11, డిసెంబర్ 2021, శనివారం

మౌనరాగం - భండారు శ్రీనివాసరావు

 


“భద్రం కృతం  కృతం మౌనం

కోకిలైర్జలదాగమే:

దర్దురా యత్ర వక్తారః 

తత్ర మౌనమ్ హి శోభనమ్!!”

తాత్పర్యం:

“వానాకాలం రాకతో కప్పల హోరు పెరుగుతుంది. అప్పుడు కోకిల మౌనం వహిస్తుంది. 

కప్పల బెకబెకలకే ప్రాధాన్యమున్న చోట మౌనం వహించడమే శోభస్కరం!!”

A meaningful silence is better than a meaningless argument    

పక్కవారికి చెప్పేటందుకే......భండారు శ్రీనివాసరావు

 

ఈనాడు అనేక వర్గాల్లో ఒక విషయం పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.

సమాజంలో మంచివాళ్ళు, ప్రత్యేకించి మేధావులు అనే బుద్ధి జీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.

అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించకపోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ ఆరోపణలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.

ఇది జరిగి చాలా ఏళ్ళయింది. 1987 లో అనుకుంటాను అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన బాధ్యతలకు కొంత దూరంగా లక్షద్వీప్ లో సేద తీరేందుకు సకుటుంబ సపరివార సమేతంగా విహార యాత్రకు వెళ్ళడం ఆరోజుల్లో పత్రికల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన బృందంలో గాంధీల కుటుంబ స్నేహితుడయిన సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వున్నారు.



అప్పుడు నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు, దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నోటి నుంచి వచ్చిందే రాజీవ్ గాంధీ లక్షద్వీప్ యాత్ర గురించిన ప్రస్తావన. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి ఎస్టీడీలో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి, సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు, కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను.

ఇలాటి సంఘటనలవల్లనేమో తెలియదు కానీ, నాలో ఒక నమ్మకం పేరుకు పోతూ వచ్చింది. 'నీతులు చెప్పడం వేరు, వాటిని ఆచరించి చూపడం వేరు' అనే విశ్వాసం నాలో బలపడుతూ వచ్చింది. 'చెప్పేదానికీ చేసేదానికీ పొంతనవుంటేనే చెప్పేదానికి నిబద్దత వుంటుంద'న్న అభిప్రాయం క్రమంగా మనసులో గూడుకట్టుకోవడం మొదలయింది.

'మా పిల్లవాడు పంచదార తింటున్నాడు ఎలా మానిపించాలి' అని ఒక తల్లి ఓ స్వామీజీని అడిగితే మూడు రోజుల తరువాత తీసుకురమ్మని పంపించేస్తాడు. ఆ తరువాత వచ్చినప్పుడు 'బాబూ. పంచదార అలా ఎక్కువ ఎక్కువ తినడం వొంటికి మంచిది కాదు' అని హితవు చెబుతాడు. 'ఆ ముక్కేదో మొన్నే చెప్పవచ్చుకదా' అన్నది తల్లి సందేహం. 'చెప్పొచ్చు కానీ, నాకూ పంచదార తినే అలవాటు వుంది. ముందు నేను మానేసిన తరువాత కదా మీ పిల్లాడికి చెప్పాలి' అంటాడు ఆ స్వామి. ఎప్పుడో చదివిన ఇలాటి నీతి కధలూ, ఇలా ఎదురయిన సంఘటనలు మొత్తం మీద నా మనసుపై చెరగని ముద్ర వేసాయి.

'విమర్శించేవారు, ఆరోపణలు చేసేవారు కూడా సచ్చీలురుగా వుండడం అవసరం. లేకపోతే వాటికి నిబద్దత వుండదు. ఒక పక్క తాము అదే పనిచేస్తూ ఇతరులకు నీతి పాఠాలు బోధించడం ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ, రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు అతి సామాన్యులు అయితే మాత్రం వాటిని వెంటనే పట్టించుకోవాలి..

నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతిబాహ్యం కాదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.

ప్రభుత్వ అధికారుల ఇళ్ళల్లో అధికారికంగా ఫోన్లు వుండడం కొత్తేమీ కాదు. ఆఫీసు వేళల్లో కాకుండా అవసరమైనప్పుడు పైవారు సంప్రదించడానికి వీలుగా ఈ సౌకర్యం వుంటుంది. 'సెల్ ఫోన్లు వచ్చిన తరువాత కూడా ఈ ఖర్చు అవసరమా' అని ఆర్ధిక శాఖలో ఒక ఉన్నతాధికారిని అడిగితే, ఆయన నుంచి చిరునవ్వే జవాబు.

ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ వాహనాల దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.

ఇప్పుడు చెప్పండి నీతులు వున్నవి ఎవరికోసం? పక్కవారికి చెప్పడం కోసమేనా!

9, డిసెంబర్ 2021, గురువారం

బిపిన్ రావత్ గురించి


రావత్ బిపిన్ రావత్!

దురదృష్టకర  పరిస్తితుల్లో ప్రాణాలు కోల్పోయిన ధీశాలి , చీఫ్  ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సర్వసైన్యాధ్యక్షుడు అనవచ్చేమో)  బిపిన్ రావత్.  ఈ దుర్వార్త తెలిసినప్పటి నుంచి దేశంలో ప్రతి ఇంట్లో  ఆయన నామస్మరణే!

అయితే ఆయనతో సన్నిహిత పరిచయం ఉన్న వ్యక్తి మా కుటుంబంలోనే ఉన్న సంగతి కొంచెం ఆలస్యంగా తెలిసింది. బిపిన్ రావత్ తో దిగిన ఫోటోలను ఆయన మా ఫ్యామిలీ  గ్రూపులో పోస్ట్ చేశారు. పేరు కల్నల్ దుర్గాప్రసాద్. పుట్టింది నిజామాబాద్. ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాదులోనే సెటిల్ అయ్యారు. మా ఆవిడ నిర్మల సొంత బాబాయి కొడుకు. మేమంతా డుంబు అని పిలుస్తాము.  సాయంత్రం అయ్యేసరికి రెండు మూడు టీవీ ఛానళ్లలో దుర్గాప్రసాద్ ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. కింద లింక్ వాటిల్లో ఒకటి. NTv వాళ్ళు ప్రసారం చేశారు. నాకున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఈ వీడియోలో దుర్గాప్రసాద్ ఇంటర్వ్యూ ఒకటిన్నర నిమిషం తర్వాత మొదలవుతుంది. కార్యక్రమం నిడివి బాగానే వుంది, వివరంగా చెప్పాడు. బాగా చెప్పాడు.

09-12-2021


ఇలాంటివారు కూడా ఉంటారా! - భండారు శ్రీనివాసరావు

 

వార్త:

జర్మనీ చాన్సలర్ గా అలాఫ్ షోల్జ్ ని పార్లమెంటు ఎన్నుకుంది. దీనితో ఏంజెలా మర్కెల్ సుదీర్ఘ పదవీ కాలం ముగిసింది.

 

వ్యాఖ్య:

 

మీరు ఎప్పుడూ ఒకే సూటులో కనబడతారు? కారణం?”

నేను ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఉద్యోగిని. ఫ్యాషన్ మోడల్ ని కాదు”

మీరు పరిపాలనా బాధ్యతలతో తీరుబడి లేకుండా వుంటారు కదా! మరి ఇంటి పనులు ఎవరు చక్కబెడతారు?”

నేనూ నా భర్తా ఇంటి పనులు ఇద్దరం కలిసి చేసుకుంటాము. మా ఇంట్లో వేరే పనివాళ్లు, వంట మనుషులు లేరు”

 

విలేకరుల సమావేశాల్లో ఇలా జవాబులు ఇచ్చే ఈ సామాన్యురాలు ఎవరు అనుకుంటున్నారా? ఈవిడే అనామకురాలైన నాయకురాలు. ఏంజెలా మర్కెల్.

 

2005 లో ఎనిమిది కోట్ల మంది జర్మనీ ప్రజలు తమను ముందుండి నడిపించే నేతగా ఆమెను ఎన్నుకున్నారు. ఆ తరువాత కూడా వరసగా నాలుగు పర్యాయాలు ఆమెనే ఎన్నుకున్నారు.  ఇన్నేళ్ళలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. తన సంబంధీకులు ఎవరినీ ఆమె ప్రభుత్వ కొలువుల్లో, పదవుల్లో నియమించలేదు. లక్షల్లో జీతాలు, భత్యాలు తీసుకోలేదు. తనకు ముందు పాలించిన నేతలను పల్లెత్తు మాట అనలేదు. తన పరిపాలన అద్భుతం అనే కధనాలు మీడియాలో వచ్చేలా చూసుకోలేదు. తనను నమ్మి అధికార పగ్గాలు అప్పగించిన ప్రజలకు మరింత చక్కటి, భద్రమైన, సుఖప్రదమైన జీవితాలను ఇవ్వడం ఒక్కటే లక్ష్యంగా ఆమె ఇన్నేళ్ళు పనిచేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు,  విలాసవంతమైన భవంతులు, ఖరీదైన  వాహనాలు, విహార నౌకలు, ప్రైవేటు విమానాలు వంటి విలాసాలపై మోజు పడకుండా అధికారంలో కొనసాగిన  కాలం యావత్తూ అత్యంత  నిరాడంబరంగా, నిబద్ధతతో, నిజాయితీతో  పాలించారు.

తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన బంధువులు, స్నేహితులు, పార్టీవారు ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా చూశారు.

ఎలాంటి పటాటోపం ప్రదర్శించకుండా, ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా, పదవి అంటే అది కూడా జీతం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగం అని మాత్రమే నమ్ముతూ, తనని నమ్మిన ప్రజలకు మౌనంగా సేవ చేస్తూ అంతే మౌనంగా అధ్యక్ష పదవిని, పార్టీ నాయకత్వ పదవినీ వదిలేశారు.

పదవీ విరమణ అనంతరం సొంత ఇంటికి వెళ్ళాల్సిన అగత్యం లేకుండా పోయింది. ఎందుకంటే జర్మనీ అధ్యక్షురాలు కాకపూర్వం  ఏ సామాన్యమైన ఇంట్లో ఉంటూ వచ్చారో,  పదవిలోకి వచ్చాక కూడా అదే ఇంట్లో కొనసాగుతూ వచ్చారు కనుక, అధికారిక భవనం ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదు. ఏ దేశానికి అయితే సర్వం సహా అధ్యక్షురాలిగా వున్నారో అదే దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది సామాన్య జర్మన్ పౌరుల్లో ఇప్పుడు ఆవిడా ఒకరు. అంతే!

09-12-2021

కలంపాళీ ఎటు తిరుగుతోంది?


అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్‌ కలిగేది. (తర్వాత, 1987లో, రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు హిందూ పేపర్ని ఇండియన్‌ ఎంబసీ నుంచి తెప్పించుకుని చదివేవాళ్ళం. కానీ అది బెంగుళూరు ఎడిషన్‌ కావడం వల్ల అందులో మన ప్రాంతం వార్తలు చాలా తక్కువ. హైదరాబాద్‌ నుంచి కీర్తి శేషులు హిందూ బ్యూరో చీఫ్‌ ఆర్‌. జె. రాజేంద్రప్రసాద్‌ రాస్తుండే రాష్ట్ర సమాచార లేఖ ఒక్కటే మాకు వూరట.
అప్పట్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ఐ . వెంకటరావు, జర్నలిస్టుల ప్రతినిధి బృందంలో సభ్యుడిగా మాస్కో వచ్చారు. తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగు కుటుంబాలు పడుతున్న వెంపర్లాటని ఆయన గమనించారు. హైదరాబాద్‌ వెళ్ళీ వెళ్ళగానే ఆంధ్రజ్యోతి దిన పత్రికని ఇండియన్‌ ఎంబసీ ద్వారా ఉచితంగా పంపించడం ప్రారంభించారు. సొంత రాష్ట్రం తాలూకు సమాచారాన్ని వారం రోజుల తర్వాతనయినా తెలుసుకోగల వీలు దొరకడం అదో కథ. అదో మధుర స్మృతి).

ఇక వెనక్కి వెడితే

అప్పట్లో అంటే యాభయ్‌, అరవై సంవత్సరాలక్రితం దినపత్రికల ఖరీదు అందరికీ అందుబాటులో ఉండేది. అయితే కొని చదివే అలవాటు మాత్రం చాలా తక్కువ.

ఆ రోజుల్లో పత్రికలకి ప్రకటనల రూపంలో కానీ, ఇతరత్రా కానీ లభించే ఆదాయం అంతంత మాత్రమే. పత్రికలు నడిపేవారుకూడా , దాన్నే తమ ప్రధాన ఆదాయవనరుగా భావించేవారు కాదు. దినవారీ నిర్వహణ బాధ్యతని పూర్తిగా సంపాదకులకు వదిలిపెట్టేవారు. అందుకే ఒక కోటంరాజు రామారావు, ఒక నార్ల, ఒక గోరాశాస్త్రి , ఒక రాఘవాచారి, ఒక నీలంరాజు, ఒక పండితారాధ్యుల, ఒక నండూరి రామమోహనరావువంటి సంపాదకులు ఆంధ్రదేశానికి లభించారు. వీరిలో నాకు తెలిసినంతవరకూ ఒక నార్ల వారు మాత్రమే రాజ్యసభ సభ్యులు కాగలిగారు.
ఆరు దశాబ్దాల తర్వాత ఈ నాటి పరిస్థితులను పరిశీలిస్తే తెలుగు జర్నలిజం కార్పొరేట్‌ స్ధాయిని అందుకుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అదనపు హంగులను, రంగులను సమకూర్చుకుంది. వార్తా సేకరణలో, ముద్రణలో, పంపిణీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కొని చదవాలన్న ఉత్కంఠని పాఠకుల్లో ప్రేరేపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆహ్వానించతగ్గవే. అందరూ కాకపోయినా కొందరు జర్నలిస్టు సోదరులు గతంలో కనీవినీ ఎరుగని ఆకర్షణీమయైన జీతభత్యాలను, సదుపాయాలను అందుకుంటున్నారు. తమ రచనలతో కూడగట్టుకున్న పాఠకాభిమానంతోపాటు, మీడియా చర్చల్లో పాల్గొంటూ , బుల్లితెరపై తరచుగా కనిపిస్తూ సెలబ్రిటీ స్టేటస్‌ని సయితం సంపాదించుకుంటున్నారు.
ఈ లక్షణాలని పుణికి పుచ్చుకున్న తర్వాత విలువలని కాపాడుకోవడం తలకి మించిన భారం కానూ కావచ్చు. చెప్పలేం!
నేను 70వ దశకంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రకటనల రీత్యా ఆదాయం లేదని అనలేను కానీ, దాని మీదనే పత్రిక నడిచేదని చెప్పడానికి కూడా వీలులేదు. అందుకే నార్లగారు, నండూరి వారు పత్రిక నడిపిన తీరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి కావు. వారి సంపాదకీయ వ్యాఖ్యలకీ, వారి ఆధ్యర్యంలో ప్రచురితమయ్యే వార్తలకూ ఒక నిబద్ధత ఉండేది. ఆ తరువాతి తరంలో కూడా ఆ సాంప్రదాయం, ఆ పరంపర కొంతకాలం కొనసాగాయి.

మంచి పత్రిక ఎప్పుడూ మంచి పాఠకులను తయారు చేస్తుంది. వారిని తమ అభిమానులుగా మార్చుకుంటుంది. అందుకే కొందరు పాఠకులు కొన్ని పత్రికలని ప్రగాఢంగా అభిమానిస్తుంటారు. వాటిని చదవడానికే అలవాటు పడుతుంటారు. వాటిల్లో ప్రచురితమయ్యే వార్తలని, వ్యాఖ్యలని విశ్వసిస్తుంటారు. నిజమని నమ్ముతుంటారు. పాఠకుల భావజాలాన్నీ, ఆలోచనా రీతులను ప్రభావితం చేసే ఒక రకమైన సమ్మోహన శక్తి పత్రికలకు ఉంటుంది. అందుకే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులకు సంఘంలో అంత మర్యాదా, మన్ననా.

కానీ వర్తమానానికి వస్తే,

పత్రిక నిర్వహణ, ఆ మాటకి వస్తే, మీడియా నిర్వహణ ఒక పరిశ్రమ మాదిరిగా తయారయింది. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దానితోబాటు వార్తలకూ, వ్యాఖ్యలకూ నడుమ ఉండాల్సిన సన్నటి విభజన రేఖ అదృశ్యమవుతోంది. వెనకడుగు వేస్తే వెనకబడిపోతామనే విశృంఖల పోటీ యుగం ప్రారంభమయింది. భుజకీర్తులు తగిలించుకునే భజన పరుల సంఖ్యా, రాజకీయ పార్టీలకూ, బడా పారిశ్రామిక సంస్థలకూ కొమ్ముకాసేవారి సంఖ్యా, మీడియాలో పెరుగుతోందన్నది కాదనలేని సత్యం. ప్రజా శ్రేయస్సు దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే పవిత్రమైన బాధ్యత కలిగిన పత్రికల్లో, తమ అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే దుష్ట సంస్కృతి రూపు దిద్దుకుంటోంది.

పత్రికలకు ప్రాణం స్వేచ్ఛ. అంతే కాదు, పత్రికాస్వేచ్ఛ జర్నలిస్టుల జన్మహక్కు. ఈ స్వేచ్ఛపై ఎవరు దాడి చేసినా, నిందలు వేసినా అది ప్రజా స్వామ్యానికి కీడుచేస్తుంది. అందుకే బాధ్యత కలిగిన పౌరులెవ్వరూ, ఈ రకమైన దాడులని, నిందలని హర్షించరు. అయితే అదే సమయంలో నిష్ఠురమైన నిజాన్ని కూడా మీడియా అర్ధం చేసుకోవాలి.
స్వేచ్ఛ అనే జన్మ హక్కు సయితం, పవిత్రమైన బాధ్యత నుంచి తప్పించలేదు.
నిబద్ధత వున్న చోటే నిజం నిలుస్తుంది. విశ్వసనీయతే హక్కుల్ని కాపాడుతుంది. అది వున్నంత కాలం దాడులకు, నిందలకు వెరవనక్కరలేదు. పాఠకులే పెట్టని కోటగా నిలబడి పత్రికలని కాపాడుకుంటారు.
కానీ ఆ పరిస్థితిలో, అలాంటి ఉన్నత స్థానంలో నేటి పత్రికలు, మీడియా వ్యవహార శైలి ఉంటోందా!
ఉంటే ఇటువంటి గీత బోధనలు చేయాల్సిన అవసరం ఏముంటుంది?