2, ఫిబ్రవరి 2022, బుధవారం
ఎక్కడ వున్నా, ఓ కన్ను ఇటే! - భండారు శ్రీనివాసరావు
హల్వా లేని బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు
1, ఫిబ్రవరి 2022, మంగళవారం
కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ మీద నా వ్యాఖ్య కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్ ఛానల్ 'సమయం' తరపున సంపత్, రత్నం మా ఇంటికి వచ్చారు. ఇద్దరూ పాత మిత్రులే. సంతోషం అనిపించింది.
కేంద్ర బడ్జెట్ - టైమ్స్ ఆఫ్ ఇండియా వారి తెలుగు ఛానల్ సమయం కు ఇచ్చిన ఇంటర్వ్యూ.
CLICK THE LINK BELOW TO WATCH THE VIDEO
పాలకుడి అర్హతకు పరీక్ష
అనగనగా ఓ రాజు. ఆ
రాజుగారికో కొడుకు. యుక్తవయస్సు
రాగానే అతడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్తాశ్రమం స్వీకరించాలన్న తలంపు
మహారాజుకు కలిగింది. అయితే రాజ్యభారాన్ని కొడుకు భుజస్కంధాలపై పెట్టేముందు
అందుకు తగిన శిక్షణ ఇప్పించేందుకు కుల గురువులవద్దకు పంపాడు.
గురువు గారి ఆశ్రమంలో
రాజూ పేదా అన్న తేడాలేదు. అక్కడ అందరూ సమానమే.
ఆశ్రమజీవితంలో కొంత
కాలం గడిపిన తరువాత యువరాజు ఓ రోజు వెళ్లి గురువును కలిశాడు.
కలిసి తన మనసులోని మాట బయట పెట్టాడు.
‘స్వామీ! ఇన్నాళ్ళబట్టి
నేను కప్పుకుంటున్న గొంగడి బాగా చిరుగులు పడిపోయింది. దాని స్తానంలో
కొత్తది ఇప్పిస్తే కృతజ్ఞుడిని’
గురువు పాత గొంగడిని
పరీక్షించి చూశాడు. యువరాజు చెప్పింది నిజమే. అది బాగా జీర్ణించి పోయి
కప్పుకోవడానికి పనికిరాకుండా వుంది.
గురువు కొత్త గొంగడి
తెప్పించి శిష్యుడికి ఇచ్చాడు. యువరాజు సంతోషంగా వెళ్ళిపోయాడు.
ఆ తరువాత గురువు
గారికి ఓ సందేహం వచ్చింది. ‘కొత్త
గొంగడి తీసుకువెళ్ళాడు
సరే పాత గొంగడి మాటేమిటి?’
శిష్యుడిని మళ్ళీ
పిలిపించాడు. ‘పాత
దుప్పటి ఏం చేశావ’ని ప్రశ్నించాడు.
‘పక్క బట్ట బాగా
మాసిపోయింది. అందుకని పాత గొంగడిని పక్కబట్టగా వాడుతున్నాన’ని బదులుచెప్పాడు.
కానీ, గురువు గారు అంతటితో
వొదిలిపెట్టలేదు.
‘పాడయిపోయిన పాత
పక్కబట్టని ఏం చేశావ’ని
ప్రశ్నించాడు.
‘కుటీరం కిటికీకి
దాన్ని పరదాగా కట్టాన’ని
శిష్యుడి జవాబు.
‘బాగుంది. మరి పాత పరదా
సంగతేమిటి? దాన్నేం
చేశావ్?’ గురువుగారు
మరో ప్రశ్న సంధించాడు.
‘ఇల్లు కడిగిన తరువాత
తుడవడానికి దాన్ని వాడుతున్నాన’ని శిష్యుడు చెప్పాడు.
గురువుగారి సందేహాలు
ఇంకా తీరినట్టులేదు.
‘అంతకుముందు ఈ పనులకు
వాడిన బట్టలు ఏమయ్యాయి?’
‘వాటిని దారాలుగా
విడదీసి ఆ దారాలతో వొత్తులు తయారు చేసి రాత్రి వేళల్లో ఆముదపు దీపాలు వెలిగించి
చదువుకుంటున్నాను’
అడగడానికి గురువుదగ్గర
ఏమీ మిగలలేదు. అలాగే శిష్యుడికి నేర్పడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు.
‘పనికిరానిదేమీ లేదు ఈ
లోకంలో’ అన్న
నీతిని బాగా వొంటబట్టించుకున్న యువరాజు చేతుల్లో ఈ
రాజ్యం భద్రంగా వుంటుందన్న గట్టి నమ్మకం గురువుకు కలిగింది.
అంతే!
పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకోవలసిందని
మహారాజుకు కబురు
పంపారు.
అలా ఉండేవి ఆ రోజులు – భండారు శ్రీనివాసరావు
ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు.
విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ
ప్రాంతంలో పర్యటించడానికి ముఖ్యమంత్రి
పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన అక్కడికి
వెడితే, ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్, ఎస్పీ, పీవీని వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ
ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం
లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు (వీకే రావు) రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి
సూచించారు.
‘నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి. నీ పని
నువ్వు చూసుకో. నేను చెప్పింది చేయి. నేను
పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా’ అంటూ
ఆఫీసు మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు
పీవీ. కానీ అక్కడ కారు డ్రైవర్ లేడు. ఏడని అడిగితే... ‘సీఎస్ గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్ నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్
కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి, ’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని
మెచ్చుకున్నారు.
విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత.
అధికారుల మాట పట్ల రాజకీయ నాయకుల మర్యాద, మన్ననలు
అలా ఉండేవి.
ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ
సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి
కొండ కిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు
చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు
ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి పంపాడు. విలేకరి పనులన్నీ పూర్తయి హైదరాబాద్
బస్సు ఎక్కేదాకా వుండి రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి
వచ్చాడు. రాగానే ఇచ్చిన మొత్తాన్ని యధాతధంగా
డ్రైవరు వాపసు చేయడంతో ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ !
కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్ ‘ అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.
ఒకనాటి విలేకరుల నిబద్దత అది.
ఆ డ్రైవర్ నిబద్ధత కూడా చాలా గొప్పది.
31, జనవరి 2022, సోమవారం
నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న
పుస్తకం
విలువ దానిని కొన్నప్పుడు పెరుగుతుంది అనేది నా నమ్మకం. నా నమ్మకంతో నిమిత్తం
లేకుండా కొన్ని పుస్తకాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అలా అని వాటి విలువ
తక్కువేమీ కాదు. రచయిత సంతకం చేసి ఇచ్చిన పుస్తకం మరెంతో ప్రియమైనది. అలాంటిది
రచయితే స్వయంగా వచ్చి ఇస్తే ఇక దానికి విలువకట్ట తరమా!
జీ.
వల్లీశ్వర్ జగమెరిగిన జర్నలిస్టు. బహు గ్రంధ రచయిత కూడా. అమూల్యమైన ఇంగ్లీష్
పుస్తకాలను అలవోకగా అనువదించిన ఘనత ఆయన ఖాతాలో వుంది.
రాత్రి
ఫోన్ చేసి ‘ఇంట్లో వున్నారా!’ అని అడిగారు. ‘కరోనా కాలంలో ఇంట్లోనే కదా!’ అన్నాను.
‘అయితే
ఓ అయిదు నిమిషాల్లో వచ్చి, రెండు
నిమిషాలు వుండి వెడతాను. మీకో పుస్తకం ఇవ్వాలి’ అన్నారు.
‘మీ
రాక సంతోషం. పుస్తక సమేతంగా రాక మరింత సంతోషం’ అన్నాను.
అన్నట్టే
వచ్చారు. అన్నట్టే పుస్తకం ఇచ్చారు. అన్నట్టే రెండు నిమిషాలు వుండి వెళ్ళిపోయారు.
ఈ కొద్ది సమయంలో ఒక ఫోటో కూడా దిగాము. ఆ పుస్తకమే:
‘నర్సరీ
రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’
పూలు, పండ్ల మొక్కల పెంపకానికి వల్లీశ్వర్
ఇచ్చిన ప్రాధాన్యత ఈ టైటిల్ లో కనబడింది.
నర్సరీని
సామ్రాజ్యంగా అభివర్ణించి పల్ల వెంకన్నను దానికి రారాజును చేసేశారు.
చాలామంది
చాలామందిని గురించి పుస్తకాలు రాస్తారు. కొన్ని చదివిన తర్వాత పుస్తకాలు రాయదగ్గ
గొప్పతనం ఏముంది వీరిలో అనిపిస్తుంది.
పల్ల
వెంకన్న గురించి వల్లీశ్వర్ రాసిన ఈ పుస్తకం చదివిన తర్వాత ఈయన గురించి ఇంత మంచి
పుస్తకం ఇంతదాకా ఎందుకు రాలేదు
అనిపించింది.
పూల
మొక్కల్ని పెంచేవారికి ఆ పూలంత మృదువైన మనసు వుంటుంది. వెంకన్న గారికి ఈ వెన్నలాంటి
మనసు బోలెడు వుంది.
పూల
మొక్కలు, పండ్ల మొక్కలు అనగానే తటాలున గుర్తొచ్చే పేరు కడియం. ఆ కడియం పేరు
చెప్పగానే గుర్తొచ్చే పేరు పల్ల వెంకన్న. కృషి వుంటే అనే పాటకు పల్లవి లాంటి మనిషి
పల్ల వెంకన్న. పోలియోతో చిన్నతనంలోనే రెండు కాళ్ళు చచ్చుపడ్డా, ఆయనలోని పట్టుదల చచ్చుపడలేదు.
మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మొక్కలనే ఆయన
తన ప్రపంచం చేసుకున్నారు. మొత్తం ప్రపంచం దృష్టి తనవైపు మళ్లేటట్టు ఆరుగాలం శ్రమించి, వంద ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే
అతి పెద్ద నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేశారు. వెంకన్న గారి విజయ రహస్యం
వల్లీశ్వర్ మాటల్లో, అదీ ఒక్క ముక్కలో:
“ఆయన
(పల్ల వెంకన్న) ఒళ్ళొంచి పని చేస్తాడు, ఒళ్ళొంగని వాళ్ళ చేతకూడా పనిచేయిస్తాడు”
ప్రచురణ:
ఎమెస్కో మూల్యం : రు. 175/-
ఇలాంటి
వ్యక్తి గురించి పుస్తకం రాసి వల్లీశ్వర్ ధన్యులు అయ్యారు. ఈ పుస్తకాన్ని అందంగా
అతి ఖరీదైన కాగితం మీద ముద్రించి ఎమెస్కో వారు ధన్యులు అయ్యారు.
(31-01-2022)
విసుగు
శంకరపాదానికి జీవితం మీద విసుగు పుట్టింది. ఏవిటీ జీవితం? తినడం, తొంగోడం, తోచకపోతే ఫేస్ బుక్ లోకి తొంగి చూడ్డం ఇంతేనా జీవిత పరమార్ధం ?
సర్వస్వం త్యజించి అడవుల్లోకి వెళ్లాడు. కిందంతా పచ్చటి పచ్చిక. పట్టు తివాచీ పరచినట్టు వుంది. పక్కన, ఆకాశం అంతు చూడాలన్నట్టు పొడవుగా పెరిగిన వెదురు చెట్లు. దూరంగా ఎవరో కనిపించారు. దగ్గరగా వెళ్ళి అడిగాడు ఎవరు నువ్వని. 'నేనా! ఈ సృష్టి కర్తను. ఆ చెట్టూ ఈ పుట్టా అన్నీ నేనే సృష్టించాను. ఇంతెందుకు నువ్వూ నీ జాతి మనుషులు అంతా మయాసృష్టం!' 'అలానా! సంతోషం. వెదకపోయిన తీగె కాలికి తగిలింది. ఇప్పుడు చెప్పు. ఇంత విసుగు కలిగించే జీవితాన్ని నాకు యెందుకు ప్రసాదించావు?' 'పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. నిండు నూరేళ్ళ జీవితం ముందే వుంది. అప్పుడే నీకు బతుకు మీద రోత పుట్టిందా! దాన్ని వొదిలిపెట్టి పోవాలన్న కోరిక కలిగిందా!' '.....................' 'అటు చూడు. ఆ పచ్చిక యెంత బాగుందో. ఇటు చూడు ఈ వెదురు వృక్షాలు యెలా యెంత ఎత్తు పెరిగాయో! నీకొక విషయం చెబుతా శ్రద్ధగా విను. కొన్ని సంవత్సరాల కిందట నేనే స్వయంగా ఈ గరిక విత్తనాల్ని, ఈ వెదురు విత్తనాల్ని ఒకే రోజు నాటాను. నారుపోసిన వాడిని కదా! నీరు కూడా పోశాను. ‘చిత్రం మరునాడే గరిక మొక్క నేలతల్లిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. వెదురు విత్తనం ఏమైందో తెలియదు. గరిక మాత్రం ఏపుగా పాకి పచ్చగా అడవి నేలనంతా మనోహరంగా పరచుకుంది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. మూడో ఏడు దాటినా వెదురు విత్తనం మొలకెత్తే సూచన కానరాలేదు. అయినా నేను నిరాశ పడలేదు. నాపని వొదిలిపెట్టలేదు. మొలవకపోయినా వెదురు విత్తనం నాటిన చోట నీళ్ళు పోస్తూనే పోయాను. నాలుగో ఏడు కూడా గడిచింది. ఐదో ఏట బహు చిత్రంగా అక్కడ ఓ చిన్న ఆకు అపచ్చని మొలక బయటకు వచ్చింది. ఆరునెలలు గడిచాయో లేదో బారెడు పెరిగింది. ఏడాది తిరిగేసరికల్లా అడవిలో చెట్లకు రాజల్లే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇంత ఎత్తు పెరగాలి కాబట్టే అంత లోతుకు వేళ్ళూనుకోవాలి. కాబట్టే, అంతవరకూ వెదురు మొక్క వెలుగు చూడలేదు. 'ఈ నా సృష్టిలో వృధా అంటూ ఏమీ లేదు. ప్రతి దానికీ ఒక పరమార్ధం వుంది. విసుగుపుట్టి వొదిలేస్తే వొరిగేది ఏమీ వుండదు. నీకంటూ ఓ కర్తవ్యం నిర్దేశించి వుంది. అది పూర్తిచేసేవరకు విసుగును దూరంగా వుంచు' శంకరపాదానికి జ్ఞానోదయం కాగానే సృష్టికర్త అదృశ్యం అయిపోయాడు. కధ కంచికి. మనం ఎఫ్ బీ లోకి.