15, మే 2022, ఆదివారం

మనమే దేవుడి సమస్య – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 15-05-2022, SUNDAY today)

దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.

వున్నాడని నమ్మేవాళ్ళంటారు.

దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.

దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.

వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా దేవుడ్ని పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.

దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.

తొక్కితే రాయి, మొక్కితే సాయి. అంతా నమ్మకం.

దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.

దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)

నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?

చెట్టులో,పుట్టలో అంతటా నేనే’ అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.

మా చిన్నప్పుడు వంటింట్లో గోడమీద ఎర్రగా ఓ చదరంలో వేంకటేశ్వర స్వామి నామాలు వుండేవి. అదే అందరికీ పూజాగృహం. స్నానం చేసిన తరువాత అక్కడ నిలబడి ఓ దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడో! ‘పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత, ఇలా ఏదో ఒక పేరుతొ  అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!

దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.

నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమ పని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.

సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

14, మే 2022, శనివారం

పునరావృతం కానివ్వం – భండారు శ్రీనివాసరావు

 గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో ఆరేండ్ల చిన్నారి ఆరాధ్య  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుందని ఆ అమ్మాయి తలితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టం పునరావృతం కానివ్వం అనే ప్రకటనలు వెలువడ్డాయో లేదో తెలియదు.

ఈ నేపధ్యంలో 2015లో అదే ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన గుర్తుకు వస్తోంది.

సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది. మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో, ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో వెలువడ్డాయి.

నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.

అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొన్నది.

దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కమిషన్ స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.

ఆ రోజుల్లో పత్రికలు ఈ దుర్ఘటనపై  పుంఖానుపుంఖాలుగా కధనాలు రాశాయి. మీడియా  గగ్గోలు పెట్టింది.

ఇది జరిగి ఏడేళ్లు దాటుతోంది. ఇన్నేళ్ళుగా ఆ కన్నతల్లి కడుపుకోత గురించి కానీ, ఆ శిశువు కుటుంబం పడ్డ వేదన గురించి కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు.

గుంటూరు ఆసుపత్రి సంఘటనపై జరిగిన విచారణ ఫలితం ఏమిటన్నది ఎవరికీ పట్టదు. కొన్నాల్తికే జనమే ఈ విషయం మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే ఆ మాతృమూర్తి వేదన అరణ్య రోదనే అవుతుంది.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. ఈ భ్రమణంలో చోటుచేసుకున్న మరో విషాదమే చిన్నారి ఆరాధ్య మరణం.

తోకటపా:

సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని అవగాహన వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అయితే వాటి నడుమ ఈ దోస్తీ కొంత మేరకు మాత్రమే. ఒక స్థాయి వరకే.

ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకకు హామీ ఇస్తుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’

ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, తరువాత ఎలక చేసిన ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.

ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ స్వప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.

(14-05-2022)

 

పనికొచ్చే మనిషి – భండారు శ్రీనివాసరావు

 (నాదేంలేదు, ఇంగ్లీషు జోకుకి స్వేచ్ఛానువాదం చేయడం తప్ప)

పనిమనిషి ఇంటి యజమానురాలిని అడిగింది జీతం పెంచమని. పెంచడానికి మూడు కారణాలు చెప్పమంది ఇంటావిడ.

నేను మీకంటే బాగా బట్టలు ఇస్త్రీ చేస్తాను”

అలానా! ఎవరు చెప్పారు నీతో అలా?”

ఎవరో కాదు మన సారే ఆ మాట నాతో చాలా సార్లు చెప్పారు”

అల్లానా! సరే! ఇంకో కారణం చెప్పు”

నేను మీకంటే బాగా వంట చేస్తాను”

అలానా తల్లీ ఇదెవరు చెప్పారు?”

ఇంకెవరు? మన అయ్యగారే!”

ఓహో! అలా కూడా చెప్పారా అయ్యగారు, అది సరే నీ జీతం ఎందుకు పెంచాలో మరో కారణం చెప్పు”

అది చెప్పడం బాగుండదండీ! కానీ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు, మీకంటే నేనే బాగుంటానుట”

ఏమిటీ! ఇది కూడా అయ్యగారే చెప్పారా? ఇంటికి రానీ సంగతి తేలుస్తాను.”

అయ్యో అలా అనుకున్నారా! ఈ సంగతి చెప్పింది అయ్యగారు కాదండీ మీ కారు డ్రైవరు”

సరే! ఇంతకీ యెంత పెంచమంటావు ముందది చెప్పు”

NOTE: Courtesy Image Owner



 

తొందరపడ్డదాన్ని కాదు (కధానిక) – భండారు శ్రీనివాసరావు

 ఆదివారం. లిఫ్ట్ అలుపూ సొలుపూ లేకుండా పైకీ కిందికీ తిరుగుతోంది. చిన్నా పెద్దా సామాన్లు ఖాళీగా ఉన్న మా పక్క పోర్షన్ లోకి చేరుతున్నాయి. నలుగురు పనివాళ్ళు పెద్ద పెద్ద టీవీలను , మంచాలను, అరమరాలను మెట్ల మీదుగా తెస్తున్నారు. సాయంత్రానికల్లా ఇల్లు పట్టనంత సామానును ఇంట్లో అమర్చిపోయారు. తీరా చూస్తే ఒక వయసుమళ్ళినావిడ, రిటైర్ అయిన మొగుడు.

వుండేది ఇద్దరే. పిల్లలు అమెరికాలో వుంటారట. ఇరవై నాలుగ్గంటలు వుండే పనిమనిషి, వంటకు ఇంకో మనిషి. పెద్ద టీవీలు ఉన్నాయన్న మాటే కానీ ఆవిడ ఎప్పుడూ పూజాపునస్కారాలతోటో, రామకోటి రాస్తూనో వుండేది. ఇక ఆయన పొద్దున్న ఇంగ్లీష్ పేపర్లో తలదూరిస్తే మళ్ళీ మధ్యాన్న భోజనం వరకు ఆ వార్తలే ఆయనగారికి భోజనం అన్నట్టుగా వుంటారు.

వంట మనిషి రోజూ ఆరున్నొక్క తీరుగా రకరకాల చిరుతిండ్లు చేసిపెడుతుంటుంది. కానీ ఏనాడూ ఆవిడ నోరు తెరిచి ‘ఈ మిఠాయి ఉండ నోట్లో వేసుకుని చెప్పమ్మా మరదలా’ అంటుందేమో అని చాలా రోజులుగా అనుకుంటూ వుండేదాన్ని. కానీ ఏనాడూ ఆమె నోటంట ఈ మాట రాలేదు. దాంతో నేనే కావాలని మా ఇంట్లో చేసిన వాటిని తీసుకుపోయి ఇస్తుండేదాన్ని. తిని తెగ మెచ్చుకునేది. ‘నీ చేతితో ఏం చేసినా అమృతం సుమా’ అనేది.

సంక్రాంతి వచ్చింది. ‘చూడు మరదలా! రేపు నువ్వూ తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రావాలి. మరచిపోవద్దు’ అంటే ఆశ్చర్యపోయాను.

పండగనాడు రకరకాల వంటకాలు వడ్డించింది. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిఉండొచ్చు అనుకున్నా.

ఏదీ మీ వంటమ్మాయి కనిపించడం లేదు’ అన్నాను అటూ ఇటూ చూస్తూ ఆవిడ ఇచ్చిన తాంబూలం నోట్లో వేసుకుంటూ.

పండక్కి వాళ్ళ ఊరుకు వెళ్ళింది. రేపు సాయంత్రం వస్తుంది. ఇన్నాళ్ళు ఆమె చేసి పెడితే మేము తింటున్నాము. ఇరుగూ పొరుగును పిలిచి ఆమె మీద భారం వేయడం ఎందుకని ఊరుకున్నాను. ఇదిగో! ఈరోజు ఇవన్నీ నా చేత్తో చేసినవే. ఎలా వున్నాయో చెప్పు. వంటింట్లోకి పోయి చాలా కాలం అయింది. ఇది తెలిస్తే మా పిల్లలు ఊరుకోరు’

ఏం చెప్పను?

ఆవిడ వయసే కాదు, మనసుకూడా పెద్దది.

13, మే 2022, శుక్రవారం

మనుషులు చేసే పనులేనా! – భండారు శ్రీనివాసరావు

 

బెజవాడలో డాక్టర్ కొమ్మూరి సాంబశివరావు (నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాల రావు గారి నాన్నగారు) గవర్నర్ పేట పోస్టాఫీసు దగ్గర క్లినిక్. ఆయన ఒక రోగితో చెబుతుంటే విన్నా. ‘ఈ మందులు సరిగా వాడకపోతే చచ్చిపోతావ్’ అని.
నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత కటువుగా చెప్పాలా అని. కానీ ఆయన అన్నారు ఇలా.
‘మనిషికి చావు భయాన్ని మించిన భయం వుండదు. ఈ రోగి నా దగ్గరకు రావడం ఇది పదో సారి. ఎప్పుడూ సరిగా మందులు వాడడు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుంటాడు’
ఈ నేపధ్యం తలచుకోవడానికి కారణం వుంది.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజుల్లో యావత్ ప్రపంచం మృత్యువు ముంగిట్లో వుంది. లక్షల మంది కరోనా కోరల్లో చిక్కుకుని చనిపోయారు. దాదాపు ప్రతి కుటుంబం తన ఆత్మీయులలో ఒకరినో ఇద్దరినో పోగొట్టుకుంది. కొందరికి ఆ గాయాలు ఇంకా గుండెలో పచ్చిగా వున్నాయి. కరోనా భయం అనేది వున్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమస్త సమాజాలను ఒకే తీరున వణికించింది. జీవితం అశాశ్వతం అనే నిర్వేదంలోకి మానవ జాతి వెళ్ళిన ఏకైక సందర్భం.
కానీ ఏం లాభం? ఏడాది తిరక్క మునుపే కింది వార్తలు చూడండి.
‘ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధురాలిపై అత్యాచారం’
‘నడి రోడ్డు మీద నరికి చంపిన హంతకులు’
‘వెంటాడి వేటాడాడు. చనిపోయాక కూడా రేప్’
‘భర్త ఆవేశం మరణ శాసనమై’
‘పెళ్ళికి ఒప్పుకోలేదని కాల్చి చంపేశాడు’
‘వివాహితపై అత్యాచారం’
‘ఫేస్ బుక్ ఫ్రెండ్ తో ప్రియుడిని చంపించిన మహిళ’
కుక్క తోక వంకర సామెత గుర్తుకు వస్తే తప్పు పట్టాలా!
(13-05-2022)

11, మే 2022, బుధవారం

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా! – భండారు శ్రీనివాసరావు

రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు తెర తీస్తున్నాయి.

రాజకీయ పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే. అది విజయం వైపు పయనం.

2019లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాjజయం పాలయిన టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు  కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు.  ఈ లక్ష్య సాధన కోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు  పూర్తిగా మారిపోతాయని మూడేళ్ళ క్రితం ఎవరయినా అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయనడానికి ఏపీలో  రోజురోజుకి మారుతున్న పరిణామాలే   మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.

నేటి రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు ఈనాడు అవసరాల పునాదులపై నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.

పాలకపక్షం వైసీపీ పూర్తిగా బలహీన పడిందని  నమ్ముతూ  తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.   

రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి గెలిపిస్తారు. 

రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు.  

బ్రహ్మాండంగా విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు. ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు  కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా, కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి పట్టు పడతాయి.

1982 ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120  సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్  80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి  60 సీట్లు అడిగారు.  20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్ దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగి  ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా  కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే,  ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టిన పట్టు రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది. 

ఇక ప్రస్తుతానికి వస్తే.        

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం.  ఈసారి ఏదీ ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం, ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా పోతాయి.

ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి, అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.

పాలకపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు,  ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట.  చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి. 

రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు  ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.

అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.

ఇది నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం ఉన్నట్టు కూడా లేదు.

8, మే 2022, ఆదివారం

మా అమ్మకు శ్రీశ్రీ సాహిత్యం ఎలా తెలుసు? – భండారు శ్రీనివాసరావు

 1987 అక్టోబరు చివరి వారం.

అప్పటికి ఆమెకు ఎనభయ్ ఏళ్ళు నిండాయి. బడికి వెళ్లి చదువుకోకపోయినా రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం.

నేను మాస్కో రేడియోలో చేరడానికి తేదీ నిర్ణయం అయింది. కుటుంబాన్ని తీసుకుని  ముందు ఢిల్లీ రైల్లో వెళ్లి, సోవియట్ ఎంబసీలో వీసా స్టాంప్ వేయించుకుని సోవియట్ విమాన సంస్థ ఏరో ఫ్లోట్ లో మాస్కో వెళ్ళాలి.

ఢిల్లీ వెళ్ళడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళాము. బంధు మితృలు చాలా మంది వచ్చారు, వీడ్కోలు పలకడానికి. నేను మా అమ్మతో ప్లాటుఫారం మీద ఓ బెంచిపై కూర్చుని ఉన్నాను. ఆమె మొహంలో బాధ కనిపించడం లేదు కానీ, మనసులో మాత్రం బాధ పడుతోంది. రైలు ప్లాటు ఫారం మీదకు వస్తూ దూరంగా కనిపించింది. ఆమె నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా  అంది.

“కూటికోసం, కూలి కోసం దేశాలు పోవాలా!’

ఏం చెప్పాలో తోచలేదు.

రైలు ఎక్కిన తర్వాత కూడా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి.

రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం కానీ మా అమ్మకు శ్రీశ్రీ కవిత గురించి ఎలా తెలిసింది? టీవీలో ఆకలి రాజ్యం సినిమా చూసి ఉంటుందా! చూసినా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకుంది?

ఆ సందేహం ఇప్పటికీ నివృత్తి కాలేదు.



(08-05-2022)