8, నవంబర్ 2021, సోమవారం

పెద్ద నోట్ల రద్దుకు అయిదేళ్లు - భండారు శ్రీనివాసరావు

 నోట్ల రద్దు జరిగిన ఇరవై ఒకటో రోజు.

ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్ ఫోనుతో అనుసంధానం చేయగలిగాను. ఊబెర్ అనాలో ఒబెర్ అనాలో ఏదైతేనేం ఒక కారు బుక్ చేసి దిగాల్సిన చోట దర్జాగా దిగిపోయాను. జేబులో చేయి పెట్టేపని లేకుండానే ట్రాన్సాక్షన్ చిటికెలో జరిగిపోయింది. దిగుతూ డ్రైవర్ మొహంలోకి చూసాను. దిగాలుగా వున్నాడు. కదిలిస్తే కధ చెప్పాడు.

పెద్ద నోట్ల రద్దుకు పూర్వం అందరూ టాక్సీ ఫేర్ చెల్లించి దిగి పోయేవాళ్ళు. ఇప్పుడందరూ ఇలా పే చేసేసి అలా వెళ్ళిపోతున్నారు. వెనక డీసెల్ కొట్టించుకోవడానికి పాసింజర్లు ఇచ్చే పైకం డబ్బులు ఉండేవి. ఇప్పుడా డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. డ్రా చేసుకోవాలంటే ఓ పూట పనిపోతోంది. పెట్రోలు బంకుల్లో మాకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. చేసారేమో తెలవదు. ‘చేతుల్లో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు వుంటాయి, ఈ మాత్రం తెలవదా’ అంటే తెలవదు సారూ”

ఏం చెప్పను? నాదీ అదే పరిస్తితి.

పెద్ద నోట్ల రద్దు జరిగిన తొలిరోజుల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆర్ధిక గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు, సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం కలుగుతుంది.

ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.

నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.

ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి  అప్పటి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం హుందాగా వుంది.

ప్రధానమంత్రి మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అల్లాటప్పాది కాదు. మొత్తం జాతిని ప్రభావితం చేసే గొప్ప సాహసోపేత నిర్ణయం.

ఇన్నేళ్ళ స్వతంత్ర భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్లధనం అనే మాయరోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా!

రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.

అలాంటిముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా జాతి మొత్తానికి సంబంధించిన పెద్ద నోట్ల రద్దు వంటి కీలక విషయంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఇలా అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!

ఈ నిర్ణయం అమల్లో ఏవైనా అవతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవు. అయితే నల్ల ధనం గురించిన వ్యవహారం కాబట్టి, నోరుజారితే అసలుకే మోసం వస్తుందని, జాతి జనుల దృష్టిలో పలచబడి పోతామనే సంకోచంతో మనసులో ఎలా వున్నా కొన్ని ప్రతిపక్షాలు అంతగా విరుచుకు పడడం లేదు. అంచేత అవన్నీ ఈ నిర్ణయానికి ప్రతికూలతను బాహాటంగా ప్రకటించడం లేదు. ప్రతిపక్షాలంటే రాజకీయం చేస్తున్నాయని సరి పెట్టుకున్నా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాటేమిటి? వాటిని అయినా పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంటుంది కదా!

రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.

ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది. అది గురితప్పకుండా చూసుకుంటూ, సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు పడకుండా చూడడం పాలకుల బాధ్యత.

బాధలు, ఇబ్బందులు అనేవి నిజానికి సాపేక్షం (రెలెటివ్).

నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఎదురయ్యే అవస్థలను అన్నింటినీ స్కూటరువాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా మాత్రమే గుర్తున్నాయి.

ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మనం అనుకునే ఇబ్బందులు వేరు, మన పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్న ఇబ్బందే కదా! ఆ మాత్రం దేశం కోసం సర్డుకుపోలేరా అని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.

తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!

 

మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?

మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండి తనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.

నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశ ప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చను హరించడం వల్ల ఆ రోజుల్లో ప్రజలు యెంత ఉడ్డుగుడుచుకున్నదీ తొంభయ్యవ దశకం తరువాత జన్మించిన నేటి తరం మోడీ అభిమానులకి తెలిసే అవకాశం లేకపోవచ్చు.

ఎమర్జెన్సీ ప్రకటించిన తొలిరోజుల్లో ప్రత్యర్ధ రాజకీయ నాయకులను మినహాయిస్తే సామాన్య ప్రజలు చాలా ఊరట పొందారు. రైళ్ళు ఠ౦చనుగా వేళప్రకారం నడిచాయి. రోజులతరబడి ఆఫీసుల మొహం చూడని ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా వేళకు కార్యాలయాల్లో కనబడేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా లంచాలు అడగడానికి, తీసుకోవడానికి భయపడ్డారు. బెజవాడ వంటి పట్టణాల్లో ప్రజలు బహిరంగ మూత్ర విసర్జనకు స్వస్తి చెప్పారంటే తొలినాళ్లలో ఎమర్జెన్సీ అనేది ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ బుడగ పగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ ముసుగులో జరిగిన అనేక అత్యాచారాలు బయట పడ్డాయి. జాతి చెల్లించుకున్న మూల్యం ఏమిటన్నది తదనంతర కాలంలో వెలుగులోకి వచ్చింది. జనం కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఆ తరువాత జరిగింది చరిత్ర. ప్రజాగ్రహానికి గురయిన ఇందిర ప్రభుత్వం గద్దె దిగాల్సివచ్చింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అద్భుతాలు జరిగిపోగలవని ఎవ్వరూ అనుకోలేదు. కాకపొతే సాహసోపేత నిర్ణయం అని చాలామంది భావించారు. వారిలో నేను కూడా ఒకడ్ని.

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొకటన్న అభిప్రాయం బలపడసాగింది. పెద్ద నోట్లు కూడబెట్టి, పెద్ద పెద్ద మేడలు కట్టిన బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవరపడకపోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు కాలుమీద కాలువేసుకుని నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడాలేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొటమరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. మూడు వారాలు గడిచిపోతున్నా కష్టాలు, కడగండ్లు పెరుగుతూ పోవడం తప్ప ఉపశమనం కనుచూపు మేరలో కనబడక పోవడంతో వారిలో సహనం తగ్గిపోవడం ఆరంభమైంది.కాస్త ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నా’యని ప్రభుత్వం ఇస్తున్న భరోసా సామాన్యులను సంతృప్తి పరచ లేదు. నిజానికి ప్రజలకు వున్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే యాభయ్ రోజులు ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. ఎందుకంటే జనాలు ఆశాజీవులు. బతుకులు బాగుపడకపోతాయా అనే ఆశతోనే బతుకు బండి లాగడానికి అలవాటు పడ్డారు. అది రాజకీయులకు కూడా తెలుసు. అంచేతే ఆశకంటి కురుపు భయం లేకుండా ప్రజలకు ఆశలు కల్పిస్తూనే వుంటారు. వాళ్ళు కావాలని మరచిపోయే వాస్తవం ఒకటుంది. ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే ఆ జనమే ఓటుతో బుద్ది చెబుతారని. గతం చెబుతున్న నిలువెత్తు నిజం ఇది.

నిజంగా దేశంలో నల్లధనం లేకుండా చేస్తే మొత్తం జాతి మోడీకి రుణపడి వుంటుంది. ఈ విషయం నిశ్చయంగా చెప్పవచ్చు. ఒకవేళ వైఫల్యం చెందితే. ఆ పరిణామాలను ఊహల్లో భరించడం కూడా కష్టం. ఎమర్జెన్సీ గాయాలు మానడానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలిసిన వారికి ఈ భయం మరింత ఎక్కువగా వుంటుంది. అప్పట్లో ఎట్లాగో అట్లా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకోగలిగారు కనుక సరిపోయింది.

ఈనాటి సమస్య ఆర్ధిక వ్యవస్థకు సంబంధించినది. అత్యంత వేగంగా ఎదుగుతున్న దశలో ఎటువంటి అవాంతరం ఎదురయినా అభివృద్ధి కుంటుపడడమే కాదు, స్తంభించిపోయే ప్రమాదం కూడా వుంటుంది. ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఇవే. మంచి కోసం చేసే సాహసోపేత నిర్ణయాలు ఊహాతీత పరిణామాలకు దారి తీయకూడదు. ఆచితూచి చేయాల్సిన పనులను హడావిడిగా చేయడం వల్ల ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.

పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇబ్బందులు ఎలా వున్నా, జాతి మాత్రం పొదుపు మంత్రం పఠిస్తోంది. విచ్చలవిడిగా చేసే ఖర్చుకు కళ్ళెం పడింది. అనవసర కొనుగోళ్ళు నిలచిపోయాయి. అవసరం అయితేనే జేబులోంచి డబ్బు బయటకు తీసే పాత రోజులు వచ్చేశాయి. నిర్బంధ వ్యయ నియంత్రణ అమలవుతోంది.

అదే సమయంలో వచ్చిన జీతాల రోజు, ఫస్టు తారీఖు, వేతన జీవులకు చుక్కలు చూపించింది. తమ కష్టార్జితంలో కొంత తీసుకోవడానికి క్యూల్లో గంటలు గంటలు నిలబడాల్సి రావడం నిజంగా ఎన్నడూ ఎరుగని అనుభవమే. జీతం కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలువుకాళ్ళ జీతం, ఏవిటో చిత్రం. నెలసరి జీతాల వాళ్ళ పరిస్తితే ఇలా వుంటే దినసరి ఆదాయాలవారి సంగతి చెప్పనక్కర లేదు. చేతిలో పైసలు ఆడక చిరు వ్యాపారాల వాళ్ళు దిగాలు పడుతుంటే మరోపక్క భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లు బయట పడుతున్న సంఘటనలు, పెద్ద ఎత్తున జరుగుతున్నకరెన్సీ నోట్ల అక్రమ మార్పిళ్ళూ ప్రజలను విభ్రమానికి గురిచేస్తున్నాయి. ప్రయోగ విజయం పట్ల సందేహాలను పెంచుతున్నాయి.

నగదు రహిత భారతం ఆవిష్కరణ గురించి నేతాశ్రీలు చేస్తున్న ప్రసంగాలు సామాన్యులను నివ్వెర పరుస్తున్నాయి. పోస్ట్ కార్డు మొహమే చూసి ఎరుగని వాళ్లకు ఏటీఏం కార్డు ప్రయోజనాలు గురించి చెప్పడం వింతల్లోవింత. అన్నప్రాసననాడే ఆవకాయ కారం తినిపించినట్టుగా వుందని హేళన స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ఉచిత ఉద్బోధలు చేస్తున్న నాయకమణ్యులు ఒక్కసారంటే ఒక్కసారి ఆన్ లైన్లో ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ చేసి చూపించగలరా అనే మౌన ప్రశ్నకు జవాబు ఏదీ?

ఇవన్నీ చూస్తున్నప్పుడు గురి పెట్టిన బాణం సరయిన దిశలోనే వెడుతోందా, మధ్యలో దారితప్పుతోందా అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. నేషన్ వాంట్స్ టునో. జాతి తెలుసుకోవాలని అనుకుంటోంది.

అందుకే చెప్పేది.

నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో నరేంద్ర మోడీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోడీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు సైతం ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ ఈ ప్రయత్నంలో విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ, ఆయన పార్టీకి మాత్రమే కాదు యావత్ దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ పులిదే పై చేయి అయితే, ‘పరవాలేదు’ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు. పొంచివున్న పెద్ద ముప్పు ఇదే. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కానీ, విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ అయినా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించేవాళ్ళయినా చేసే హెచ్చరికలు ఇవే!

గుడ్డిగా కళ్ళు మూసుకుని ముందుకు సాగితే కాలు రహదారిలోకి సాగొచ్చు, ముళ్ళ దారిలోకి దారి తీయొచ్చు. రెంటికీ అవకాశం వుంది కాబట్టే జాగ్రత్తల అవసరం ఎక్కువ వుంది. ఇది మోడీకీ, ఆయనను అభిమానించేవారికీ, మోడీ వ్యతిరేకులకూ, వారిని కళ్ళు మూసుకుని సమర్ధించేవారికి మాత్రమే సంబంధించిన సమస్య అనుకోవడం మంచిది కాదు. నూట పాతిక కోట్లమంది భారతీయుల భవిత దీనితో ముడిపడి వుంది.

అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా మోడీ విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. మనకోసం కాదు, మోడీ కోసం కాదు, మన దేశ భవిష్యత్తు కోసం. భవిష్యత్ తరాల భద్రతకోసం.

 

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలయి అయిదేళ్లు గడిచాయి. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి మోడీ ప్రయోగించిన ఈ ‘బ్రహ్మ శిరోనామకాస్త్రం’ గురికి తగిలిందా లేక గురి తప్పిందా అనే విషయంలో ఇన్నేళ్ళుగా చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి.

మహాభారతంలో ప్రస్తావించిన ఈ అస్త్రాన్ని సర్జికల్ స్ట్రైక్ తో పోల్చవచ్చు.

నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో ప్రాణాంతక వ్యాధికి కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర భాగాలకు ఇసుమంత హాని కూడా కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా అలాంటిదే.

మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని, పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి దృష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా, బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.

భారత ఆర్ధిక వ్యవస్థకు ఏమాత్రం విఘాతం కలుగకుండా నల్లదనం, నకిలీ కరెన్సీ, శత్రుపీడ మొదలయిన చెదపురుగులను తుదముట్టించాలని మోడీ ఈ పెద్ద నోట్ల రద్దు తలపెట్టారు. ఒక రకంగా అశ్వద్ధామ ప్రయోగించిన అస్త్రం వంటిదే.

మరి ఫలితాలు? ఇంకా ప్రశ్నార్ధకమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

(08-11-2021)

వసూలు చేసే పన్నులు ఖజానాకు చేరుతున్నాయా ! – భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఓరోజు, ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా! అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం నిమిషం, లక్షల కోట్ల విలువైన లావాదేవీలు కోట్లలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’ .
ఇక నా దగ్గర ప్రశ్నలు లేవు.
అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

7, నవంబర్ 2021, ఆదివారం

జరిగిన కధ – భండారు శ్రీనివాసరావు

 

కధల్లో జీవితాలు ఉన్నట్టే జీవితాల్లో కూడా కధలు వుంటాయి. అలాంటి కధ కాని కధ ఈ జరిగిన కధ. 

స్నేహం అంటేనే స్వచ్చత. దాపరికం, స్వార్ధం ఇసుమంత కూడా లేనిదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. మిగిలినవన్నీ పరిచయాలు మాత్రమే.

ఇప్పుడు మీరు చదవబోతున్న కధనంలోని పాత్రలన్నీ నిజమైనవే. ఆ పాత్రలు పలికిన పలుకులన్నీ ఒక ప్రత్యక్ష సాక్షి నోట నేను  విన్నవే.

కాకినాడ జే.ఎన్.టీ.యూ. చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. అక్కడ విద్యాభ్యాసం చేసి జీవితాల్లో స్థిరపడిన విద్యార్ధులు ఒక సాంప్రదాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారుట. అదేమిటంటే, ఒక బ్యాచ్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులు పాతికేళ్ళ తర్వాత అదే కళాశాలలో కలుస్తారు. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళు ప్రతియేటా అదేచోట ఇరవై అయిదు  సంవత్సరాల  కలుస్తూ, గడిచిన ఇన్నేళ్ళ కాలంలోని  జ్ఞాపకాలను నెమరు వేసుకుని రెండు మూడు రోజులు సరదాగా గడపడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని విన్నాను. ఇది నిజమైతే నిజంగా గొప్ప సంగతే.

మూడేళ్ల  క్రితం నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమానికి  పాతికేళ్ళ క్రితం ఆ కాలేజీలో చదువుకున్న ఓ బ్యాచ్ కి చెందిన మొత్తం 180 మందిలో 130 మంది హాజరయ్యారు. వారిలో ఇద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి వున్నారు. అమెరికా నుంచి వచ్చిన ముప్పయ్ మంది దంపతయుక్తంగా పాల్గొన్నారు. కొందరు కళాశాల రోజుల్లోనే ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినవారు కూడా వున్నారు. 

రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ మధ్యంతర కాలంలో ఎవరికి వారు జీవితాల్లో వారు స్థిరపడ్డారు. కళాశాలలో కలిసి చదువుకున్న తమ సహాధ్యాయే తమకు పై అధికారిగా వచ్చిన ఉద్యోగులు కూడా కొందరు వున్నారు. ఆఫీసులో సార్ సార్ అనే మర్యాద పిలుపులు కాస్తా ఈ సమ్మేళనంలో పాత రోజుల్లోమాదిరిగా షరామామూలు అరేయ్ ఒరేయ్ కి మారిపోయాయి.

‘ఐ.ఏ.ఎస్. కాగానే మమ్మల్ని మరచిపోయావు. నేను పనిచేస్తున్న డిపార్ట్ మెంటుకి నువ్వే హెడ్డువి. ఏదో ఫ్రెండువి కదా కలవాలని వస్తే నన్ను లోపలికే పంపలేదు.’ డివిజినల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నాడు.

‘భలేవాడివే! విజిటర్స్ స్లిప్ మీద నీ పేరు చూసి నా పియ్యేను పంపించి మరీ పిలిపించా కదా! ఇలా నిష్టూరం ఆడితే ఎలా’ జవాబిచ్చాడు ఆ ఐ.ఏ.ఎస్. 

పోలీసు అధికారి అన్నాడిలా. ‘ఈ ఉద్యోగం పుణ్యమా అని నాకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడూ నీడలా స్టెన్ గన్లు పట్టుకుని సెక్యూరిటీ గార్డులు. దేశ సరిహద్దుల్లో వున్నప్పుడు ఎలాగూ తప్పదు. నేను చదువుకున్న చోటు ఇది. ఇక్కడన్నా నన్ను వదిలిపెట్టండిరా బాబూ అని బతిమిలాడుకుని వాళ్ళని మెయిన గేటు దగ్గరే వదిలి వచ్చాను’

అందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఆ నవ్వులు అలా ఓ మూడు రోజుల పాటు పువ్వులు పూస్తూనే వున్నాయి. ఒకరు పెద్దా అని లేదు, ఒకరు చిన్నా అనిలేదు. అందరూ టైం కాప్స్యూల్ లో మాదిరిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళారు. కేరింతలతో, కాలేజీ కబుర్లతో సాగిపోతున్న ఆ ధారా ప్రవాహం ఎవరో అన్న ఒక్క మాటతో ఆగిపోయింది.

‘అన్నట్టు గణేష్ ఏడీ?’

పొట్టిగా వుండే గణేష్ కూడా వారందరితో పాటే అదే కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. పెళ్లయింది. ఒక పిల్లాడు. ఏమైందో తెలియదు ఏదో అస్వస్తతకు గురై హఠాత్తుగా కన్నుమూశాడు. అమెరికాలోనే ఉంటున్న కళాశాల సహాధ్యాయులు గణేష్ భార్యను, పిల్లల్ని పట్టుబట్టి కాకినాడ తీసుకువచ్చారు. గణేష్ లేడన్న విషయం తెలిసి స్నేహితులందరూ ఎంతో బాధ పడ్డారు.

గణేష్ కొడుకు కల్పించుకుని అన్నాడు. 

‘మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే మా నాన్న ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది. ఇక్కడ అరమరికలు లేని మీ స్నేహం గమనించిన తర్వాత చనిపోయి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తోంది’

ఈ మాటలతో అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

అగ్నిమీళే పురోహితం – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు 07-11-2021 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.

కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.

లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోం ధ్వనులు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. దాని ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన, విచ్చుకున్న పువ్వు  ఆకారంలో వుండే  రేకుతో చేసిన ఒక  స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు  దానిమీదవుంచి, అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు. అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.

పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే. వాటికి కూడా కాలం చెల్లినట్టు వుంది. అంతా డిజిటల్. జగమంతా డిజిటల్. 

రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.

తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.

సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.

పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను రికార్డును తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.

తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.

అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.

“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.

ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది. హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు. నిష్ణాతులు. అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. కారణం ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు, ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.

సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన  అరుదైన రికార్డును, రిగ్వేద శ్లోకానికి,  మాక్స్ ముల్లర్ ఆవిధంగా కట్టబెట్టారన్న  విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.

(EOM)

NOTE: అగ్ని మీళే పురోహితం శ్లోకానికి ప్రతిపదార్ధ తాత్పర్యాలు ఆంధ్రామృతం బ్లాగులో వున్నాయి. అవి యధాతధంగా: 

ప్రతిపదార్థము.  అగ్నిం = అగ్నినిపురోహితం = పురోహితుడినియజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విజమ్ = ఋత్విక్కునుహోతారమ్ = హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును)రత్నధాతమమ్ = (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవాణ్ణిఈళే = నేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.

భావము. అగ్నినిపురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విక్కునుహోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవానినినేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.



6, నవంబర్ 2021, శనివారం

ఇద్దరు స్నేహితుల హృదయావిష్కరణ – భండారు శ్రీనివాసరావు



కొంత పరస్పర డబ్బా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఈ ప్రోగ్రాం చేసిన జర్నలిస్ట్ ప్రేమకు అవేవీ పట్టవు. వాళ్ళ నాన్న జ్వాలాలాగే తాను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుపోవడమే ఆమెకు తెలుసు.

ఒకరిని గురించి మరొకరు చెప్పడం ద్వారా ఇద్దరు స్నేహితులను పరిచయం చేయాలని అనుకున్నట్టుంది. అలాగే చేసింది. ఈ క్రమంలో కొందరికి  నేను పైన చెప్పిన మాట కొంత నిజమనిపించవచ్చు. చేయగలిగింది లేదు.

జ్వాలా, నాకు మధ్య ఉన్న స్నేహానికి షష్టిపూర్తి దాటింది. ఈ సందర్భంలో మా ఇద్దర్నీ కూర్చోబెట్టి ప్రేమ అనే ప్రేమమాలిని అనే బుంటీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

అదేమిటో విచిత్రం. ముసురుపట్టినట్టు ఈరోజు నా పోస్టులు అన్నీ వీడియోలే!