22, నవంబర్ 2021, సోమవారం

అమెరికాలో మాస్కో - భండారు శ్రీనివాసరావు

 అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని, ‘ఢిల్లీ జనాభా యెంత’ అని అడిగితే 'తొమ్మిదివేల'ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి,  ‘రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి లెక్కల ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని బల్లగుద్ది మరీ చెబుతాడు.

మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ – హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ, పలకడం మాత్రం డెల్-హై అనే.

ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క ఢిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. సుమారు మూడు దశాబ్దాల   క్రితం వరకూ అమెరికాతో ‘ఉప్పూ నిప్పూ’ వంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ( చాలామంది మాస్కో అని పలికే  రష్యా రాజధాని మాస్కోని రష్యన్లు మాస్కవా అంటారు. మాస్కవా నదీ తీరంలో వున్న నగరం కాబట్టి ఆ పేరు పెట్టారని ప్రతీతి)

ఈ మాదిరిగానే లండన్, బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు ఈ అమెరికాలోని  పట్టణాలకు వున్నాయి.

కింది ఫోటో:  పుష్కరం క్రితం కుటుంబంతో కలిసి అమెరికాలోని  లీవెన్ వర్త్ నగర సందర్శన




 

21, నవంబర్ 2021, ఆదివారం

మా బావగారు చెప్పిన నెహ్రూ కధ - భండారు శ్రీనివాసరావు

 మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -

ఓరోజు బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'


(కొలిపాక రామచంద్రరావు)


అనువాదం అరాచకం – భండారు శ్రీనివాసరావు

(ఈరోజు  నవంబరు  21 తేదీ ఆదివారం  ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) 

అనువాదం ముఖ్యోద్దేశం అర్ధం కావడం అనేవారు కీర్తిశేషులు, పదప్రయోగ దురంధరులు, ఆర్వీయార్ గా సుప్రసిద్దులయిన రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు.

నేను పాతికేళ్ళకు పూర్వం మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం అనువాదం చేసుకుని ప్రసారం చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు. అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో, మాస్కోలో నేనున్న రోజుల్లోనే మాస్కో రాదుగప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఇప్పుడు కీర్తిశేషులు) నాకు అనువాద సమస్యలుఅనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
రారాగా ప్రసిద్ధులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. (రెడ్డి గారు కూడా అనేక సంవత్సరాలపాటు మాస్కోలో అనువాదకుడిగా పనిచేశారు) అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. అనువాదం ఎలా చేయాలో, ఎలా చేస్తే మూలానికి దూరం జరగకుండా చదువరికి అర్ధం అయ్యేలా సుబోధకంగా అనువాదం ఎలా చేయొచ్చో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరాలి. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
మాస్కోలో వారాంతపు రోజుల్లో సాయంకాలక్షేపాలు చేసేటప్పుడు, నాకూ ఆర్వీయార్ కు నడుమ తెలుగు భాష, అనువాదాలకు చెందిన అనేక విషయాలు దొర్లేవి.
ఆయన అనేక కబుర్లు ఆసక్తికరంగా చెప్పేవారు.
పరమహంస విద్యానాధ స్వామివారు, షేక్స్పియర్ పేరుని శూలపాణిఅని అనువదించారుట. కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రలో, డిస్ట్రిక్ట్ జడ్జ్ కి ప్రాడ్వివాకుడుఅని, మెయిన్ రోడ్ కి ప్రధాన రధ్యఅనీ, రైల్వే లైన్ కి ఇనుపదారి, అయోమార్గం అనీ ఇలా అనువాదాలు కనిపిస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా హోం వర్క్ కి గైహికముఅనీ, డిక్టేషన్ కి ఉక్త లేఖనంఅనీ తెలుగు పదాలు ఇచ్చారట.
అయితే, ఈ తెలుగు ప్రయోగాలకంటే,  వాటి తాలూకు అసలు ఇంగ్లీష్ పదాలే వాడుకలో ప్రాచుర్యం పొందాయి.
వాటి అర్ధం అందరికీ తెలిసేటప్పుడు ఇక అయోమయ పదకల్పన ఎందుకన్నది ఆర్వీయార్ అభిప్రాయం.
విద్యార్ధి కల్పతరువు అనే పుస్తకం వుంది. ఇప్పుడు దొరుకుతున్నదో లేదో తెలవదు. అందులో ధర్మామీటర్ (తాపమానిని), కెమెరా (ఛాయాగ్రాహక యంత్రం), టెలిగ్రాఫ్ ( తాజావార్తా యంత్రం), ఇలా అర్ధ వివరణ ఇచ్చారు. అయితే అర్ధం అవడం ముఖ్యమా అనువాదం ముఖ్యమా అనే ప్రశ్నకు జవాబు దొరకాలి.
సర్వీస్ కమీషన్ కి తెలుగేమిటి? దాన్ని అనువాదం చేసి అదే ప్రశ్న అడిగితే ఎవ్వరికీ ఉద్యోగాలు రావు అనేవారు రావు గారు.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు కలం కూలీజీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లోని  ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ సరిపెట్టుకోమంటున్నారు.
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ గురించిన వార్త  కొన్నాళ్ళ క్రితం ఒక తెలుగు పత్రికలో వచ్చింది. మిషన్ అనే ఇంగ్లీష్ పదానికి మర, యంత్రంఅని భాష్యం చెప్పుకున్న ఆ విలేకరి, మిషన్ కాకతీయను అనువాదం చేయబోయి యంత్ర కాకతీయఅని రాశాడు. అతడి మాతృభాషాభిమానం మెచ్చదగినదే. అయితే మిషన్, మెషిన్ నడుమ గందరగోళంలో ఆయన రెండో దాన్నే ఎంచుకుని యంత్ర కాకతీయ అనే కొత్త పద ప్రయోగాన్ని తన పాఠకులపై రుద్దాడు. అతగాడి పొరబాటో, గ్రహపాటో కాని, సోషల్ మీడియా దాన్ని అందిపుచ్చుకుని చర్చోపచర్చలతో చీల్చి చెండాడింది.
ఈ పొరబాటు ఆ వార్త పంపిన విలేకరిదా, చూసి ప్రచురించిన సంపాదక బృందానిదా, లేదా తన పత్రికలో ఏమి వస్తున్నదో చదివే తీరికలేని పత్రికా సంపాదకుడిదా అంటూ అనేకానేక జవాబులేని ప్రశ్నలతో ఈ చర్చ అనంతంగా కొన్నాళ్ళు సాగింది.
సరే! ఇదొక కధ.
అర్ధం కానిదాన్ని గ్రీక్ అండ్ లాటిన్ అనే ఒక్క మాటతో కొట్టేయడం మనకు తెలిసిందే.
లాటిన్ భాషలో ఇగ్నోటం పెర్ ఇగ్నోటియస్అని ఒక పద ప్రయోగం వుంది. ఒక పట్టాన కొరుకుడు పడని ఈ లాటిన్ పదప్రయోగానికీ ఓ అర్ధం వుంది. వివరించబోయిన విషయం కంటే వివరణ క్లిష్టంగా వుండడం అనేది దీని మూలార్ధం.

నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి తియ్యటి తెనుగు తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.
కాబట్టి, రాసేది అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి.
అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు. (21-11-21)

సమాజంపై టీవీ ప్రభావం – భండారు శ్రీనివాసరావు

 (నవంబర్, 21, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం)

 ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం. 'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు. హింస ఎక్కడ లేదు? నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్ళల్లో, వీధుల్లో, మాటల్లో, చర్చల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు, సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా డ్రాయింగ్ రూముల్లోకి, అక్కడినుంచి ఎకాయెకిన ఇంటిల్లిపాదీ మెదళ్ళలోకీ జొరబడుతోంది. విశ్వవ్యాప్తంగా అల్లుకుపోయిన టెలివిజన్ చానళ్ళ వల్ల మంచి ఏమీ జరగడం లేదా అంటే పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్తితి. పదేళ్ళక్రితం అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. ‘మీ ఈఅభివృద్దికి కారణం ఏవిట’న్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి అంశానికి సంబంధించినది వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా (అలనాటి) దూరదర్శన్ లో క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ, తద్వారా పొందిన మానసిక వికాసం తరువాత జీవితంలో తమకు అక్కరకు వచ్చిందనీ వాళ్ళు చెప్పారు. టీవీల వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. లాహోర్ లో ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్ లో చదువుకునే విద్యార్ధులు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. పిల్లల మీద ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం అన్న అంశంపై వారు పరిశీలన జరిపారు. వాళ్ళ లెక్క ప్రకారం- అక్కడి పిల్లల్లో, పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని, ఓ గంట టీవీ గేమ్స్ చూస్తారట. ఓ యిరవయి నిమిషాలు రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ ఖర్చు చేస్తారని తేలింది. మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల ఇమాజినేటివ్ పవర్ (ఆలోచించే సామర్ధ్యం) పెరుగుతుందన్నారు. సృజనాత్మకత మెరుగుపడుతుందన్నారు. కొత్త భాషలు, సరికొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీల వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు, టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను అదుపుచేసే విధానం వుండాలన్నారు. పిల్లలు చూసే టీవీ కార్యక్రమాలపై పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. భారత రాజ్యాంగంలోని యిరవై ఒకటవ అధికరణం ప్రజలందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రైట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు కల్పిస్తోందని , గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం రాజ్యాంగంలోని ఈ ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ అనేక టీవీ ఛానళ్ళు దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. వంటలు, ఆరోగ్యం, విద్య – ఈ అంశాలమీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సమయం సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. ఆకర్షణీయమయిన టీవీ ప్రకటనలు చూసే పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. వాటిని చూసి కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి ఈ డ్రాయింగ్ రూం టీవీలే కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం అలా ఏదో ఒక ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో, సీరియళ్లు చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసుకోవడంతోనే సరిపోతోంది. పిల్లలని చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే వాటికి ఎంతగా అలవాటు పడిపోయారో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడయి తోచు చందాన, ఈ నాడు ప్రయివేటు టీవీ ఛానళ్ళు కుటుంబంలో ప్రతిఒక్కరికీ కావాల్సిన కార్యక్రమాలను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ' దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే 'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు, చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలు కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు. ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అశ్లీలాన్ని అరికట్టే సదాశయంతో రూపొందించే ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. అలా అని టీవీ చానళ్ళ వల్ల ఎలాటి ప్రయోజనాలు లేవనే నిర్ధారణకు రావడం కూడా సబబు కాదు. సమకాలీన రాజకీయాలపట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెరగడానికి టీవీలు దోహదం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం అక్కడక్కడా అరుదుగా కానవచ్చిన టీవీలు ఈనాడు తామరతంపరగా దేశం నలుదిక్కులా అల్లుకుపోయాయి. ఇంతటి విస్తృతి కలిగిన ప్రసార మాధ్యమం కాబట్టే టీవీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేకుండా పోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోను కలిపి వేల సంఖ్యలో టీవీ నెట్ వర్కులు పనిచేస్తున్నాయి. పలు దేశాల్లో టీవీ చానళ్ళ సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టే దశను దాటిపోయింది. బహామాస్, అంటార్కిటికా, ఆండోరాలలో మాత్రమే ఒకే ఒక టీవీ ఛానల్ చొప్పున వుంది. మనదేశం సంగతి, అందులో రెండు తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర లేదు. దేశంలో రెండేళ్ళ నాటి గణాంకాల ప్రకారం 1148 టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. వీటిల్లో వందకు పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమెరికాలో సగటున రోజుకు సుమారు నాలుగు గంటలు టీవీ చూస్తుంటే మన దగ్గర రోజుకు టీవీ చూసే సమయం సగటున దానికి రెట్టింపు ఉంటోంది. జనాభా ఎక్కువ కావడం, వారిలో సరయిన పని లేని వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా వుండడం అందుకు కారణంగా చెబుతున్నారు. మనకంటే జనాభా ఎక్కువ వున్న చైనాలో సగటున టీవీ చూసే సమయం కొంచెం అటూ ఇటూగా రెండున్నర గంటలేనట. ఇదో వైచిత్రి. (21-11-2015)