6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నాయకుల 'అదృశ్యాలు', మీడియా ఊహాగానాలు - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఆదివారం 06-02-2022 ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)


కొన్ని విషయాలు జరిగినప్పుడు చిత్రంగా తోస్తాయి. కొంతకాలం గడిచిన తర్వాత కూడా వాటిని తలచుకుంటే బహు విచిత్రంగా అనిపిస్తాయి. ఇలాంటి ఘటనలు చరిత్రలో ఎన్నో కనబడతాయి. మరీ క్రీస్తు పూర్వం నాటివి కూడా కాదు సుమా!
నిత్యం మీడియాలో తమ మొహం కనబడాలని చాలామంది రాజకీయ నాయకులు అనుకోవడం కద్దు. వాళ్ళు అలా ఏ ఒక్క రోజు మీడియాలో కనబడకపోయినా, మీడియాకు అదే ఒక వార్తగా మారి సంచలనం కావడం కూడా కొత్తేమీ కాదు.
ఏడేళ్ల కిందట అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ, ఎవరితో చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయారని ఓ వార్త గుప్పుమంది. అలిగివెళ్ళారని కొన్ని వార్తలు చెబుతుంటే, ఏకంగా హిమాలయాలకు వెళ్ళారని మరికొన్ని వదంతులు వెల్లువెత్తాయి.
అలిగి వెళ్ళిన మాట నిజం కాకపోవచ్చు. హిమాలయాలకు వెళ్ళిన మాటలో కూడా వాస్తవం లేకపోవచ్చు. కానీ కనబడకుండా వెళ్ళిన మాట నిజం. రోజుల తరబడి ఆయన ఎవ్వరికీ దర్శనం ఇవ్వని మాటా నిజం. పైగా అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఏ ఒక్క రోజు కూడా చట్టసభ గుమ్మం తొక్కిన జాడలేదు. కనబడకుండా పోయిన ఈ యువనేత గురించి ట్విట్టర్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమే సంగతులు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇదొక చిత్రం.

రాహుల్ గాంధీ అనామకుడు కాదు. ఆయన్ని గురించి తెలిసిన వారు ఎక్కువ. గుర్తు పట్టడం అతి సులభం. పటిష్టమైన వ్యక్తిగత భద్రత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా క్షణాలమీద బందోబస్తు ఏర్పాట్లు జరిగిపోతాయి. చుట్టూ అంగరక్షకులు నిరంతరం కాపలాగా వుంటారు. వారి చేతుల్లోని వాకీటాకీలు రాహుల్ రాకపోకల్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటాయి. గతంలో టీవీల్లో రాహుల్ భద్రతాఏర్పాట్లు చూసిన వారికి రాహుల్ అదృశ్యం వార్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన అంగరక్షకులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కనబడకుండా పోయిన ఈ యువనేత తనని కంటికి రెప్పలా కాపాడాల్సిన కాపలాదారులని కూడా వెంటబెట్టుకు పోయాడా లేదా తెలియదు. వాళ్ళు వెంట వుంటే ఆచూకీ కనుక్కోవడం అంత కష్టమైన పనికాదే! రాహుల్ అదృశ్యం గురించి రకరకాల వ్యాఖ్యానాలు మాత్రం అనుదినం మీడియాలో వచ్చాయి. సోషల్ మీడియా సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ఆనుపానులు కనుక్కోవాలంటే పోలీసులకు నిమిషాల్లో పని. మీడియాకు కూడా ఇదేమంత కష్టమైన పనికాదు. అయినా కానీ, అదృశ్యం గురించిన వ్యాఖ్యానాలు, మాట విరుపులతో కూడిన సమాచారమే కాని రవంత అదనంగా ఎవ్వరూ ఏ వివరాలు ఇవ్వని పరిస్తితి. ఒక మాజీ ప్రధాన మంత్రి కుమారుడు ఏకంగా కొన్ని రోజులపాటు కనబడకుండా పొతే ఇదా పరిస్తితి అనుకోవాల్సివచ్చింది. ఇదొక చిత్రం అన్నది అందుకే.

సరే! రాహుల్ గాంధి కనబడడం లేదు. ఇంట్లో లేరు. బయట లేరు. ఆయన కనబడడం లేదని ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి కాబట్టి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారించడం ఆ రోజుల్లో మరో సంచలన వార్త అయింది. వెళ్ళిన పోలీసులు 'అదృశ్యం' గురించి వాకబు చేశారంటే అదీ లేదు. వెళ్లి ఎలాటి సమాచారం అడిగారో తెలుసా! అది మరీ చిత్రం.
'రాహుల్ యెంత ఎత్తు ఉంటాడు? కళ్ళ రంగు ఏమిటి? కాలిజోడు కొలతలు ఏమిటి?'

రాజకీయాల్లో సీరియస్ నెస్ తగ్గించడం కోసం ఇలా కాస్త హ్యూమరసం వొలకబోశారేమో అని అప్పుడు జనాలు అనుకున్నారు. ఇది కొత్తేమీ కాదని, 1991 లో తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఎన్నికల సభలో శ్రీలంక ఉగ్రవాది మానవబాంబుగా మారి రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న దుర్ఘటనలో, ఆ పేలుడు ధాటికి యువ గాంధీ శరీరం తునాతునకలు అయినప్పుడు, 'రాజీవ్' ఆనాడు ధరించిన కాలిజోడు సాయంతోనే ఆయన ఆనవాళ్ళు పోల్చుకున్న 'చరిత్ర'ను ఆనాడు ఓ కేంద్ర మంత్రి గుర్తు చేయడం ఈ యావత్ 'ఎపిసోడు'కి కొసమెరుపు. ఇది మరింత చిత్రంగా లేదూ.
ఇంతకీ రాహుల్ ఎక్కడ వున్నట్టు? ఎక్కడికి వెళ్లినట్టు? ట్వీట్ చేయగలగాలంటే అది కారడవుల్లోనో, హిమాలయ సానువుల్లోనో కుదిరేపని కాదు. ట్వీట్ ఆధారంతో ఆయన ఆనుపానులు కనుక్కోలేనివేమీ కావు. అయినా, సరే ఆచూకీ తప్ప ఆయన గురించిన అన్ని విషయాలు మీడియాలో వచ్చాయి. చిత్రం అని అన్నది ఇందుకే.
సరే! ఇదేదో మన దేశానికి మాత్రమే ప్రత్యేకం అని అనుకోవడానికి వీల్లేకుండా సరిగ్గా ఆ సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాడలేకుండా పోయారు. ఆయనేమీ చిన్నా చితకా మనిషి కాదు. అయిదడుగుల ఏడంగుళాల మనిషి. అంతర్జాతీయ రాజకీయ గూఢచర్యంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న 'కేజీబీ' పుట్టిన దేశానికి సాక్షాత్తు అధ్యక్షుడు. రాజకీయాల్లోకి రావడానికి ముందు 'కేజీబీ' సంస్థలో పుతిన్ పదహారేళ్ళపాటు సీనియర్ అధికారిగా పనిచేశారు కూడా. అయినా పదిరోజులపాటు 'అదృశ్యం' అయిన పుతిన్ అచూకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఊహాగానాలు మాత్రం ఆరున్నొక్క రాగం అందుకున్నాయి. క్రమంగా ముదిరి వదంతులుగా మారాయి. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ పుకారు షికారు చేస్తే, కాదు అసలు ప్రాణాలతోనే లేడని మరో పుకారు పుట్టింది. సైనిక కుట్ర జరిగి నిర్బంధంలో ఉన్నాడని మరో వదంతి వచ్చి జత చేరింది. ఇవేవీ కావు పుతిన్ అదృశ్యానికి అసలు కారణం ఆయన ప్రేయసి అని, విదేశంలో బిడ్డకు జన్మ ఇస్తున్న ఆమెను చూడడానికి రెక్కలు కట్టుకుని వెళ్ళాడని ఇంకో ఊహాగానం రెక్కలు విప్పుకుంది. ఇలా రోజుకో పుకారు పురుడు పోసుకుంటూ వుంటుంటే, సరిగ్గా పదిరోజుల తరువాత పుతిన్ అజ్ఞాతాన్ని వీడి తనపై వస్తున్న వదంతులకు తెర దించాడు. తన ఆకస్మిక అదృశ్యానికి ఏ కారణం చెప్పకుండా, ఊహాగానాలను మాత్రం కొట్టిపారేసే ప్రయత్నం చేసారు. 'పుకార్లు లేకపోతే జీవితం రొటీన్ గా మారి విసుగు పుడుతుంది' ఇదీ చివరకు ఆయన ఇచ్చిన వివరణ. బహుశా ఏ నల్ల సముద్రం తీరంలోనో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఆస్వాదిస్తూ పది రోజులు పది నిమిషాల్లా గడిపి ఉంటారని అనుకోవాలి. నిజంగానే యెంత చిత్రం అనిపిస్తోంది కదూ.
ఇలాటి అదృశ్య సంఘటనలు చాలా దేశాల్లో జరిగాయి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా వున్న క్సీ జిన్ పింగ్ (విదేశీ పేర్లను ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ ఉందన్న భావం బలపడుతున్న కాలం ఇది. లోగడ ఇలాటి పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు ఆలిండియా రేడియో ఇంగ్లీష్ వార్తలు విని రాయమని పాత రోజుల్లో ఎడిటర్లు చెప్పేవాళ్ళు) అధ్యక్ష పదవికి నామినేట్ అయిన కొద్ది రోజులకే కనిపించకుండా పోయారు. రాడార్ కూడా పసికట్ట లేనంతగా ఆయన 'అదృశ్యం' అయ్యారని అప్పట్లో మీడియా కోడై కూసింది. సరే మళ్ళీ బయటకు వచ్చి ఆ దేశపు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అది వేరే విషయం. కానీ కనబడకుండా అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారన్న గుట్టు ఇప్పటికీ బయటకు రాలేదు.
కాకపోతే, కనబడకుండా పోయిన ఇలాటి సంచలన రాజకీయ నాయకులు మనకు చరిత్రలో అనేకమంది కానవస్తారు.
హ్యూగో చావెజ్ ఆషామాషీ నాయకుడు కాదు. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు ఏకంగా ఓ నెల రోజులపాటు ఎవ్వరి కంటికీ కనిపించకుండా పోయి సంచలనం సృష్టించారు. 2011 జూన్ నెలలో ఇది జరిగింది. అప్పుడు అయన తీవ్ర అనారోగ్యం గురించిన వార్తలే సంచారం చేసాయి. అనుదినం టీవీ తెరలపై కానవస్తూ, ట్విట్టర్లో దర్శనం ఇచ్చే ఛావెజ్ అన్ని రోజులు కనబడకుండా పోవడం ఆ రోజుల్లో పెద్ద వార్తగా తయారయింది. ఆయనపై వెలువడిన వదంతులను ఖండించడానికి ఆయన ప్రభుత్వం చాలా శ్రమ పడింది. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోతో కలిసి ఛావెజ్ వాహ్వ్యాళి గా నడిచివెడుతున్న ఫోటోలను పత్రికలకు విడుదల చేసినా, పుకార్ల పటిమ ఏమాత్రం తగ్గలేదు.
అమెరికాకు చెందిన మరో రాజకీయ నాయకుడిది సామాన్యంగా ఎదురయ్యే సమస్యే. కాని అయన దాన్ని దాచిపెట్టి తన అదృశ్యానికి వేరే కారణాలు చెప్పాడు. అదే ఆయన్ని ఇబ్బందులలోకి నెట్టింది. ఆయన సౌత్ కరోలినా గవర్నర్ మార్క్ సాన్ ఫర్డ్, 2009 జూన్ లో వున్నట్టుండి నాలుగు రోజులపాటు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ‘మా ఆయన ఏదో పుస్తకం రాయడానికి వెళ్ళాడు, ఇంట్లో పిల్లల అల్లరి వల్ల ప్రశాంతత కరువై అజ్ఞాతంలోకి వెళ్ళారని’ మార్క్ సాన్ ఫర్డ్ భార్య యేవో సాకులు చెప్పింది. కానీ ఈలోగా ఆయనే బయట పడి, తన మనసులో మాట బయటపెట్టాడు. 'నేను నా భార్యకు ద్రోహం చేసాను. నాకెంతో ప్రాణప్రదం అయిన నా ప్రియురాలితో గడపడానికి వెళ్లానని చెప్పేసి, ఆయనే తన తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నాడు. అయన బుద్ది ఏడాదిలోనే మరో వంకర తిరిగింది. మొదటి ఎపిసోడుతో చిన్నబుచ్చుకున్న మొదటి భార్య విడాకులు తీసుకుంది. దాంతో మరింత ధైర్యంతో సాన్ ఫర్డ్ దొరవారు మళ్ళీ కనబడకుండా పోయారు. కాకపోతే తన స్థానంలో తరువాత గవర్నర్ చార్జి తీసుకునే కార్యక్రమంలో హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతే కాదు, నలుగురు చూస్తుండగానే అక్కడకు వచ్చిన తన మాజీ భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుని తనలో దాగున్న ప్రబంధ నాయకుడిని మరోమారు ప్రపంచానికి ఎత్తి చూపారు.
సరదా సంగతులు ఇలాగే చిత్రంగా వుంటాయి.



5, ఫిబ్రవరి 2022, శనివారం

కాకినాడ సంబంధం – భండారు శ్రీనివాస రావు

 


అరవై ఏళ్ళ కిందటి మాట.

అప్పుడు మా వూళ్ళో దోస్తులం అందరం పదో తరగతి చదువుతున్నాం. పాసు కాగానే మాలో కొందరు టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో చేరిపోయారు. నేను మాత్రం పీయూసీ, బీ కాం ఇలా చదువు లాగించాను.

కొన్నేళ్ళు గడిచాయి. వాళ్లందరికీ మా వూళ్ళో, లేకపోతె చుట్టుపక్కల గ్రామాల్లో వున్న చిన్న సర్కారు బడుల్లో  టీచరు ఉద్యోగాలు వచ్చాయి. బతకలేక బడి పంతులు అన్నట్టు ఉండేవి వాళ్ళ జీతాలు, జీవితాలు.

అలా కొన్నేళ్ళు సాగాయి. నా డిగ్రీ పూర్తయింది.

సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. చిన్ననాటి దోస్తులం  అప్పుడప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.  

‘మేమూ నీలాగా డిగ్రీ చేసివుంటే బాగుండేది. ఏదో మా కర్మ ఇలా తగలబడింది’ అనేవాళ్ళు.

అలా మరి కొన్నేళ్ళు గడిచాయి.

అందరం రిటైర్ అయ్యాము.

వున్న వూళ్ళో ఉంటూ వాళ్లకి వచ్చే పెన్షన్ లో సగం కూడా నాకు హైదరాబాదులో రావడం లేదు.

కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎగుడుదిగుడులు సహజం

నా షరా మామూలు డైలాగు వుంది కదా! గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు  నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు.

ప్రాప్తం! అంతే!

‘మా నాన్న చెప్పిన కాకినాడ/ పిఠాపురం  సంబంధం చేసుకుని వుంటే..’ అనే బాపు కార్టూనులాగా,  ఇప్పుడు ముక్కు చీదుకుంటే ఏమిటి లాభం!

(05-02-2022)

కనిపించుటలేదు! – భండారు శ్రీనివాసరావు

 

జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
ఒకానొక రోజుల్లో రిక్షాలు, గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగా వుండేవుంటారు. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.

ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?

2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడ ఈ పరాయి దేశం వాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్ధం అయింది.
1889లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.

దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలు అంతస్తుల ఆధునిక సుందర భవనాలను నిర్మించుకున్నారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు. ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే, పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న కొత్త మోజు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.

అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను అలాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు. (విజయవాడ లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ఎత్తేసిన తరువాత దాన్ని ఒక రహదారిగా మార్చేసిన సంగతి ఇక్కడ గమనార్హం)

ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
పోతే, గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న, అంతరించి పోతున్న వస్తువుల జాబితా మన దగ్గర తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం.


4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

కోర్టు గుమ్మం జైలు గడప – భండారు శ్రీనివాసరావు


“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను” అన్నాడా లాయరు గారు.
అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే అనిపించింది.
నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. కాకపొతే, 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారి మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.

గల్లీ వార్తలు – భండారు శ్రీనివాసరావు

 

ఏదో పాత సినిమాలో డైలాగు- ‘Long long ago, so long ago, nobody can say how long ago’ మాదిరిగా ఇది కూడా చాలా చాలా పాత జ్ఞాపకం. సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి సంగతి.

విలేకరులందరికీ బాగా తెలిసిన ఓ మంత్రి గారు వుండేవారు. తెలుగుదేశం అధికారానికి రావడంతో ఆయన మాజీ అయ్యారు. కానీ రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా పేరు పెట్టి పలకరించేటంత చనువు కలిగిన పత్రికా మితృలు అనేకమంది ఆయనకి వుండేవారు.

రేడియోకి అన్నిచోట్లా విలేకరులు వుండరు. అంచేత ఆ మాజీ మంత్రిగారు ఏ ఊరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టినా, అది పూర్తి కాగానే హైదరాబాదులో రేడియోకి ఫోను చేసి స్వయంగా వార్త చెప్పేవారు.

నిన్న గుడివాడలో ఇదే పాయింటు చెప్పారు, మళ్ళీ గూడెంలో మాట్లాడుతూ అదే పాయింటు వార్తల్లో చెబితే బాగుండదు, కాస్త మార్చి వేరే పాయింటు చెప్పండి’ అనేవాడిని ఆయనతో వున్న చనువుతో.

వూరి ఊరుకీ పాయింటు ఏం మారుతుంది శ్రీనివాసరావ్. అసలీ పాయింటు చెప్పడానికే కదా ఇలా ఊరూరూ తిరుగుతోంది. ఈ పేపర్లతో పెద్ద చిక్కు వచ్చి పడింది. గల్లీ గల్లీకి ఓ ఎడిషన్ అంటారు. ఒక ఊళ్లోనే ఒక పేటలో వార్త మరో వాడలో కనబడదు. అందుకే ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ అదే పాయింటు అన్ని చోట్లా చెబుతున్నాను. అసలే మాజీలం. వేస్తారో వేయరో కూడా తెలియదు’ అంటూ ఆయన తన గోడు చెప్పుకున్నారు.

పాత కధ అన్నాను అందుకే. ఆ రోజుల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం వార్తలు ఒక్క రేడియోలోనే వచ్చేవి. దూరదర్సన్ వుండేది కానీ సాయంత్రం ఒక్కటే బులెటిన్. అది తప్పిపోతే మళ్ళీ మర్నాడు సాయంత్రమే. ఇక ఇప్పట్లా అప్పట్లో ఇన్ని రకాల ఇరవై నాలుగ్గంటల టీవీ ఛానల్స్ లేవు. పత్రికలు కూడా మర్నాడు కానీ రావు. అంచేత ఆ రోజుల్లో రేడియో వార్తలకి మంచి గిరాకీ వుండేది. అదన్న మాట.

2, ఫిబ్రవరి 2022, బుధవారం

మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు

 

మా అమ్మానాన్నల పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.

రేడియో డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్ళినప్పుడు, గాంధీ నగరంలోని వాళ్ళింట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.

పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే ఆమె లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.

బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.

భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. అయినా కర్మ ఫలం తప్పదు.

విరిగిన కాలుకే మళ్ళీ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన ఆ కాలుకే మళ్ళీ ఫ్రాక్చర్. అదీ ఎప్పుడు? డెబ్బయి అయిదేళ్లు దాటిన వయసులో.

ఆ పిడికెడు గుండె అన్ని ఆపరేషన్లను తట్టుకుంది. ఎలా తట్టుకుందో ఆ గుండెకే తెలుసు.

మా బావగారు పోయినప్పటి నుంచి ఆయన ఆలోచనలతోనే రోజులు గడిపింది. భార్యాభర్తల  అనుబంధం అర్ధం కావాలి అంటే వారిలో ఎవరో ఒకరు పోవాల్సిందేనా!

ఎవరికీ లేని అదృష్టం ఆమెది. అందరూ మగపిల్లలే. కోడళ్ళు అందరూ మంచివాళ్ళు. మంచాన పడిన రోజులు తక్కువే అయినా, కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు, పిల్లలూ, కోడళ్ళూ, వాళ్ళ పిల్లలూ అందరూ ఆమె దగ్గర వాలిపోవాల్సిందే.  ఏ తల్లికి దక్కుతుంది ఇంత అదృష్టం. ఏ అత్తకు దొరుకుతుంది ఈ భాగ్యం. తన అమ్మ భారతి గురించి నా మేనల్లుడు తుర్లపాటి పరేష్  ఫేస్ బుక్ లో రాసిన రాతలు ఇందుకు దృష్టాంతాలు.  

ఇంతటి  అదృష్టాన్ని హరాయించుకోలేక ఆ చిన్ని గుండె అలసిపోయింది. కీ అయిపోయిన గడియారంలా ఈ మధ్యాన్నం  ఆగిపోయింది.

మా ఏడో అక్కయ్య తుర్లపాటి భారతికి నా కన్నీళ్ళ శ్రద్ధాంజలి.

(02-02-2022)

కింది ఫోటో: మా అమ్మతో ఆమె కన్న సంతానం ఏడుగురు ఆడపిల్లలు. ఇప్పుడు మా అమ్మతో సహా ఎవ్వరూ లేరు.