కాబోలు.
అంచేత మీలో ఎవ్వరికైనా నా పోస్టులు ఇలా ఇంగ్లీషు లో కనబడితే, అంత ఆంగ్ల భాషా ప్రావీణ్యం నాకు లేదని అర్థం చేసుకోమని నా మనవి. అలాగే, See Original ద్వారా  తెలుగులో నేను రాసిన అసలు పోస్టు చదువుకోవచ్చని ఇప్పుడే కలిగిన అవగాహనను మీతో పంచుకుంటున్నాను.

2, ఆగస్టు 2024, శుక్రవారం

నాకేల చింత - భండారు శ్రీనివాసరావు


రమ్యమైన రెండో వారం పోస్టర్ వేయవచ్చేమో!
ఇవాల్టికి ఆరో రోజు నేను అమెరికాలో కాలు మోపి.
వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్టు కు కొద్దో గొప్పో Conducted Tours అనుభవం వుండే వుంటుంది. ఏదో మంత్రిత్వ శాఖ వాళ్లో, బ్యాంకు వాళ్ళో తమ ప్రగతిని పాత్రికేయులకు చూపించడానికి ఇలాంటి అధ్యయన యాత్రలు నిర్వహిస్తారు. జేబులో రూపాయి లేకపోయినా సరే మగ పెళ్లి వారి మర్యాదలకు తక్కువ వుండదు.
అలాగే ఈ అమెరికా యాత్రలు కూడా.
గతంలో ఒకసారి ఆటా సభలు అనుకుంటా, డాలర్ల డిక్లరేషన్ చేసే సమయంలో అడిగిన గుర్తు, డబ్బు లేకుండా ఈ దేశంలో ఎలా బతుకుతారని. అతడికి తెలియదు, కొందరు జర్నలిస్టులు అలా బతకగలరని. నేనిది జనరలైజ్ చేసి చెప్పానని పాత్రికేయ సోదరులు కినుక పూనకండి. మెజారిటీ జర్నలిస్టులకు జీత భత్యాలు తక్కువ. ఇక ఇలాంటి టూర్లకు కూడా సొంత డబ్బు ఖర్చు చేయడం అనేది అలవికాని భారం.

ఇంతకూ నేను చెప్పవచ్చేది ఏమిటంటే ఈ ప్రయాణం కోసం నేనూ కొన్ని డాలర్లు వెంట తెచ్చుకున్నాను. కానీ మా పిల్లలు నన్ను జేబులో చెయ్యి పెట్టనివ్వడం లేదు. అంతేకాదు, చేతితో ఏదీ పట్టుకోనివ్వడం లేదు. హాండ్స్ ఫ్రీ ప్రయాణం. అది మాల్ కావచ్చు, స్టార్ హోటల్ కావచ్చు, ఎయిర్ పోర్టు కావచ్చు. అన్నీ వాళ్ళే. 
మొదటి రోజు నాలుగు కార్లలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆ పది మంది ఇప్పటి వరకూ మావెంటే వున్నారు. 

గురువారం రాత్రి బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ నుంచి పదిహేను మందిమి బయలుదేరి అర్ధ రాత్రి టాంప చేరుకున్నాము. అదేదో చిన్న వూరు అనుకుంటే హైదరాబాదు కంటే అనేక రెట్లు పెద్దదిగా కనిపించింది. ఎకరాలకు ఎకరాలు రోడ్లు వేశారా అన్నట్టు చాలా విశాలంగా,  అప్పుడే వేసినట్టు నల్లగా నిగనిగ లాడిపోతున్నాయి. అమెరికాలోనే వుంటున్న మా అన్నయ్య మనుమరాళ్ళు శిఖిర, శిశిర, కోడలు హేమ మా కంటే ముందుగానే  టాంపా చేరుకుని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెండు పెద్దసైజు అద్దె కార్లలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 
హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే ప్రవేశ ద్వారం వుండడం చేత,  వచ్చి పోయే ప్రయాణీకుల వాహనాలతో బయట చాలా రద్దీగా కనిపిస్తుంది. అయితే వాషింగ్ టన్ డీసీ, బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ ల్లో పరిస్థితి వేరేగా  వుంది. ఒక్కో ఎయిర్ లైన్స్ కు ఒక్కో గేటు పెట్టారు. అంచేత ఎక్కడా రద్దీగా వుండదు. హాయిగా కారుని నేరుగా గేటు దగ్గర ఆపుకుని ఎయిర్ పోర్టులోకి వెళ్లి పోవచ్చు. అదొక మంచి సదుపాయం అని నాకు అనిపించింది.

 విమానం ల్యాండ్ ఆయిన తర్వాత ఏవో  సాంకేతిక కారణాలు చెప్పి నలభయ్ నిమిషాలు మమ్మల్ని విమానంలోనే వుంచేసారు, వెనుకటి రోజుల్లో ప్లాటుఫారం ఖాలీ లేక బెజవాడ వెళ్లే నిజాం పాసింజర్ రైలును రాయన పాడు స్టేషన్ లో నిలిపేసినట్టు.

ఆ సమయంలో మా వాళ్ళు అందరూ టాంపా వాట్స్ అప్ గ్రూపులో చాట్ చెయ్యటంలో మునిగిపోయారు. విషయం ఏమిటంటే,
ఈ వూర్లో మాకు వసతి కల్పించాల్సిన Gary's AIR BNB (BNB అంటే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అని తర్వాత తెలిసింది) కంపెనీ వాడు అంతమందికి వసతి కుదరదని మెలిక పెట్టాడుట. వెంటనే గ్రూపులోని వార్ రూమ్ టీమ్ ముందు నన్ను, ఆడవాళ్ళు పిల్లల్ని ముందు రిజర్వ్ చేసుకున్న వసతి గృహానికి పంపించారు. అప్పటికప్పుడు ఆన్ లైన్లో కోర్టు యార్డ్ మ్యారియేట్ హోటల్లో రెండు గదులు బుక్ చేసి నన్ను కూడా అక్కడికి తీసుకు వెళ్ళారు. 

ఉడ్ స్టాక్ నుంచి చక్కగా విడివిడిగా ప్యాక్ చేసి వెంట తెచ్చుకున్న పులిహార, పెరుగన్నం పదార్థాలకు బాల్టి మోర్ సెక్యూరిటీ నో చెప్పింది. పెరుగన్నం తేమగా వుండడంతో ఆ ప్యాకెట్లను రకరకాలుగా శోధించి వీలు కాదన్నారు. సాయి వాళ్లకు నచ్చచెప్పాడు. ఏ కళన వున్నాడో కానీ చివరికి పెరుగన్నం ప్యాకెట్లను అనుమతించారు. 
అప్పటికే విమానం బోర్డింగ్ టైం కావడంతో హడావిడిగా తినేసి ఫ్లయిట్ ఎక్కాము.
అంచేత కాబోలు, హోటల్ కు దగ్గరలో వున్న మెక్ డొనాల్డ్ కు వెళ్లి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో డిన్నర్ కం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకున్నాము.
ఇప్పుడు అంతా నిద్దర్లలో వున్నారు. లేచాక ఇవాల్టి కార్యక్రమం ఏమిటన్నది తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు Conducted Tour లాగా సాగుతోంది.
నాకేల చింత!

కింది ఫోటోలు:
బాల్టి మోర్ నుంచి టాంపా ( ఫ్లోరిడా) వెడుతూ, టాంపాలో మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో

1, ఆగస్టు 2024, గురువారం

భూమంటే చేదా !

 కన్నంతలో, విన్నంతలో అమెరికా భండారు శ్రీనివాసరావు

అమెరికా అనేది అవకాశాల దేశమే కాదు, వింతలు, విశేషాల దేశం కూడా.

నేను అమెరికా రావడం ఇది ఐదో సారి. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి ఉంటున్న ఉడ్ స్టాక్ పట్టణంలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుంది.

పచ్చదనం పరచుకున్న కొండలు, గుట్టలతో నిండి వుండి, తాటి ప్రమాణంలో  గుబురుగా పెరిగిన చెట్ల మాటున చిన్న చిన్న కాలిబాటలు, సెలయేళ్ళు, క్రమంగా మాయమవుతున్న జాబితాలో చేరుతున్న జంతుజాలం, పాత కాలపు వ్యవసాయపు పనిముట్లు, పరికరాలు   ఇవన్నీ చూస్తుంటే, పెద్దనామాత్యులు రచించిన మనుచరిత్రలోని,

‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యం గుర్తుకు రాకమానదు.

ఎప్పటినుంచో నూట అరవై అయిదు సంవత్సరాలుగా ఒక కుటుంబం హక్కుభుక్తంలో వుంటూ, సామ్యుయేల్ బ్రౌన్ అనే పెద్దమనిషికి ఈ అపారమైన విలువగలిగిన ఆస్తి, తండ్రి తాతల నుంచి వంశపారంపర్యంగా లభించింది. బ్రౌన్ మహాశయుల  మరణానంతరం ఆయన కుమారుడికి అది దఖలు కాగా, ఆయన చనిపోతూ మూడోవంతు భూమిని తన ఇద్దరు చెల్లెళ్లకు రాసిపోయాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన రూత్ బ్రౌన్,  ఫ్రాన్సెస్ బ్రౌన్ లు, వన్య, జంతు సంపదతో కూడిన, మౌంట్ ప్లెజెంట్ గా ప్రసిద్ధి చెందిన తమ సువిశాల భూ సంపదను సమాజం బాగుకోసం త్యాగం చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే వన్య, జంతు ప్రాణి సంరక్షణ విషయంలో అవగాహన, ఆసక్తితోపాటు ప్రకృతి సంరక్షణ పట్ల భవిష్యత్ తరాలకు తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యావత్ ఆస్తిని ఒక ట్రస్టుకు ఒప్పచెప్పారు.

మొక్కలు, జంతువులు, పక్షులు గురించి చిన్నతనం నుంచి బోధించే ప్రత్యేక తరగతులను ఆ ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ప్రోత్సాహం కలిగించే అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. అక్కడ ప్రవేశం ఉచితం. ఎవరైనా సరే  పౌరులు కూరగాయలు సొంతంగా పండించుకోవాలి అనుకుకుంటే అందుకు కావాల్సిన భూమిని ఉచితంగా ఇస్తారు.

ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు, ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు అంతా జీత భత్యాలు లేకుండా వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కారు పార్కింగ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో మాట్లాడాము. మిసెస్ ఆద్రే  అనే ఆవిడ వయస్సు 81 సంవత్సరాలు.  2007 రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాడు.  ప్రవృత్తి రీత్యా ప్రకృతి ప్రేమికురాలు అయిన ఆవిడ తన ముదిమి వయసులో కాలక్షేపం కోసం కాకుండా స్వచ్చందంగా సిద్ధపడి ఇక్కడ పనిచేస్తున్నారు. మేము ఇండియా నుంచి వచ్చాము అని చెబితే చాలా సంతోష పడ్డారు. చెట్లను, జంతువులను, పక్షులను భగవత్ స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతి అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆవిడ అలా అంటూ వుంటే నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. కారణం మీకూ తెలుసు.

వందల ఎకరాల భూమిని ప్రకృతి సంరక్షణ కోసం అతి సులభంగా త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే.

పెంపుడు పిల్లులకు, కుక్కలకు కోట్లాది డాలర్ల సంపదను వీలునామా రాసే సంపన్నుల దేశం కనుక ఇక్కడ ఇదొక వింత కాకపోవచ్చు.

కానీ, హైదరాబాదు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో కొన్ని వందల గజాల జాగాలో సువిశాలమైన భవంతులు నిర్మించుకున్న సంపన్న ఆసాములు, రోడ్ల వెడల్పు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు హీనపక్షం కొద్ది అడుగుల భూమిని వదులుకోవడానికి ఇష్టంలేక, కోర్టులను ఆశ్రయించిన ఉదంతాలు తెలిసిన దేశం నుంచి వచ్చాను కనుక, ఈ సోదరీమణుల వదాన్యం వింతల్లో వింతగానే నాకు  అనిపించింది.  















(01-08-2024)          

 

బార్ అండ్ రెస్టారెంట్ గా మారిన రైల్వే స్టేషన్ – భండారు శ్రీనివాసరావు

 

 

కన్నంతలో, విన్నంతలో అమెరికా 


అమెరికన్లకు మార్పు ఇష్టం. స్తబ్దతను ఇష్టపడరు. ప్రతిక్షణం కదలికలో ప్రగతిని కోరుకుంటారు. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే మార్పును ఎంత గాఢoగా కోరుకుంటారో గతాన్ని అంతగా ప్రేమిస్తారు. గతం గుర్తులను పదిలంగా దాచుకుంటారు. భావితరాల కోసం వాటిని భద్రపరుస్తారు.

ప్రస్తుతం నేను ఉంటున్న మేరీ లాండ్ రాష్ట్రంలోని ఉడ్ స్టాక్ నగరానికి దాపులో సైక్స్ విల్  (Sykes Ville) అనే చోట ఒక రైల్వే స్టేషన్ వుంది. దీన్ని 1831 లో ఏర్పాటు చేశారు. 1863 లో జరిగిన  రైల్వే కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారింది. ఆ విధ్వంసకాండలో రైలు మార్గంతో పాటు నగరంలోని ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి.  1883 లో తిరిగి ఈ రైల్వే స్టేషన్ ను ఇప్పుడున్న రూపంలో పునరుద్ధరించారు. మరుసటి ఏడాది నుంచి రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. కానీ పరిణామక్రమంలో భాగంగా 1950 లో ఈ స్టేషన్ ను మూసివేశారు. కొన్ని గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. స్టేషన్ భవనంలో ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అక్కడ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, వచ్చి పోయే గూడ్స్ రైళ్ళను తిలకించడానికి సెలవు దినాల్లో అనేకమంది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వుంటారు. సుమారు రెండువందల ఏళ్ళ నాటి రైలు బోగీలను, రైలు ఇంజన్ ను మ్యూజియంగా మార్చి అలనాటి రైళ్ళ స్వరూప స్వభావాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. అలనాటి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రతి శనివారం, ఆదివారాల్లో రైతు బజార్లు నిర్వహిస్తున్నారు. (బెజవాడలో ఇలాగే సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం రద్దీ రోడ్లతో సమూలంగా రూపం మార్చుకుంది. స్టేషన్ అవశేషాలు మచ్చుకు కూడా లేవు. ఒకప్పుడు అక్కడ ఓ రైల్వే స్టేషన్ వుందంటే ఈ తరం వారెవ్వరూ నమ్మరు)

స్టేషన్ దాపుల్లో రోడ్డుకు ఇరువైపులా హోటల్లు, రెస్టారెంట్లు, విడిది గృహాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.

కాశ్యప్ వాహిని ఇంట్లో భోజనాల అనంతరం తిన్నది అరగడానికి తిరగడానికి మళ్ళీ బయలు దేరాం.

చుట్టుపక్కల అంతా దట్టమైన అడవులు. వాటిగుండా వేసిన చక్కటి రహదారుల వెంట పొతే, చిట్టడవి నడుమ గలగలా పారుతున్న సెలయేరు. దాని మధ్య చిన్నాపెద్ద బండరాళ్ళు. వాటి మీద దుముకుతూ, కేరింతలు కొడుతూ  పిల్లలు చాలాసేపు కాలక్షేపం చేశారు. నిజానికి అరకు లోయలో కూడా ఇలాంటి సెలయేరు వుంది. కానీ ఇంత గొప్ప రహదారి సౌకర్యం ఉందా అంటే అనుమానమే. ఏటి వొడ్డున  నలుచదరంగా ఉన్న ఓ బండరాయిపై నేను విశ్రాంతి తీసుకుంటూ పిల్లలు చేస్తున్న  తమాషాలను చూస్తుండిపోయాను. రమణీయమైన ప్రకృతి అందాలను, నింగిని తాకుతున్న ఎత్తైన వృక్షాలు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఇదే ఊర్లో మా అన్నయ్య, మేనల్లుడు, మేనకోడలి పిల్లలు దగ్గర దగ్గరగానే (వుడ్ స్టాక్, సైక్స్ విల్, టర్ఫ్ వ్యాలీ) ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుక్కుని  వుంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తప్పిస్తే, ఉన్న పద్దెనిమిది మందిమీ కలిసి ఎవరో ఒకరి ఇంట్లో  మధ్యాహ్నభోజనాలు, రాత్రి డిన్నర్లు. ఎక్కడకు వెళ్ళినా నాలుగు కార్లు కదలాల్సిందే.

పరాయిదేశంలో కూడా కుటుంబ ఆప్యాయతలు అలాగే వున్నాయి. అందరూ వర్క్ ఫ్రం హోం బాపతే కాబట్టి లాప్ టాపుల్లో ఆఫీసు పని. పనిలోపనిగా కాలక్షేపం కబుర్లు. మధ్య మధ్య వేడి వేడి పకోడీలు, కాఫీలు సరేసరి.

(30-07-2024)

(అమెరికాలో రెండో రోజు కొన్ని ఫోటోలు, వీడియోల లింకులు)