6, మార్చి 2022, ఆదివారం

హక్కులు సరే! మరి బాధ్యతలు! - భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRA PRABHA on 06-03 -2022, SUNDAY)

రేపు ఏడో తేదీ సోమవారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసన సభ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.

సమావేశాల్ల్లో ఏం జరుగుతుంది, అవి సజావుగా సాగుతాయా అనేవి  ప్రజాస్వామ్య ప్రియులను కలచివేస్తున్న ప్రశ్నలు.

పద్దతిగా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పడానికి గత అనుభవాలు చాలు.

మరి పరిష్కారం ఏమిటి? వుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  శాసనసభ ప్రాంగణంలో సభ్యులకోసం అత్యంత విలువైన గ్రంధాలయం వుంది. ఇప్పటి సంగతి తెలవదు.  నేను విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో కదాచిత్ గా ఆ గ్రంధాలయంలోకి అడుగుపెడుతూ ఉండేవాడిని. శ్రీయుతులు తెన్నేటి విశ్వనాధం, వావిలాల గోపాలకృష్ణయ్య,  పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు,  బోడేపూడి వెంకటేశ్వరరావు, వెంకయ్యనాయుడు,  ఎస్.జైపాల్  రెడ్డి, సీ హెచ్ విద్యాసాగర్ రావు వంటి ఉద్దండులయిన ప్రజాప్రతినిధులు ఆ గ్రంధాలయాన్ని ఉపయోగించుకుంటూ వుండడం నాకు తెలుసు. ఇప్పటి శాసన సభ్యులు, ముఖ్యంగా తొలిసారి సభలో అడుగుపెట్టిన వారు ఈ లైబ్రరీకి వెళ్లి వెనుకటి కాలంలో సభ ఎలా నడిచేది అన్న విషయంపై అవగాహన పెంచుకోగలిగితే అసలు సమస్య దూదిపింజలా ఎగిరిపోయే అవకాశం ఎక్కువ. కానీ వారికి అంతటి తీరికా ఓపికా వుంటాయా అంటే నాకు అనుమానం కూడా ఎక్కువే.

శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు వాటిని సజావుగా నిర్వహించడానికి కొన్ని నిర్దేశిత నియమ నిబంధనలు వుంటాయి. వాటిని గురించి కొత్త సభ్యులకు, పాతవారికి కూడా పూర్తి సమాచారం అందిస్తారు. సభలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఇలా అన్ని విషయాలపై సభ్యులకు వివరాలు అందచేస్తారు. పాలక ప్రతిపక్షాలు వీటిని తుచ తప్పకుండా పాటిస్తే పేచీయే లేదు. ఇలాటి వ్యాసాల అవసరమూ వుండదు. గతాన్ని తవ్వితీయడంలో చూపిస్తున్న శ్రద్ధాసక్తులు, గతంలోని మంచిని గ్రహించడంలో ప్రదర్శిస్తే వర్తమానం ఇంతటి బాధాకరంగా వుండదు. భవిష్యత్తు గురించి బెంబేలు పడాల్సిన పరిస్తితి ఉత్పన్నం కాదు.

జనతా ప్రభుత్వం నాటి ఒక ఉదంతాన్ని గుర్తుచేసుకుందాం. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. జార్జ్ ఫెర్నాండెజ్ ఆయన మంత్రివర్గంలో సభ్యుడు. ఆయన ఓ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశించి ‘ఆవిడ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు’ (She is a perennial liar') అని దురుసుగా వ్యాఖ్యానించారు. దానిపై దుమారం రేగింది. అభ్యంతర పెట్టింది కూడా ప్రధానమంత్రి కావడం విశేషం. 'ఉన్నమాటే చెప్పాను' అంటారు ఫెర్నాండెజ్. 'అయినా కానీ, అలా అని వుండాల్సింది కాదు. కాదూ కూడదు, అనాలని అనిపిస్తే, ఆవిడ చాలా అరుదుగా నిజం చెబుతారు’ (She seldom tells truth) అనాలి' అంటూ సభామర్యాదను బోధించారు మొరార్జీ.

అలాగే ఒకానొక రోజుల్లో, శాసనసభ నడిచే తీరుతెన్నులు ఎలా వుండేవో తెలుసుకోవడానికి కొన్ని మచ్చు తునకలు:

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, ఒక సందర్భంలో ప్రతిపక్ష కమ్యూనిస్ట్ సభ్యులు శాసన సభ నుంచి వాకవుట్ చేస్తేనే ఎంతగానో మధన పడ్డారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగం అసెంబ్లీ లైబ్రరీ రికార్డులలో పదిలంగా వుంది.

1959 ఆగస్టు ఒకటో తేదీన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించారు.

"చర్చ ఇంత సవ్యంగా జరుగుతున్న ఈ తరుణంలో తలవని తలంపుగా దేశంలో ఎక్కడో జరిగిన ఒక చర్యకు నిరసనగా మిత్రులు సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలా విచారకరం. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. కాంగ్రెసు వారు నాలుగు సీట్లు కూడా గెలవరని అనుకున్నారు. కానీ ఎంతో మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఒకసారి ఒక పార్టీ, మరొకసారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది ఈనాటి ధర్మం కాదు. వేదకాలం నుంచి వస్తోంది. పాతకాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా రెండు పక్షాలు గెలవ్వు. ఎవరో ఒకరే గెలుస్తారు. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు. 'రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే' అని. అందువల్ల ప్రతిపక్షం ఇక్కడ లేకపోయినా నేను వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ ప్రశాంతతను కాపాడుకోవాలి. ప్రశాంత వాతావరణం వుందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. దానికి క్రెడిట్ ప్రభుత్వానిది కాదు, పోలీసులదీ కాదు, ఆ క్రెడిట్ ప్రతిపక్షానిది అని వెంకటేశ్వర్లు గారు చెప్పారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. అప్పోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కల్సి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం వున్నాయి."

 

ఆంద్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత ఏర్పడ్డ తొలి శాసన సభకు తొట్టతొలి స్పీకర్ గా కాంగ్రెస్ కురువృద్ధుడు అయ్యదేవర కాళేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1956 నవంబర్ నాలుగో తేదీన ఆయన స్పీకర్ గా మొదటి ప్రసంగం చేసారు.

"మీరందరూ ఈ సభాద్యక్ష స్థానాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు. మీరందరూ ఇష్టపడినట్టయితే, మీ అందరి అనుమతితో ఒక పని చేయదలచుకున్నాను. స్పీకర్ బల్ల మీద వున్న ఈ వెండి దండాన్ని తీసివేస్తాను. ఈ వెండి దండం భూస్వామ్య వ్యవస్థకు, రాచరికానికి గుర్తు. ప్రజాస్వామ్యంలో దీనికి స్థానం లేదు."

1959 ఆగష్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, గవర్నర్ ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు అంశాలవారీగా సమాధానం చెప్పారు.

"ఎవరూ చెప్పని ఒక విషయం బాగారెడ్డి గారు చెప్పారు. మిగిలినవారికి ధైర్యం లేక చెప్పలేదని నా ఉద్దేశ్యం. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏమంటే ఏమో, న్యాయం అని తోచినప్పుడు కూడా పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చే మొత్తం (ఆదాయంలో) యాభయ్ శాతం వాళ్ళ సాలరీల కింద ఇస్తున్నారు. వాట్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్? ఒక్క శాతం. పన్నులు కడుతున్న రైతాంగానికి, పల్లెటూరివారికి తెలియదు కానీ, తెలిస్తే ముఖ్యమంత్రి మొదలుకుని కింది వరకు రాళ్ళతో కొడతారు. 330 లక్షలమంది ప్రజానీకం రాష్ట్రంలో వుంటే, ఒక లక్షమందో, రెండు లక్షలమందో చదువుకున్నవాళ్ళమని మనం అనుకుని, వచ్చే రాబడిలో సగం మొత్తాన్ని వాళ్ళకే  పంచేసుకుంటూ వుంటే బాగుంటుందా!  ఎవరేమి అడిగినా డబ్బు లేదంటాము. కాలువ రిపేరు చేయమంటే డబ్బు లేదంటాము. విద్యుచ్చక్తి ఇవ్వవయ్యా అంటే డబ్బు లేదంటాము. శ్రీ రామాచార్యులు గారు ధర్మల్ స్టేషన్ పెట్టండి, రాయదుర్గం నుండి లైను వేస్తె ఎన్నో ఊర్లకి కరెంటు వస్తుంది అని అడిగితే అలాట్ మెంటు లేదని సమాధానం చెబుతాము. పాపం ప్రజలకి తెలియడం లేదు. అమాయకులుగా వున్నారు. చదువు సంధ్యలు లేవు. వారికి లక్ష అంటే ఏమిటో, కోటి అంటే ఏమిటో తెలియదు. వాళ్లకి మన గురించి అసలు నిజాలు తెలిస్తే మనల్ని బయటకు పంపుతారు. 'మీరూ వద్దు, మీ రాజ్యమూ వద్దు, మీ గుమాస్తాలు వద్దు. బాబూ మమ్మల్ని విడిచిపెట్టండి, మా బతుకు మేము బతుకుతాము' అంటారు. ఆ పచ్చి నిజాన్ని బాగారెడ్డి గారు చెప్పినందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను"

 

ఇది ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రసంగం అంటే నమ్మడం సాధ్యమా! ఒక ప్రతిపక్షనేత కూడా ఈ విధంగా నిజాలు మాట్లాడడానికి సాహసించడని అనుకునే రోజులివి.

కాబట్టి నేతలూ, గతం ఎలా ఉండేదో, ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించేవారో తెలుసుకోవడానికి ఒక్కసారి అసెంబ్లీ లోని  గ్రంధాలయానికి వెళ్ళండి. 'కాదు, ఇలానే వాద ప్రతివాదాలతో సమయం గడుపుతాము, రాజకీయాలతోనే పొద్దు పుచ్చుతాము'  అంటే ఎవరూ చేయగలిగింది ఇప్పట్లో ఏమీ లేదు. సర్వం తెలిసినవాళ్ళనీ, సర్వజన సంక్షేమం కనిపెట్టి చూస్తారని ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధులుగా శాసనసభలోకి పంపారు. శాసన కర్తలుగా మీకు ఎన్నో హక్కులు వున్నాయి. అదే సమయంలో బాధ్యతలు కూడా అంతే వున్నాయి. హక్కులు గుర్తున్నవారు బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి రోజూ అసెంబ్లీలో జరిగేది చూస్తున్నప్పుడు, నిష్టురమైన ఈ నిజాన్ని చెప్పక తప్పని రోజులు వచ్చాయనిపిస్తోంది.



(06-03-2022)

 

5, మార్చి 2022, శనివారం

లాభనష్టాలు - భండారు శ్రీనివాసరావు


'ప్రతి రోజూ ప్రార్ధన చేస్తుంటావు. పాతికేళ్ళుగా చూస్తున్నా నీ వరస. ఇలా దేవుడ్ని ప్రార్ధిస్తూ వున్నందువల్ల నీకు దక్కింది ఏమిటి? కొత్తగా పొందింది ఏమిటి? ఒక్కటంటే ఒక్కటి చెప్పు?'

'నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే! ప్రార్ధన చేస్తూ నేను పొందింది ఏమీ లేదు. సంపాదించుకున్నదీ ఏమీ లేదు. కాకపొతే ప్రార్ధనలతో నేను చాలా చాలా పోగొట్టుకున్నాను. గతంలో నాకున్న గర్వం, ఈర్ష్యా, అసూయా, మొండితనం, లోభితనం ఇవన్నీ పోయాయి. ఇప్పుడు చెప్పు, నేను సంపాదించుకున్నట్టా! పోగొట్టుకున్నట్టా!

4, మార్చి 2022, శుక్రవారం

మగువ ధైర్యం – భండారు శ్రీనివాసరావు

 ఆ దంపతులది దిగువ మధ్యతరగతి నేపధ్యం. ఇరువురి తలితండ్రులు కష్టపడి చదివించారు. ఇద్దరూ కష్టపడి చదివారు. బీ టెక్ కాగానే అమెరికా అవకాశం తోసుకువచ్చింది. తమకూ, తమని కనిపెంచిన వారికీ కష్టాలు తీరే రోజులు వచ్చాయని అనుకున్నారు.

భర్తకు ఉద్యోగం. భార్య ఇంటి పనులు. పదేళ్ళ కాపురానికి గుర్తుగా చక్కటి పండంటి అమ్మాయి, ఓ అబ్బాయి. సంపాదనకు తగ్గట్టుగా అమెరికాలో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు. ఇండియాలోని తలితండ్రులకు అతడొక్కడే ఆధారం. ప్రతినెలా అతడు పంపే డబ్బులతోనే ఇల్లు గడిచే పరిస్తితి. ఏ కొరతా లేకుండా చూసుకునే కొడుకు. అదేమిటి అని అభ్యంతర పెట్టకుండా అత్తమామలను సొంత తలితండ్రులుగా చూసుకునే కోడలు. ఆ ముసలి ప్రాణాలకు ఇంకేమి కావాలి.

రేపోమాపో నలభయ్యవ పడిలో పడబోతున్న అతడికి ఆరోగ్యం మీద జాగ్రత్త జాస్తి. ఇంట్లోనే జిమ్.

ఆ రోజు, వారి జీవితాలను అతలాకుతలం చేసిన రోజు. ఎప్పటిమాదిరిగానే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. వాళ్ళు గుడ్ నైట్ చెప్పి తమ పడక గదిలోకి వెళ్ళిపోయారు. టీవీ చూస్తూ మధ్యలో లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. తిరిగి బయటకు రావడం బాగా ఆలస్యం కావడంతో భార్య తలుపు తట్టింది. లోపల నుంచి ఏ జవాబు లేదు. గట్టిగా బలం కొద్దీ నెట్టి చూస్తే ఏముంది. అతడు గోడకు ఆనుకుని అచేతనంగా కనిపించాడు.

చదువుకున్న, తెలివిగల అమ్మాయి కాబట్టి వెంటనే మనసు ఉగ్గబట్టుకుని ఎమర్జెన్సీకి ఫోన్ చేసింది. పిల్లల్ని లేపి పొరుగు వారికి అప్పగించింది. అంబులెన్స్ వచ్చేలోగా తనకున్న పరిజ్ఞానంతో భర్తకు సీపీఆర్ ( Carrdio – Pulmonary Resuscitation గుండెల మీద గట్టిగా నొక్కుతూ, నోటిద్వారా గాలిని పంపడం) ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత అతడిలో కదలిక మొదలయింది. ఈ లోగా డాక్టర్లు వచ్చారు. సకాలం(అమృత ఘడియలు, ఇంగ్లీష్ లో గోల్డెన్ అవర్స్ అంటారుట) లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అంటూ ఆమెని అభినందించారు. రెండు రోజులు ఆసుపత్రిలో వుంచి డిశ్చార్జ్ చేశారు.

కొడుకు ప్రాణాలు కాపాడిన కోడలిని ఇండియాలోని అత్తామామలు ప్రశంసలతో ముంచెత్తారు.

అమెరికాలో ఉంటున్న మా పిల్లలు ఒకసారి ఫోనులో చెప్పిన సంగతులు ఇవి.

    

ఎదిగిన కొద్దీ - భండారు శ్రీనివాసరావు

 

మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”

కౌంటర్ లోని వ్యక్తి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-

ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.

భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.

అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.

ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.

గౌరవం హోదాకే ప్రతిభకు కాదు – భండారు శ్రీనివాసరావు

 


చిన్నప్పుడు స్కూళ్ళల్లో మోరల్ క్లాస్ అని ఓ పీరియడ్ వుండేది. వారానికి ఒకటో రెండో తరగతులు.
నీతి కధలు, నీతి పాఠాలు బోధించేవాళ్లు.

ఆ రోజుల్లో విన్న కధ ఒకటి జ్ఞాపకం వుంది. ఓ పేద బ్రాహ్మణుడు. వేదవేదాంగాలు చదివాడు. తగిన గుర్తింపు లేకపోగా మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడ్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
పొరుగూళ్ళో పండిత సత్కారం జరుగుతోందని తెలిసి వెడతాడు. మాసిన దుస్తులతో ఉన్న అతడ్ని లోపలకు పోకుండా అడ్డుకుంటారు.
ఇలా పని కాదనుకుని తెలిసిన వారి ఇంటి నుంచి కొత్త బట్టలు అడిగి తీసుకుని వాటిని ధరించి వెడితే అతడికి ప్రవేశం సులభంగా దొరుకుతుంది. అతడి పాండిత్యానికి అక్కడివారు ముగ్ధులు అవుతారు. భోజనాలు చేసేటప్పుడు అడిగి అడిగి మరీ లడ్డూలు వగైరా వడ్డిస్తుంటారు. అతడు వాటిని చేతిలోకి తీసుకుని తను ధరించిన వస్త్రాలకు తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడి వాళ్లకి అతడి ప్రవర్తన విచిత్రంగా అనిపించి అతడినే కారణం అడుగుతారు.
“మీరు నాకిచ్చిన గౌరవం నా పాండిత్యానికి కాదు, నేను ధరించిన ఈ దుస్తులకి. కాబట్టి వాటికి తినిపించే ప్రయత్నం చేస్తున్నాను” అని బదులిస్తాడు. దానితో అందరికీ కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
స్థూలంగా ఇదీ కధ.
ఓసారి కారులో వెడుతున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెప్పిన కొన్ని విషయాలు విన్నప్పుడు, చిన్నప్పుడు విన్న ఈ నీతి కధ గుర్తుకు వచ్చింది.

మా అన్నయ్య చెన్నై లో స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు, ఆయనకంటే ముందు అదే హోదాలో అదే బ్యాంకులో పనిచేసిన అధికారి ఒకరు రిటైర్ అయిన తర్వాత చెన్నై వచ్చి, చూసిపోదామని మా అన్నయ్య ఇంటికి వచ్చారట. బ్యాంకు టైం కావడంతో ఆ రిటైర్డ్ అధికారిని కూడా వెంటబెట్టుకుని ఆఫీసుకు తీసుకు వెళ్ళారు. సీజీఎం వస్తున్నారు అని తెలియగానే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయి లిఫ్ట్ ఆపి, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం కొందరు సిబ్బంది వెయిట్ చేస్తూ వుండడం ఆనవాయితీ. లిఫ్ట్ లో వెడుతున్నప్పుడు తన వెంట వచ్చిన రిటైర్డ్ అధికారిని ఎవరూ గుర్తించక పోవడం మా అన్నగారికి విచిత్రంగాను, బాధగాను అనిపించింది. కొన్నేళ్ళ క్రితం ఇదే ఉద్యోగం ఆయన చేశారు. తనకు జరిగిన మర్యాదలే ఆ రోజుల్లో ఆయనకు జరిగివుంటాయి. ఇప్పుడు ఆయన పదవిలో లేరు. పదవినిబట్టి, హోదాను బట్టి అందుకునే మర్యాదలు చాలా తాత్కాలికం అని మా అన్నగారికి అనిపించిందట.
నిజమే అనిపించింది.

2, మార్చి 2022, బుధవారం

రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా? – భండారు శ్రీనివాసరావు

(మూడేళ్ల నాటి ముచ్చట)


“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య రావడం లేదు. అది వేరే సంగతి”

మహా టీవీ వాళ్ళు ఓలా క్యాబ్ బుక్ చేసినప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్.
మూతికి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకుని చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.

“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.

ఇంతకీ ఇతగాడు పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.

“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.

“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”

జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు.
నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.

1, మార్చి 2022, మంగళవారం

రాజకీయ చెణుకులు – భండారు శ్రీనివాసరావు


ప్రస్తుతం రాజకీయ నాయకులు విసురుకుంటున్న విమర్శనాస్త్రాల్లో ‘వినకూడని మాటలు’ వినబడుతున్నాయి. గతంలో ఈ విసుర్లు ఎలా ఉండేవో చెప్పడానికే ఈ ప్రయత్నం.
రాజకీయాల్లో వుండేవాళ్ళల్లో కూడా హాస్యపు పాలు ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో అది తక్కువైపోతూ అసహనపు పాలు ఎక్కువవుతోంది. కొన్ని పాత ముచ్చట్లు గుర్తు చేసుకుందాం.

లోక్ సభలో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి చర్చ నడుస్తోంది.
ఒక ప్రతిపక్ష సభ్యుడు ఇలా అన్నారు.
“మన దేశంలో తయారయ్యే మోటారు కారులో శబ్దం చేయని భాగం ఏదైనా ఉన్నదంటే అది కారు హారన్ మాత్రమే”

సరోజినీనాయుడు మహాత్మా గాంధీ గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
“ఈ గాంధీగారి నిరాడంబరత్వం ఏమో కానీ ఆయన్ని ఇలా సాదాసీదాగా వుంచడానికి మనం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన గారు ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!”
సర్దార్ పటేల్ ని కూడా ఆమె వదిలి పెట్టలేదు.
“ ఈ ఉక్కు మనిషికి అగ్రికల్చర్ తప్ప అసలు కల్చర్ అంటే ఎంతమాత్రం తెలియదు”

ప్రతిపక్ష సభ్యుడు పిలూ మోడీ మంచి హాస్య చతురత కలవాడు. భారీ కాయానికి తగ్గట్టే హాస్యం కూడా అదే మోతాదులో వుండేది. ఆ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ, ఏ సమస్య వచ్చినా, మొండిగా దాన్ని అమెరికా గూఢచారిసంస్థ సీఐఏ తో ముడిపెట్టి మాట్లాడుతూ వుండేవారు. అది విని వినీ చిర్రెత్తుకొచ్చిన పిలూ మోడీ “నేను సీఐఏ ఏజంటును’ అని రాసి వున్న బ్యాడ్జీని ఇందిరాగాంధీకి కనిపించేలా తన చొక్కాకు తగిలించుకుని సభకు వచ్చి అందర్నీ నివ్వెర పరిచారు.

1950 ప్రాంతాల్లో పీ. గోవింద మీనన్ ట్రావెన్ కూర్, కొచిన్ రాష్ట్రానికి (తరువాత కేరళ రాష్ట్రంగా పేరు మారింది) ముఖ్యమంత్రి. టీ.వీ.థామస్ ప్రతిపక్ష నాయకుడు.
తను కూర్చున్న స్థానాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. “నా ఈ (ముఖ్యమంత్రి) కుర్చీలో కూర్చోవడానికి ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్రుత పడుతున్నారు. అది ఆయనకు ఈ జన్మలో సాధ్యం అయ్యేపని కాదని నేను చెప్పదలచుకున్నాను. ఈ కుర్చీ ఎక్కాలంటే ఆయన మళ్ళీ మనిషి పుటక కాదు, నల్లి జన్మ ఎత్తాలి.”

బ్రిటిష్ ప్రధానిగా రామ్సే మెక్ డోనాల్డ్ కి మెతక మనిషి అనే పేరు. ప్రతిపక్షంలో వున్న విన్ స్టన్ చర్చిల్ ఆయన్ని గురించి ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
"ఈ మెక్ డోనాల్డ్ ఎలాటి వాడంటే గొర్రె తోలు కప్పుకున్న మరో గొర్రె”

1978 లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు వ్యాఖ్య చేసారు.
'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'
ఈ వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.
పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగిన పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.

తోకతపా:
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.