తప్పతాగిన స్తితిలో అతి వేగంగా ఓ యువవిద్యార్ధి కారు నడిపిన ఫలితంగా సంభవించిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక కుటుంబం మొత్తం చితికి పోయింది. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెడుతున్న ఒక యువకుడి కలలన్నీ అతడి కనురెప్పల కిందే కరిగిపోయాయి. అప్పటివరకు చదువుతున్న స్కూలును ఒదిలి మరో స్కూల్లో చేరి బంగారు భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన పదేళ్ళ బాలిక రమ్య ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్లాడుతూ వారం రోజుల తరువాత మృత్యు దేవత ఒడిలో ఒదిగి పోయింది. హైదరాబాదు పంజాగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ చనిపోవడం, ఆ కారులో వున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మొత్తం నాలుగు కుటుంబాలు భరించలేని దుఃఖంలో మునిగిపోయాయి. సహచర విద్యార్ధులతో కలిసి పగటి పూటే పూటుగా మద్యం సేవించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి నడుపుతున్న కారు, అదుపు తప్పి బోల్తా కొట్టి, మరో వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
7, డిసెంబర్ 2021, మంగళవారం
మారని వ్యవస్థ
6, డిసెంబర్ 2021, సోమవారం
రాముడు మంచి బాలుడు - భండారు శ్రీనివాసరావు
5, డిసెంబర్ 2021, ఆదివారం
రోశయ్య గారు – కూరల కత్తి
ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రతిపక్ష నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి. రామకృష్ణుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు గురించి సుదీర్ఘంగా మాట్లాడి, ప్రభుత్వ పధకాల అమలుకు అవసరమయితే అప్పులు చేసినా తప్పులేదన్న అర్ధం ధ్వనించేలా వ్యాఖ్యానించారు. పైగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేందుకు అవకాశం వుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రోశయ్య
లేచి ఇలా అన్నారు.
“అప్పులు
అభివృద్ధి కోసం అంటున్నారు, ఇదేమి
లాజిక్కో నాకు అర్ధం కాదు. పరిమితికి మించి ఓడీలు తీసుకుంటే నష్టపోయేది రాష్ట్రమే.
అయినా వంటింట్లో కూరగాయలు కోసే కత్తి
వుందని మెడ కోసుకుంటామా!” అని చమత్కరించారు.
తర్వాత
సభ బయట విలేకరులతో ముచ్చటిస్తూ ఇంకా ఇలా అన్నారు.
‘కాఫీపొడుం, పంచదార అయితే ఏదో అనుకోవచ్చు.
కానీ పప్పూ ఉప్పూ నూనె నెయ్యి
ఇలా ప్రతిదీ పొరుగింటమ్మ దగ్గర
చేబదులు తీసుకుని నడిపే దాన్ని సంసారం అనరు. ప్రభుత్వం అయినా అంతే’
05-12-2021
మరో రూపంలో మృత్యుక్రిమి – భండారు శ్రీనివాసరావు
ఒమైక్రాన్ అనమంటుంది నిఘంటువు. కానీ ఒమిక్రాన్ అని డిసైడ్ చేసింది మీడియా. ఇప్పుడు ఒమైక్రాన్ అంటే మరో కొత్త వేరియంట్ వచ్చిందని పొరబడి, భయపడే అవకాశం వుంది కాబట్టి ఒమిక్రాన్ తో నే సర్దుకుపోదాం.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ 19
అనే భయంకరమైన అంటువ్యాధి మన దేశంలో అడుగుపెట్టి మరో
రెండు నెలల్లో రెండేళ్లు పూర్తవుతాయి. ఎక్కడో చైనాలో పొడసూపిన ఈ మామూలు కంటికి
కానరాని ఈ చిన్ని క్రిమి, సమస్త విశ్వాన్ని చుట్టబెట్టడానికి పెద్ద సమయం
తీసుకోలేదు.
కేరళలోని మూడు పట్టణాల్లో మొట్టమొదట 2020 మార్చి 30 వ తేదీన ఈ కోవిడ్ వ్యాధిని గుర్తించారు. చైనా
వెళ్లి వుహాన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధులు స్వదేశానికి
వస్తూ వెంటబెట్టుకు వచ్చిన వ్యాధి, అతిత్వరలో భయంకర పరిణామాలకు మూలకారకం అవుతుందని
అప్పట్లో వారికి తెలియదు. నిజం చెప్పాలి అంటే అసలు ఎవ్వరికీ తెలియదు.
తదాదిగా ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు
సినిమా రీలులా గిర్రున తిరిగాయి. 2020 మార్చి ఇరవై మూడో తేదీన దేశంలో తొలిసారి కేరళలో
లాక్ డౌన్ విధించారు. అప్పటిదాకా ఈ పదాన్ని వేరే అర్ధంలో అర్ధం చేసుకోవడానికి
అలవాటు పడిన వారికి లాక్ డౌన్ అమలు తీరు అంటే ఏమిటో తెలిసి వచ్చి నివ్వెరపోయారు. ఆ
తర్వాత రెండు రోజులకే విధిలేని పరిస్థితుల్లో
యావత్ భారతదేశంలో లాక్ డౌన్ విధించారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వంటి
వాతావరణం కమ్ముకోవడం అదే మొదటిసారి కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిజమే
గత్యంతరం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఎందుకంటే, ఈ కోవిడ్ వ్యాధి లక్షణాలు అంటే ఏమిటో తెలియదు.
ఎలా వ్యాపిస్తుందో తెలవదు. నోటి నుంచి, శ్వాస నుంచి, అసలు మనుషులు ఒకరినొకరు తాకినా అంటుకుంటుందని
ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం
అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి
దిగింది. ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం అనే కన్నా, విస్తరించకుండా దీన్ని ఎలా అరికట్టడం అనేది ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది.
‘పెసరట్టు వేయాలంటే పెసర పిండి కావాలి. పెసర పిండి కావాలంటే పెసలను
నానబోసి రుబ్బాలి. పెసలు నానడం అనేది మనిషి చేతిలో లేదు. దానికి కొంత వ్యవధానం
అవసరం. ఎంత డబ్బువున్నా, ఎంత అధికారం వున్నా పెసలని
వున్నట్టుండి నానేలా చేయడం అసాధ్యం. కాబట్టి డబ్బుతో అన్ని పనులు సాధ్యం
కావు’ అనే అర్ధం వచ్చే ఒక సన్నివేశం
బాపూరమణల అందాల రాముడు సినిమాలో వుంది.
విస్తరిస్తున్న
కరోనాని మట్టుపెట్టడం అనేది తమ ఒక్కరి చేతిలో లేదని అటు పాలకులకు, ఇటు పాలితులకు తెలిసివచ్చేటప్పటికి చాలా పుణ్య కాలం గడిచిపోయింది. ఈ అంతుపట్టని
రోగాన్ని అంతం చేసే వాక్సిన్ తయారు చేయడం అనేది ఏడాదిలోపే పూర్తి చేయడం భారత దేశం
సాధించిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు.
ఈలోగా
పులిమీద పుట్రలా కరోనా రెండో దాడి
మొదలయింది. మొదటిదే నయమనిపించేలా వుంది ఈ రెండోది. అసలు కరోనా గురించే జనాలకు సరైన
అవగాహన లేదు అనుకునే తరుణంలో ఈ వ్యాధి గురించి రకరకాల కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.
కలరా వంటి ఇతరేతర
వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు.
చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా
సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని ఐసొలేషన్ గదుల్లో ఉంచాల్సిన పరిస్థితి. ఇన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో
వ్యాధిని గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ
హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం
అన్నారు నిపుణులు. రోగి చనిపోయిన తర్వాత
కూడా సొంత కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుడి శరీరాన్ని తాకలేని పరిస్థితి. సాంప్రదాయాల
ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. ఈ స్థితి పగవాడికి కూడా రాకూడదు
అని మౌనంగా రోదించిన కుటుంబాలు ఎన్నో! ఎన్నెన్నో!!
కరోనా పాజిటివ్ అని
తెలియగానే సొంత మనుషులు, సాటి మనుషుల ప్రవర్తనలో నెగెటివ్ ధోరణి కనిపించడం మానవ
మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఈ సన్నివేశాలు అన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వం
నాటివి కావు. ఏడాదిక్రితం వీటన్నిటికీ మనమే ప్రత్యక్ష సాక్షులం.
మిగిలిన అంటు
వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు.
రైళ్ళు, బస్సులు, కార్లు విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై
ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి
నుంచి మనిషికి ఈ వ్యాధి సోకే ప్రమాదం కారణంగా ఈ
వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన
పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక
వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క పొంచి
ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటించాయి.
ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి
మరొకరికి ఈ వ్యాధిని సంక్రమింప చేసే ప్రమాదం
ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన
పరిస్తితి కూడా దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో
ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. విదేశాల నుంచి
వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని అంటున్నారు.
డాక్టర్లను, నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన
రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆక్సిజన్ ఎక్కడ నుంచి తెస్తారు. నిజానికి చుట్టూ వున్న
గాలిలో ఆక్సిజన్ వుంటుంది. కానీ దాన్ని రోగులకు అవసరమయ్యే రీతిలో తయారు చేయడం, సరఫరా చేయడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పనా! ఎంత అధికారం వున్నా, ఎన్ని వనరులు వున్నా, ఎంత చిత్తశుద్ధి వున్నా కొన్ని సాధ్యం
కానివి వుంటాయి. వీటికి మంత్రదండాలు వుండవు. రెండో వేవ్ సమయంలో ఈ ఆక్సిజన్ కొరత
వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు లెక్కలు చెప్పడం కష్టం.
భారత సైన్యంలో ఇఎంఇ అనే
ఒక విభాగం వుంది. దాని ప్రధాన కార్యాలయం సికిందరాబాదు. రేడియో విలేకరిగా కొన్ని
డజన్ల సార్లు ఈ విభాగం చేసే కార్యకలాపాలు దగ్గర నుండి చూసే అవకాశం నాకు లభించింది.
సైన్యంలో ముందు భాగాన వుండి పోరాడే సైనికులకు అవసరం అయ్యే సరఫరాలను ఈ విభాగం కంటికి
రెప్పలా కనిపెట్టి అందిస్తుంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలు, వాటి నమూనాలు, అభివృద్ధి సమస్తం ఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది.
యుద్ధ రంగాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడే సైనికులకు ఇది వెనకనుండి మద్దతు ఇస్తుంది.
యుద్ధ సమయాల్లో దీని ప్రాధాన్యత చాలా వుంటుంది.
కరోనాపై యుద్ధంలో కూడా
ముందుండి పోరాడే డాక్టర్లు, నర్సులు, ఇతర సాంకేతిక వైద్య సిబ్బంది, రోగులకు అవసరం అయ్యే సరఫరాలను సరిగా అందేటట్టు చూడడానికి
ఇటువంటి ప్రత్యేక విభాగం ఆవశ్యకత చాలా వుందనిపిస్తోంది. ఈ దిశగా సరైన అడుగులు
పడ్డాయా అంటే ఔను అని చప్పున జవాబు చెప్పడం కష్టం.
మళ్ళీ
లాక్ డౌన్ మాటలు వినపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు కూడా. అయితే
ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
కిందటిసారి
హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సమాజంలో అనేక మంది, ముఖ్యంగా రెక్కాడితేకాని డొక్కాడని
బీదాబిక్కీ, వీధి వ్యాపారులు పలు ఇబ్బందులు
పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు. లాక్ డౌన్ కారణంగా పని దొరక్క, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి రవాణా
సదుపాయాలు లేక, సామాను నెత్తిన పెట్టుకుని మైళ్లకు మైళ్ళు నడిచి వెళ్ళిన దృశ్యాలు ఇంకా
జనం మనస్సులో పచ్చిగానే వున్నాయి. ఒకవేళ
లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి మరో సారి ఎదురయితే ఈసారి ముందు జాగ్రత్త
చర్యలు తీసుకుని వలస కూలీలు అందరూ సొంత ఊళ్లకు వెళ్లి పోయేలా వారికి తగిన
వ్యవధానం ఇస్తూ లాక్ డౌన్ ప్రకటించాలి. లేనిపక్షంలో. గతంలో చూసిన హృదయవిదారక
దృశ్యాలే పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.
సాధారణ
మనుషులకు విషయాలను గుర్తు పెట్టుకోవడం సులభం కాదు. అన్ని విషయాలు దీర్ఘకాలం గుర్తు
పెట్టుకోలేరు. అందుకే కాబోలు కొద్ది కాలం క్రితం కరోనాతో పడ్డ బాధలు, ఇబ్బందులు అన్నీ మరచిపోయి నిర్లక్ష్యంగా వుంటున్నారు.
కరోనా వ్యాధి సోకకుండా ఉపయోగపడే మాస్కులను ధరించక పొతే వెయ్యి రూపాయలు జరిమానాని
అధికారులు ప్రకటించారు అంటే ఈ విషయంలో ప్రజల నిర్లిప్తత ఏ స్థాయిలో వుందో అర్ధం
అవుతోంది.
కొద్దికాలం
క్రితం తమ ఆత్మీయులను అర్ధంతరంగా పొట్టన బెట్టుకున్న ఈ భయంకర వ్యాధి వల్ల కలిగిన
చేదు అనుభవాలను మరచిపోయి పెళ్ళిళ్ళు, పేరంటాలు, సినిమాలు, సభలు
అంటూ గుంపులు గుంపులుగా జనం ఒకచోట చేరడం చూస్తుంటే ఖచ్చితంగా చేసిన పొరబాటే
మళ్ళీ చేస్తున్నారు అనిపిస్తోంది.
కొత్తగా
కోరలు చాస్తున్న ఒమిక్రాన్ బారిన పడకుండా వుండాలి అంటే
అప్రమత్తంగా వుండాలి. కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు
హెచ్చరికలు చేసే బదులు, లోగడ జరిగిన
పొరబాట్లు పునరావృతం కాకుండా చూడాలి.
విదేశీ ప్రయాణీకులపై ఇప్పటికే అనేక దేశాలు
ఆంక్షలు విధించాయి. మన దేశంలో ఇంకా తాత్సారం జరుగుతోందని అనిపిస్తోంది. నిన్న
ముంబై నుంచి మాకు తెలిసిన కుటుంబం హైదరాబాదు వచ్చింది. నిలబడి ప్రయాణించడం మినహా
మొత్తం విమానం అంతా ఒక్క సీటు ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయి వుందట. కోవిడ్ నిబంధనలను పాటిస్తున్న దాఖలా లేదట. చేతులు
కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలా కాకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు కాలయాపన
చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం
అవసరం.
ప్రభుత్వాల మీదనే నెపం వేయకుండా ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి మసలు కోవాలి. వ్యాధిపై
పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు
కావాలి.
ఇక్కడ
కేంద్రమా, రాష్ట్రాలా అని కాదు, పాలకులు అందరికీ ఒకే విజ్ఞప్తి.
అనుభవాల
నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోతే ఈ దేశాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు.
(05-12-2021)
చిత్తశుద్ధి – భండారు శ్రీనివాసరావు
చిత్తం శివుని మీదా, భక్తి చెప్పుల మీదా అనే సామెత వుంది.
మనుషుల్లో
రకరకాలు. తాము ఒక్కరే పరిశుద్దాత్ములమని నమ్ముతూ, ఇతరులను గురించి నీచంగా
మాట్లాడడం అనే హిపోక్రసీ వారి రక్తంలో వుంటుంది. దీనికి సంబంధించిన కధ ఒకటి చిన్నతనంలో
మనలో చాలా మంది చదివే ఉంటాము.
ఓ ఊళ్ళో పురాణ కాలక్షేపాలతో ఊరి జనానికి మంచేదో, చెడేదో చెప్పే పండితుడు ఉండేవాడు.
ఆయన అనునిత్యం దైవనామ స్మరణలోనే జీవితం
గడుపుతుంటాడు. ఆయన ప్రవచనాలు చెప్పే
ప్రదేశానికి దగ్గరలోనే ఒక వేశ్య ఇల్లు. ఆ ఇంటికి వచ్చిపోయే విటులను చూస్తూ ఆ పండితుడు బాధ పడేవాడు. ఇలా పాపకర్మలు చేసేవాళ్ళకు నరకం
తప్పదు అని భావించేవాడు. ఆ వేశ్య ఇంటికి ఎవరు వచ్చినా ఒక గులక రాయి వేసి లెక్కలు
పెట్టేవాడు. కొన్నాళ్ళకు ఆ గులక రాళ్లు ఓ చిన్న గుట్టగా తయారయ్యాయి. ఆమెని పిలిచి
చెప్పాడు,
చూసావుగా నీ పాపాల గుట్ట ఎలా పెరుగుతోందో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ
పాపిష్టి జీవితానికి స్వస్తి చెప్పి రామా కృష్ణా అంటూ కాలం గడుపు అని సలహా
ఇచ్చాడు.
మరి
కొన్నాళ్ళకి ఆ ఇద్దరికీ అంత్యకాలం సమీపించింది. స్వర్గం నుంచి వచ్చిన దైవ భటులు ఆ
వేశ్యను సకల మర్యాదలతో తీసుకువెళ్ళారు. పండితుడిని తీసుకుపోవడానికి యమభటులు
పాశాలతో వచ్చారు.
“నిత్యం
దైవారాధనలో గడిపే నాకు నరకం ఏమిటి, యావత్ జీవితం పాపకర్మలతో గడిపిన
ఆమెకు స్వర్గ ప్రాప్తి ఏమిటి అని నిలదీశాడు.
అప్పుడు
ఆ యమ భటులు చెప్పిన సమాధానమే ఈ చిత్తశుద్ధి వ్యాసానికి కేంద్ర బిందువు.
‘నిజమే
మీరు ప్రతి నిమిషం భగవన్నామస్మరణలోనే గడుపుతున్నారు. కానీ మీ చిత్తం మాత్రం ఆమె
ఇంటికి వచ్చి పోయే విటులను లెక్కించడం పైనే వుంది. ఆమె తన దరిద్రపు బతుకును
ఏవగించుకుంటూ, కనీసం
వచ్చే జన్మలో అయినా తనకి మంచి జీవితం ప్రసాదించమని రోజూ పడుకునే ముందు దేవుడ్ని
ఒకేఒకసారి కోరుకునేది. ఆ క్షణంలో ఆమెకు
వేరే ధ్యాస వుండేది కాదు. మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థించేది. ఆమె చిత్తశుద్ధికి
భగవంతుడు కరుణించి స్వర్గం అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ ఇతరులలోని చెడును తప్పుబట్టే చెడుస్వభావం కారణంగా నీకు నరకం ప్రాప్తించింది”
రోశయ్య గారితో కాసేపు – భండారు శ్రీనివాసరావు
పాత విషయాలు కదా తేదీలు సంవత్సరాలు సరిగా గుర్తుండడం లేదు.
తిరుపతికి దగ్గరలో, మరీ అంత దగ్గర కాదు, శ్రీ సిటీ అనే ఒక సెజ్ రూపు
దిద్దుకుంటోంది. ఆ సంస్థ పీఆర్వో కి మాకు
ఆ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలనే సత్సంకల్పం కలిగింది. ఈ బృందంలో జర్నలిస్టు అవుట్ లుక్ ఎమ్మెస్ శంకర్, జ్వాలా
నేను. తిరుపతిలో స్వామి దర్శనం అనే మాట మమ్మల్ని మరో మాట మాట్లాడనివ్వలేదు.
హైదరాబాదు నుంచి విమానంలో చెన్నై వెళ్లి, అక్కడి
నుంచి శ్రీ సిటీవాళ్ళు ఏర్పాటు చేసిన కారులో అక్కడికి చేరడం మా ప్రోగ్రాం.
సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్
పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్
భవన్ కు ఫోన్ చేసి తుల్జానంద్ సింగ్ తో మాట్లాడాడు. ఆయన వెంటనే రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఒక
రకంగా చెప్పాలంటే చెన్నైలో దిగేంతవరకు ఈ రాజ్ భవన్ సందర్శన కార్యక్రమం లేదు. ఏ
వూరు పోయినా ఆ వూళ్ళో ఎవరెవరు తెలిసిన వాళ్ళు వున్నారో వాళ్లకి ఫోను చేయడం కాని, వీలయితే కలిసిరావడం కానీ జ్వాలా పీఆర్ లో ఒక భాగం.
తుల్జానంద్ రండి రండి అంటూ ఆహ్వానం
పలకడం, మేము ప్రయాణిస్తున్న వాహనం రూటు
మార్చుకుని రాజ్ భవన్ లోకి దూసుకుపోవడం జరిగింది. లోపలకు వెళ్ళగానే అప్పుడే
వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా పేరుతొ
పలకరించి, ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే
వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో
వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం. ఎప్పటెప్పటివో సంగతులు చెప్పారు. తెనాలి, గుంటూరు, విలేకరులను ఆయన పేర్లతో సహా గుర్తు
పెట్టుకోవడం గమనించి ముచ్చటేసింది.
పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు
దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ
కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం
బాగా కుదించుకుపోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్
నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా
పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.
'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ
పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'
చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకున్న సంజాయిషీ అది.
కాసేపు కబుర్లు చెప్పుకుని, తుల్జానంద్ సింగ్ ఫోటోలు తీయగా తీయించుకుని, రోశయ్య
గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పి మళ్ళీ రోడ్డున
పడ్డాము.
4, డిసెంబర్ 2021, శనివారం
కబుర్లు చెబుతూ రోశయ్య గారు, నిద్ర పోతూ నేను
ఆరోజు శుక్రవారం. అసెంబ్లీ భాషలో UNOFFICIAL DAY అంటారు. అంటే ఆరోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వుండదు. (అంటే మా బోంట్లకు పెద్ద పనేమీ వుండదు).
నేను ఆ రెండూ చూసుకుని ఎదురుగానే వున్న మా
రేడియోకి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాను. ఈలోగా మంత్రి రోశయ్య గారు మా న్యూస్
యూనిట్లోకి హడావిడిగా వచ్చి, ‘చూడు
శ్రీనివాసరావ్. రేపూ,
ఎల్లుండీ (అసెంబ్లీకి} సెలవు కదా! ఖమ్మంలో మా వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టారు. నేను
మళ్ళీ అయిదింటికి వస్తాను. ఖమ్మం వెళ్లి ఆదివారం ఉదయం కల్లా వచ్చేద్దాం. మీ ఊరే
కదా!’ అంటూ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.
సాధారణంగా నేను మధ్యాన్నం ఇంటికి వెళ్లి
భోంచేస్తాను. ఇక ఆ రోజుకి కామత్ హోటల్లో భోంచేసి ఫోన్ చేసి మా ఆవిడకు చెప్పాను,
ఖమ్మం వెడుతున్నాను,
ఎల్లుండి వస్తాను అని. ఆవిడ ఓ జత బట్టలు ఓ బ్రీఫ్ కేసులో సర్ది, పనివాళ్లకు ఇచ్చి,
మా ఆస్థాన ఆటో డ్రైవర్ (పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్ళే ఆటో) తో రేడియో స్టేషన్
కు పంపింది.
అన్నట్టే ఆ రోజు సాయంత్రం రోశయ్య గారు మా ఆఫీసుకి
వచ్చారు. నేను ఆయనతో కలిసి కారెక్కాను.
ఊరుదాటేంత వరకు రోశయ్య గారు ఏవో కబుర్లు
చెబుతున్నారు. కామత్ హోటల్ సాంబార్ భోజనం మహిమ ఏమో తెలియదు, నాకు
మాగన్నుగా నిద్ర పట్టింది. పైగా ఏసీ కారు.
లేచి చూసేసరికి కారు సూర్యాపేట దాటింది.
నాకు సిగ్గేసింది, ఆయన ఏమనుకున్నారో ఏమో అని.
కానీ ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు.
అసెంబ్లీ వర్క్ కదా అలసిపోయి ఉంటావు అని
ఊరుకున్నారు.
ఇలాంటి ఉదాత్తులతో సన్నిహితంగా వ్యవహరించే అవకాశం
ఇచ్చిన ఆకాశవాణికి నమోవాకాలు.
Bellow
Photo: Sharing Dais with Shri Rosaiah
(02-12-2021)