13, సెప్టెంబర్ 2021, సోమవారం

మాస్క్ తో మా ఆవిడ

 కింది చిత్రంలో మాస్క్ తో వున్నది మా ఆవిడ నిర్మల. ఆమె చనిపోయిన ఆరేడు నెలల తర్వాత కానీ కరోనా మన దేశంలో అడుగుపెట్టలేదు. అప్పటికి ఇలా మాస్కులు పెట్టుకుని తిరగడం అలవాటు లేదు.

అంతకు ముందు సంవత్సరం అంటే 2018లో అనుకుంటా, మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్, హైదరాబాదులోని మా కుటుంబాలను తీసుకుని మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూపించాడు. ఆ క్రమంలో మా అందర్నీ ఇనుప చువ్వలు, కడ్డీలు  తయారు చేసే ఓ కర్మాగారానికి తీసుకువెళ్లాడు. అక్కడి నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలి. కాకపొతే, అవి వాళ్ళే ఇచ్చారు.

అప్పటి ఫోటో ఇది.



(13-09-2021)

కంప్యూటర్ ఆడా మగా ......

 

అనే ధర్మసందేహం ఒక టీచరుకు కలిగింది. టీచరు తలచుకుంటే టెస్టులకు కొదవేమిటి? వెంటనే క్లాసులో పిల్లల్ని కంప్యూటర్ ఆడా, మగా అనే ప్రశ్నకు జవాబులు కారణాలతో సహా కోరింది.

క్లాసులోని ఆడపిల్లలు అందరూ కంప్యూటర్ ‘మగ’ అని రాస్తే, మగపిల్లలు ‘ఆడ’ అని రాశారు.

ఆడపిల్లలు చెప్పిన కారణాలు:

ఏపని చేయించాలన్నా ముందు కంప్యూటర్లను ఆన్ చేసి వుంచాలి. మగవాళ్ళు అదే బాపతు. లేకపోతే ఎక్కడి గొంగడి అక్కడే అన్న సామెతే.

ఏ సమస్య వచ్చినా నిజానికి అవి పరిష్కరించాలి. కానీ మగ జాతి కదా! అవే ఎప్పుడూ ఒక సమస్యగా మారతాయి.”

మంచి కంప్యూటర్ అని కొనుక్కుంటాము. అదేవిటో మరో జెనరేషన్ కంప్యూటర్ కళ్ళబడగానే, ‘తొందరపడ్డామేమో, కొన్నాళ్ళు ఆగితే బాగుండేదేమో అని మనసులో తొలుస్తుంది.

అంచేత కంప్యూటర్ మగ పురుగే. సందేహం లేదు”

ఇక మగపిల్లలు పేర్కొన్న కారణాలు:

పుట్టించిన దేవుడు లేదా వాటిని తయారుచేసిన వాడు తప్పిస్తే చస్తే వేరెవ్వరూ వాటి మనసులో ఏముందో కనుక్కోలేరు. ఈ విషయంలో ఆడవాళ్ళు, కంప్యూటర్లు ఒక్కటే.

చిన్న చిన్న తప్పుల్ని కూడా గుర్తుపెట్టుకుని అవసరమైనప్పుడు వాటిని ఎత్తి చూపే సామర్ధ్యం కంప్యూటర్లకు వుంది. ఇక అనుమానం ఏల?

కంప్యూటర్ ఖచ్చితంగా ఆడజాతే.”

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

కాపురం చేసే కళ (కధానిక) - భండారు శ్రీనివాసరావు

 డాక్టర్ చెబుతున్నది వింటుంటే నాకెందుకో పాత సంగతులు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. అది చూసి ఆయన మరోలా అనుకున్నాడు.

చూడమ్మా! నేను చెప్పేది కాస్త సీరియస్ గా తీసుకో, చెప్పింది చెయ్యి’

నేను తలూపాను. కానీ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలని ఆపుకోలేక పోయాను. మా వాడు కార్లో ఇంటికి తీసుకువస్తున్నప్పుడు తోవ పొడుగునా అవే.

నేను కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది. అత్తారింటికి పంపించేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.

చూడమ్మా చిట్టీ! నువ్వు కాలు పెడుతోంది పెద్ద కుటుంబంలోకి. అత్తా, మామా మీ ఆయనే అయితే ఇంత చెప్పాల్సిన పని లేదు. కానీ మీ మెట్టింటి నిండా బావగార్లు, మరదులు, తోటి కోడళ్ళు. వాళ్ళది చూస్తే గంపెడు సంసారం. మనది చూస్తే గుప్పెడు. మాకు లేకలేక పుట్టింది నువ్వొక్క దానివే. కొడుకువయినా, కూతురివి అయినా ఒకటే అనుకుని గారాబంగా పెంచాము. అతి ముద్దు కారణంగా నీకన్నీ మగరాయుడి వేషాలు అబ్బాయి. మీ తాత బుద్ధులు వచ్చాయి. ఆయన కూడా నట్టింట్లో మడత మంచం మీద కూర్చుని విలాసంగా కాళ్ళు ఊపుతూ కబుర్లు చెప్పేవారు. నువ్వూ అంతే. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా కాళ్ళు ఊపడం ఆపవు. ఇలాగే అలవాటుగా మీ అత్తగారింట్లో చేస్తే బాగుండదు. పైగా నా పెంపకాన్ని ఆడిపోసుకుంటారు. కాపురం చేసే కళ కాళ్ళు చెబుతాయంటారు. మా తల్లివి కదా! ఈ అమ్మ చెప్పే ఈ ఒక్క మాట వినమ్మా. ఇలా కాళ్ళు ఊపడం మానేసెయ్యి’

అమ్మకు మాట ఇవ్వకపోయినా, అమ్మ చెప్పిన మాట నా మనసులో అలాగే ముద్ర పడిపోయింది. ఎప్పుడో ఓసారి కధాచిత్ గా కాళ్లూపే అలవాటు అప్పుడప్పుడూ తొంగిచూసినా, మొత్తం మీద అది ఎవరి కంటాపడక ముందే సర్దుకునేదానిని. పిల్లలు పుట్టి, పెద్దవాళ్ళయ్యారు. అప్పటిదాకా ఇంట్లో పెద్దవాళ్ళుగా వున్నవాళ్ళు దాటిపోయి, ఇప్పుడు నేనే ఇంటికి పెద్ద దిక్కు అయ్యాను. కానీ, కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపే అలవాటును పూర్తిగా మానుకున్నాను.

ఇదిగో మళ్ళీ ఇన్నాల్టికి ఈ డాక్టర్ సలహా వింటుంటే నవ్వు రాక ఏం చేస్తుంది.

అప్పుడు అమ్మ వద్దన్నదాన్నే డాక్టర్ గారు ఇప్పుడు చెయ్యమంటున్నాడు.

కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా కాసేపు కాళ్ళూచేతులూ ఊపమంటున్నాడు. అలా చేయడం ఇప్పుడు నా వంటికి అవసరమట.

11, సెప్టెంబర్ 2021, శనివారం

మరో చిత్తరువు జ్ఞాపకం

 

ఇప్పుడంటే ఇలా మొబైల్ తో ఫోటో తీసి అలా అప్ లోడ్ చేస్తున్నాం కానీ ఒకానొక రోజుల్లో ఫోటోగ్రఫీ అనేది ప్రయాసతో కూడిన ప్రియాతిప్రియమైన అనుభవం. సొంత కెమెరా ఉన్నాకూడా, తీసిన ఫోటో వెంటనే చూసుకునే వీలు వుండేది కాదు. ఒక రీలు కొంటే మహా అయితే ఓ పాతిక ఫోటోలు వచ్చేవి. వీటిల్లో మసకమసగ్గా వున్న ఫోటోలు పోను ఓ పదిహేను పరవాలేదు అనిపించేవిలా ఉండేవి. మళ్ళీ ఈ రీళ్ళలో కలర్ రీళ్ళు, బ్లాక్ అండ్ వైట్ రీళ్ళు. కెమెరాలోని రీలు మొత్తం అయిపోతే కాని ప్రింటింగ్ కు ఇవ్వడానికి కుదరదు. అందుకే ఒకటి రెండు అబ్బురంగా తీసి రీలు మొత్తం పూర్తయ్యాకే స్టూడియోలో ఇచ్చేవాళ్ళు. అక్కడ డార్క్ రూమ్ లో ఆ రీలు కడిగి ఆరబెట్టి, ప్రింట్ వేసి ఇచ్చేసరికి చాలా సమయం పట్టేది.
అలా దిగిన ఫొటోలే ఈ కిందవి. బహుశా ముప్పయ్యేళ్ల కిందటివి అనిపిస్తోంది. ఎందుకు ఎప్పుడు వెళ్ళామో తెలియదు కానీ బస్సులో నాగార్జున సాగర్ వెళ్ళినప్పటి ఫోటోలు అని, వీటిని నాకు షేర్ చేసిన మిత్రుడు సూర్య చెప్పారు.
నిజంగా ఇవి నాకు అపురూపం. ఎందుకంటే ఇందులో నా భార్య నిర్మల కూడా వుంది. సూర్య గారి భార్య వాణి గారితో మా ఆవిడకు చక్కని స్నేహం. అక్కాచెల్లెళ్ల మాదిరిగా వుండేవారు. (బస్సులో, బోటులో మా వెనక సీట్లలో కూర్చున్నారు)
(10-09-2021)












10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

మిచ్చామి దుఃఖడం – భండారు శ్రీనివాసరావు

పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.

సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ‘సారీ’ అనే పదం ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. క్షమించమని కోరడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది. జైనులు పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖః డం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
మిచ్చామి అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
దుఖః డం అంటే దుష్కృ త్యాలు. చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున – భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘ నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.



అమెరికా ఉలిక్కిపడ్డ రోజు – భండారు శ్రీనివాసరావు

 భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001 సెప్టెంబర్ పదకొండవ తేదీన.

కారణం, అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధిచెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.

అలాంటి దేశంపై ఇటీవలి కాలంలో జరిగిన మొటమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన. అమెరికాకు గర్వకారణంగా నిలచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో డీకొట్టి కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి.

ఈ దాడితో బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు తీసుకుంది. ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు.

పొతే, అమెరికన్ ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని సముద్ర జలాల్లో ముంచేసి ఇక అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న లైవ్ దృశ్యాలను ఆనాటి అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.

అప్పటిదాకా ప్రపంచంలో అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం ఎంత ప్రమాదకరమో అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది.

అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపు, లేదా చచ్చిపో’ అనే రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.

ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం.

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.

అధిక సంఖ్యలో వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.

వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు.



 

9, సెప్టెంబర్ 2021, గురువారం

నందమూరి తారకరామారావు గారితో ఓ జ్ఞాపకం

 ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.

ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.

ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.

లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి ఏమిటి న్యూస్ అని అడిగితే

"రిలెయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఎల్లుండిలో కేంద్రం నుంచి మాకు అనుకూలమైన నిర్ణయం వస్తుంది" అని చెప్పారు.

(ఆయన అన్నట్టే రెండోరోజున ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు)

తర్వాత ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.

ఆయన మాతో చెప్పారు.

రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?” అంటూ

ముగించారు రామకృష్ణారావు గారు.