11, నవంబర్ 2021, గురువారం

భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య

 భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య అనే శీర్షికతో నేను నిర్వహిస్తున్న బ్లాగుకు, అంతర్జాలం నుంచి ఎంపిక చేసిన వంద ఉత్తమ బ్లాగుల్లో మూడో స్థానం లభించినందుకు సంతోషిస్తూ, ఇందుకు సహాయ సహకారాలు అందించిన పాఠకులకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

LINK:

100 Great blogs (blogvedika100blogs.blogspot.com)

చెన్నై కన్నీటి వరదై – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు గురువారం ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)
2015 డిసెంబరులో తమిళనాడు రాజధాని చెన్నై నగరం వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమంటూ అప్పుడు లెక్కలు చెప్పారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూసిన వారికి అది నిజమే అనిపించింది.
మళ్ళీ ఆరేళ్ల తర్వాత అవే దృశ్యాలు.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకున్న దాఖలా లేదు.
ఈసారి ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా నడుం కట్టి సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండడం ముదావహం.
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం. జరిగిన నష్టం కొండంతగా వున్నప్పుడు ఎంతటి సాయం అయినా రవ్వంతగా అనిపించడం సహజం.
చుట్టూ నీళ్ళే! కానీ, గుక్కెడు కూడా అవి తాగడానికి పనికి రావు. అరకొర విద్యుత్ సరఫరా అవుతుంటేనే సర్దుకుపోవడం కష్టం. అలాటిది రోజుల తరబడి అంధకారం. పక్కింటికి పోవాలంటేనే పదిసార్లు తాళాలు లాగిచూసుకుని, అనేక జాగ్రత్తలు చూసుకుని అడుగు బయట పెట్టే రోజులు. అలాటిది, పొరుగు వారితో కూడా ఒక మాట చెప్పకుండా, కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ, ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా నడుంలోతు నీళ్ళల్లో దాదాపు ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్తితి. చంటి పిల్లలకు పాలు, పెద్దవారికి వేళకు తిండీ మందులు సరి చూసుకునే వ్యవధానం వుండదు. ఒక కష్టం కాదు, ఒక ఇబ్బంది కాదు, పగవారికి కూడా రాకూడదు అనుకునే రీతిలో, పక్కవాడికి కూడా చెప్పుకోవడానికి వీలులేని పరిస్తితిలో, ప్రాణాలు దక్కించుకోవడం ఎల్లా అని, దిక్కుతోచని స్తితిలో కాలం గడపడం అంటే యెంత దుర్భరమో చెన్నై ప్రజలకు అనుభవంలోకి వచ్చివుంటుంది. ఆ సమయంలో వారి మానసిక స్తితి గురించి ఊహించుకోవడం కూడా దుర్భరం. ప్రస్తుతం చెన్నై వాసుల పరిస్తితి ఎలావుందంటే వర్షం పేరు చెబితేనే వారికి కంటి మీద కునుకు వుండడం లేదు. ఆకాశం వైపు చూస్తున్నారు, మళ్ళీ వాన కురుస్తుందేమో అన్న భయంతో. ఆకాశం వైపే చూస్తున్నారు ఎవరయినా హెలికాప్టర్ లో వచ్చి ఆదుకుంటారేమో అనే ఆశతో. ఆశల సంగతేమో కానీ భయాలు మాత్రం నిజమవుతున్నాయి
తుపాను, భూకంపాల వంటివి సంభవించినప్పుడు జరిగిన నష్టం ఏపాటిదన్నది రోజులు గడిస్తే కానీ పూర్తిగా అవగతం కాదు. వాస్తవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ముందు కంటికి కనిపించిన దానికంటే అధికంగా వుండే అవకాశాలే ఎక్కువ.
ఇలాటి ప్రకృతి వైపరీత్యాలు గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే. వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే. ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులు కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం.
బ్రిటిష్ వారి కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో మిగిలింది ఇదే. జరిగింది ఇదే. భారీ వర్షాలకు చెన్నపట్నం మునిగిపోయింది అని జనాలు వింతగా చెప్పుకునే విషమ పరిస్తితి.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను, ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. చెన్నై ప్రజలు కూడా గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంబై పౌరుల మాదిరిగానే అత్యంత నిబ్బరంగా వ్యవహరిస్తున్న సంగతి గమనార్హం.
(EOM)



10, నవంబర్ 2021, బుధవారం

ప్రభుత్వ ధనం

 

మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని కలెక్టర్ గారితో చెప్పారు.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
మా అన్నయ్య తరవాత అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస మరణం పొందారు.


(ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు కుడి వైపు కూర్చున్నది భండారు పర్వతాల రావు )


(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు చెప్పిన విశేషాలు ఆధారంగా)

9, నవంబర్ 2021, మంగళవారం

2016 నాటి నోట్ల రద్దు ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయని కొందరు, రావడం లేదని మరికొందరు వాదించుకొనుచున్నారు. మీరు ఎవరితో ఏకీవభించెదరు ఎడిటర్జీ?”

ఇద్దరితో..”

అదెలా?”

అంటే ఇలా. చెబుతాను ఇనుకో!.....సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. తాము ఒకటి నమ్ముతూ దాన్నే ఇతరులు కూడా నమ్మి తీరాలనే మనస్తత్వం ఇందులో ప్రబలంగా వుండడమే దీనికి కారణం”

మరి ఏది దారి?”

కంటితో చూసి రుజువు చేసుకోవడమే... నిన్న కాక మొన్న మా కజిన్ వాళ్ళు అరకు టూరు వెళ్లివచ్చారు. వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని ఏటీఎంలు పనిచేస్తూనే వున్నాయి. డబ్బులు దొరుకుతూనే వున్నాయి. అంతే కాదు, చిన్న షాపుల్లో చిన్న వస్తువు కొనుక్కుని రెండువేల నోటు ఇచ్చినా మరో మాట అడగకుండా చిల్లర లెక్కపెట్టి ఇస్తున్నారట. పైగా కొత్త అయిదు వందల నోట్లు పుష్కలంగా దొరుకుతున్నాయట. ఇన్ని ‘ట’ లు వున్నాయని నమ్మను అనబోకు. మా కజిన్ చెప్పింది మరి. అదెప్పుడూ అబద్ధం చెప్పదు. మరి హైదరాబాదులో ఈ గొడవ ఏమిటి? అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకు?”

అది అరకు. ఇది హైదరాబాదు. పెద్ద నగరం. పెద్ద జనాభా. పెద్ద నోట్ల అవసరం ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడ కొరత. అందుకే ముందే చెప్పాను, రెండు వాదనలు నిజమే అని. విషయం విడమరచి చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత? పగలు పన్నెండు గంటలు. అమెరికాలో వున్న మీ అబ్బాయికి ఫోను చేసి కనుక్కో. రాత్రి పన్నెండు అంటాడు. అదీ నిజమే. ఇదీ నిజమే. అదన్న మాట”

(2nd January 2017)

పద్మ అవార్డులు అర్హులకే అందుతున్నాయా?

2016 నవంబరు ఎనిమిది రాత్రి – భండారు శ్రీనివాసరావు

 

1978 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.

ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.

జానకి రామన్ బొంబాయి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని, ఇదంతా చాలా గోప్యంగా జరగాలని రామన్ ను ఆదేశించారు.

ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.

అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.

భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.

సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు” అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం.

నల్ల డబ్బును సూట్ కేసుల్లో, దిండ్ల కవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది” అని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.

నాడు 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనత ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్ కు చెందిన మొరార్జీ దేశాయ్.

మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత అయిదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.

కాకపొతే అప్పటికన్నా ఈసారి మోడీ ప్రభుత్వం గోప్యతను మరింత పకడ్బందీగా పాటించినట్టు కనబడుతుంది.

ఆ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్ ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత గురించిన అంశం కానీ ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు సయితం సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు. ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారని, అప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. ఈ విషయంలో గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు ఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.

నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.

 

ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. “కొద్ది రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు” అనే భావన సర్వత్రా కనబడింది.

(08-11-2016)

 

ఒక రోగి వైరాగ్యం - భండారు శ్రీనివాసరావు

 

ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా.
నీరవ నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు చేసే చప్పుళ్ళు, యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ, ఈ ఆసుపత్రులూ అమాంతం ఈ లోకంనుంచి మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!
కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు. ఖరీదు కట్టని అవయవం అంటూ ఈ దేహంలో ఒక్కటయినా ఉందా?
ఒక్క రూపాయి కూడా మారు అడగకుండా, అమ్మ కడుపులో వుండగానే మనిషికి అన్నీ అమర్చి, ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?