ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..
19, మార్చి 2022, శనివారం
సంతకం ఖరీదు అయిదు రూపాయలు – భండారు శ్రీనివాసరావు
18, మార్చి 2022, శుక్రవారం
బ్రాహ్మణ సదస్సు – భండారు శ్రీనివాసరావు
ఇది నలభయ్ ఏళ్ళ
నాటి మాట.
ఆ రోజుల్లో
చిక్కడపల్లిలో ABCD ORGANISATION (All Brahmin Community Organization) అనే ఒక సంస్థ
వుండేది. ఆ సంస్థ కార్యదర్శి, సమాజంలో వివిధ
వర్గాలతో సన్నిహిత పరిచయాలు కలిగిన ఒక జర్నలిష్టుని
కలిసి తమ సంస్థ కార్యకలాపాలలో సహకారం అర్ధించాడు. ఆయన వెంటనే లేచి నిలబడి, కులాల పేరుతొ
సంస్థలు, సంఘాలు నిర్వహించడం తనకు సుతరామూ ఇష్టం లేదని మొహం మీదే అనేసి వెళ్లి
రండంటూ పంపేశాడు.
మళ్ళీ ఇన్నేళ్ళ
తరువాత అదే జర్నలిష్టు ఇటీవల హైదరాబాదులో బ్రాహ్మణ సదస్సు జరిగితే హాజరయి బ్రాహ్మణ సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ
చేసిన తీర్మానానికి తన మద్దతు ప్రకటించారు. కాలం తెచ్చిన మార్పు అనుకోవాలి.
ఇప్పుడు ఒక నిజం
చెబుతాను, ఆ జర్నలిష్టు ఎవ్వరో కాదు, నేనే!
అయిదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్
మేనేజింగ్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్ళు పనిచేసిన వెంకట్ చంగవల్లి గౌరవార్ధం జరిగిన
సమావేశానికి వెళ్ళినప్పుడు నాకీ విషయం మరోమారు స్పురణకు వచ్చింది.
ఈ సమావేశానికి
కార్పొరేషన్ చైర్మన్, మాజీ చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు రావుగారు ముఖ్య అతిధిగా
హాజరయ్యారు. ముక్తసరిగా మాట్లాడడం ఆయన తత్వం. కానీ కృష్ణారావుగారి నిన్నటి ప్రసంగం
ఉద్విగ్నంగా సాగింది. ఆయనలో దాగున్న అద్భుతమైన వక్త వెలికి వచ్చారు. ప్రభుత్వ
సర్వీసులో వున్నప్పుడు ఆయన్ని ఎన్నోసార్లు కలిశాను. ప్రత్యేకించి ఒక కులానికి
ప్రయోజనం కలిగించే ధోరణిని ఎన్నడూ కనబరచలేదు.
కానీ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న తరువాత బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్ని రకాల
ఆలోచనలు చేస్తున్నదీ తేటతెల్లం అయింది. నిజానికి ఈ కార్పొరేషన్ పదవి ఆయన గతంలో
చేసిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా చాలా చిన్నది. చీఫ్ సెక్రెటరీగా వున్నప్పుడు డజన్ల
సంఖ్యలో ఇలాంటి సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేసేవి. వేల కోట్ల రూపాయల రాష్ట్ర
బడ్జెట్లు ఆయన ఆధ్వర్యంలో రూపు దిద్దుకునేవి. అంత పెద్ద హోదాలో
పనిచేసిన పెద్ద మనిషి ఇంత చిన్న పోస్ట్ ఎందుకు ఒప్పుకున్నారో అప్పుడు నా బోంట్లకు
అర్ధం కాలేదు కూడా. ఇప్పుడు తెలిసివచ్చింది, ఒక చిన్న సంస్థను
కూడా పెద్ద ఎత్తున విస్తరించాలంటే ఇలాంటి వ్యక్తులే అవసరమని.
కార్పొరేషన్
అనుబంధ విభాగం బ్రాహ్మణ సహకార పరపతి సంస్థకు ఈ కొద్దికాలంలోనే
ఆయన తన పలుకుబడితో అనేక హంగులు కల్పించారు. పలు జాతీయ, అంతర్జాతీయ
బ్యాంకులకు సాఫ్ట్ వేర్ అందిస్తున్న ఒక సంస్థ నుంచి అదే రకమైన సాఫ్ట్ వేర్ ను, కాణీ ఖర్చులేకుండా
ఉచితంగా పొందగలిగారు. దాని విలువ రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా ఇరవై కోట్లు. అంటే
కార్పొరేషన్ కు ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సమానం అన్నమాట.
ఇక ఆ సాయంత్రం
ప్రధాన అతిధి వెంకట్ చంగవల్లి తన సతీమణి పద్మగారితో కలిసి వచ్చారు. మామూలుగానే ఆయన
సీరియస్ సమావేశాలు, సదస్సుల్లో కూడా
నవ్వులు పూయిస్తారు. ఆ అలవాటుతో ఆయన తన ప్రసంగాన్ని ఒక పిట్టకధతో మొదలు పెట్టి
అసలు అంశానికి జోడిస్తూ కొనసాగించారు.
ఒకావిడకు పుట్ట
చెముడు. డాక్టరుకు చూపెట్టుకుంది. రకరకాల వినికిడి సాధనాలు చూపెట్టారు. ఒకటి చాలా
ఖరీదు, ఒకటి చాలా చాల చౌక. ఖరీదుది పెట్టుకుంటే బాగా వినబడుతుంది. చౌకది
తగిలించుకుంటే ఏమీ వినబడదు. కాకపోతే చెవిటి మిషన్ కనబడగానే ఆవిడ చెవిటిది అన్న విషయం బోధపడి ఎదుటి వాళ్ళే ఓపిక చేసుకుని బిగ్గరగా మాట్లాడతారు. అల్లాగే, వెంకట్ చంగవల్లి
గతంలో ఈఎం ఆర్ ఐ (108 అంబులెన్స్) వంటి అనేక పెద్ద పెద్ద
ఉద్యోగాలు చేసినా ఆయన ఎవరన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ బ్రాహ్మణ
కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా తనని నియమించగానే చెవిటి మిషన్ కధలోని
అవ్వలాగా తానెవరన్నది అందరికీ తెలిసిపోయిందని చెప్పారు.
తెలంగాణ బ్రాహ్మణ
పరిషద్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, కార్పొరేషన్ జనరల్
మేనేజర్ భవాని శంకర్, ఇంకా అనేకమంది బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొని వెంకట్ చంగవల్లికి ఆత్మీయ
వీడ్కోలు పలికారు.
ఒక కొసమెరుపు:
లక్ష్మణ్ అనే ఒక
పెద్దమనిషి ఒక చిన్న జ్ఞాపకాన్ని సదస్యుల
మీదికి ఒదిలారు. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో పనిచేసే లక్ష్మణ్ అనే ఓ పెద్దమనిషిని
ఒక సదస్సుకి పిలిచారు. అధ్యక్షులవారు Now Mr. Lakshman will give his valuable
address in brief’ అంటూ వేదిక మీదకు
ఆహ్వానించారుట. లక్ష్మణ్ గారు నేరుగా మైకు తీసుకుని, లక్ష్మణ్, కామర్స్ హెడ్ ఆఫ్
ది డిపార్ట్ మెంట్, ఎస్సారార్ కాలేజ్, విజయవాడ’ అనేసి చక్కా స్టేజ్ దిగి వచ్చేసారుట.
నేను చదివింది, అదే ఎస్సారార్
కాలేజీలో. అందుకే ఇది గుర్తు పెట్టుకున్నాను. (18-03-2017)
17, మార్చి 2022, గురువారం
భార్యకు కారు పంపించని మంత్రి. – భండారు శ్రీనివాసరావు
మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.
అవతల పియ్యే.
‘సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’
మంత్రిగారు విసుగ్గా ఫోన్
తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.
‘ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు
డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’
‘........’
‘కారు పంపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ
అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక
వెడుదువ్ కాని’
ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ
బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార
శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, ఆ బ్యాంక్ లిక్విడేషన్ వ్యవహారాలను
చూడడానికి నియమితులయిన ఎస్బీఐ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు అందులో పాల్గొంటున్నారు.
నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం
అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా
సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే
కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే.
మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?
ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి
వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్
కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.
సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం.
మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.
ఈరోజు చిక్కాల రామచంద్రరావు గారి
పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు
(17-03-2022)
కుముద్ బేన్ జోషి
(Published in ANDHRAPRABHA daily on 17-03-2022, Thursday)
1985 నవంబరు
నుంచి 1990 ఫిబ్రవరి
వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్ వెలుపల నడిచే రాజకీయాలకు ధీటుగా
గవర్నర్ నివాసంలోను నడిచిన రాజకీయ సందడి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో అనేక
కధనాలు వెలువడుతుండేవి. దానికి ప్రధాన కారణం అప్పట్లో గవర్నరుగా పనిచేసిన కుముద్
బెన్ జోషి.
తన ఎనభయ్ ఎనిమిదో ఏట కుముద్ బెన్ జోషి
స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోని స్వగ్రామంలో
మార్చి పద్నాలుగో తేదీ సోమవారం నాడు కన్ను
మూశారు. ఒకప్పుడు పత్రికల వార్తలకు ప్రధాన వనరు అయిన కుముద్ బెన్ చనిపోయిన వార్త
పత్రికలకు అంతగా పట్టినట్టు లేదు. లోపల పేజీల్లో ఓ చిన్న వార్తగా వచ్చింది. ఆమె మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర
మోడీ సంతాపం వ్యక్తం చేయడంవల్ల, ఏపీ మాజీ గవర్నర్ మరణ వార్త తెలుగు రాష్ట్రాల
ప్రజలకు తెలిసిందని అనుకోవాలి. సహజమే.
అధికారానికి,
ఆరోగ్యానికి దూరమై ఇప్పటికే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. అలాంటి వ్యక్తులను
గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఈనాటి వేగ ప్రపంచానికి ఉంటుందని ఆశించడం అత్యాశే
అవుతుంది. అంచేతే తళుక్కు మంటేనే తారలు, మిణుక్కు మంటే చుక్కలు అనేది.
గవర్నర్ల పాత్ర గురించి ఈనాడు జరుగుతున్న చర్చ
ఏనాడో అంటే ముప్పయ్ ఏడేళ్ల క్రితమే జరిగిందని ఈనాటి యువ తరానికి తెలిసే అవకాశం
ఉంటుందని అనుకోను. ఆ రోజుల్లో ఇరవై నాలుగ్గంటల టీవీ వార్తాప్రసారాలు ఉన్నట్టయితే
మీడియాకు అనుక్షణం పండగలాగా గడిచిపోయేది. రాజ్ భవన్ రాజకీయాలు ఆరోజుల్లో అంతటి సంచలనాత్మకంగా సాగేవి.
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలో రాజీవ్ గాంధి
నాయకత్వంలో జాతీయ పార్టీ కాంగ్రెస్
ప్రభుత్వం,
రాష్ట్రంలో ఎన్టీఆర్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీ
టీడీపీ ప్రభుత్వం. రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. పొసగని విధానాలు. మాదే
పైచేయి అనే ఆధిపత్య ధోరణి.
గవర్నర్ కుముద్ బెన్ జోషి యాభయ్ ఏడేళ్ల వయసులోనే
ఈ పదవిలోకి వచ్చారు. గవర్నర్ పదవికి ఇది చిన్న వయసు కిందే లెక్క. అప్పటికే ఆవిడ
చురుకైన కాంగ్రెస్ నాయకురాలు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మూడు
సార్లు రాజ్యసభ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆవిడకు వుంది.
ఓ రిపబ్లిక్ దినోత్సవం రోజున గవర్నర్ సాంప్రదాయక
ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడని రీతిలో మాట్లాడడం ఆనాటి
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇరవై నిమిషాల పాటు సాగిన హిందీ
ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు
చేయడం సాధ్యం కాదని జోషీ కుండ బద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న
సాయాన్ని ఆ ప్రసంగంలో ఓ పక్క ప్రముఖంగా
ప్రస్తావిస్తూ,
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పధకాల పట్ల చిన్న చూపు ప్రదర్సించడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం
జీర్ణించుకోలేక పోయింది. నిరసన వ్యక్తం చేస్తూ మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది.
ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ కు పంపాలని మంత్రివర్గం ముఖ్యమంత్రిని కోరింది.
గవర్నర్ తీరు పట్ల కొందరు బాహాటంగానే అసంతృప్తి,
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు, సహకార
శాఖ మంత్రి ఎన్. యతిరాజారావు ప్రభ్రుతులు గవర్నర్ పదవికి ఉన్న ప్రతిష్టను జోషి దిగజార్చారని. ఆవిడ కాంగ్రెస్ ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజ్
భవన్ గాంధి భవన్ (రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం) గా తయారైందని ఆక్షేపించారు.
కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో రాష్ట్రంలోని
ఇరవై మూడు జిల్లాల్లో అనేక మార్లు విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో
పాల్గొనే వాళ్ళు. రాష్ట్రంలో కాంగ్రెస్
పార్టీని పటిష్టం చేయడం అనే రాజకీయ ప్రయోజనం కోసమే గవర్నర్ ఇలా అనేక
కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ
మంత్రులు ఆరోపించేవారు. రాజ్ భవన్ పై పెట్టే
వ్యయం పెరుగుతూ వుండడం పట్ల వారు అడపాదడపా
ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు. అప్పటికే గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం జోషీ తీరు పట్ల అసహనం పెంచుకున్నారు.
కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో స్థానిక
పత్రికలకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలు,
ఆరోపణలు ఆధార రహితం అని కొట్టి వేసేవారు. వాటికి జవాబు ఇవ్వడం గవర్నర్ గా తన
హోదాను తగ్గించుకోవడమే అవుతుందని, వాటిని తాను లెక్కపెట్టనని ఘాటుగా చెప్పేవారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన
శారదా ముఖర్జీ తన పదవీ కాలంలో తన అధ్యక్షతన చేతన అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు
చేశారు. కుముద్ బెన్ జోషి ఈ సంస్థకు మరిన్ని జవసత్వాలు కల్పించడమే కాకుండా, నీసా
అనే మరో సంస్థను నెలకొల్పారు. అచేతనావస్థలో ఉన్న రెడ్ క్రాస్ సంస్థకు కొత్త ఊపిరి
పోశారు. చేతన ఆధ్వర్యంలో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న జోగినీ
వ్యవస్థను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేశారు. కొన్ని జోగినీ జంటలను రాజ్ భవన్
కు ఆహ్వానించి దర్బారు హాలులో ఆ జంటలకు పెళ్ళిళ్ళు చేశారు. రాజ్ భవన్ లో సాగుతున్న
ఈ కార్యక్రమాల పట్ల నాటి మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రకంపనలు
సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు నడుమ అగాధాన్ని మరింత పెంచింది.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పదవిని దుర్వినియోగం
చేసిన వ్యక్తిగా రాం లాల్ ముద్ర వేయించుకుంటే, కుముద్ బెన్ వివాదాస్పద గవర్నర్ గా పేరు
తెచ్చుకున్నారు.
ఆవిడ చేసిన ప్రయత్నాల ఫలితం అని చెప్పలేము. కాని
తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని ఓడించి అధికారానికి రావడం కాకతాళీయం కావచ్చు.
తోకటపా:
గవర్నర్ కు ముఖ్యమంత్రికి అసలు పొసగదని, నిప్పులో ఉప్పు బాపతు అని జనం బాహాటంగా చెప్పుకుంటున్న సమయంలో జరిగిన
సంఘటన ఇది. నగరం నుంచి గండి పేటకు పోయే దారిలో గవర్నర్ తన అధ్యక్షతన ఉన్న స్వచ్చంద సంస్థల భూమిలో ఒక వృద్ధాశ్రమం
కట్టాలని తలపెట్టారు. దానికి సరైన తెలుగు పేరు సూచించాలని గవర్నర్ అడిగిన వ్యక్తి
ఎవరో తెలుసా! సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. బదులుగా ఎన్టీఆర్ సూచించిన పేరు ఏమిటో తెలుసా! వయోధిక ఆశ్రమం.
(16-03-2022)
16, మార్చి 2022, బుధవారం
మరు క్షణం మనది కాదు – భండారు శ్రీనివాసరావు
క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా
నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
అని నిర్మల్ అక్కరాజు పోస్టు పెడితే ఒకరు ఏమిటి ఈ వైరాగ్యం అన్నారు.
నిజానికి నిర్మల్ కొటేషన్ కరక్టే.
అందుకు ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యం,
బుధవారం
చాలా కలతగా గడిచింది. మొన్న నా పోస్టుకు వివరంగా చక్కటి కామెంటు పెట్టిన సి.హెచ్.
కృష్ణ గారు, నేను
ఆ కామెంటు చూసిన కాసేపటికే ఈ లోకం విడిచి వెళ్ళారు. సాయంత్రం అవుతూనే మరో
దుర్వార్త. మిత్రుడు పాత్రికేయ సహచరుడు విద్యారణ్య గుండె పోటుతో మరణించాడు. చావు
అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా ఆవిడ మరణం. ఆలోచనలు అన్నీ అటు మళ్లాయి.
ఇదెలా
ఉండగానే మితృలు ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. అవీ ఇవీ మాట్లాడుతూ వారికి
బాగా పరిచయం వున్న, మంచి మనసున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడని చెప్పారు. స్కూటరు మీద ఇంటికి
తిరిగొచ్చిన ఆ నలభయ్ ఏళ్ళ మనిషి స్కూటర్ స్టాండ్ వేస్తూ ఓ పక్కకి ఒరిగిపోయాడు.
ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఫలితం దక్కలేదు. తీసుకురావడానికి ముందే ప్రాణం పోయిందన్న చావు కబురు చెవిన వేశారు. ఎంతో
జీవితం ముందున్న మనిషి ముందే పోయాడు.
వాళ్ళ కాలనీలో ఓ బాలాజీ దేవాలయం వుంది. ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవేరి సహిత దేవదేవుడిని కాలనీలో ఊరేగిస్తూ రావడం ఆనవాయితీ. ఇంటిముందు నిలబడిన పల్లకీలోని దేవదంపతులకు హారతి ఇవ్వడం కృష్ణారావు దంపతుల ఆనవాయితీ. కానీ విధిగా రావాల్సిన ఊరేగింపు రాలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్లి గుళ్ళో పూజారిని ఆరా తీశారు. ఆ గుడికి అధికారికంగా ధర్మకర్త కాకపోయినా సర్వం తన భుజాలకు ఎత్తుకుని అన్ని కార్యక్రమాలు చక్కబెట్టే ఓ పుణ్యాత్ముడు తన తొంభయ్ రెండో ఏట మరణించాడు. అమెరికాలో ఉంటున్న ఆయన పిల్లలు తండ్రికి అనారోగ్యం అని తెలిసి రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలారు. పిల్లల్ని చూసిసరికి పెద్దాయన కొంత తేరుకున్నాడు. తేరుకున్నాడని అనుకుని, ముందు నుంచి ఆయన్ని కనిపెట్టుకుని చూస్తున్న సహాయకుడికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి చేరారో లేదో ఇక్కడ ఈయన ప్రాణం పోయింది.
కింది ఫోటో:
నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయిని ఇంటర్వ్యూ చేస్తున్న పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జరిగిన గొడవ ఏమిటి?
ప్రెస్
క్లబ్ ఎన్నికల్లో ఏం జరిగింది?
“క్లబ్
ఎన్నికలు జరిగిన తీరుపై సాయంత్రం చర్చ పెడుతున్నాను. నువ్వు తప్పకుండా రావాలి” నిన్న
ఫోన్లో చెప్పాడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్.
“నీ
జర్నలిష్ట్ డైరీలో ఈ పేజీ అవసరమా! చర్చించి ఏం చేయగలం చెప్పు” అన్నది నా వెనువెంట
సమాధానం.
సతీష్
సామాన్యుడు కాదు. సాధారణంగా ప్రెస్ వారిని దగ్గరకు తీయని నందమూరి తారక రామారావు
వంటి మహానుభావుడినే చెప్పి ఒప్పించి ధర్మపీఠం మీద కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం
కురిపించిన ఘనుడు. పైగా గురుపుత్రుడు. సీనియర్
పాత్రికేయులు వీ. హనుమంత రావు గారి తనయుడు.
ఇక
నేనెంత?
సతీష్
పిలుపు ప్రకారమే వెళ్లాను. నేను చెప్పాల్సింది, చెప్పాలని అనుకున్నదే చెప్పేసి వచ్చేశాను.
అదన్న
మాట ఈ కింది వీడియో లింక్. కొద్దిసేపటి క్రితం సతీష్ పంపాడు.
నాతోపాటు
పాల్గొన్నది జర్నలిష్టుల సంఘం జాతీయ నాయకుడు కె. శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంటుగా పోటీ చేసిన పాత్రికేయ
సహచరుడు సతీష్ కమాల్.
LINK:
https://youtu.be/96Ox2xIGmHg
(16-03-2022)
15, మార్చి 2022, మంగళవారం
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు
ఈసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. టీవీ ఛానల్స్ లో చర్చలు మినహాయిస్తే ఈ ఎన్నికలు ఇటీవల జరిగిన సినిమా వాళ్ళ ‘మా’ ఎన్నికలను తలపించాయి. ఫేస్ బుక్ వేదికగా సాగిన ప్రచారం చూస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనే సందేహం కలిగింది. ఇది ఓట్ల లెక్కింపు రోజున తీరింది కూడా. ఆ గందరగోళానికి ఎవరిది తప్పు అని నిర్దారించడం నా ఉద్దేశ్యం కాదు. ఈ స్థాయిలో ప్రచారం జరిగినప్పుడు ఓ స్థాయిలో ఉద్రేకాలు ప్రబలడంలో ఆశ్చర్యం లేదు. కానీ నలుగురికీ సుద్దులు చెప్పాల్సిన ఫోర్త్ ఎస్టేట్ గురించి ఫేస్ బుక్ లో వెలువడుతున్న వ్యాఖ్యలు గమనించినప్పుడు మనసు ఉసూరుమనిపించకమానదు.
గతంలో నేను ఒకసారి
క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. మరోసారి ఓడిపోయాను.
గెలిపించింది నా
క్లబ్ కుటుంబసభ్యులే. ఓడించింది ఆ కుటుంబ సభ్యులే.
కాబట్టి ఆ జయాపజయాలను నేను ప్రతిష్టగా తీసుకోలేదు. హాయిగా అప్పుడప్పుడూ క్లబ్ కి వెళ్లి వస్తూనే వున్నాను. అందర్నీ పలకరిస్తున్నాను. వాళ్ళూ నేనంటే అంతే
ఆప్యాయంగా, కొండొకచో గౌరవంగా కూడా వుంటున్నారు.
కావున నా మనవి, నా సలహా ఏమిటంటే
అందరూ కలిసివుండండి. అందర్నీ కలుపుకు పొండి.
పదవుల్లో ఎవరు వున్నా క్లబ్ అందరిదీ అనుకుంటే నాలుగు మంచి పనులు చేసి చూపించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది.
జర్నలిష్టులకు
వృత్తి రీత్యా రాజకీయవాసనలు తప్పనిసరి. వాటిని క్లబ్ బయటే ఒదిలి లోపలకి వస్తే ఏ
చిక్కూ ఉండదు.
గొప్ప క్లబ్ లో
సభ్యులం అని నలుగురూ చెప్పుకుంటుంటే వినాలని కోరుకుందాం. ఆ గొప్పతనంలో
వున్న మధురిమను అందరం ఆస్వాదిద్దాం.
హైదరాబాద్ ప్రెస్
క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. (అధికారికంగా ఇంకా ప్రకటించినట్టు లేదు) కొత్త కార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు.
ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు.
మంచి పనులు
చేయడానికి మంచి అవకాశం వచ్చింది. అవి చేసి మరిన్ని అభినందనలు అందుకోండి.
అలాగే గెలవని
వారికి శుభాకాంక్షలు. ఇవే చివరి ఎన్నికలు కావుకదా! లైట్ గా తీసుకోండి.
(15-03-2022)