8, జులై 2022, శుక్రవారం
6, జులై 2022, బుధవారం
వై.ఎస్. ను కడుపుబ్బ నవ్వించిన కాల్ సెంటర్ ఉద్యోగిని
(జులై 8 వై ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితం)
ఎప్పుడో పుష్కరకాలానికి ముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో హెచ్.ఎం.ఆర్. ఐ. రూపకల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వచ్చారు.
ముందుగా అసలు ఏమిటి ఈ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా వుంటుంది. సామాన్యులకు, అసామాన్యులకు సమస్యలు అనేకం, సమాధానం ఒక్కటే! ఆ జవాబే 104 అనే ఈ పధకాన్ని గుర్తించి, ప్రోత్సహించి అమలు చేయడంలో తోడ్పడింది రాజశేఖర రెడ్డి గారే కనుక.
‘కాంతమ్మకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. యెంత పట్టుకున్నా వంకర్లు తిరిగిపోతోంది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేడు. టైము చూస్తే అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కాని డాక్టరు దొరకడు. దిక్కు తోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు.
‘మూర్తికీ శైలజకూ కొత్తగా పెళ్లయింది. హానీమూన్ కి వెళ్లి వస్తుంటే దారిలో కారు చెడిపోయింది. దానికి తోడు విడవకుండా కురుస్తున్న వర్షం ఒకటి. ఏం చెయ్యాలో తెలియని స్తితిలో దగ్గరలో వున్న టీ స్టాలుకు వెళ్ళారు. కారు రిపేరు పూర్తయ్యేసరికి, వేళకాని వేళలో తాగిన ఆ టీ వికటించిందేమో తెలియదు, మూర్తికి వాంతులు మొదలయ్యాయి. కొత్త పెళ్లి కూతురికి భయంతో చెమటలు పట్టాయి. ఏడవడం తప్ప ఏం చెయ్యాలో తెలియని పరిస్తితి.
‘రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వచ్చింది. వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుందన్నమాటే కాని, డాక్టరు కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది కూడా యధా రాజా తధా ప్రజా బాపతు. మందులు మచ్చుకు కూడా దొరకవు. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క మనుమడికి వళ్ళు పేలిపోయే జ్వరం. చూపిద్దామంటే డాక్టరు లేడు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. కానీ ఎవరి మీద చూపించాలి ఆ కోపం? ఎవరికి పిర్యాదు చేయాలి పాపం.
‘వెంకటరావు వుంటున్న ఊరు ఓ మోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద డాక్టర్లు వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే పెద్ద డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్లి, పెద్ద ఫీజు చెల్లించి, పెద్దవైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని మందులు ఆ వూళ్ళో యెంత ప్రయత్నించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలవక తల పట్టుకున్నాడు వెంకటరావు.
ఇలాంటి కాంతమ్మలూ, మూర్తులూ, శైలజలూ, రామనాధాలు, వెంకటరావులు ఇంకా ఎంతమందో. అందరిదీ ఒక సమస్య కాదు. కానీ ఏం చెయ్యాలి అన్నదే అందరి సమస్య.
అప్పటి ప్రభుత్వం నిపుణులను సంప్రదించి, ఎంతో ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుంది. అదే 104.
ఇదొక టోల్ ఫ్రీ నెంబరు. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నెంబరుకు ఉచితంగా ఫోను చేయవచ్చు. ఈ కేంద్రంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వుంచారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్సరే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగు హోములు, ఇలా అన్ని వివరాలు సిద్ధంగా వుండడం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ, ఎక్సరే, స్కానింగు వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ, ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు వున్నదీ ఇటువంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం వున్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసుకుని ఒక నెంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కేంద్రంలో కంప్యూటర్ తెరపై సిద్ధంగా వుంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుంటుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటికప్పుడు చేయాల్సిన ప్రధమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియపరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108 కి తెలియపరచి అంబులెన్సు పంపిస్తారు.
స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు.
ఇక అసలు విషయం చెప్పుకుందాం.
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సమయానికే సమావేశానికి వచ్చారు. ఈ పధకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నెంబరుకు ఫోన్ చేశారు.
అవతల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది.
“104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?”
ముందు కంగు తిన్నా ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది.
“ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?”
వై.ఎస్. ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వులతో నిండిపోయింది.
5, జులై 2022, మంగళవారం
తరం మారింది, ఊరూ మారింది – భండారు శ్రీనివాసరావు
1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కాలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే ఇప్పటికి అక్షరాలా తొంభయ్ ఒక్క సంవత్సరాలు గడిచాయి. అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది.
మొన్న మా స్వగ్రామం కంభంపాడు వెళ్ళినప్పుడు ఎప్పటిదో బ్రిటిష్ కాలంనాటి ఓ దస్త్రం నా కంటపడింది.
‘DETAILED LIST OF JOINTLY REGISTERED HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.
వివరాల్లోకి వెడితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. అయితే ఈ మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణలో కూడా సమగ్ర భూసర్వే జరుగుతోందని, అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే జరిగి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. ఇది పూర్తయితే భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని వారి ఆశ.
ఇదలా ఉంచితే తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో 128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవి కాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు. సాగుకు పనికి రాని భూమి 34.40 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగా, గ్రామంలో భూమిశిస్తు మొత్తం 4720 రూపాయలు వసూలు అయ్యేది. 9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని కట్టివేసే దొడ్డి అన్నమాట. నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు.
1929 వ సంవత్సరం జమాబందీ లెక్కల ప్రకారం ఊరి మొత్తంలో 1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా) 675 గొర్రెలు, మేకలు వుండేవిట.
ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు ఉండేవి. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు వీటికి మాత్రం కొదవలేదు.
(05-07-2022)
ప్రాంతీయ వార్తలు చదివిన గుడిపూడి శ్రీహరి ఇక లేరు
1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.
తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్, సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు కూడా గొంతు పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది)
ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో వింటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.
శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.
ఆయన వయసులో నాకంటే పెద్ద. కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరోమల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు,ఇంగ్లీష్, హిందీ సినిమాల్లో హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లు, వీటన్నితో అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది. ఇప్పుడు అలాంటి చనువువుందని చెప్పలేను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇచ్చ్చిపుచ్చుకునే మర్యాదలు, పలకరింపుల్లో తేడాలు రావడం సహజం.
ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.
‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా’
ఆయన చెప్పింది నాకు సరిగ్గానే అనిపించింది.
కొన్నేళ్ళ క్రితం శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నాను.
అయితే ఈ ఉదయం ఓ దుర్వార్త తెలిసింది. శ్రీహరి ఇకలేరు. తన ఎనభయ్ ఎనిమిదో ఏట గత రాత్రి రెండుగంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
(05-07-2022)
భయం లేదు! స్పందించే గుణం మిగిలే వుంది!
స్పందించే
గుణం లేనిపక్షంలో మనిషి గుండెకు, రాతి
బండకు తేడా వుండదు.
మనుషులకు
స్పందించే గుణం ఇంకా పూర్తిగా పోలేదు అని చెప్పడానికే ఈ ఉదాహరణ.
మూడు
మాసాల క్రితం ఓ కధ చెప్పుకుందాం అని ఓ పోస్టు పెట్టాను. నిజానికి ఇది కధ కాదు. నిజజీవితమే.
మా
స్వగ్రామం కంభంపాడులో మండే ఎండల్లో కాలిపోతున్న రేకుల షెడ్డులో, కనీస దూరంలో విద్యుత్ వెలుగులు
కనిపించని ఊరి బయట పొలాల్లో నివసిస్తున్న ఓ వృద్ధుడి కధ అది.
కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే అనేక కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా
సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా
మూడో అన్నయ్య అకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం
మిగిలాము. చిన్నవాడినైన నాకే డెబ్బయి ఆరు. మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు.
ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని
అనుకోను.
ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు
భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ
పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే
ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ
దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:
“ఈ ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు
పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఈమె
ఎవరికి కనపడదు. (సరిగా బట్టలు వేసుకోదని బయటకు రానివ్వరు) మండుటెండలో సైతం చెట్టు
నీడ కూడా లేకుండా, ఈ రేకుల షెడ్డులోనే ఊరు బయట
నాలుగేళ్లుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపుమేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడే
లేకపోయినా, కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
“వెనుకటి రోజుల్లో పిచ్చమ్మ అనే ఆమె మన
ఊళ్ళో ఉండేది. ఈ పిచ్చయ్య ఆమె కుమారుడు. కంభంపాడులోనే కూలి పనులు చేసుకుని
జీవిస్తున్నాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా
ఉండేది. అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంతమంది కామాంధుల
పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా
అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ వుండడంతో తమ ఇళ్ళ మధ్య వాళ్ళు ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడ
లేదు.
“ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పడంతో,
కంభంపాడు వెళ్లి మన ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని
ఒక మూలన పొలంకు అడ్డులేకుండా చివరన తాత్కాలికంగా ఉండమని చెప్పాను. దీంతో వాళ్లు
అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ
పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారి వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే
స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే
వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి
ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.
“అయితే ఇప్పుడు మన పొలాలు
కొలిపిస్తున్నందున అక్కడినుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాను. పిచ్చయ్య నన్ను
అడిగిన దాని ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి నివాసం ఏర్పాటు చేయాలని అనుకున్నాను.
నేను నాతో పాటు నా మిత్రులు, అన్నయ్య రఘు, ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు
గోపాలకృష్ణ అందరం కలిసి వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి నివాసం ఏర్పాటు చేయాలని
భావించాము. వాళ్ళకి మన ఊళ్ళోనే ఒక నివాసం ఏర్పాటు చేసేందుకు తలా ఒక చేయి
వేస్తున్నాము” ((25-04-2022)
ఇదీ మూడు మాసాల క్రితం నేను పెట్టిన
పోస్టు.
ఈ కధ సాంఘిక మాధ్యమంలో కనిపించిన
తర్వాత కదలిక మొదలయింది. గ్రామ పంచాయతీ
వాళ్ళు మా పొలం పక్కనే వున్న పోరంబోకు
స్థలం కేటాయించారు. ప్రభుత్వం తరపున, సొంత ఇంటి పధకం కింద పిచ్చయ్య ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు అయ్యాయి.
పిచ్చయ్యకు శాశ్వత ఆవాస నిర్మాణం మొదలయింది.
మొన్న మేము మా ఊరు వెళ్ళినప్పుడు
పిచ్చయ్య నిర్మించుకుంటున్న ఇంటిని
చూశాము.
అవే కింది ఫోటోలు:
(05-07-2022)